17, మార్చి 2023, శుక్రవారం

హరి అవతారమే అతఁ డితడు పరము సంకీర్తన ఫలములో నిలిపె !! - అన్నమయ్య కీర్తన


 

ఫాల్గుణ బహుళ ద్వాదశి  పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి. ఈ సందర్భంగా  వారిని సంస్మరించుకుంటూ వారి తనయుడు పెద తిరుమలాచార్యులు  తన తండ్రిపై రచించిన కీర్తన.


చిత్ర రచన : పొన్నాడ మూర్తి

 

హరి అవతారమే అతఁ డితడు

పరము సంకీర్తన ఫలములో నిలిపె !!

 

ఉన్నాడు వైకుంఠమున నున్నాడు ఆచార్యునొద్ద

ఉన్నతోన్నత మహిమ నన్నమయ్య

ఉన్నవి సంకీర్తనలు ఒట్టుక లోకములందు

పన్నిన నారదాదులు పై పై పాడగను 

 

చరియించు నొకవేళ శనకాది మునులలో

హరిబాడు దాళ్ళపాక అన్నమయ్య

తిరమై యాళువారుల తేజము తానై యుండు

గరుడానంత ముఖ్య ఘనుల సంగడిని ॥

 

శ్రీవేంకటాద్రి మీద శ్రీపతి కొలువునందు

ఆవహించె దాళ్ళపాక అన్నమయ్య

దేవతలు మునులును దేవుడని జయవెట్ట

గోవిదుడై తిరుగాడి గోనేటి దండను

 

భావం సౌజన్యం : సాహిత్యశిరోమణి, మహామహోపాధ్యాయ కీ. శే.  సముద్రల లక్ష్మణయ్య, M.A.

 

అన్నమయ్య శ్రీహరి అవతారమే. ఇతడు మోక్షమును సంకీర్తనఫలముగా స్థాపించినాడు.

 

అన్నమయ్య వైకుంఠములో మహోన్నతమైన మహిమతో నొప్పారుచు ఆచార్యుని చెంతనే ఉన్నాడు. నారదుడు మున్నగువారు మాటిమాటికీ పాడగా అన్నమయ్య పాటలు లోకములం దెల్లెడల వ్యాపించి ఉన్నవి.

 

శ్రీహరిని కీర్తించు అన్నమయ్య ఒక్కొక్క వేళ సనకాది మునీంద్రులతో కూడి సంచరించుచుండును. గరుడుడు, శేషుడు మున్నగు నిత్యశూరుల చెంత తాను స్థిరమైన ఆళ్వారుల తేజోరూపముతో ప్రకాశించుచుండును.

 

తాళ్ళపాక అన్నమయ్య శ్రీవేంకటాచలముపై శ్రీకాంతుని కొలువుకూటమునందు నెలకొని యున్నాడు. దేవతలు, మునులు ఈయన దేవుడే అని జయజయధ్వానములు కావించుచుండగా ఆయన కోనేటిచెంత భగత్తత్త్వజ్ఞుడై సంచరించుచుండును.

 

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...