అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి // కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని యంబలొక్క చేరెడే చాలు జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని // తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని // లంపటపడని మేలు లవలేసమే చాలు రొంపికంబమౌకంటె రోయుటే చాలు రంపపు గోరికకంటే రతి వేంకటపతి పంపున నాతని జేరే భవమే చాలు // అప్పులేని //
చిత్రం : పొన్నడ మూర్తి
భావము : సౌజన్యం : 'సాహిత్య శిరోమణి' సముద్రాల లక్ష్మణయ్య, ఎం. ఏ.
అప్పుచేసి ఆటోపముగా సంసారము జరుపుటకంటె అప్పులేని కాపురము జరిగినంతవరకే చాలును. అదే సుఖప్రదము. అట్లే తప్పు తోవలో ఆర్జించిన అధిక ధనముకంటె తప్పులేని జీతము నాలుగు కాసులైనను చాలును.
ఎండవానలవలని బాధ తప్పని పెద్ద గృహముకంటె చక్కగా కప్పబడిన ఇల్లు చిన్నదైనను మేలు. నానా చింతలకు లోనై తిను పంచభక్ష్య పరమాన్నములకంటే చీకుచింత లేని యంబలి చేరెడైనను సుఖకరమే. ధూర్తురాలైన కులస్రీకంటె గుణవతి యయిన వనిత తక్కువ జాతిదైనను మేలు. “స్త్రీరత్నం దుష్కులాదపి” అని పెద్దల వచనము. అన్యాయంగా క్షణములో ఆర్జింపబడి పదిమందికి వింతగొలుపు దొడ్డ సంపదకంటె న్యాయార్చితమైన విత్తము మిక్కిలి కొద్దిదైనను చాలు.
ఇతరుల దూషణకు లోనై శత సంవత్సరములు జీవించుటకంటె ఎట్టి దూషణలేక ఒక్కదినము జీవించినను మేలే. ఆపరిశుధ్ధమైన అన్నము కడుపునిండా తినుటకంటె పరిశుధ్ధమైన అన్నము ఒక్క కబళమైనను సుఖావహము. పెద్ద పెద్ద ఆశలతో ప్రాకులాడి పదిమందిలో గుట్టుచెడి బతుకుటకంటె ఏ కొంచెపు మేలుకలిగినను దానితో తృప్తినొందుట మేలు. లేనిపోని ప్రయాసలకు గురియై జాలిపడుటకంటె వచ్చినదానితో తనివిపొందుట మేలు.
పలు తగులములకు గురియై బాధపడుటకంటె ఏ లంపటములులేక వచ్చు మేలు కొదిదిపాటిదైనను
చాలు. బురదలోని స్తంభమువలె నిలకడలేని జీవితముకంటె ఐహికసుఖములపై రోతపడి నిశ్చలముగా నుండుట
మేలు. రంపమువలె బాధావహమైన కోరికలకు లోనగుటకంటె “మామేకం శరణం వ్రజ” అను భగవదాదేశము ననుసరించి
ఆదేవుని సన్నిధి జేరుటకు ప్రయత్నించు మానవుని పుట్టుకే శ్రేష్ట,మైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి