దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం రామమ్
రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజాను బాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షాగురుం |
రాజీవ లోచనం రామచంద్రం ||
నీలజీమూత సన్నిభ శరీర ఘన వి- |
శాల వక్షసం విమల జలజనాభం |
కాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనధిపం భోగశయనం ||
పంకజాసన వినుత పరమ నారాయణం |
సంకరార్జిత చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినతం |
భావం :
ఈ కీర్తనలో పదకవితాపితామహుడు దేవభాషలో దశరథనందనుడిని ప్రస్తుతించాడు. పద్మావతీప్రియుడైన శ్రీనివాసుడిలో శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నాడు.
అన్నమయ్య దాశరధిని భజిస్తూ ఆయన దివ్యప్రభావాన్ని స్మరిస్తూ, అసురుడైన రావణుడుకి శత్రువై రఘువంశాన్నే శోభింపజేసాడంటూ ఈ సంకీర్తనకు శ్రీకారం చుడుతున్నాడు.
సూర్యవంశంలో జనించిన రఘురాముడిని రాజవరశేఖరుడని, సూర్యవంశ సుధాకరుడని, ఆజానుబాహుడని, నీలమేఘశ్యాముడని, కోదండాన్నిధరించిన దీక్షాగురుడని, రాజీవలోచనుడని కొనియాడాడు.
నీలమేఘమువంటి శరీరము కలవాడు, విశాలమైన వక్షంతో విరాజిల్లువాడని, కమలనాభుడైన విష్ణుమూర్తియని, సర్పసంహాకురుడైన గరుడుడినే వాహనం చేసుకున్నవాడని, ధర్మసంస్థాపకుడని, ఆదిశేషుణిపై పవళించే పరమపురుషుడని, భూమిజ అయిన సీతాదేవికి పతిదేవుడని కొనియాడాడు.
పంకజాశనుడైన బ్రహ్మదేవుడు వినుతించే పరమనారాయాణుడు, జనకుడి శివధనుస్సును అవలీలగా విరిచినవాడు, లంకను జయించి విభీషణుడిని లాలించి పట్టం కట్టినవాడు, కలియుగంలో వేంకటాద్రిపై వెలసి పూజలందుకుంటున్నాడని పులకించిపోతున్నాడు.
చిత్రం : Ponnada Murty
సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి