22, మార్చి 2023, బుధవారం

అమ్మే దొకటియును అసిమలోని దొకటి ఇమ్ముల మా గుణములు ఎంచ చోటేదయ్యా ॥ - అన్నమయ్య కీర్తన


 


అమ్మే దొకటియును అసిమలోని దొకటి

ఇమ్ముల మా గుణములు ఎంచ చోటేదయ్యా ॥

 

ఎప్పుడు నేము చూచిన నింద్రియ కింకరులము

ఇప్పుడు నీ కింకరుల మెట్టెయ్యామో

తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము

చెప్పి నీ దాసుల మన సిగ్గుగాదా మాకు

 

పడతుల కెప్పుడును పరతంత్రులము నేము

పడి నీ పరతంత్రభావము మాకేది

నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ

ఎడయేది నిన్ను నుతియించే టందుకును

 

తనువు లంపటాలకు తగ మీదెత్తిత్తి మిదె

ఒనరి నీ ఊడిగాన కొదిగేటెట్టు

ననిచి శ్రీవేంకటేశ నాడే నీకు శరణంటి

వెనక ముందెంచక నీవే కావవయ్యా

 

భావం :

 

వెంకటేశ్వరా,  మా గుణాలను విశ్లేషించే ప్రయత్నం చేయకయ్యా ! మేము మూటలో ఉన్నవి ఒకరకమైతే ముందు మరో రకం వస్తువులు పెట్టి ఆకర్షిస్తున్న కపట వ్యాపారుల్లాంటి వాళ్ళము. ఇది నీకు తెలియంది కాదు.

ఇంద్రియాలకు యజమానులుగా ఉండాల్సిన మనం వాటికి కింకరులుగా మారిపోతున్నాం. అవి మన అధీనంలో ఉండాల్సిందిపోయి వాటి అధీనంలో మనముంటున్నాము. ధనమునకు దాస్యమైన మేము నీదాసులమని చెప్పుకొనుటకు సిగ్గు కాదా మాకు.

పడతులకు పరతంత్రులమై పరంధాముడివైన నీకు పరతంత్రులము అవలేకపోతున్నాము. నానా రుచులకు అమ్ముడుపోయిన నాలుకతో నిన్ను నొతియించలేక పోతున్నాము. 

తనువు లంపటాలలో చిక్కుకున్న మేము నీ ఊడిగము చేస్తూ ఎప్పుడు తరించాలి? అందుకే నిన్నే శరణన్న మమ్మల్ని నీవే కాచుకోవాలని ఆర్ద్రతతో అడుగుతున్నాము.


చిత్రం : Ponnada Murty

 

 

 


కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...