30, మే 2020, శనివారం

"వేచి చూసిన కాలమంతా కరిగి పోయెను చిటికెలో " - "ప్రేమ సీమల్ రాగ హేలన తూగిపోతే మధుర మేగా" - గజల్



శ్రీమతి  శారద మంచిరాజు గారి గజల్

వేచి చూసిన కాలమంతా కరిగిపోయెను చిటికెలో
సమయమన్నది పరుగులెత్తుతు జారిపోయెను చిటికలో!

ఎన్ని ఊసులు పంచినావో నేడుమౌనము ఏలనో
పులకరింతల వెల్లువంతా వీగిపోయెను చిటికలో!

 పూలపందిరి అల్లుకున్నాం- కర్కశంగా విరుతువా ?
ఆశలన్నీ తూలికలుగా ఎగిరిపోయెను చిటికలో!

పరిష్వంగపు మత్తులోనీ అధరసుధలే తేనెలూరే
కాలకూటం సెగలు చిమ్ముతు నవ్విపోయెను చిటికలో!

శ్వాస ఒకటిగ బాసఒకటిగ ఉన్నమన అనుబంధమే !
కాలరాసిన కారణమ్మే మలగిపోయెను చిటికలో!

ప్రేమభావన తెలియగలరా మూర్ఖులైనా పరిజనం !
హంసమనలను గేలిచేస్తూ వెడలిపోయెను చిటికలో!

 కలతపెట్టే  పాతకథలే ఏచరిత్రను చదివినా
శారదమ్మకు నచ్చచెపుతూ
నిమిరిపోయెను చిటికలో !!

(శ్రీ పి.వి.ఆర్.మూర్తిగారికి కృతజ్ఞతతో  --  శారద మంచిరాజు)



నా చిత్రానికి శ్రీమతి సావిత్రి రమణరావు గారి గజల్

ప్రేమ సీమల రాగ హేలన
తూగి పోతే మధుర మేగా
మోహ నమ్మవు మోహనము లో
తేలి పోతే మధుర మేగా
వణుకు పెదవుల వలపు మధువులు
కొసరి కోరుగ కోడె ప్రాయము
తొంద రించే తేటి విందున
రేగి పోతే మధుర మేగా
కనులు కనులూ కలిపి పాడే
ప్రణయ గీతికి లిపులు ఏలా
పొంగు ప్రణయం చింద రాగం
ఊగి పోతే మధుర మేగా
విరియు ప్రేమల రంగు విల్లులు
ప్రణయ లోకపు రంగ వల్లులు
కలల సీమన తరుణ కళలన
వెలిగి పోతే మధుర మేగా
సంజె ఎరుపుల చెలిమి పిలుపుల
ఊసు లె న్నో , ఊహ లెన్నో
ఉరుకు వాగై కడలి ఒడిలో
ఒదిగి పోతే మధుర మేగా
స్నేహ రాగం,మోహ గీతం
ఆలపించగ మరుల లహరులు
తనువు వీణై అణువు అణువున
మోగి పోతే మధుర మేగా
నీవు నేనని లేనె లేనీ
సంగ మము లో సావిత్రీ
కోర్కె అలలా కోటి పులకల
సాగి పోతే మధుర మేగా
ఈ అబి వ్యక్తి కి ప్రేరణ శ్రీ Pvr Murty గారి చిత్రం. వారికి నా హృదయ పూర్వక కృతఙ్ఞ తాభి వందనాలతో..

ఎదను తొలిచి మనసు దోచి - గజల్

💥 ఈ వారం చిత్రానికి గజల్
————————————

ఎదను తొలిచీ మనసు దోచీ
వీడి పోవుట ఎందుకో !
అదను తెలిసీ సుధను గ్రోలగ
వచ్చిపోవుట ఎందుకో  !

మొగలిపూవులు  గుచ్చుకున్నా
 జడను దాల్చక ఉందుమా?
  బాధలోతోసేసినా , నే వాలి
 పోవుట ఎందుకో  !

నీవు వచ్చిన గుర్తులన్నీ
ఊపిరిని నింపేనులే
 కౌగిలించీ పాత తప్పులు
తుడిపి పోవుట ఎందుకో !

మండుటెండలు వచ్చిపోవా
మంచివానకు  ముందుగా
ముద్దు చేస్తూ మాయమంత్రం
వేసిపోవుట ఎందుకో  !

అంత కోపం మంచులాగా
కరిగిపోదా  చూడగా
ప్రేమకేగొళ్ళాన్నితీస్తూ
 మురిసిపోవుట ఎందుకో !

కలతలన్నీ నీటి సుడులే
కౌగిలిస్తే ఉండునా ?
ప్రణయకలహం సహజమేనని
తేల్చి పోవుట ఎందుకో !

అలసిపోయిన ఎదల సొదలకు
ఆటవిడుపే మురిపెమూ
వేటగాడా కరుణమాలీ
కొట్టిపోవుట ఎందుకో !

ప్రేమజలధిన పడవసాగే
జంటచిలుకలు నడపగా
ఈశ్వరా ! నీ కేమి మోదము ?
ముంచి పోవుట ఎందుకో !

కోర్కెలన్నీ కూడబెట్టా
ఆరగింపును చేయగా !
వారబోసిన దేవి నిచ్చట
వదిలి పోవుట ఎందుకో !
—————————
డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం - Sri. Pvr Murty garu

26, మే 2020, మంగళవారం

మనసు - కవిత


నా చిత్రానికి అమ్మాయి 'అనుశ్రీ' కవిత

!!! మనసు !!!
నిజంగా నీ అంత ఇష్టం నీ అంత ప్రేమ
ఎవరు చూపిస్తారు నాపై
ఎవరికీ తెలుసు నేనేంటో
ఎవరికి తెలుసు నాలో అలజడెంతో
మౌనంగా రోదిస్తూ
నా కన్నీళ్ళని తుడుస్తూ
ఉలిక్కి పడి లేచిన ప్రతిసారి, ఫరవాలేదని
అస్తమిస్తున్న ఆశలకు ఆయువు పోస్తూ...
నన్ను కనిపెట్టుకుని నాకలలన్నీ పట్టుకుని
తీరం చేర్చే దిశగా అడుగులు వేయిస్తూ..
నిద్రని వెలేసిన ఎన్నో రాత్రులలో
నన్ను నాకు పరిచయం చేస్తూ..
ఆవేశాన్ని అణచివేస్తూ
ఆక్రందనలని అనునయిస్తూ..
ఎన్ని వేల సార్లు మరణించావో
నన్నిలా బ్రతికించేందుకు
ఎన్ని సార్లు ముక్కలయ్యావో
నేను ఓడించిన సమయాలను తలచి
ఎల్లలు లేని నీ ఆలోచనా సమీరాలని
నాకోసం గిరిగీసుకుని
నలుగుతూ నడిపిస్తున్న నిన్ను
నాకేమవుతావో ఎలా చెప్పను
సంతోషాల ఊయలలో ఊగినపుడు
నవ్వుల జల్లై మురిసి పోతూ...
విషాదాల వేటుకి గాయపడినప్పుడు
ఓదార్పువై సేద తీర్చుతూ
కాలానికో మనిషిని హితులంటూ చూపితే
ఏడుస్తూ తిరస్కారాల శాపాలు భరించి..
నాతో పాటే నడిచి అలసి సొలసినా
నను వీడలేక నాతో పయనిస్తున్నావు
విశ్రమించే తరుణం ఆసన్నమైనపుడు
మట్టిలో సైతం తోడొచ్చే నేస్తానివి
నాతో కలిసి అంతరించే అంతరంగానివి
పేరు అడిగితే ఏమనగలను
నాతో పాటే పుట్టిన నా మనసువననా
చూపించమంటే నాలోనే ఉన్నావని
నన్ను నాలో చూసుకుని మురిసిపోనా.
అనూశ్రీ...

జీవితమొక పయనమని గమ్యము తెలియదనీ తెలిసినా ఈ మనిషి పయనమాగదు ..



నా చిత్రాలు చూసి కొందరు మిత్రులు నాకు ప్రేరణ ఎక్కడనుండి వస్తుందని అడుగుతుంటారు. ఇదిగో ఇలాగ:

అంతర్జాలంలో ఓ ఫోటో నన్ను ఆకర్షించింది. వెంటనే నా కిష్టమయిన pencil చిత్రానికి ఉపక్రమించాను. ఫలితం ఇదిగో ఇలాగ వచ్చింది. చిత్రం వెయ్యగానే 'Shor' హిందీ చిత్రంలో 'జీవన్ చల్నే కా నామ్, చల్తే రహే సుభః శ్యామ్' మహేంద్రకపూర్ పాడిన సూపర్ హిట్ పాట గుర్తుకొచ్చింది. ఇంచుమించి ఇదే భావం స్ఫురించే 'ప్రేమాభిషేకం' లో పాట "ఆగదూ, ఆగదూ ఏ నిమిషం" అనే పల్లవితో కూడిన అమరగాయకుడు ఘంటసాల గారి పాట కూడా గుర్తుకొచ్చింది. నా చిత్రాన్ని facebook తదితర social media లో పోస్ట్ చేసాను. మంచి స్పందన లభించింది.

జీవితమొక పయనమని గమ్యము తెలియదనీ
తెలిసినా ఈ మనిషి పయనమాగదు ..

22, మే 2020, శుక్రవారం

మరీచిక - కవిత

మరీచిక


ఆశల నావ తరలివెళుతోంది
అక్కడ నిరాశల వలయాలే తప్ప
సంతోషాల నిధులు లేవని తెలిసినా..
అలసిన గొంతును సవరించుకుని
మరోసారి గుక్కపట్టి ఏడ్చేందుకు
కాసింత విరామానికై వెతుకుతోంది
దూరతీరాల్లో ఆకలి దారుల్లో
కదులుతున్న ఆ పాదాల సవ్వడులే
తన మదికి ఓదార్పుగీతాలు అందుకే
దూరాన్ని తగ్గించేందుకై..
సముద్రమంత దుఃఖాన్ని
ఒంటరిగా తరలించుకొస్తున్న జీవనసహచరుడికి
తన కన్నుల్లో పొంగుతున్న ప్రేమను
కడుపునిండా దాచుకున్న బాధను
ఒక్కసారే వినిపించి సేదతీరాలని...
బీదరికపు గొడుగు కింద
మరోసారి
ఎడబాటు మిగిల్చిన ఎదకోతలన్నీ
ఎదురుపడి విప్పిచెప్పాలని
ఎదురు చూస్తూనే ఉంది మరీచికలా..
ధైర్యమిచ్చేందుకు దారిపట్టిన
ఆ పాదాలనిప్పుడు
నడిస్తూ నడుస్తూ అలసిపోయి రాజీనామా ఇచ్చి
గమనాన్ని ముగించాయని తెలియక..!
*అనూశ్రీ*

(నా చిత్రానికి ప్రఖ్యాత కవయిత్రి 'అనూశ్రీ' కవిత)

వేటూరి సుందరరామ మూర్తి - Veturi Sundararama Murthy


ప్రఖ్యాత తెలుగు గీత రచయిత వేటూరి సుందరరామ మూర్తి - స్మృత్యంజలి (నా pencil చిత్రం)

1974 లోవచ్చిన 'ఓ సీత కథ తో సినీ గీతాల రచన క్రొత్త మలుపు తిరిగింది.
ఆ పదవిన్యాసంలో..ఆ నవ్యతలో, ఆ వైవిధ్యంలో, ఆ నిర్భయ పదసృష్టిలో...ఆ ప్రభంజనంలో.. సినీ కవిత నాలుగు  దశాబ్ధాల పాటు ఉర్రూత లూగింది. 
ఆయన రాకముందు ఎందరో మహామహులు సినీ గీతాలు...సాహిత్యవిలువలతో వ్రాశారు. నీతులు రాశారు. బూతులు రాశారు. కానీ ఈయన రాకతో రసవద్గీతలు & భగవద్గీతలు కూడా వెల్లువయ్యాయి.
పున్నాగపూలు సన్నాయి పాడాయి..కోకిలమ్మకు పెళ్ళి కుదిరింది...కోనంతా పందిరయ్యింది...చిగురాకులు తోరణాలయ్యాయి.
మానసవీణలు మధురగీతాలు పాడాయి.
"వెల్లువొచ్చి గోదారమ్మా వెల్లకిలా పడింది."
గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రనా ఎందువలన? అని సందేహాలు కలిగాయి.
నెమలికి నేర్పిన నడకలు, మురళికి అందని పలుకులు, అందానికి అందమైన పుత్తడి బొమ్మలు దొరికారు.
తకిట తకిట తందానాలు, జగడ జగడ జగడాలు, మసజసతతగ శార్ధూలాలు,గసగసాల కౌగిలింతలు తెలుగు పాటను శృంగారభరితం...రసవంతం చేశాయి;

“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” "ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు" "నరుడి బతుకు నటన" ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. వారి కలంనుండి జాలువారిని ఇటువంటి పాటలు ఎన్నో, ఎన్నెన్నో .. ఈ మహనీయుని గురించి ఎంత చెప్పినా తక్కువే .. !

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...