9, అక్టోబర్ 2020, శుక్రవారం

అడివి బాపిరాజు - రచయిత, చిత్రకారుడు

అడవి బాపిరాజు గారి జయంతి సందర్భంగా నేను నా pencil తో వారి చిత్రం చిత్రీకరించాను. వారి గురించి నేను సేకరించిన వివరాలు క్రిందన పొందుపరుస్తున్నాను.

 అడివి బాపిరాజు (అక్టోబరు 81895 - సెప్టెంబరు 221952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయితకళాకారుడు, నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.

నారాయణరావు, గోనగన్నారెడ్డి, కోణంగి వంటి అద్భుతమైన నవలలు రాశారు. నవరంగ సంప్రదాయ పద్ధతిలో ఎన్నో చిత్రాలను చిత్రీకరించారు. ఇంకా రేడియో నాటికలు, పలు కధలు రచించారు. వీరి గురించి వికీపీడియా లింక్ క్లిక్ చేసి చదవండి.

https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%A1%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%81


వారు రచించిన 'వడగళ్ళు' కధ గురించి, వారి గురించి మరిన్ని వివరాలు ప్రముఖ రచయిత, నటుడు కీ.శే. గొల్లపూడి మారుతీరావు గారు బాపిరాజు గారి కుమార్తె తో జరిపిన ఇంటర్వ్యూ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలిగాను. ఈ క్రింది లింక్ క్లిక్ చూసి వీక్షించమని మనవు

.https://www.youtube.com/watch?v=elWUNK-dy-g


8, అక్టోబర్ 2020, గురువారం

పాడకే నా రాణి పాడకే పాట - అడవి బాపిరాజు గేయం




పాడకే నా రాణి పాడకే పాట పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే

రాగామాలాపించి వాగులా ప్రవహించి సుడిచుట్టు గీతాల సురగిపోనీయకే ||

కల్హారముకుళములు కదలినవి పెదవులు ప్రణయపదమంత్రాల బంధించె జీవనము ||

శ్రుతిలేని నామతికి చతురగీతాలేల గతిరాని పాదాల గతుల నృత్యమ్మటే ||


అడవి బాపిరాజు గారు రచించిన ఈ అద్భుతమైన గీతాన్ని, ఘంటసాల గారి గళంలో ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.


https://www.youtube.com/watch?v=T1f_sWtT97I

5, అక్టోబర్ 2020, సోమవారం

Pasupuleti Kannamba - పసుపులేటి కన్నాంబ


Pasupuleti Kannamba - my Pencil sketch 

 అత్తమామల ఆరడి లేదు...

ఆడబిడ్డ అదుపాజ్ఞలు లేవు....
ఆడబిడ్డ అదుపాజ్ఞలు లేవు....
సవతుల పోరా మొదలే లేదు..
బావల మరుదుల బాధే లేదు...
నా భాగ్యమే భాగ్యము. ...
నా బోటి స్త్రీ భాగ్యమే భాగ్యము.
పేరుకు నా పతి రాజే గాని...
పెత్తనమంతయు నాదే...
జ్ఞాతి అంకురము ఆర్పివైచితిని...
భూతలమంతయు నాదే...
భూతలమంతయు నాదే........
కన్నబిడ్డలు లేరు....కట్టుకున్న రాజు తప్ప! అయినా....అంతా తనే అనుభవించాలనే స్వార్థ పూరిత మనస్కురాలైన విలనీ రాణి పాత్రలో... 1946లో విడుదలైన... ముగ్గురు మరాటీలు లో....ఆవిడ గారి నటన అపూర్వం.
************
దేవుడు లేడూ.....సత్యం జయించదూ.....అంటూ....మద్రాసు నగర వీధుల్లో....ఆవిడ గారు....ఏడుస్తూ...జుట్టు విరబోసుకుని....పరిగెత్తుతూ....నటిస్తుంటే......
అది నటన అని తెలియని ప్రజలు....ఆమె వెంట పరుగెత్తుతుంటే.....పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారట!
అది లాంగ్ షాట్. కెమెరా ఎక్కడో మిద్దె మీద ఫిక్స్ చేసి తీస్తున్నారు. గృహలక్ష్మి(1938) మూవీ.
హీరో రామానుజాచార్యులు ఓ డాక్టర్. వేశ్య కాంచన మాల వల్లో పడి.....భార్యను నిర్లక్ష్యం చేసి, చివరకు హత్యానేరం మోపపడి చెరసాల పాలైతే.....భార్య ఉన్మాదావస్థలో....పిచ్చిగా అరుస్తూ పోతుంది.
ఆ సీన్ లో మద్రాస్ రోడ్లలో....ఆ నటీమణి నటన ఎందరినో ఆశ్చర్య పరచిందంటే అతిశయోక్తి కాదు!
************
పుట్టుకతోనే....భూదేవిని పునీతగా చేసింది! నిన్ను చేపట్టి...నీకీర్తి బ్రహ్మలోకం దాకా వ్యాపింప చేసింది! రఘువంశం మెట్టి..తన పాతివ్రత్యం చేత ఛాయాదేవి ని కూడ మరపింప చేసింది! నీ పితృ..పితామహులనే కాదు...ప్రపితా మహులను కూడా ఊర్ధ్వ లోకాలు పొందేలా చేసింది!
అట్టి పరమపావనికి...అగ్నిపునీతకు...అప్రతిష్టా! ఆ అమాయకురాలిని త్యజించడం....నీకు ప్రతిష్టా?!
లోకంలో ఎక్కడైనా కోడలి గుణదోషాలెంచవలసింది...అత్త. ముగ్గురత్తలం..అంత:పురం పాలిస్తుంటే....మాతో సంప్రదించకుండా...ఆ గుణవతిని వెళ్ళగొట్టడానికి...నీకేం అధికారముంది?!
సీతా పరిత్యాగం గురించి విని...ఆందోళనతో....శ్రీరామచంద్రుని....తల్లి కౌసల్య....ప్రశ్నిస్తున్న ఆ ధాటీ...తీరు....ఆ డైలాగ్ డెలివరీ...అనన్యం...అపూర్వం!.....లవకుశ...మూవీలో.
*************
పసుపులేటి కన్నాంబ. నంద్యాల లో అక్టోబర్ 5- 1911 న జన్మించి...కడపలో పెరిగి...నాటకాలతో....మద్రాస్ చేరుకున్న కన్నాంబ...13 ఏళ్ళకే......సావిత్రి, అనసూయ, చంద్రమతి పాత్రలకు పేరెళ్ళిపోయింది.
వారి హరిశ్చంద్ర నాటకాన్ని చూసి....అదే పాత్రధారులతో 1935 లో స్టార్ కంబైన్స్ వారు...మూవీగా తీస్తూ....చంద్రమతి పాత్ర...కన్నాంబకే ఇచ్చారు. అంతకు ముందు 1934 లో సీతాకల్యాణం లో చిన్న పాత్ర వేసినా పెద్ద పేరు రాలేదు!
జస్ట్ స్టేజి డ్రామా.....యథాతధంగా తీశారు! అప్పుడు టెక్నాలజీ లేదు. స్పాట్ లో రికార్డింగ్....మైక్ లు...మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవీ కనబడకుండా మేనేజ్ చేసి....టేక్ చేయడమే! పెద్దగా అరుస్తూ చెప్పాలి డైలాగ్ లు. పాటలు....పద్యాలు అవీ...ఇంకా గట్టిగా....సొంతంగానే పాడుకోవాలి! అయినా....మూవీ సూపర్ హిట్ అయ్యింది!
అప్పటికే...నాటకాల్లో రాటుతేలిన కన్నాంబ గారు....అదరగొట్టారు!
అసలు....నటనంటే....ఏమిటో.....డైలాగ్ డెలివరీ ఎలా చెప్తే....ఆకట్టుకోవచ్చో....మొట్టమొదట సినిమాలకు నేర్పింది....కన్నాంబ గారే అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు!
అప్పట్లోనే తమిళ, తెలుగు రంగాలు రెండింటిలోనూ....సూపర్ స్టార్ గా వెలుగొంది....నాగయ్య గారితో సమానంగా పారితోషికం తీసుకున్నది ఒక్క కన్నాంబ గారే!
************
హరిశ్చంద్ర(1935), ద్రౌపది వస్త్రాపహరణం(36), కనకతార(37),సారంగధర(37),గృహలక్ష్మి(38),మహానంద(39), చండిక(41),.......
1941 లో నిర్మాత - దర్శకుడు అయిన కడారు. నాగభూషణం గారితో వివాహం. ఇద్దరూ కలిసి...రాజ రాజేశ్వరి నాట్యమండలి స్థాపించడం...అది క్రమేణా రాజరాజేశ్వరి కంబైన్స్ గా మారి మూవీస్ తీయడం....షుమారు 30 సినిమాలు తీశారు సొంతంగా తెలుగు & తమిళం కలిసి!
కన్నాంబ గారు షుమారు 170 మూవీస్ చేశారు. తల్లిప్రేమ(41), కన్నగి(42), సుమతి(42),మహామాయ(45)మాయాలోకం(45), మాయామశ్చీంద్ర(45),పాదుకా పట్టాభిషేకం(45),......ఈ మూవీస్ ఏవీ కూడా ఇప్పుడు చూడలేం. కాలగర్భంలో కలిసి పోయాయి!
కేరక్టర్ ఆర్టిస్ట్ గా వేసిన మూవీస్ మాత్రం కొన్ని చూడగలం. ముగ్గురు మరాటీలు(46), పల్నాటి యుధ్ధం(47),మనోహర(54),అనార్కలి(55), రాజ మకుటం(1960), జగదేక వీరుని కథ, ఆడపెత్తనం, కుటుంబ గౌరవం, తోడికోడళ్ళు, లవకుశ వంటివి....చూస్తే...కన్నాంబ గారి నటనా వైధుష్యం ద్యోతకమౌతుంది.
***********
రాజ రాజేశ్వరి కంబైన్స్ ఆఫీస్ & ఇల్లు.....అంటే...ఆ రోజుల్లో...ఓ పెద్ద అన్న సత్రమే మద్రాస్ మహానగరంలో!
తమ జాతకాలు సినీ సీమ లో పరీక్షించుకోదలుచుకున్న వారికి వారి ఇల్లు....ఓదార్పు నిచ్చే మజిలీ! రేలంగి, పద్మనాభం...ఇంకా ఎందరో....వారి ఇంట ఉండి...పైకి వచ్చిన వారే!
ఎవ్వరికీ....కాదని చెప్పలేని కరుణా మూర్తులు కన్నాంబ దంపతులు!
లక్షల్లో ఆదాయం....అప్పట్లో బంగారు కాసులు డబ్బాల్లో పోసి...పోపుల డబ్బాల మధ్య పెట్టుకునే వారట కన్నాంబ గారు. అదో తరహా జాగ్రత్తేమో!
పిల్లలు లేరు. రాజ రాజేశ్వరి అని పేరు పెట్టుకుని ఓ పాపను పెంచి పెద్ద చేసి...దర్శకుడు సి.ఎస్. రావు కిచ్చి పెళ్ళి చేశారు.
30 సినిమాలు తీస్తే....అన్నీ ఆడవుగా! కొన్ని నష్టాలు తెచ్చాయి. దానధర్మాలు మాత్రం తగ్గలేదు!
వచ్చిన ఆస్తి....వచ్చినట్లే కరిగి పోయింది. ఆస్తులు సంపాదించడం కంటే...నిలుపుకోవడమే కష్టం మరి!
ఇక పెంచిన కూతురి భర్త....సి.ఎస్. రావ్. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.....రాజసులోచనను. వారి దాంపత్యం కూడా సజావుగా సాగలేదు! అది అప్రస్తుతం.
1964 మే- 7 వ తేదీ....53 ఏళ్ళకే....మృత్యువాత పడ్డారావిడ! భర్త కృంగి పోయారు.
కన్నాంబ గారి చివరి మూవీ ...నాగయ్య గారి భక్త రామదాసు. కొంత డబ్బింగ్...చివరి సీన్లో...టి.జి.కమలాదేవి గారు చెప్పారు!
వారి ఆచారమో...మరి భర్త కడారు నాగభూషణం గారి సెంటిమెంటో గానీ...కన్నాంబ గారిని సమాధి చేసేప్పుడు....పట్టుచీర తో...నగలతో...సమాధి చేస్తే....
మరుసటి రోజు పాలు పోసేందుకు వెళ్ళినప్పుడు....సమాధి త్రవ్వి...పట్టుచీర, నగలు...దొంగలు దోచుకుని...పోయారట!
పెద్ద భవంతులలో గడిపిన కడారు నాగభూషణం గారు.....చివరి రోజుల్లో చిన్న గదిలో గడిపారు!
ఓ ట్రంకు పెట్టె, ఓ కుర్చీ...నేల మీద చాప. అంతే!
కానీ గది గోడమీద...కన్నాంబ గారి చిత్ర పటం మాత్రం....అద్భుతంగా ఉండేదట మహా తేజస్సుతో....నిలువెత్తు చిత్రం!
ఈ రోజు కన్నాంబ గారి జయంతి(5-10-1911).

(వివరాలు తెలియజేసిన మిత్రులు Prasad Kvs గారికి ధన్యవాదాలు)

4, అక్టోబర్ 2020, ఆదివారం

తల్లి బిడ్డ - sketch pen బొమ్మ


 తల్లి బిడ్డ -  ఈ అంశంమీద ఎక్కడైనా ఓ ఫోటో తారసపడితే బొమ్మ వేసుకోవాలనిపిస్తుంది. ఆటువంటిదే ఈ చిత్రం. ఓ వీడియో చూస్తుంటే ఈ అద్భుత దృశ్యం తారసపడింది. వెంటనే ఆ వీడియో ని pause mode లో పెట్టి ఈ చిత్రం గీసేసాను. తల్లి-బిడ్డ బొమ్మ వేస్తున్నప్పుడు వచ్చే అనుభూతే వేరు. 

ఈ విషయం పై 'తెలుగు వెలుగు' సంచికలో వచ్చిన వ్యాసం మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.

3, అక్టోబర్ 2020, శనివారం

పాతకుర్చీ - కధ

॥పాతకుర్చీ ॥

 నాకెంతో నచ్చిన Dr. Umadevi Prasadarao Jandhyala గారి కధకి నా బొమ్మ. 

~~~~~~~~~~~~~

లక్ష్మి దిగులుగా చూస్తోంది .

‘తను ఒక్కతే మిగిలింది ఒంటరిగా . అందరూ బయటికెళ్ళిపోయారు . సాయంత్రం దాకా రారు . ఒకటి రెండు సార్లు గోపాల్ వస్తాడు గానీ ఏదో ఇంత తినడానికి పెట్టీ పెట్టనట్లు పెడతాడు . ఈ మధ్య మరీ లేవలేక పోతోంది . కాళ్ళు నడుము ఒకటే నొప్పి . చెప్పుకోనూ లేదు . చూసీ పట్టించుకోరు ఇంట్లో వాళ్ళు . ఎన్నాళ్ళుందో నేల ఋణం !

ఎవరో వాకిట్లో ఆటోలో దిగుతున్నారు .

అరే ఈవిడ వర్థనమ్మ . ఎంత మారి పోయింది ! జుట్టు బాగా నెరిసిపోయింది . వాకిట్లో నాలుగు మెట్లెక్కడానికి అవస్త పడుతోంది .

నాలాగే కాళ్ళు నొప్పులు కాబోలు . పక్కన ఎవరో పిల్లాడు . చెయ్యి పుచ్చుకొని మెట్లెక్కిస్తున్నాడు . అదృష్ట వంతురాలు . తనకూ పుట్టారు నలుగురు పిల్లలు . ఎక్కడున్నారో కూడ తెలీదు.’

నవ్వుకుంది లక్ష్మి.

వర్థనమ్మ చిన్నగా లోపలికెళ్ళింది .

“ పెద్దమ్మా నువ్వా! ఆటో ఆగితే ఎవరో మిద్దెపై వాళ్ళింటికి వచ్చారనుకున్నా” అంటూ మంచి నీళ్ళిచ్చి కుర్చీ తెచ్చి వేసింది మేనల్లుడి భార్య వేణి .

“ఇష్ అమ్మయ్యా”! అని కుర్చీలో కూచోగానే ఆ కుర్చీ గడగడ వణికిపోయింది . ఇదేవిటే ఇలా కూసాలు కదిలిపోయాయి దీనికి ... పడతానో ఏమో” అంది ఆవిడ నవ్వి .

“మరే,ఆ కుర్చీకి అరవైఏళ్ళు దాటాయి అత్తయ్యా . ఎంత మంచి టేకైనా ఇంకా ఎంతకాలం బావుంటుంది ? అమ్మేద్దావంటే ఈయన ఒప్పుకోరు. ‘మా నాన్న కూచున్న కుర్చీ . ఆయన జ్ఞాపకం’ అంటారు”.

“అవునే వేణీ !మా తమ్ముడు ఉద్యోగంలో చేరి తన మొదటి జీతంతో కొనుక్కున్నాడు.” అంటూ ప్రేమగా దాన్ని నిమిరింది.

“వాడు దీన్లో కూచుని ఎంత మందికి ట్యూషన్ పాఠాలు చెప్పాడు! మా అందరితో ఎన్ని కబుర్లు చెప్పాడు।ఎవరెక్కడ కూచున్నా ఈ కుర్చీ మాత్రం

అది రాజుగారి కుర్చీ అంటూ వాడికే అట్టి పెట్టేవారు.వాడికన్నా పెద్దదాన్ని. నేనిలా వేలాడుతున్నా. మాయదారి హార్ట్ ఎటాక్ . పడుకున్న వాడిని నిద్రలోనే మాయం చేసింది .”అంటూ కళ్ళు తుడుచుకుంది.

“ మాటల్లో పడి మరిచి పోయా,లక్ష్మి ఎలా ఉందే ?చూసి చాలా రోజులైంది”కాఫీ తాగుతూ అడిగింది వర్థనమ్మ .

“అదుగో చూడుపో. తొంగి తొంగి చూస్తోంది.”అంది ఒకరకంగా నవ్వి వేణి.

వర్థనమ్మ చిన్నగా లక్ష్మి దగ్గరకు వెళ్ళింది . ఓపిక కూడ దీసుకొని లేచింది లక్ష్మి .

“ఏవిటో నీకూ కాళ్ళు నొప్పులుటే! ఎంత చిక్కిపోయావే! ఏంచేస్తాం . ఇలా ఈడవ్వలసిందే ! పాలిస్తేనే గొడ్డు. పనిచేస్తేనే మనిషి .

ముసలితనం వస్తే ఎవరికైనా తిప్పలే.

ఎన్ని పాలిచ్చావు ? ఎంత మంది నీకు పూజలు చేసారు ! ఎన్నిళ్ళ గృహప్రవేశాలకు నువ్వొస్తే చాలనుకున్నారు! అదంతా వయసులో వైభోగం. మా వారిని స్వర్గానికి నీ తోక పట్టించేగా పంపారు ! అప్పుడు పాపం పసిబిడ్డతల్లివి . మా తమ్ముడికిచ్చాం దానంగా నిన్ను . పాపం చాలా బాగా చూసుకున్నాడు . వాడు పోయే నాటికి నీ ఈతలైపోయాయి గానీ లేక పోతే నిన్నూ దానంగా ఎవరికో ఇచ్చుండే వాడు వాడి కొడుకు. మా తమ్ముడి మీద బెంగెట్టుకున్నావా ? వాడు అదే మా మేనల్లుడు మంచివాడు గనక నిన్ను తోలెయ్యకుండా తిండి పెడుతున్నాడు”అని గొణుక్కుంటూ తనలో తను మాట్లాడుకుంది వర్థనమ్మ .

తనకంతా అర్థమైనట్లు తలఊపి నాలుకతో ఆమె చెయ్యి నాకింది లక్ష్మి . “మీ పిల్లలు కూడ మంచి వాళ్ళే వర్థనమ్మా . లేకపోతే నువ్వు ఆశ్రమానికి వెళ్ళవలసి వచ్చేది.” అనుకుంది తోక ఊపుతూ లక్ష్మి లోపల .

ఆ మాటలు వినబడినట్లు వర్థనమ్మ దాని వెన్ను మీద తట్టి ‘అన్నిటికీ శిథిలావస్థ తప్పదు ఆ కుర్చీకిలాగా!

వదిలించుకోలేని పాతకుర్చీలమే మనమం


తా.’అనుకుంది విరక్తిగా !

2, అక్టోబర్ 2020, శుక్రవారం

చందమామ' చిత్రకారుడు శంకర్ - నివాళి (Chandamama 'Sankar' - pencil sketch)

 


'చందమామ' చిత్రకారుడు శంకర్ - నివాళి (my pencil sketch

మంగళవారం కన్నుమూసిన శంకర్ ‌గారి వయస్సు 97 సంవత్సరాలు, తన అసలు పేరు కరథొలువు చంద్రశేఖరన్‌ శివశంకరన్‌. చందమామ చిత్రకారుడిగా శంకర్‌గా పరిచయం. ఆయన 1924, జూలై 24న ఈరోడ్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. 12వ తరగతి పూర్తయ్యాక, మదరాసులోని ఆర్ట్స్‌ కాలేజీలో చేరి తనకు స్వతహాగా అబ్బిన బొమ్మలు వేసే శక్తిని ఇనుమడింపచేసుకున్నారు. మొదటి ఉద్యోగం 1946లో కళైమాగళ్‌ అనే పత్రికలో. తరువాత 1952లో చందమామలో చిత్రకారునిగా చేరి, చివరివరకూ చందమామలోనే బొమ్మలు వేశారు. చివరిక్షణాల్లోనూ, చందమామలో తాను వేసిన బొమ్మలనే తలచుకుంటూ ఆ బెంగతోనే ఆయన మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. (వివరాలు 'సాక్షి' దినపత్రిక సౌజన్యంతో)


శంకర్ గారి గురించి శ్రీ కె. రాజశేఖర్ గారి మాటల్లో ...

"చందమామ మాన్య చిత్రకారులు శంకర్ గారు ఈ మంగళవారం మధ్యాహ్నం 1 గంట వేళ కన్నుమూశారు. వయసు 97 ఏళ్లు. చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న మదనంతపుర ప్రాంతంలో తన కుమార్తె ఇంట్లో ఆయన ఇన్నాళ్లుగా గడిపారు. ఆయన జీవన సహచరి షణ్ముకవల్లి (87) కుమార్తె, కుమారుడు ఉన్నారు. 97 ఏళ్ల వయసులోనూ చందమామ గురించి, దాంట్లో తాను వేసిన చిత్రాల గురించే ఆలోచిస్తూ మానసికంగా బాగా బలహీనులయ్యారని వారి కుమార్తె చెప్పారు. గత 20 రోజులుగా సైక్రియాటిస్టు ఆయనకు వైద్య సేవలందించారు. 20 రోజులుగా మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకోలేదట. ఈరోజు అంటే మంగళవారం సాయంత్రమే శంకర్ గారి అంత్యక్రియలు కూడా ముగిశాయని తెలిసింది. (జూనియర్ చందమామ మాజీ సంపాదకులు వాసుకి గారి ద్వారా ఈ వివరాలు తెలిసాయి) శంకర్ గారి కన్నుమూతతో చందమామ చిత్రకారుల్లో చివరిశకం కూడా ముగిసినట్లే. తన 700 పైగా బేతాళకథలకు దాదాపుగా ఈయనే చిత్రాలు గీశారు. చందమామలో వచ్చిన రామాయణం, మహాభారతం సీరియల్స్ కి వేసిన బొమ్మలతో పౌరాణికి పాత్రలకు దివ్యత్వం కలిగించిన గొప్ప ఆర్టిస్టు శంకర్ గారని అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పారు. రాజకుమార్తెల నిసర్గ సౌందర్యాన్ని నభూతో నభవిష్యత్ అనేలా చిత్రించిన శంకర్ గారు రాక్షస పాత్రలను కూాడ అంతే సుందరంగా చిత్రించారు. ఉదాహరణకు రామాయణంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు పాత్రలు మచ్చుకు మాత్రమే. చందమామలో చేరింది మొదలుకుని 2012 చివరి వరకు దాదాపు 60 ఏళ్లు పాటు చిత్రాలు గీస్తూనే వచ్చిన మాన్య చిత్రకారుడు శంకర్ గారు.
- కె. రాజశేఖరరాజు (ఒకనాటి 'చందమామ' కుటుంబ సభ్యుడు)"

లలిత యామిని కరగకుండా ఒదిగిపోనా ఈక్షణమిలా - గజల్


శ్రీమతి హంసగీతి గారి గజల్ కి నా బొమ్మ

 లలిత యామిని కరగకుండా ఒదిగిపోనా ఈక్షణమిలా

కలల కౌముది చెదరకుండ కరిగిపోనా ఈక్షణమిలా
నీవునేనుగ నేను నీవుగ ఒకరికొకరిగ జతగచేరగ
తనువు లతలా అల్లుకుంటూ మురిసిపోనా ఈక్షణమిలా
మౌనరాగం మీటుతున్నది కౌగిలింతల కానుక నడిగి
శృతులు పాడే విపంచికనై నిలిచిపోనా ఈక్షణమిలా
మమత లన్నీ చిలుకుతున్నవి ప్రణయబంధపు ముడులువేస్తూ
మరులు గొలిపే ప్రేమమధువుగ అందిపోనా ఈక్షణమిలా
దిగులు మబ్బులు కరుగుతుంటే మెరుపునగవుల జల్లు కురిసే
ప్రేమధారల చినుకుతడిలో తడిసిపోనా ఈక్షణమిలా
తమకమేదో కమ్ముతున్నది చిలిపిముద్దుల సంతకాలకు
గువ్వలాగా గుండెగూటిని చేరిపోనా ఈక్షణమిలా
తనువు తపనల సరాగాలను పాడుతుంటే'హంసగీతీ'
ప్రేమ ఒడిలో రసికరాజ్ఞిగ మారిపోనా ఈక్షణం.
(తెలుగు గజల్ 'హంసగీతి' గారి సౌజన్యంతో)

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...