2, అక్టోబర్ 2020, శుక్రవారం

చందమామ' చిత్రకారుడు శంకర్ - నివాళి (Chandamama 'Sankar' - pencil sketch)

 


'చందమామ' చిత్రకారుడు శంకర్ - నివాళి (my pencil sketch

మంగళవారం కన్నుమూసిన శంకర్ ‌గారి వయస్సు 97 సంవత్సరాలు, తన అసలు పేరు కరథొలువు చంద్రశేఖరన్‌ శివశంకరన్‌. చందమామ చిత్రకారుడిగా శంకర్‌గా పరిచయం. ఆయన 1924, జూలై 24న ఈరోడ్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. 12వ తరగతి పూర్తయ్యాక, మదరాసులోని ఆర్ట్స్‌ కాలేజీలో చేరి తనకు స్వతహాగా అబ్బిన బొమ్మలు వేసే శక్తిని ఇనుమడింపచేసుకున్నారు. మొదటి ఉద్యోగం 1946లో కళైమాగళ్‌ అనే పత్రికలో. తరువాత 1952లో చందమామలో చిత్రకారునిగా చేరి, చివరివరకూ చందమామలోనే బొమ్మలు వేశారు. చివరిక్షణాల్లోనూ, చందమామలో తాను వేసిన బొమ్మలనే తలచుకుంటూ ఆ బెంగతోనే ఆయన మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. (వివరాలు 'సాక్షి' దినపత్రిక సౌజన్యంతో)


శంకర్ గారి గురించి శ్రీ కె. రాజశేఖర్ గారి మాటల్లో ...

"చందమామ మాన్య చిత్రకారులు శంకర్ గారు ఈ మంగళవారం మధ్యాహ్నం 1 గంట వేళ కన్నుమూశారు. వయసు 97 ఏళ్లు. చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న మదనంతపుర ప్రాంతంలో తన కుమార్తె ఇంట్లో ఆయన ఇన్నాళ్లుగా గడిపారు. ఆయన జీవన సహచరి షణ్ముకవల్లి (87) కుమార్తె, కుమారుడు ఉన్నారు. 97 ఏళ్ల వయసులోనూ చందమామ గురించి, దాంట్లో తాను వేసిన చిత్రాల గురించే ఆలోచిస్తూ మానసికంగా బాగా బలహీనులయ్యారని వారి కుమార్తె చెప్పారు. గత 20 రోజులుగా సైక్రియాటిస్టు ఆయనకు వైద్య సేవలందించారు. 20 రోజులుగా మంచినీళ్లు తప్ప మరేమీ తీసుకోలేదట. ఈరోజు అంటే మంగళవారం సాయంత్రమే శంకర్ గారి అంత్యక్రియలు కూడా ముగిశాయని తెలిసింది. (జూనియర్ చందమామ మాజీ సంపాదకులు వాసుకి గారి ద్వారా ఈ వివరాలు తెలిసాయి) శంకర్ గారి కన్నుమూతతో చందమామ చిత్రకారుల్లో చివరిశకం కూడా ముగిసినట్లే. తన 700 పైగా బేతాళకథలకు దాదాపుగా ఈయనే చిత్రాలు గీశారు. చందమామలో వచ్చిన రామాయణం, మహాభారతం సీరియల్స్ కి వేసిన బొమ్మలతో పౌరాణికి పాత్రలకు దివ్యత్వం కలిగించిన గొప్ప ఆర్టిస్టు శంకర్ గారని అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పారు. రాజకుమార్తెల నిసర్గ సౌందర్యాన్ని నభూతో నభవిష్యత్ అనేలా చిత్రించిన శంకర్ గారు రాక్షస పాత్రలను కూాడ అంతే సుందరంగా చిత్రించారు. ఉదాహరణకు రామాయణంలో కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు పాత్రలు మచ్చుకు మాత్రమే. చందమామలో చేరింది మొదలుకుని 2012 చివరి వరకు దాదాపు 60 ఏళ్లు పాటు చిత్రాలు గీస్తూనే వచ్చిన మాన్య చిత్రకారుడు శంకర్ గారు.
- కె. రాజశేఖరరాజు (ఒకనాటి 'చందమామ' కుటుంబ సభ్యుడు)"

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...