॥పాతకుర్చీ ॥
నాకెంతో నచ్చిన Dr. Umadevi Prasadarao Jandhyala గారి కధకి నా బొమ్మ.
~~~~~~~~~~~~~
లక్ష్మి దిగులుగా చూస్తోంది .
‘తను ఒక్కతే మిగిలింది ఒంటరిగా . అందరూ బయటికెళ్ళిపోయారు . సాయంత్రం దాకా రారు . ఒకటి రెండు సార్లు గోపాల్ వస్తాడు గానీ ఏదో ఇంత తినడానికి పెట్టీ పెట్టనట్లు పెడతాడు . ఈ మధ్య మరీ లేవలేక పోతోంది . కాళ్ళు నడుము ఒకటే నొప్పి . చెప్పుకోనూ లేదు . చూసీ పట్టించుకోరు ఇంట్లో వాళ్ళు . ఎన్నాళ్ళుందో నేల ఋణం !
ఎవరో వాకిట్లో ఆటోలో దిగుతున్నారు .
అరే ఈవిడ వర్థనమ్మ . ఎంత మారి పోయింది ! జుట్టు బాగా నెరిసిపోయింది . వాకిట్లో నాలుగు మెట్లెక్కడానికి అవస్త పడుతోంది .
నాలాగే కాళ్ళు నొప్పులు కాబోలు . పక్కన ఎవరో పిల్లాడు . చెయ్యి పుచ్చుకొని మెట్లెక్కిస్తున్నాడు . అదృష్ట వంతురాలు . తనకూ పుట్టారు నలుగురు పిల్లలు . ఎక్కడున్నారో కూడ తెలీదు.’
నవ్వుకుంది లక్ష్మి.
వర్థనమ్మ చిన్నగా లోపలికెళ్ళింది .
“ పెద్దమ్మా నువ్వా! ఆటో ఆగితే ఎవరో మిద్దెపై వాళ్ళింటికి వచ్చారనుకున్నా” అంటూ మంచి నీళ్ళిచ్చి కుర్చీ తెచ్చి వేసింది మేనల్లుడి భార్య వేణి .
“ఇష్ అమ్మయ్యా”! అని కుర్చీలో కూచోగానే ఆ కుర్చీ గడగడ వణికిపోయింది . ఇదేవిటే ఇలా కూసాలు కదిలిపోయాయి దీనికి ... పడతానో ఏమో” అంది ఆవిడ నవ్వి .
“మరే,ఆ కుర్చీకి అరవైఏళ్ళు దాటాయి అత్తయ్యా . ఎంత మంచి టేకైనా ఇంకా ఎంతకాలం బావుంటుంది ? అమ్మేద్దావంటే ఈయన ఒప్పుకోరు. ‘మా నాన్న కూచున్న కుర్చీ . ఆయన జ్ఞాపకం’ అంటారు”.
“అవునే వేణీ !మా తమ్ముడు ఉద్యోగంలో చేరి తన మొదటి జీతంతో కొనుక్కున్నాడు.” అంటూ ప్రేమగా దాన్ని నిమిరింది.
“వాడు దీన్లో కూచుని ఎంత మందికి ట్యూషన్ పాఠాలు చెప్పాడు! మా అందరితో ఎన్ని కబుర్లు చెప్పాడు।ఎవరెక్కడ కూచున్నా ఈ కుర్చీ మాత్రం
అది రాజుగారి కుర్చీ అంటూ వాడికే అట్టి పెట్టేవారు.వాడికన్నా పెద్దదాన్ని. నేనిలా వేలాడుతున్నా. మాయదారి హార్ట్ ఎటాక్ . పడుకున్న వాడిని నిద్రలోనే మాయం చేసింది .”అంటూ కళ్ళు తుడుచుకుంది.
“ మాటల్లో పడి మరిచి పోయా,లక్ష్మి ఎలా ఉందే ?చూసి చాలా రోజులైంది”కాఫీ తాగుతూ అడిగింది వర్థనమ్మ .
“అదుగో చూడుపో. తొంగి తొంగి చూస్తోంది.”అంది ఒకరకంగా నవ్వి వేణి.
వర్థనమ్మ చిన్నగా లక్ష్మి దగ్గరకు వెళ్ళింది . ఓపిక కూడ దీసుకొని లేచింది లక్ష్మి .
“ఏవిటో నీకూ కాళ్ళు నొప్పులుటే! ఎంత చిక్కిపోయావే! ఏంచేస్తాం . ఇలా ఈడవ్వలసిందే ! పాలిస్తేనే గొడ్డు. పనిచేస్తేనే మనిషి .
ముసలితనం వస్తే ఎవరికైనా తిప్పలే.
ఎన్ని పాలిచ్చావు ? ఎంత మంది నీకు పూజలు చేసారు ! ఎన్నిళ్ళ గృహప్రవేశాలకు నువ్వొస్తే చాలనుకున్నారు! అదంతా వయసులో వైభోగం. మా వారిని స్వర్గానికి నీ తోక పట్టించేగా పంపారు ! అప్పుడు పాపం పసిబిడ్డతల్లివి . మా తమ్ముడికిచ్చాం దానంగా నిన్ను . పాపం చాలా బాగా చూసుకున్నాడు . వాడు పోయే నాటికి నీ ఈతలైపోయాయి గానీ లేక పోతే నిన్నూ దానంగా ఎవరికో ఇచ్చుండే వాడు వాడి కొడుకు. మా తమ్ముడి మీద బెంగెట్టుకున్నావా ? వాడు అదే మా మేనల్లుడు మంచివాడు గనక నిన్ను తోలెయ్యకుండా తిండి పెడుతున్నాడు”అని గొణుక్కుంటూ తనలో తను మాట్లాడుకుంది వర్థనమ్మ .
తనకంతా అర్థమైనట్లు తలఊపి నాలుకతో ఆమె చెయ్యి నాకింది లక్ష్మి . “మీ పిల్లలు కూడ మంచి వాళ్ళే వర్థనమ్మా . లేకపోతే నువ్వు ఆశ్రమానికి వెళ్ళవలసి వచ్చేది.” అనుకుంది తోక ఊపుతూ లక్ష్మి లోపల .
ఆ మాటలు వినబడినట్లు వర్థనమ్మ దాని వెన్ను మీద తట్టి ‘అన్నిటికీ శిథిలావస్థ తప్పదు ఆ కుర్చీకిలాగా!
వదిలించుకోలేని పాతకుర్చీలమే మనమం
తా.’అనుకుంది విరక్తిగా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి