23, ఫిబ్రవరి 2020, ఆదివారం

తెలుగు భాష - తెలుగు గజల్


నేను రంగులద్దిన రేఖా చిత్రానికి శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి గజల్

॥తెలుగు భాష ॥
===============
పాలకన్నా వెన్నకన్నా కమ్మనైనది తెలుగు భాషే
తేనె కన్నా చెరుకు కన్నా తీయనైనది తెలుగు భాషే
కావ్యమైనా గానమైనా ఒదిగిపోదా వయారంగా
కులుకులొలికే మనసుదోచే చక్కనైనది తెలుగు భాషే
అమరభాషకు చేయి కలిపీ అజంతంగా మలిచి మనదిగ
వాడుకుంటే వ్రాసుకుంటే అనువు ఐనది తెలుగు భాషే
ఆదికవి నన్నయ్య కైనా హాలికుడు పోతన్నకైనా
తిక్కనా తిమ్మనలకైనా ప్రియంబైనది తెలుగు భాషే
తరంగిణిలా ఉరకలేస్తూ తనదుపోకడ మార్చుకుంటూ
ఆంధ్రభోజుడు రాయలకు రమణీయమైనది తెలుగు భాషే
ప్రబంధాల్లో నాయికైనది యక్షగానపు భామఅయినది
నిత్యయవ్వని కవులఊహకు ప్రాణమైనది తెలుగు భాషే
కృష్ణశాస్త్రికి కలలరాణై బాపిరాజుకు బొమ్మతానై
భావకవులూరేగు బంగరు రథంబైనది తెలుగు భాషే
విప్లవాలకు బావుటాగా సమాజానికి బాసటవుతూ
నాడునేడూ తెలుగువారికి దేవతైనది తెలుగు భాషే !
——————-
డా. ఉమాదేవి జంధ్యాల
తెలుగుతల్లి చిత్రకారులు - శ్రీ Pvr Murtyగారు

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...