23, జూన్ 2020, మంగళవారం

కొసరాజు రాఘవయ్య చౌదరి - గీత రచయిత - Pencil sketch

కొసరాజు రాఘవయ్య చౌదరి - నా pencil sketch



కనకాద్రి శిఖరాన శునకమ్ము సింహమై,
ఏడుదీవుల రాజ్యమేలేనయా!
గుళ్ళు మ్రింగేవాళ్ళు, నోళ్ళు గొట్టే వాళ్ళు..
ఊళ్ళో చలామణీ అవుతారయా!
ఆ ఆ లు రానట్టు అన్నయ్యలందరికి...
అధికార యోగమ్ము పడుతుందయా!
కుక్కతోక పట్టి గోదావరీదితే..
కోటిపల్లి కాడ తేలేరయా!
స్వారాజ్య యుధ్ధాన జయభేరి మ్రోగించిన,
శాంతమూర్తులు అంతరించారయా,
స్వాతంత్ర్య గౌరవం సంతలో తెగనమ్ము...
స్వార్థమూర్తులు అవతరించారయా!
గొర్రెల్ని తినువాడు గోవింద గొట్తాడు,
బర్రెల్ని తినువాడు వస్తాడయా!
పగలె చుక్కలు మింట మొలిపింతునంటాడు!
నగుబాట్లు పడి తోక ముడిచేనయా.
అప్పు చేసిన వాడు పప్పుకూడు తిని...
ఆనందమయుడౌతు తిరిగేనయా!
అర్దమిచ్చిన వాడు ఆకులలములు మేసి
అన్నానికాపన్నుడౌతాడయా!
నందామయ గురుడ నందామయ,
ఆనందదేవికి నందామయ!
1954 లో రాష్ట్రపతి ఉత్తమ చిత్రం గా ఎన్నికైన కె.వి.రెడ్డి గారి...పెద్ద మనుషులు....మూవీ లోని ఈ పాట....
ఆ రోజుల్లో...తెలుగు నాట....ప్రతినోట...నాట్యమాడిందంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు విన్నా ఆ పాట నిత్య నూతనంగా అలరిస్తుంది!
అప్పుడెప్పుడో....1939 లో రిలీజ్ అయిన గూడవల్లి రామబ్రహ్మం గారి రైతు బిడ్డ....మూవీలో....అద్భుతమైన రైతు పోరాటం.....గీతాలు వ్రాసి...
అందులో ఓ మంచి పాత్ర కూడా వేసిన ఆయన.....సినిమా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని....అద్భుత విజయాన్ని అందుకున్నా....
ఎందుకో మళ్ళీ సొంత ఊరెళ్ళిపోయి...వ్యవసాయం చేసుకుంటూ....పత్రికలలో...సాహిత్య వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉండిపోయాడు....
మళ్ళీ 13 ఏళ్ళ తరువాత....కె.వి.రెడ్డి గారే పిలిపించి...పెద్ద మనుషులుతో....సినీ గీత రచయితగా మార్చేశారు.
ఆ తరువాత....ఆయన తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసేసుకున్నాడు.
హాస్య, వ్యంగ్య, రాజకీయ , జానపద గీతాలను.....ఆయన వ్రాస్తే....అప్పట్లో....ఆ కిక్కే వేరబ్బా....ఆన్నట్లుండేది!
ఆయనే... కొసరాజు రాఘవయ్య చౌదరి గారు.
*************
సినిమాలో అన్ని పాటలూ రికార్డ్ చేసేసినా సరే....ఇంకా ఏదో వెలితి కనిపిస్తుంటది. అప్పుడు...కొసరాజు గారే గుర్తొస్తారు...ఏ దర్శకుడికైనా!
ఓ హాస్య గీతమో...వ్యంగ్య గీతమో...జానపదమో పెట్టేస్తారు. ఆశ్చర్యంగా అదే పెద్ద హిట్టౌతుంది సినిమాకు!
1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు.
సొంత వూరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు.
అంచేత నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివారు కొసరాజు గారు!
నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.’లాగా, ఆయన చిన్నతనంలోనే ‘డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు!
ఐతే, ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం - రాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది.
ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.
కొండముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది.
నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి.
అప్పటికే ఆయన కంఠం లౌడ్‌ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు.
అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! బాలకవి అని బిరుదు పొందాడు.
సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాపులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాపులర్!
పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం - ఏ మాత్రం అడ్డురాలేదు!
ఏ డిగ్ర్రీలూ లేవు...ఏ జర్నలిజం కోర్సులూ లేవు!
**************
"చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళ, వేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన కూచోబెట్టారు కోసరాజు గారిని.
వధూవరుల మీద రాజు గారు రాసిన పద్యాలు చదివితే, 'ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!' అని చెళ్లపిళ్ల వారు ప్రశంసించారు, ఆశీర్వదించారు!
జమీన్‌రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు.
అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు గారు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.
ఆ పుస్తకం చదివి, అందరూ 'మనకెందుకులే' అని వెనుకంజ వేశారుట - భయపడి.
ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మాత్రం 'నేను రాస్తాను' అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది.
రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే 'ఆహా' అనే వారందరు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు.
**************
కొసరి వ్రాయి చుకునే వారు దర్శకులు...నిర్మాతలు.....కొసరాజు గారిదగ్గర గీతాలు. మరి వారి కొసరాజు బ్రాండ్ అలాంటిది!
హాస్యం తొణికిసలాడాలన్నా...
వ్యగ్యం తొంగిచూడాలన్నా...
జానపద రీతులు...అలరించాలన్నా....
ఒక్క కొసరాజు వారి మాటే....పాటగా మారాలి!
అదీ అప్పుడాయన పరిస్థితి.
కొస రాజు కాదు....కొసరు రాజు....అని కూడా అనేవారాయనను! ఆయన రచన ఒక్కటైనా లేకపోతే....సంపూర్ణత్వం రాదు!
రైతుపైన అభిమానము చూపని రాజులుండనేల?
నిద్ర మేల్కొనర తమ్ముడా..గాఢ నిద్ర మేల్కొనరా తమ్ముడా,...
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా...
ఇల్లరికంలో ఉన్న మజా....
జేబులో బొమ్మ జేజేల బొమ్మ,
అయ్యయ్యో చేతిలొ డబ్బులు పోయెనే,
ముద్దబంతి పూలు పెట్టి..మొగిలిరేకులు..
సరిగంచు చీర జట్టి, కొమ్మంచు రైక తొడిగి....
సరదా సరదా సిగిరెట్టు..ఉది దొరల్ తాగు భల్ సిగిరెట్టు...
టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ...
ఆడుతు పాడుతు..పని చేస్తుంటే...
మూక్కు చూడు ముక్కందం చూడు...
శివశివ మూర్తివి గణనాథ..నువ్వు శివుని కుమారుడవు గణనాథ....
శ్రీరామ...ఓరామ.. నీ నామమెంతో రుచిరా
ఆ శైలి ఒక్క కొసరాజు కే సొంతం.
ఎందుకంటే....ఆయన చిన్నప్పటి నుండే...ఓ సంస్కృతి చూస్తూ పెరిగారు.
హరికథలు, బుర్రకథలు,
జముకుల కథలు, రజకుల పాటలు,
పాములోళ్ళ పాటలు,భజన గీతాలు,
పగటివేషగాళ్ళ పాటలు,
గంగిరెద్దు వారి గీతాలు....
ఇవన్నీ గమనించడమే కాదు....జీర్ణించుకున్నారు...తన పాటలో అవసరానికి ఆవిష్కరించారు....తనదైన ప్రత్యేక శైలిలో.
అజరామరం గా నిలిచాయి ఆ పాటలు.
మూడున్నర దశాబ్ధాల పాటు....షుమారు 200 చిత్రాలలో 1000 కి పైగా గీతాలు వ్రాశారాయన.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము కొసరాజు రాఘవయ్య గారికి
రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.
తెలుగు ప్రజానీకం... 'కవి రత్న' 'జానపద కవి సార్వభౌమ'.. బిరుదులు ఇచ్చింది.
**************
సినిమాకు మాటలు వ్రాసే వారందరూ పాటలు రాయలేకపోవచ్చు.
కానీ పాటలు వ్రాసేవారు...మాటలు వ్రాయగలరు.
కానీ కొసరాజు గారు ఆ ప్రయత్నం చేయలేదు. ఎవ్వరూ అడగలేదేమో మరి!
సంస్కృతాంధ్రాలు చదివినా...
అవధానాలు చేసినా...
జానపద వాజ్మయాన్ని జీర్ణం చేసుకున్నా....
కించిత్తు కూడా గర్వం అనేది ఎరుగరు కొసరాజు గారు.
సదా చిరునవ్వు ముఖమే! కడు సౌమ్యుడాయన. విరగబడి నవ్వుతారు, నవ్విస్తారు....నవ్వు ఇస్తారు.
81 ఏళ్ళ వయస్సులో...27 అక్టోబర్ 1986 న....కొసరాజు గారు కీర్తిశేషులయ్యారు.
ఈ రోజు 23 జూన్ 1905....వారి జయంతి అంటున్నారు. కానీ సెప్టెంబర్ 3 వారి జయంతిగా కూడా బిన్నాభిప్రాయాలున్నా....చిరస్మరణీయులైన కొసరాజు గారిని ఎప్పుడైనా తలుచుకోవచ్చు తెలుగు వారు.

(వివరాలు మిత్రులు ప్రసాద్ కెవి గారి సౌజన్యంతో)

22, జూన్ 2020, సోమవారం

ఎల్. వి. ప్రసాద్ - L.V. Prasad, Pencil sketch



ఎల్. వి. ప్రసాద్  -- నా పెన్శిల్ చిత్రం.

ఎల్. వి. ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్‌.వి. ప్రసాద్‌ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన  ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసారు.
ఈయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.
ఇక 1908 జనవరి 17న జన్మించిన ఎల్‌.వి.ప్రసాద్‌ వివాహం సౌందర్య మనోహరమ్మతో జరిగింది. ఒకరోజు ఆయన సినిమాల్లో నటించాలనే కోరికతో జేబులో 100రూ.లతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయల్దేరాడు. ముంబయికి వెళ్లిన ఆయనకు ఎంతో కష్టపడగా చివరికి ఆలం అరా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
దేశంలోనే తొలి టాకీ సినిమా అయిన ఈ చిత్రంలో ఎల్‌.వి.ప్రసాద్‌ ఓ పాత్ర చేశారు. ఈ చిత్రంలో నటించినందుకుగాను ఎల్‌.వి.ప్రసాద్‌కు నెలకు 30 రూపాయలను అందజేశారు. ఆ తర్వాత హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం కాళిదాస, తెలుగు చిత్రం భక్త ప్రహ్లాదలో ఆయన నటించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఎల్‌.వి.ప్రసాద్‌ 1950లో విడుదలైన విజయ పిక్చర్స్‌ వారి షావుకారు సినిమాకు దర్శకత్వం వహించి ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఎన్టీరామారావు, జానకి నటిచిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రసాద్‌ ప్రొడక్షన్‌ను నెలకొల్పిన ఎల్‌.వి.ప్రసాద్‌ హిందీలో మిలన్‌, ఖిలోనా, ససురాల్‌, ఏక్‌ దూజే కె లియే వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు.

('తెలుగుబిడ్డ' సౌజన్యంతో)

15, జూన్ 2020, సోమవారం

అద్భుత గాయని, నటి " సురయ్యా " -


My pencil sketch of legendary Surayya

అలనాటి అద్భుత గాయని, నటి 'సురయ్యా' - కొన్ని ఆశక్తికర విషయాలు.

ప్రేమ విఫలమైనా.....
ప్రేమించిన వాడిని....గుండెల్లో నింపుకుని....
జీవితమంతా....హాయిగా గడిపేసిన ధృవ తార......
సురయ్యా గురించి....
ఎక్కువ మందికి తెలియకపోవచ్చు!
ప్రేమంటే రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు. రెండు హృదయాలకు సంబంధించినది!
అని నిరూపించిన సురయ్యా .....
నిజంగా అభినందనీయురాలు.
సురయ్యా...లాహోర్ లో జన్మించినా...బొంబాయిలోని మెరైన్ డ్రైవ్ లో అమ్మ & అమ్మమ్మలతో ఉంటూ...జె.బి.పెటిట్ హై స్కూల్ లో చేరినప్పుడు....తన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా!
6 ఏళ్ళ సురయ్యాకు 12 ఏళ్ళ రాజ్ కపూర్ & మ్యుజిక్ డైరెక్టర్ గా పేరుగాంచిన మదన్ మోహన్! ముగ్గురు కలిసి....బొంబాయి ఆల్ ఇండియా రేడియో లో పాడే వారు.
బాల నటిగా 7 ఏళ్ళ కే బాల నర్గీస్ తో కలిసి......మేడం ఫాషన్...అనే మూవీలో(1936) యాక్ట్ చేస్తూ పాడింది. అందులో హీరోయిన్ నర్గీస్ తల్లి జర్దన్ బాయి. 7 ఏళ్ళకే సురయ్యా లోని గాన మాధుర్యాన్ని పసిగట్టారావిడ!
బాలనటిగా...తమన్నా(42), స్టేషన్ మాస్టర్(1942),హమారీ బాత్(43) లాంటి మూవీస్ లో యాక్ట్ చేసింది.
హమారీ బాత్ నిర్మాత దేవికా రాణి...నెలకు500 రూపాయల జీతం ఏర్పాటు చేస్తే....
ఆ మూవీస్ విడుదలయ్యాక...కె.ఆసిఫ్....తన రేట్ ను ఏకంగా 40000 కు పెంచేశాడు చిత్రానికి. దేవికా రాణిని ఒప్పించి....నటించింది. అదే ఫూల్ మూవీ.
ఆ తరువాతా ఇషారా తో తారాపథం లో దూసుకెళ్ళింది సింగింగ్ స్టార్ గా!
తన పాటలు తనే మధురాతి మధురంగా గానం చేసుకుంటూ....అద్భుతమైన నటన ....పాలరాతి శిల్పం లాంటి అందమైన సురయ్యా....
క్రమేణా...నిర్మాతల పాలిటి కల్పవృక్షమయ్యిందంటే అతిశయోక్తి కాదు! 1945 నుండి 1961 దాకా హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ..సురయ్యా!
సురయ్యా మూవీకి లక్ష పారితోషికం తీసుకునే రోజుల్లో...త్రిమూర్తులు దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ & రాజ్ కపూర్ లకు అంత సీన్ లేదు అప్పుడు. ఆమె కన్న వారి పారితోషికం తక్కువ!

(ఈ వివరాలు అందించిన మిత్రులు Prasad Kvs గారికి ధన్యవాదాలు)

12, జూన్ 2020, శుక్రవారం

చెంగును నడుమున దోపుకు

నా pencil చిత్రానికి 'హంసగీతి' గారి కంద పద్యములు

చెంగును నడుమున దోపుకు
ముంగిట ముగ్గులను బెడుచు ముప్పొద్దుల నే
బొంగరము భంగి తిరుగుచు
చెంగున బంగళ పనులను జేయుచు నుంటిన్!!

శుచిగా మడిగట్టుకు నే
పచనము జేయగ శ్రమించి పలువంటలనే
రుచికరములనుచు నను మె
చ్చుచు తిందువె లొట్టలేసి చొక్కుచు నకటా!!

పట్టించుకోవె మగడా
నట్టింటను గూలబడితి నలకను బడుచున్
పట్టెను నాకాలు బెణికి
పట్టియు సవరించలేవ బాధను దీర్చన్!!

డా. సి. నారాయణరెడ్డి - కవితలు, గజళ్ళు


Dr. C. Narayana Reddy - My pencil sketch


పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు - సేకరణ శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

ప్రపంచ పదులు

🔹సముద్రానికి చమురు పూస్తే జిడ్డు బడుతుందా?
హిమనగానికి బొగ్గుపూస్తే నల్లబడుతుందా?
తలుపులూ కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా
తరుముకొచ్చే కాల వాహిని తిరిగిపోతుందా?
ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా?

💥చేదు సత్యం మింగగలిగితె జీవితం వైద్యాలయం
మనసు పుటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం.
ఎవ్వరో నేర్పాలనే భ్రమ యెందుకంట వృధావృధా!

💥అడుగు తప్పక ఆడగలిగితె అవనియే నృత్యాలయం
కనులు తిప్పక చూడగలిగితె ఆణువణువు తత్వాలయం.

💥మింటికుందో యేమొగానీ కంటికేదీ పరిమితి ?
దిక్కుకుందో యేమొగానీ మొక్కుకేదీ పరిమితి ?
అన్నిటికి గిరిగీసి చూపే ఆ ప్రయత్నం వ్యర్థమే –
భాషకుందో యేమొగానీ ధ్యానకేదీ పరిమితి ?
శ్వాసకుందో యేమొగానీ ఆశకేదీ పరిమితి ?





కవితలలో కొన్ని భాగాలు

🌷ఎన్ని సార్లు చెక్కితే ఒకశిల్పం
ఎన్నిసార్లు తీర్చితే ఒక చిత్రం
కబుర్లు చెప్పకే ఓ కాలమా
ఎన్ని సార్లు చస్తే ఓ జీవితం
————————
🌷ఆ మబ్బు సంతకం ఉంది చినుకుల్లో
ఈ మామ సంతకం ఉంది చిగురుల్లో
ఏ దస్తావేజులను చూసి ఏం లాభం
నా మనసు సంతకం ఉంది పలుకుల్లో
———————
🌷విశ్వంభరనుండి

నేను( మనిషి )పుట్టకముందు మబ్బులెంతగా
ఎదురుచూసాయో
చూపుల సోపానాలపై సాగివచ్చి తమను పిండుకునే తపన ఏదని !

ఉషస్సులెంతగా ఉద్వేగ పడ్డాయో
విచ్చుకున్న తమ కంటికడలిలో
పిచ్చిగా నురగెత్తే విముక్తాత్మలేదని !

సి. నారాయణరెడ్డి - కవితలు, వ్యాఖ్యానాలు , గజళ్ళు - Pencil sketch

మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ :

పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..!
తెలుగువీణియ శృతి..తెలిసి మీటినారె భళారే..!
వన్నెచిన్నె లెన్ని నింపె..పరువాల చిత్రాంగికి..
దాచలేని వలపులెన్నొ..సృష్టి జే"సినారె" భళారే..!
పసిడితెలుగు రారాజే.. జ్ఞానపీఠ చక్రవర్తి..
పదప్రయోగ కుశలతకే..బాట వే"సినారె" భళారే..!
పెదవులపై చెరగని దరహాస విభుడతడే..
మధురభావ గగనాలను..భువికి దించినారె భళారే..!.
మాటలాడు వేళ ఎంత..విశుద్ధచక్ర గరిమయో..
అమ్మగుండె ఊయలలో..గజలు కురి"సినారె" భళారే..!
భారత భారతీ నర్తన..శాలా విలాస మాధవ..
నిజవాణీ మేఘమల్లె..జాలు వారినారె భళారే..!
-----------------------------------------------------------

మిత్రులు ప్రసాద్ కెవి గారి స్పందన :

మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను
పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను...
లంచం నను భజించి వస్తే ఏమంటాను నేనేమంటాను
తిరుమల గిరి హుండీలో జొరబడమంటాను...
కామం నను కలవరపెడితే ఏమంటాను నేనేమంటాను
అలిగి వున్న పడుచు జంటతో కలబడమంటాను...
క్రోధం నను కవ్విస్తుంటే ఏమంటాను నేనేమంటాను
పస చచ్చిన పేడి జాతిలో బుసలిడమంటాను...
లోభం నను బులిపిస్తుంటే ఏమంటాను నేనేమంటాను
తెగ వొలికే కవి పలుకుల్లో దిగబడమంటాను....
అహంకార మెదురై వస్తే ఏమంటాను నేనేమంటాను
నరుని వదలి కొండనెత్తిలో స్థిరపడమంటాను....
కాలం పులిలా గాండ్రిస్తే ఏమంటాను నేనేమంటాను
దిగులెందుకు ఓయి సినారె తెగబడమంటాను.
**************
అరిషడ్వర్గాలు.....కాలం....చివరికి మరణాన్ని కూడా కొంటెగా....చిలిపిగా ఓ ఆట పట్టించే కవిత్వం....ఈ గజల్.
దీనిలో.....కవి మరణానికి భయపడడు.
పైగా మరణంలో ప్రేయసిని....సహచరిని దర్శిస్తాడు.
దీనిలో ప్రదర్శించిన నవ్యత ఏమిటంటే మరణం అనివార్యమని గ్రహిస్తూనే తప్పని మరణాన్ని చూసి నీరుగారిపోక,....
దాన్ని శిశువుగా మార్చుకొని తాత్త్వికస్పర్శతో జోకొడతారు. మరణంలో మరోప్రాణి వికాసాన్ని భావించడం దీనిలో కనిపిస్తుంది.
చావులో చావకు. చావులో జన్మించు.
నిరంతర సజీవ చైతన్యవంతుడికి చావు పక్కలో నిదురపోయే పసిపాప వంటిది....
అద్భుతమైన భావన....ఆనందం అలముకున్న భావన.
****************
నవ్వని పువ్వు,
వెన్నెల వాడ,
జలపాతం,
ఋతుచక్రం,
దివ్వెల మువ్వలు,
మంటలు- మానవుడు,
నాగార్జున సాగరం,
కర్పూర వసంత రాయలు,
విశ్వంభర.....
ఇవన్నీ....పాత సినిమాల పేర్లనుకుంటున్నారా! అప్పట్లో తెలుగు సినిమా టైటిల్స్....ఇలాగే అందంగా ఉండేవి.
విశ్వంభర....మానవ జీవితాన్ని....ఆవిష్కరించిన...ఈ రచన...సాహిత్య అకాడమీ అవార్డు కూడా కొట్టేసింది.
ఇవన్నీ...డాక్టర్. సింగిరెడ్డి. నారాయణ రెడ్డి గారి రచనలు. ఇవి కొన్నే!....వ్రాస్తూ పోతే....ఇంకా బోలెడు మిగిలిపోతాయి!
ఈ నీలి నీలి ముంగురులు... ఇంద్రనీలాల మంజరులు....
ఈ వికసిత సిత నయనాలు...శతదళ కోమల కమలాలు....
అరుణారుణమీ అధరము....తరుణ మందార పల్లవము ....
ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు....
పాల కడలిలో ఉదయించు సుధా కలశాలు!
ఎంత సుందరము....శిల్ప బంధురము...
ఈ జఘన మండలము...
సృష్టి నంతటిని దాచుకున్న..
ఆ పృథ్వీ మండలము!....
మనోహర మైన ఆ వర్ణన ఒక్క కలమే చేయగలదు. ఆ పాళి ఎవరిదో చెప్పక్కరలేదు. సంతకం చేసినట్లుండే శృంగార కవిత్వం వారికే చెల్లు!
**************
ఏ హరివిల్లు విరబూసినా....నీ దరహాసమనుకొంటినీ...
ఏ చిరుగాలి కదలాడినా.....నీ చరణాల శృతి వింటిని...
నీ ప్రతిరాకలో...ఎన్ని శశిరేఖలో....
నిను చూడక నేనుండలేను......
తాజ్ మహలు లో కురిసే వెన్నెల...పూరిగుడిసె పై కురియదా...
బృందావనిలో విరిసే మల్లియ ....పేద ముంగిట విరియదా !
మంచితనము పంచేవారికి....అంతరాలతో పని ఉందా!*
ఎవరు తల్లి, ఎవరు కొడుకు? ఎందుకు ఆ తెగని ముడి!
కొనఊపిరిలో...ఎందుకు అణగారని అలజడి...
కరిగే కొవ్వొత్తి పై కనికరం ఎవ్వరికి...ఎవ్వరికి...
అది కాలుతున్నా...వెలుగులె కావాలి అందరికి...అందరికి !
ఒక్క శృంగారమే కాదు....నవరసాలు అవలీలగా ఒలికించగల ధీమా వారిదే! గజళ్ళు....అద్భుతంగా వ్రాసి....ఆయనే గానం చేశారు!
కవి, నాటక కర్త, ఆచార్య పదవి నిర్వహించిన వారు,...
గజల్స్ గాయకుడు,...
తెలుగు రచనా నవ్యరీతులతో డాక్టరేట్ పొందిన వారు,
3 యూనివర్సిటీలనుండి...గౌరవ డాక్టరేట్ పొందిన వారు.
ప్రబంధ శృంగార సౌరభాలు...తన తొలి చిత్రమైన గులేబకావళి కథ లోనే చూపారు.
కలల అలల పై తేలెను....మనసు మల్లె పూవై...
ఎగసిపోదునో చెలియా...నీవే ఇక నేనై...
విరజాజులు పరిమళించు...విరులపానుపేమన్నది?
అగుపించని ఆనందం...బిగికౌగిట కలదన్నది!
సడి సవ్వడి వినిపించని నడిరాతిరి ఏమన్నది?
జవరాలిని..చెలికానిని జంట కూడి రమ్మన్నది!
కావ్య శృంగారమంటే ఇదికాక మరేమిటి?
3000 కు పైగా సినీ గీతాలు, 80 కావ్య రచనలు...ముఖ్యంగా వారి విశ్వంభర....అద్భుతమనే చెప్పాలి.
***************
వ్యక్తిగా సాధించనిదేమీ లేదు. పద్మశ్రీ, పఫ్మభూషణ్, కేంద్ర & రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలు,రాజలక్ష్మి పురస్కారం, సోవియట్- నెహ్రూ పురస్కారం....ఎన్నో...ఎన్నెన్నో!
రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షులు(1981),
1988 - జ్ఞానపీఠ పురస్కారం. - విశ్వంభర.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు(1989),
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘ సలహాదారుడు(1992),
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు
రాజ్యసభ సభ్యుడు(ఎం.పి).
నందమూరికి ఇష్టులైన కవీశ్వరులు కనుక ....చాలా పదవులు & పురస్కారాలు వారి హయాం లోనే వచ్చినట్లు అపప్రథ ఉన్నా....
అర్హత మాత్రం ఉన్న వారు *సినారె*..అంటూ ముద్దుగా పిలుచుకునే డాక్టర్. సి.నారాయణ రెడ్డి గారు.
నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము,
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు,
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప,
చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప.
జ్ఞాన పీఠాలు....భారతరత్నలు.... మహావ్యక్తులెందరినో......కాలం తనలో లీనం చేసుకుంది.



--------------------------------------------------------------------------------------------------------------------------------------------

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...