23, జూన్ 2020, మంగళవారం

కొసరాజు రాఘవయ్య చౌదరి - గీత రచయిత - Pencil sketch

కొసరాజు రాఘవయ్య చౌదరి - నా pencil sketch



కనకాద్రి శిఖరాన శునకమ్ము సింహమై,
ఏడుదీవుల రాజ్యమేలేనయా!
గుళ్ళు మ్రింగేవాళ్ళు, నోళ్ళు గొట్టే వాళ్ళు..
ఊళ్ళో చలామణీ అవుతారయా!
ఆ ఆ లు రానట్టు అన్నయ్యలందరికి...
అధికార యోగమ్ము పడుతుందయా!
కుక్కతోక పట్టి గోదావరీదితే..
కోటిపల్లి కాడ తేలేరయా!
స్వారాజ్య యుధ్ధాన జయభేరి మ్రోగించిన,
శాంతమూర్తులు అంతరించారయా,
స్వాతంత్ర్య గౌరవం సంతలో తెగనమ్ము...
స్వార్థమూర్తులు అవతరించారయా!
గొర్రెల్ని తినువాడు గోవింద గొట్తాడు,
బర్రెల్ని తినువాడు వస్తాడయా!
పగలె చుక్కలు మింట మొలిపింతునంటాడు!
నగుబాట్లు పడి తోక ముడిచేనయా.
అప్పు చేసిన వాడు పప్పుకూడు తిని...
ఆనందమయుడౌతు తిరిగేనయా!
అర్దమిచ్చిన వాడు ఆకులలములు మేసి
అన్నానికాపన్నుడౌతాడయా!
నందామయ గురుడ నందామయ,
ఆనందదేవికి నందామయ!
1954 లో రాష్ట్రపతి ఉత్తమ చిత్రం గా ఎన్నికైన కె.వి.రెడ్డి గారి...పెద్ద మనుషులు....మూవీ లోని ఈ పాట....
ఆ రోజుల్లో...తెలుగు నాట....ప్రతినోట...నాట్యమాడిందంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు విన్నా ఆ పాట నిత్య నూతనంగా అలరిస్తుంది!
అప్పుడెప్పుడో....1939 లో రిలీజ్ అయిన గూడవల్లి రామబ్రహ్మం గారి రైతు బిడ్డ....మూవీలో....అద్భుతమైన రైతు పోరాటం.....గీతాలు వ్రాసి...
అందులో ఓ మంచి పాత్ర కూడా వేసిన ఆయన.....సినిమా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని....అద్భుత విజయాన్ని అందుకున్నా....
ఎందుకో మళ్ళీ సొంత ఊరెళ్ళిపోయి...వ్యవసాయం చేసుకుంటూ....పత్రికలలో...సాహిత్య వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉండిపోయాడు....
మళ్ళీ 13 ఏళ్ళ తరువాత....కె.వి.రెడ్డి గారే పిలిపించి...పెద్ద మనుషులుతో....సినీ గీత రచయితగా మార్చేశారు.
ఆ తరువాత....ఆయన తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసేసుకున్నాడు.
హాస్య, వ్యంగ్య, రాజకీయ , జానపద గీతాలను.....ఆయన వ్రాస్తే....అప్పట్లో....ఆ కిక్కే వేరబ్బా....ఆన్నట్లుండేది!
ఆయనే... కొసరాజు రాఘవయ్య చౌదరి గారు.
*************
సినిమాలో అన్ని పాటలూ రికార్డ్ చేసేసినా సరే....ఇంకా ఏదో వెలితి కనిపిస్తుంటది. అప్పుడు...కొసరాజు గారే గుర్తొస్తారు...ఏ దర్శకుడికైనా!
ఓ హాస్య గీతమో...వ్యంగ్య గీతమో...జానపదమో పెట్టేస్తారు. ఆశ్చర్యంగా అదే పెద్ద హిట్టౌతుంది సినిమాకు!
1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు.
సొంత వూరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు.
అంచేత నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివారు కొసరాజు గారు!
నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.’లాగా, ఆయన చిన్నతనంలోనే ‘డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు!
ఐతే, ఆయన ఊరుకోలేదు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం - రాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది.
ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.
కొండముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది.
నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి.
అప్పటికే ఆయన కంఠం లౌడ్‌ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు.
అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! బాలకవి అని బిరుదు పొందాడు.
సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాపులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాపులర్!
పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం - ఏ మాత్రం అడ్డురాలేదు!
ఏ డిగ్ర్రీలూ లేవు...ఏ జర్నలిజం కోర్సులూ లేవు!
**************
"చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళ, వేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన కూచోబెట్టారు కోసరాజు గారిని.
వధూవరుల మీద రాజు గారు రాసిన పద్యాలు చదివితే, 'ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!' అని చెళ్లపిళ్ల వారు ప్రశంసించారు, ఆశీర్వదించారు!
జమీన్‌రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు.
అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు గారు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.
ఆ పుస్తకం చదివి, అందరూ 'మనకెందుకులే' అని వెనుకంజ వేశారుట - భయపడి.
ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మాత్రం 'నేను రాస్తాను' అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది.
రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే 'ఆహా' అనే వారందరు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు.
**************
కొసరి వ్రాయి చుకునే వారు దర్శకులు...నిర్మాతలు.....కొసరాజు గారిదగ్గర గీతాలు. మరి వారి కొసరాజు బ్రాండ్ అలాంటిది!
హాస్యం తొణికిసలాడాలన్నా...
వ్యగ్యం తొంగిచూడాలన్నా...
జానపద రీతులు...అలరించాలన్నా....
ఒక్క కొసరాజు వారి మాటే....పాటగా మారాలి!
అదీ అప్పుడాయన పరిస్థితి.
కొస రాజు కాదు....కొసరు రాజు....అని కూడా అనేవారాయనను! ఆయన రచన ఒక్కటైనా లేకపోతే....సంపూర్ణత్వం రాదు!
రైతుపైన అభిమానము చూపని రాజులుండనేల?
నిద్ర మేల్కొనర తమ్ముడా..గాఢ నిద్ర మేల్కొనరా తమ్ముడా,...
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా...
ఇల్లరికంలో ఉన్న మజా....
జేబులో బొమ్మ జేజేల బొమ్మ,
అయ్యయ్యో చేతిలొ డబ్బులు పోయెనే,
ముద్దబంతి పూలు పెట్టి..మొగిలిరేకులు..
సరిగంచు చీర జట్టి, కొమ్మంచు రైక తొడిగి....
సరదా సరదా సిగిరెట్టు..ఉది దొరల్ తాగు భల్ సిగిరెట్టు...
టౌను పక్కకెళ్ళొద్దురో డింగరీ...
ఆడుతు పాడుతు..పని చేస్తుంటే...
మూక్కు చూడు ముక్కందం చూడు...
శివశివ మూర్తివి గణనాథ..నువ్వు శివుని కుమారుడవు గణనాథ....
శ్రీరామ...ఓరామ.. నీ నామమెంతో రుచిరా
ఆ శైలి ఒక్క కొసరాజు కే సొంతం.
ఎందుకంటే....ఆయన చిన్నప్పటి నుండే...ఓ సంస్కృతి చూస్తూ పెరిగారు.
హరికథలు, బుర్రకథలు,
జముకుల కథలు, రజకుల పాటలు,
పాములోళ్ళ పాటలు,భజన గీతాలు,
పగటివేషగాళ్ళ పాటలు,
గంగిరెద్దు వారి గీతాలు....
ఇవన్నీ గమనించడమే కాదు....జీర్ణించుకున్నారు...తన పాటలో అవసరానికి ఆవిష్కరించారు....తనదైన ప్రత్యేక శైలిలో.
అజరామరం గా నిలిచాయి ఆ పాటలు.
మూడున్నర దశాబ్ధాల పాటు....షుమారు 200 చిత్రాలలో 1000 కి పైగా గీతాలు వ్రాశారాయన.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము కొసరాజు రాఘవయ్య గారికి
రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.
తెలుగు ప్రజానీకం... 'కవి రత్న' 'జానపద కవి సార్వభౌమ'.. బిరుదులు ఇచ్చింది.
**************
సినిమాకు మాటలు వ్రాసే వారందరూ పాటలు రాయలేకపోవచ్చు.
కానీ పాటలు వ్రాసేవారు...మాటలు వ్రాయగలరు.
కానీ కొసరాజు గారు ఆ ప్రయత్నం చేయలేదు. ఎవ్వరూ అడగలేదేమో మరి!
సంస్కృతాంధ్రాలు చదివినా...
అవధానాలు చేసినా...
జానపద వాజ్మయాన్ని జీర్ణం చేసుకున్నా....
కించిత్తు కూడా గర్వం అనేది ఎరుగరు కొసరాజు గారు.
సదా చిరునవ్వు ముఖమే! కడు సౌమ్యుడాయన. విరగబడి నవ్వుతారు, నవ్విస్తారు....నవ్వు ఇస్తారు.
81 ఏళ్ళ వయస్సులో...27 అక్టోబర్ 1986 న....కొసరాజు గారు కీర్తిశేషులయ్యారు.
ఈ రోజు 23 జూన్ 1905....వారి జయంతి అంటున్నారు. కానీ సెప్టెంబర్ 3 వారి జయంతిగా కూడా బిన్నాభిప్రాయాలున్నా....చిరస్మరణీయులైన కొసరాజు గారిని ఎప్పుడైనా తలుచుకోవచ్చు తెలుగు వారు.

(వివరాలు మిత్రులు ప్రసాద్ కెవి గారి సౌజన్యంతో)

1 కామెంట్‌:

కాంత్ చెప్పారు...

కొసరాజుగారి గురించి ఇంత వివరంగా చదవడం ఇదే మొదటిసారి. చాలా తెలియని విషయాలు రాసారు. ధన్యవాదాలండి.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...