28, జులై 2020, మంగళవారం

లీలా నాయుడు - Leela Naidu, Actress and Beauty queen

లీలా నాయుడు - Pencil sketch

లీలా నాయుడు (1940 - జులై 28, 2009) ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది. పెక్కు హిందీ చలన చిత్రములలో నటించి పేరు సంపాదించుకున్నది. "యే రాస్తే హై ప్యార్ కే" చిత్రములో లీల నటన పలువురి మన్ననలు పొందినది. లీల 1940 సంవత్సరములో జన్మించింది. మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).
జీవనగమనము

1954లో (పదిహేను సంవత్సరముల వయసు) Femina Miss India గా ఎన్నుకొన బడింది.
వోగ్ పత్రిక (Vogue) లీలను మహారాణి గాయత్రీ దేవి సరసన పది మహాసౌందర్యవతులలో ఒకరిగా పరిగణించింది.
1956లో ఓబెరాయ్ హోటళ్ళ స్థాపకుడు మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ ను పెళ్ళాడింది.
మాయ, ప్రియ అను కవలకుమార్తెలను కన్నపిదప తిలక్ రాజ్ తో విడిపోయింది.
విడాకుల తరువాత జిడ్డు కృష్ణమూర్తి బోధలకు ఆకర్షితురాలయ్యింది.
1969లో గోవాకు చెందిన ప్రఖ్యాత రచయిత డామ్ మొరేస్ ను వివాహమాడింది.

చిత్ర రంగము



1960లో విడుదలైన "అనూరాధ" లీల మొదటి చిత్రము. హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, బలరాజ్ సాహ్ని కథానాయకుడు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రముగా పురస్కారము పొందింది. లీలకు పండిత్ రవి శంకర్ పాటలు కూర్చాడు. 1962లో "ఉమ్మీద్" (అశోక్ కుమార్), పిమ్మట మర్చంట్-ఐవరీ వారి "The Householder" (1963), శ్యామ్ బెనెగల్ "త్రికాల్" (1985) లలో నటించింది. కొద్ది చిత్రములలో నటించిననూ లీల వాటిద్వారా చిత్రరంగముపై చెరగని ముద్ర వేసింది. 1992లో నటించిన "Elctric Moon" లీల చివరి చిత్రం.
లీల జులై 28, 2009 న ముంబాయిలో మరణించింది.

27, జులై 2020, సోమవారం

కనులను మోసే కన్నులు వరమే .. తెలుగు గజల్



నా చిత్రానికి మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారి రచించిన గజల్. వారికి నా ధన్యవాదాలు.


కలలను మోసే..కన్నులు వరమే..!
వీడని ఊహల..ఊసులు వరమే..!
వయసుకు అలజడి..జ్ఞానము కొఱకే..
తీరని మోహపు..వీధులు వరమే..!
అనుభవ సారం..రేపటి మార్గం..
ఎఱుకను నిలిపే..తలపులు వరమే..!
తొందర పాటుకు..కలవరపాటే..
ముచ్చట గొలిపే..వలపులు వరమే..!
బ్రతుకే నిప్పుల..కుంపటి ఎపుడూ..
తెలుసుకు వేసే..అడుగులు వరమే..!
తియ్యని బోధలు..తోచును చేదుగ
మాధవ గజలున..మెఱుపులు వరమే..!

Com

20, జులై 2020, సోమవారం

సముద్రాల రాఘవాచార్య

సముద్రాల రాఘవాచార్య (pencil sketch)

సముద్రాల వారి గురించి పలు ఆసక్తికర విశయాలు అందించిన మిత్రులు ప్రసాద్ కెవి గారికి ధన్యవాదలు.  చదవండి ..


"చరిత్ర సృష్టించాలన్నా మేమే!
దాన్ని తిరగ రాయాలన్నా మేమే!
వాళ్ళెంత?.... బ్లడీ ఫూల్స్. బురద జాతి!
ఇలాంటి పంచ్ డైలాగ్స్...కొంచెం ప్రయత్నిస్తే.....మనం కూడా వ్రాసేస్తాం అనిపిస్తుంది.
కానీ వేదాంత పరమైన అద్భుత విషయాలు డైలాగ్స్ లో కూర్చాలంటే....అష్టాదశ పురాణాలని మథించి ఉండాలి.
వాటిపై అద్భుతమైన అవగాహన కావాలి.
ఆషామాషీ కాదు.
***************
శ్రీకృష్ణ పాండవీయంలో సుయోధనుడు:
“పాంచాలీ... పంచ భర్తృకా... నీవా నన్ను పరిహసించునది!
సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును, నేడొక్క అబల, బంధకి అపహసించుటయా!
అభిమానధనుడైన సుయోధనుడది విని సహించుటయా... సహించక మరణించుటా!..
మరణించి సాధించునది... మచ్చ మాసిపోవునా...పరిహాసాస్పదుడై ప్రాణత్యాగము చేసికొన్నాడన్న అపనింద వేరొక్కటా...కల్ల... ఈ పరాభవము దాగుట కల్ల...
ఆ పాంచాలి ప్రక్కన నిలచి ఫక్కున నవ్విన ఆ టెక్కులాండ్రలో, యే ఒక్కతైనా ఈ వార్త ప్రక్కవాటుగా నొక్కించక మానునా!
ఈ అపఖ్యాతి ఆనాటికానాటికి జ్వాజ్వల్యమాన దావానలమై అఖండ భూమండల మావరించి మా శ్రవణపుటభేద్యము కాకమానునా...
శత్రువులని తెలిసి తెలిసి నన్నధిక్షేపించుటకే పన్నిన పన్నాగమని ఎరిగి ఎరిగి మందమతినై, మామ మాటలకు ఏల చెవి ఒగ్గవలె...
ఈ పాండవ హతకుల ఆహ్వానము నేనెలా మన్నించవలె...
మన్నించితిపో...ఈ మయసభ మాకేల విడిది కావలె...
అయినదిపో...ఈ మందిర సౌందర్య సందర్శనాపేక్ష నాకేల జనించవలె...
జనించెపో... మేమందేల పరిభ్రమించవలె, మనసేల భ్రమించవలె...
ఆహూతుడన్న ఆదరముంచక, వావివరుసలు గణించక, బంధువని పాటించక, ఆ బంధకి... పాంచాలి... ఏల అపహసించవలె!
మనుటయా మరణించుటయా’’
***************
ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు?
జీవిత పరమార్థం తెలుసుకోలేక...ఆర్తి పడుతున్న అంధుణ్ణి.
జీవితానికి...పరమార్థమంటూ ఒకటుందని అనుకుంటున్నావా?
లేదా స్వామీ?...వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు...దేశ దేశాలను జయించిన చక్రవర్తులు...సీదా సాదా...అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే.
వీరంతా మరణించిన తరువాత...ఏమవుతున్నారు స్వామీ?
పిచ్చివాడా! లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే...
మరణించిన తరువాత ఏమౌతారనే...విచారం నీకెందుకు?
ఆ విచారం వదులుకో.
నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను. అనుభవించు.
వద్దు స్వామీ. అవన్నీ అనుభవించి...క్షణికములని...క్షుద్రములని...తెలుసుకున్నాను.వాటిపై నాకు వాంఛ లేదు.
నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే.
మనం ఎక్కడనుంచి వస్తున్నాం? ఎక్కడికి పోతున్నాం?
ఈ రహస్యం తెలుసుకోవడానికి దేవతలకే సాధ్యం కాలేదే! మానవులకు సాధ్యమౌతుందా!
మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే....మాకు దిక్కెవ్వరు స్వామీ?
మేమీ దు:ఖ భాజనమైన శరీరంతో కృశించి...జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసినదేనా?మానవునికి తరుణోపాయము లేదా స్వామీ?
****************
లేకేం నాయనా.ఉంది.
ఈ శరీరం విద్యావిద్యలు...రెంటితోనూ పుట్టింది.
సంసార యాత్రకు...మోక్ష యాత్రకూ...ఇదే సాధనం.
అవిద్యచే మోహితుడవై...కనిపించే ఈ జగత్తు...సత్యము నిత్యము..అనుకుని....
దు:ఖభాజనుడవై....చావు పుట్టుకల కుమ్మరి సారి లో తిరుగుచున్నావు.
ఇదంతా అనిత్యమని...ఈ నాటకానికంతటికీ కారణమైన.....మహా చైతన్యం వేరే ఉందని....
అది నిత్యము...సత్యము అని తెలుసుకుని....ఆ ఆత్మానుభవం పొందాలి.
ఆ ఆత్మానుభవం...నాకెట్లా కలుగుతుంది స్వామి?
భక్తి మార్గంలో కొందరు...జ్ఞాన మార్గంలో కొందరు...సాధించారు.
కానీ జీవన్ముక్తికి...రాజయోగమే సులభతరమని...పెద్దల మతం.
రాజయోగమా? నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ?
ఆ సమయం వచ్చినప్పుడు...పరమాత్మే..సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు.
కారు చీకటిలో దారి తెలియక తిక మక పడుతున్న నాకు....వెలుగు వలె మీరు లభించారు.
మీరే నా గురువులు...నా దైవం.. ఆయోగ రహస్యం నాకు బోధించి...సత్య స్వరూపం చూపించండి స్వామీ.
***************
అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై వినుము.
రసాన్ని కట్టేస్తేనే కాని...స్వర్ణం కానట్టు,
మనస్సును కట్టేస్తేనే కాని...సత్యము కనిపించదు.
మనస్సే మన బంధానికి...మోక్షానికి కారణం.
మనస్సును స్వాధీనం చేసుకుంటే...నీకు..
స్వాధీనం కానిదేదీ ఉండదు!
ఆ సాధనే యోగమంటారు.
సాంగ యోగాన్ని క్రమంగా సాధించి...
చిత్త వృత్తులనణచి...సమాధి స్థిరుడవైనప్పుడు....,
నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది.
అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు!
ఇంతవరకు ...తనచేత చిక్కించుకుని ఆడించే ప్రకృతి..
నీ స్వాధీనమౌతుంది!
మోక్షం అంటే....అదేనా స్వామీ?
కాదు నాయనా. అది మోక్షానికి మొదటి మెట్టు.
ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక...
సుస్థిర చిత్తుడవై...ధ్యానిస్తే,
స్వయంప్రకాశము...
సచ్చిదానందము....
శాశ్వతము అయిన స్వస్వరూపానుభవము...
కేవలం జ్ఞానరూపంగా... నీవనుభవిస్తావు.
తత్వమసి అంటే అదే.
అప్పుడు నువ్వు....నేను ఒక్కటే.
రాజయోగం సాధించి...అఖండ బ్రహ్మానందానుభవం పొందు నాయనా.
**************
1947 లో విడుదలైన... యోగివేమన మూవీలోని....
ఈ రాజయోగ రహస్యాల జ్ఞాన పలుకులు.....పామరులకు...పండితులకు కూడా...పంచదార చిలకలే!
మయూఖ చిహ్నితలు......
జ్ఞాన గవాక్షాలు.....
విజ్ఞాన వీచికలు....
సముద్రాల వారి పలుకులు.🙏
*****************
ఏ కొరనోము నోచుకున్నానో...నేను...
కూలే...నిరాశై లైలా బ్రతుకే!...
అంటే... ఆచార్యులు గారూ....పర్షియాలో....అరేబియాలో కూడా ఆడవాళ్ళు..నోములు & వ్రతాలు చేస్తారా?!
అడిగేవ్యక్తిని ఓ చూపు చూశారు ఆచార్యుల వారు!
ఒరే నాయనా! అరేబియా ఆడపిల్ల తెలుగు లో మాట్లాడుతుందారా!?
అయినా ఇది లైలా- మజ్ఞు తెలుగు చిత్రం....నిర్మాతలకు అనుగుణంగా...వ్రాయడం నా పధ్ధతి......
అంటూ తెలివిగా విషయాన్ని దాటవేశారు సముద్రాల రాఘవాచార్యులు గారు!
ముదావహంబున కడంగడు సంతసించి.....అనేకంటే...
నాకు ఎంతో సంతోషంగా ఉంది.....అనడం బాగుంటుంది కదా!
ప్రజలకు అర్థమౌతుంది. అనేవారు ఆయన..
1937 లో కనకతార మూవీకి మాటలు వ్రాయడంలో ఆ బాణీనే చూపారు సముద్రాల వారు.
పౌరాణికమా, జానపదమా, సాంఘీకమా అనికాదు......ప్రజలకు అర్థమయ్యే భాషలో వ్రాయాలి కవులు...అనేవారు!
ఎందరో పండితులు నొచ్చుకున్నారు. పామరులు సంతసించారు.
భాషను భ్రష్టు పట్టిస్తున్నారు ఈ సినిమా రచయితలంటూ...పుంఖాను పుంఖాలుగా...విమర్శలు వస్తున్నా....
వాడుక భాష ను తెలుగు సినిమా కు పరిచయం చేసిన ఘనత....సముద్రాల రాఘవాచార్యుల వారిదే!
****************
100 కి పైగా సినిమాలకు రచన, మాటలు & పాటలు వ్రాశారు.
1000 దాకా పాటలు వ్రాశారు.
పౌరాణిక, చారిత్రక, జానపద & సాంఘీకాలలో...
శృంగార, శౌర్య, రౌద్ర, హాస్య, భక్తి & శోక రసాల వంటి నవరసాలలోనూ వ్రాశారు. మెప్పించారు!
సంస్కృతాంధ్రాలలో ఉధ్ధండులు.
బెజవాడలో ఫ్రెండ్స్ & కో అని ఓవ్యాపార సంస్థ నడిపేవారు గూడవల్లి రామబ్రహ్మం గారు.
స్టేషనరీ, గ్రంథాలు & గడియారాలు అమ్మేవారు. అక్కడ చేరేవారు ఆచార్యులు.
ఎందరో మహానుభావులు బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి, కె.వి.రెడ్డి...లాంటి మిత్రులు చేరేవారు.
అక్కడ సాహిత్య గోష్టులు...కవితా చర్చలే జరిగేవి.
వ్యాపారం కంటే ! ఎవరికి నచ్చింది....వారు తీసుకుని పోయేవారు. ఎవ్వరూ కొనేవారు కాదు!
వ్యాపారం శూన్యమైతే...రామబ్రహ్మం గారు *ప్రజామిత్ర* అనే పత్రిక ప్రారంభించి...
సముద్రాల వారిని రచయితగా తీసుకున్నారు.
ఆ ప్రజామిత్ర ...మద్రాస్ కు షిఫ్ట్ అయినప్పుడు....సముద్రాల గారు కూడా మద్రాస్ చేరుకుని సినిమాలకు మాటలు & పాటలు వ్రాయడం ప్రారంభించారు.
కనకతార(1937),గృహలక్ష్మి(1938),వందేమాతరం(39),సుమంగళి(40), దేవత(41),భక్త పోతన(42),స్వర్గసీమ(45)యోగివేమన(47) లకు రచన, మాటలు & పాటలు సముద్రాల గారివే!
భక్తి తత్వము & వేదాంత ధోరణి....వ్రాయాలంటే....
సముద్రాల వారే వ్రాయాలి. యోగి వేమన లో అది పరాకాష్టకు చేరుకుందంటే అతిశయోక్తి కాదు.
****************
ఆయన ఎంత బిజీగా ఉండే వారంటే....కొంత మంది రచయితలు...వారికోసం ఘోస్ట్ రచయితలుగా పాటలు వ్రాశారు.
అందులో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు & సముద్రాల కుమారుడు రామానుజాచార్య(జూనియర్ సముద్రాల) కూడా ఉండే వారు.
వేరే ఎవరి పాటో ....మీపాటగా చలామణి చేసుకోవడం తప్పు కదండీ?!...అని ఎవరైనా ప్రశ్నిస్తే,....
ఇందులో తప్పేముంది. మల్లాది...నా స్నేహితుడు. నేను బిజీగా ఉన్నాను. సహాయ పడ్డాడు. నేను డబ్బిచ్చాను.
మా రామానుజం కూడా నాకు సహాయపడ్డాడు! ఇది కేవలం పరస్పర సహకారమే కానీ...మరేం లేదు అనేవారు!
సముద్రాల కు అసలు పద్యాలంటే...ఇష్టముండేది కాదు.
నాటకాలలోలా...ఇంకా ఏమిటీ పద్యాలు...యుధ్ధం చేసుకుంటూ...రాగాలు తీసుకుంటూ...ఇంకా ఇలా పద్యాలు పాడటం ఏం బాగాలేదు! అనేవారు.
కానీ...నిర్మాతలు ఒప్పుకునేవారు కారు. ప్రజలు ఇంకా పద్యాలు కోరుకుంటున్నారండి. పద్యాలు ఉండాల్సిందే అని బలవంతపెట్టేవారు!
సముద్రాల...నిజంగా సముద్రమంత వారు. పాండిత్యంలోను, నవరస పోషణా చతురతలోను, సంద్రాన ఎంతటి వైవిధ్యముందో....
అంతటి వైవిధ్యం తన రచనా చమత్కృతిలో చూపేవారు.
సౌమ్యుడు, నిదానస్తుడు.
ముందు తన అభిప్రాయాలను చెప్పినా...దర్శకనిర్మాతల అభిరుచిమేరకు...రాజీపడి పోయేవారు.
***************
లవకుశ...అద్భుత దృశ్య కావ్యం లో సముద్రాల వారి గీతాలు...
ఆంధ్ర దేశమంతటా మారుమ్రోగిపోయాయంటే....
ఆ రచనా పటిమకు జోహార్లు చెప్పవలసినదే.
రామకథను వినరయ్యా...
శ్రీరాముని చరితమును...
వినుడు వినుడు రామాయణ గాధ...
ఊరకే కన్నీరు నింప....
జగదభిరాముడు శ్రీరాముడే...
ఎన్ని రసగుళికలు....జన్మ చరితార్థం కాదా! వారి సాహిత్యానికి తోడు...ఘంటసాల మాస్టారి స్వర రచనలో....చిరస్థాయిగా నిలిచిపోయాయా గీతాలు.
***************
నందమూరి కి మిక్కిలి ఇష్టులు సముద్రాల గారు. ఆ స్నేహం చిరకాలం నిలుపుకున్నారు.
డి.ఎల్. నారాయణ గారి వినోదా పిక్చర్స్ లోను, ఎన్.ఏ.టి లోను భాగస్వామ్యం ఉండేదాయనకు.
దర్శకుడుగా 3 చిత్రాలు చేశారు. వినాయక చవితి(57), భక్త రఘునాథ్(60) & బభ్రువాహన(64).
సముద్రాల గారి పుణ్యమా అని అలనాటి గ్రాంథిక భాష....వ్యవహారిక భాషగా మారింది.
ఎన్నెన్ని చక్కటి గీతాలు మనకందించారో.
అవి ఈ నాటికీ..మనలనలరిస్తూనే ఉన్నాయి. ఉంటాయి.
రేపల్లెలో...19 జూలై మాసాన 1902 లో సముద్రాల వారు జన్మించారు.
16- 3 - 1968....సముద్రాల వారు....వారి ముద్రనిల వదలి....కీర్తిశేషులైనారు."

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...