3, జులై 2020, శుక్రవారం

ఎస్వీ రంగారావు - SV Rangarao

ఎస్వీ రంగారావు గారి జయంతి సందర్భంగా నా pencil చిత్రం. వారి గురించి అద్భుత వివరాలు అందించిన మిత్రులు డా. ప్రసాద్ కెవి గారికి ధన్యవాదాలు.


రాక్షస స్త్రీల నడుమ చిక్కిన జానకి.....పులుల నడుమ చిక్కిన లేడి వలె ఎంతయో దు:ఖించెను.
మానవుడు కూడా ఒక జంతువే! ఇతర జంతువులకును....మానవునకు గల బేధము జ్ఞానము....
రామాయణ పురాణం చదవడంలో ఉన్న సూర్యకాంతమ్మ గారు...ఎస్.వి.రంగారావు రావడం గమనించలేదు.
నాయాల్ది....అదేగా లేనిది?....అన్నాడు రంగారావు.
ఆ...వచ్చారా? ఆ...ఏవిటి ఆ దసరా మామూళ్ళ వాళ్ళకి ఎంతిచ్చారు?...సూర్యకాంతమ్మ.
నేనా....నాదగ్గరేముందే ఇవ్వడానికి?.....
ఏమీ ఇవ్వకపోతే....వాళ్ళంతా అలా జేజేలు కొట్టుకుంటూ ఎందుకు వెళ్ళారు?
ఎందుకంటే...నేన్నీకెలాఉన్నా....ఊళ్ళో వాళ్ళందరికీ ప్రెసిడెంటునే...ఎవడైనా కొట్తాడు జేజేలు....నువ్వు తప్ప.
ఆ...ఈ గొప్పలకేం గానీ...అసలేమిచ్చారో చెప్పండి, 5 రూపాయలిచ్చారా?
5 రూపాయలా?.....ఛ....
పొనీ...పదిచ్చారా?..... ఆ...ఇచ్చే ఉంటారు ప్రెసిడెంటు గారు. నిజం చెప్పండి.
ఆ...ఇచ్చాను.....ఇస్తే?....
ఇస్తే ఏముంది?...పస్తే!....ఆ పది రూపాయలు చెల్లుబడి అయ్యే దాకా...చిలగడ దుంపలు తిని...నీళ్ళు తాగి పడుండాల్సిందే!...అంతే!
ఒసే...ఈ రోజు పండగే!
ఊళ్ళో వాళ్ళకు పండగ...అయ్యగారికి ఎండగ! ఏం చేస్తాం?....
అది కాదే ..రోజూ పెట్టే ఆ పచ్చడి మెతుకులన్నా?.....
ఎందుకూ! ఆ జేజేలతో కడుపు నిండి పోలా? మీకు బయట పొగడటమేగా కావాల్సింది! ఇంట్లో ఎలా ఉంటేనేం? ఏం తింటేనేం?...
బయట పల్లకీల మోత....ఇంట్లో ఈగల మోత! నాయాల్ది....ఏనాడు జేసుకున్న ఖర్మో!...కానీవే...అట్టాక్కానీ.....
ఇద్దరు మహా నటులు....ఎస్.వి.రంగారావు గారు &, సూర్య కాతం గారు నటించిన దసరా బుల్లోడు లోని ఈ సీన్లో ఇద్దరూ అలవాటుగానే జీవించారు.
****************
ఒరేయ్ బాబూ...ఏమిరా ఇలా చేశావ్...నీ చిన్ని చేతుల్తో నానోట్లో ఇంత అన్నం పెట్టే వాడివి కదరా!
తిరిగి నాచేత్తో...నీనోట్లో ఇంత మట్టేస్తున్నారా...బాబూ......
ఈ డైలాగ్....ఆయన యాక్షన్ చూస్తూ...
అంతవరకూ ఆయన మీద కారాలు మిరియాలు నూరిన వారంతా....మ్రాన్పడిపోయారు!*
అసలా షాట్ కోసం అంతా సిధ్ధం చేసుకున్నాక....అసలు ఉండవలసిన పాత్రధారి ఆయన ఎంతకీ రాలేదు!
కృష్ణ, గుమ్మడి, నిర్మాత ప్రభాకర్ రెడ్డి....అందరూ అసహనంగా వెయిట్ చేసి చేసి....
ఎవరో లీడ్ ఇస్తే...చివరకు...పాండీ బజార్లో హమీబియా హోటల్ లో ఓ చిన్న రూం లో మందు కొట్తూంటే ఒప్పించి తీసుకొచ్చారు!
అందరికీ...కోపంగానే ఉంది. కానీ షాట్లో ఆయన నటనకు ముగ్ధులైపోయి....
మాటలు మరచిపోయారు!
******************
డాడీ.....డాడీ.....మీరింక తాగనని ఒట్టేయండి డాడీ.....
అని కన్నీళ్ళతో అడుగుతున్న....జమున కేసి....చూస్తూ....
షాట్ అయిపోయిందిరా....ఇంకా యాక్ట్ చేస్తున్నావా...బాగా చేశావురా...బంగారు.....
అంటూ చేతులు విడిపించుకుని ప్రక్కనే కుర్చీలో కూలబడ్డాడాయన.
మీకు తెలుసు....నాకూ తెలుసు...ఇది యాక్షన్ కాదని....దయచేసి మీరు త్రాగడం మానేయండి డాడీ.....
జమున ఏడుస్తూ అడుగుతుంటే......
నాకేం కాదురా...నా బాడీ ఉక్కు...చూస్తున్నావు గా ఎంత హెల్దీగా ఉన్నానో పద బంగారూ....వెళ్ళు.కాసేపు...ఇలా నిద్ర పోవాలి...
అంటూ జమునను షూటింగ్ స్పాట్ నుండి పంపేశారాయన!
చదరంగం.....మూవీ...
ఆయనే నిర్మాత - దర్శకుడూనూ!
*******************
50 ఏళ్ళ జీవితంలో....
నూజివీడు లో స్కూలింగ్....
మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందూ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ చదవడం....
షేక్స్ పియర్ డ్రామాలో షైలాక్ రోల్ కాలేజ్ లో వేసి మెప్పించడం....
నటన....డ్రామాలు ఓ పాషన్ గా మారడం....
డిగ్రీ అయ్యాక ....ఫైర్ స్టేషన్ లో ఉద్యోగం....
అది చేస్తూనే...నాటకాలు ఆడుతూ ఉండడం....
అది తెలిసే....బంధువైన బి.వి.రామానందం గారు....1946లో సేలం పిలిపించిడం....
ఉద్యోగానికి బై చెప్పి....వరూధిని...మూవీలో నటించడం.....
మొదట కెమెరా ఫేస్ చేసినప్పుడు....బాగా భయపడ్డా....
అది కనిపించకుండా...ఏదో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోవడం.....
ఆ సినిమా ఫ్లాప్ కావడం....ముఖం చూపించలేక....
మళ్ళీ జెమ్షెడ్ పూర్ లో టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరడం....
1947..డిసెంబర్ 27న....లీలావతితో పెళ్ళి......
ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఆయనకు.
వాలుకుర్చీలో కూర్చుని సింహావలోకనం చేసుకుంటుంటే.
అసలు తనేం....తాగుడుకు అంత బానిసేం కాదు! ఏదో అప్పుడప్పుడు.
అసలు బాటిల్ ముట్టకుండా కొన్ని నెలలున్న సందర్భాలూ ఉన్నాయి!
కాకపోతే....పులివేట, పేకాట....ఇవి నా హాబీలు. అంతే...
అయినా మనిషన్నాక ఏబలహీనతలూ లేకుండా ఎలా ఉంటారు!
నేనేం బుధ్ధుడ్ని కాదే!
ఆ తరువాత...మళ్ళీ మద్రాస్ లో కాలుపెట్టా 1948లో....
సినిమా పాత్రల మీద మోజు పోలేదు మరి.
ఫ్రెండ్స్ అంతా ప్రౌత్సహించారు.నిర్మాతలు కాదు!
వరూధిని హీరోవా బాబూ....నువ్వేనా నాయినా?...అబ్బే!....అని చప్పరించేవారు.
ఎక్కే గుమ్మం...దిగే గుమ్మం.ఎవ్వరూ చాన్స్ ఇవ్వలేదు.
చివరికి మనదేశం(1949)లో ఓ చిన్న వేషం, పల్లెటూరిపిల్ల(1950)లో మరో వేషం....దొరికాయి.
ఆ తరువాత షావుకారు(1950)లో సున్నం రంగడి పాత్ర తో బ్రతుకు మలుపు తిరిగింది.
****************
నేను నిన్న ఓ రిక్షా వాడిని చూశాను. వాడి మాట, నడిచే తీరు, బీడీ త్రాగే స్టైలు....అవీ చూసి నేనో స్టైల్ అనుకున్నా.
మామూలు రౌఢీలా అరుపులు, కేకలూ కాకుండా...అని ఎల్.వి.ప్రసాద్....చక్రపాణులకు చెప్పి....చేసి చూపించా.
బాగుంది రంగారావ్....ఇలాగే చెయ్...వెరైటీగా ఉంది...అని ప్రోత్సహించారు.
ఆ మూవీతో రామారావు తో బాటు సున్నం రంగడిగా నాకూ పేరొచ్చింది.
ఇక పాతాళభైరవి లో నేపాళ మాంత్రికుడి రోల్. చాలా టఫ్ కాంపిటీషన్ తో నాకొచ్చింది.
షైలాక్ లా చేసి చూపించా.
ఓ పిల్లి గడ్డం తో...ఆ నడక....పింగళి గారి స్పెషల్ డైలాగ్స్....నా ఆహార్యం....
ఆ పాత్ర తో ఇక వెనుకకు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.
ఓవర్ నైట్ రామారావు తో బాటు నాకూ స్టార్ హోదా వచ్చేసింది.
ఇక పెళ్ళి చేసిచూడులో ధూపాటి వియ్యన్న...
ఎటో చూస్తూ మాట్లాడటం......చీటికి మాటికీ కళ్ళు చికిలిస్తూ..
మధ్య మధ్య లో ముక్కడం...నెత్తిన చేతులు పెట్టుకోవడం....
ఇలాంటి మేనరిజం లతో మహా బాగా పండిందాపాత్ర. ఇలా కూడా చెయ్యొచ్చన్న మాట నటన....
అని అందరూ ఆశ్చర్యపోయారు!
ఇక వరుసగా....ఎన్ని పాత్రలు...
****************
బంగారు పాపలో కోటయ్య పాత్ర,
అక్బర్ పాదుషా,
దక్షుడు,భోజుడు,
ఘటోత్కచుడు,బాణాసురుడు,
మహోదరుడు, భస్మాసురుడు, హరిశ్చంద్రుడు,మయాసురుడు,
కీచకుడు,రావణుడు,
నరకాసురుడు,,యముడు,
దుర్యోధనుడు,ఉగ్రసేనుడు,
కంసుడు,తాండ్ర పాపారాయుడు,
హిరణ్య కశిపుడు....
ఇలా ముఖ్యంగా రాక్షస రాజుల పాత్రలకు వేమూరి గగ్గయ్య తరువాత....
అంతటి పేరు నాకే వచ్చింది!
ఇక తండ్రి, మామ, పెద్దనాన్న, అన్న పాత్రలూ సరేసరి.
మద్రాస్ లో చదువుకోవడం వల్ల వంట బట్టిన తమిళం....
ఉభయభాషా ప్రవీణుడ్ని చేసి....తమిళం లో కూడా ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించగలిగాను....
తమిళుడే....ఇతను అనిపించేలా! నాకొచ్చిన అవార్డులు కూడా తమిళంలోనే ఎక్కువ!
బళ్ళారి రాఘవ గారి నటన....వేమూరి గగ్గయ్య గారి నటన నచ్చేది నా చిన్నప్పుడు.
ఈ రంగారావ్ స్టార్ కావడానికి వెనుక ఎంత మథన, కృషి ఉన్నాయో....అందరికీ ఎలా తెలుస్తుంది!?
స్టార్ అయ్యాక...ఎన్నెన్నో పాత్రలు వచ్చాయి. వచ్చినవన్నీ రంగారావు ఒప్పుకోలేదు.
ఒప్పుకుని...తప్పుకున్నవీ ఉన్నాయి!
రంగారావుని భరించలేం అన్నవాళ్ళు...
ఆ పాత్రకు రంగారావే తగినవాడని అనిపించినా, వేరే నటుల్ని పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి!
ట్రబుల్ సం ఆర్టిస్ట్ అన్న ముద్ర కూడా పడింది!
మూడ్ బాగుండాలి అంతే.
మూడ్ బాగుండక పోతే...చిన్నపిల్లాడు స్కూల్ ఎగ్గొట్టినట్టు....షూటింగ్ ఎగ్గొట్టేవాడ్ని!
ఒక్కోసారి షూటింగ్ మధ్యలో మూడ్ బాలేక పోతే విగ్గు మీసం విసిరేసి వెళ్ళిపోయేవాడ్ని కూడా!
ఏం చేసినా...నా నటనతో కొట్టుకొచ్చేశాను. కళ్ళతోనే నటించడం...కంఠంలోని మాడ్యులేషన్స్ చూసుకోవడం....అంతే!
నటన...అతి సహజమే నాకు!
**************
ఎందుకు త్రాగుతున్నానంటే....ఎన్నో కారణాలు...ఏవో అందరికీ ఉన్నట్లే...ఏవో సాకులు....
భార్య లీలావతి తో విబేధాలు...కోపాలు, తాపాలు...
కుటుంబమన్నాక...ఎన్నో ఉంటాయిగా.
ముగ్గురు పిల్లలతో మురిపాలూ ఉంటాయి.
పండగ పబ్బాలతో బాటు....ఫ్రెండ్స్ తో పార్టీలు ఉంటాయి.....
మనస్సులో ఎక్కడో వెలితీ ఉంటుంది!
నా మధుసేవ కూడా చిత్రంగా ఉండేది!
పడితే విరామం లేకుండా...ఒకటే పట్టు. ఆగిపోతే అంతే! మళ్ళీ ఎప్పుడో!
ఆ పట్టులో ఉన్నప్పుడే కాల్షీట్లు గల్లంతయ్యేవి!
నన్న భరించడం కష్టం....అన్నది అలాంటప్పుడే వస్తుంది.
అయినా సెట్టు మీద కొచ్చాక....నన్ననే ధైర్యం ఎవ్వరికీ లేదు.
ఓపులి లా...సింహం లా కనిపించేవాడ్నేమో మరి!
అయినా నా శరీరం ఉక్కు....నాకేం కాదు....
******************
బాపు అందరి ఆర్టిస్టులతో బాటు...
నా కేరికేచర్ వేస్తే...రమణ కేప్షన్ వ్రాశాడు.
నాకే నవ్వొచ్చింది.
క్లిష్టపాత్రల్లో...చతురంగారావు,
దుష్ట పాత్రల్లో...క్రూరంగా రావు,
హడలగొట్టే...భయంకరంగారావు,
హాయిగొలిపే...టింగురంగారావు,
అలరించే....విలాసంగారావు,
రొమాన్సు లో(చేయిస్తే)..పూలరంగారావు,
మనిషి...మధు మధురంగారావు,
మాటల్లో...మహ చమత్కారంగారావు,
కథ నిర్బలమైతే...హావభావాలు పాత్రపరంగారావు,
కళ్ళక్కట్టినట్టు కనపడేది...ఉత్తి యశ్వీరంగారావు,
ఆయన శైలీ ఠీవీ....అన్యులకు సులభంగారావు,
ఒకొక్కసారి డైలాగుల్లో మాత్రం...యమ కంగారంగారావు!
ఇలా సాగుతూనే నిర్మాతగా కూడా మారి 4 మూవీస్ తీశాను.
నాదీ ఆడజన్మే, సుఖదు:ఖాలు, చదరంగం & బాంధవ్యాలు.
ఆ చివరి రెండు మూవీస్ నేనే డైరెక్ట్ చేశాను.
రెండూ నంది అవార్డుల్ని కూడా సంపాదించాయి....
ఇక ఇంతకంటే కావలసిందేముంది!
****************
ఒక వ్యక్తి గురించి వ్రాస్తున్నప్పుడు....మహోన్నత నటుడే కావచ్చు...ఉన్న విషయం ఉన్నట్లు వ్రాయడం....ఉత్తమం.
చిత్రసీమలో అందరికీ తెలిసిన బంధమే....ఎస్.వి.రంగారావు - ఛాయాదేవిల సంబంధం.
ఆమె ఆయనకు టింగు అయితే....ఆయన ఆమెకు రంగడు. టింగు రంగడు అని ఓ నిక్ నేం కూడా ఉండేది మన విశ్వ నట చక్రవర్తికి.
మొదటినుండి తోడు ఉన్నాయనను కాదని....రంగారావు గారి సాన్నిహిత్యం కోరుకుంది ఛాయాదేవి.
తను చేస్తున్న ఫైనాన్స్ బిజినెస్ కు....ఎస్.వి.ఆర్. పెద్ద అండ. అప్పు తీసుకున్న వారెవరైనా....ఎస్.వి.ఆర్. కు భయపడి....వడ్డీలు...అసలు ...చెల్లింపులు బాగా సాగేవి.
ఎస్.వి.ఆర్. మరణానంతరం....ఛాయాదేవి ఒంటరి తనం తో నెగ్గుకు రాలేక పోయింది. తన సొంత బంగ్లా లోనే...ఓ రూం లో అద్దె కుండే పరిస్థితి తెచ్చుకుంది. త్వరలోనే ఆమె చరిత్ర కూడా ముగిసింది!
అరే...ఎక్కడ ఎస్.వి.ఆర్?....ఎక్కడ ఛాయాదేవి?....
ఇద్దరూ ఇక్కడే. మేకప్ తీసేసి.....పేకప్ చెప్తే.......నటీ నటులందరూ....మామూలు మనుషులే! ప్రతి మనిషికి...ఉండే బలహీనతలు...వాళ్ళకూ ఉంటాయి.
జీవన్నాటకం లో...ఎవరికేం.....వెలితి ఉన్నా....దానికి ఆసరా ఇచ్చే వారికోసం మనస్సులు...వెతుకుతుంటాయి. అది దొరికినట్లనిపిస్తే...అదో బంధమౌతుంది. అంతే! ఒకరి ఆసరా ఇంకొకరికి కావాలి.
ఇందులో ఎవ్వరినీ తప్పు పట్టలేం. వారి పరిస్థితులు వారికే తెలుస్తాయి గానీ ఇతరులకు కాదుగా.
***************
విశ్వనట చక్రవర్తి గా బిరుదు పొందిన కీ.శే. సామర్ల వెంకట రంగారావు (ఎస్.వి.రంగారావు)......
మళ్ళీ మరో రంగారావు లాంటి నటుడు ఇక పుట్టడు!
ఒకవేళ అంతకు మించిన నటుడు ఎవరు పుట్టినా...
ఎంతటి వాడు పుట్టినా రంగారావు రంగారావే!
ఆయన స్థానం ఆయనదే!
ప్రపంచం గుర్తించిన తెలుగు నటుల్లో రంగారావు ఒకరు.
1963 లో జకార్తా లో నర్తనశాల లోని కీచక పాత్రతో...
ఆఫ్రో- ఏషియన్...బెస్ట్ యాక్టర్ అవార్డ్ కైవశం చేసుకుని విదేశీయుల మన్నన లను పొందినా...
4- రాష్ట్రపతి అవార్డులు కూడా....తమిళ మూవీలే అందించాయి!
2- నందులు- చదరంగం(1967)& బాందవ్యాలు(1968)..
విశ్వనట చక్రవర్తి....
నటసార్వభౌమ....
నటశేఖర....
నట సింహ.....
ఇలా ఎన్నో బిరుదులున్నా.....
ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులేమీ రాలేదు అనితరసాధ్యమైన నటనాగ్రేసరుడికి!
ఆయన పేరుతో ఓ స్టాంప్ రిలీజ్ చేసింది. అంతే.
గుండెపోటు....56 ఏళ్ళకే తన జీవన నాటకానికి తెర దించేస్తుందని...
రంగారావు గారు అసలు ఊహించిఉండరు.
వారసులు..నటులయ్యారా అంటే....ఎస్.వి.ఆర్. మనవడు...అంజలీదేవి మనవరాలితో ఓ మూవీ అనుకున్నారప్పట్లో.
ఎందుకనో మరి అది ఆగిపోయింది!
***************
నటుడిగానే కాక... కథా రచయితగా కూడా రాణించాడు.
ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి.
వేట, ఆగష్టు 8, పసుపు కుంకుమ, ప్రాయశ్చిత్తం, విడుదల, సంక్రాంతికి
&
సులోచన అనే ఏడు కథలు మాత్రం లభ్యమౌతున్నాయి.
ఈ కథలతో ఎస్.వి.రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది.
1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు.
వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు.
నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975).
యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో...
చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.
**************
రంగారావు గారి శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన...
2018 జూలై 3లో హైదరాబాదులో జరిగాయి.
ఈ ఉత్సవాలను 2018 జూలై 3 నుంచి జూలై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి.
2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
జీవించింది 56 ఏళ్ళే అయినా(3-7- 1918 ------18-7-1974)
నటించింది అన్నిభాషల్లో కలిపి.... 260 చిత్రాలే అయినా....
ప్రజల గుండెల్లో....నటుడిగా సుస్థిర స్థానం కీ.శే. సామర్ల వెంకట రంగారావు గారిది.


ఈ సంవత్సరం జూలై 3వ తేదీకి... 102 వసంతాలు నిండాయి.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...