10, జులై 2021, శనివారం

అఖిల లోకైకవంద్య హనుమంతుడా - అన్నమయ్య కీర్తన


 



(నా చిత్రలేఖనంలో ఓ అన్నమయ్య కీర్తన)


అఖిలలోకైకవంద్య హనుమంతుడా సీత-
శిఖామణి రామునికిఁ జేకొని తెచ్చితివి
అంబోధి లంఘించితివి హనుమంతుడ
కుంభినీజదూతవైతి గురుహనుమంతుడ
గంభీరప్రతాపమునఁ గడగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి
అంజనీదేవ కుమార హనుమంతుడ
కంజాప్తఫలహస్త ఘన హనుమంతుడ
సంజీవని దెచ్చిన శౌర్యుడవు
రంజిత వానరకుల రక్షకుఁడవైతివి
అట లంకసాధించిన హనుమంతుడ
చటుల సత్వసమేత జయహనుమంతుడ
ఘటన నలమేల్మంగకాంతు శ్రీవేంకటేశుకుఁ
దటుకన బంటవై ధరణి నిల్చితివి


ఈ కీర్తనకి వివరణాత్మక విశ్లేషణ అందించిన సోదరి డా. Umadevi Prasadarao Jandhyala గారికి నా ధన్యవాదాలు.
అన్నమయ్య కీర్తనకు నా వ్యాఖ్య
~~~~~~
అన్నమయ్య హనుమంతుని కీర్తిస్తూ వ్రాసిన ‘ అఖిలలోకైక వంద్య హనుమంతుడా….. ‘అనే కీర్తన శ్రీమతి పొన్నాడ లక్ష్మి ఈ రోజు పాడుతున్నారు.
పాటకు వేసిన శ్రీ పొన్నాడ మూర్తిగారి చిత్రం
ఆంజనేయుని ప్రసిద్ధ ప్రార్ధన శ్లోకాన్ని నాచే పలికించింది.
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్,
రామాయణమహామాలా రత్నం వందే నిలాత్మజమ్’!
అన్నమయ్య పాట విన్నప్పుడు నాకు చెప్పాలనిపించిన మాటలలో కొంచెమైనా మీతో పంచుకోవాలనిపిస్తోంది!
హనుమంతుని గురించి తెలియనిదెవరికీ. మళ్ళీ కొత్తగా చెప్పేదేముంది? అనుకోకూడదుగా. నచ్చిన మధుర పదార్థం ఎప్పుడు దొరికినా తినక వదలంకదా!
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా ।
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్భవేత్ ।।
హనుమన్నామస్మరణ ఎంత మహిమాన్వితం!!
అందుకే పాటతో బాటు నామాటలూ వినండిమరి!
వేలమంది వానరసైన్యంలో హనుమంతునికే శ్రీరాముడు ముద్రికనెందుకు ఇచ్చాడు?
హనుమంతుని బలం మీద సామర్థ్యంమీద అంత నమ్మకం శ్రీరామునికి. కార్యసాధకునికి అవసరమైన బుద్ధిబలం, దేహబలం ఉన్నవాడు వాయుపుత్రుడు. రుద్రతేజోద్భవుడు! చిరంజీవి!
పసితనంలోనే మింటికెగిరి కంజాప్తునే ఫలమని పట్టుకున్న వాడు.. ఇదీ గుర్తు చేసుకున్నాడు అన్నమయ్య
‘కంజాప్తఫల హస్త ఘనహనుమంత!
అంటూ ‘ తన కీర్తనలో !
బాలాంజనేయుడు భానుని ఫలమని పట్టినప్పుడే ఆ జంభారి విసిరిన వజ్రాయుధం తగిలి దవడకు దెబ్బతగలడంతో హనుమ అనే పేరువచ్చింది.
సొమ్మసిల్లిన సుతునిజూచి
వాయుదేవుడు కుపితుడై గాలివీచనీయక ముణగదీసుకున్నాడు. లోకాలు తల్లడిల్లాయి. అప్పడా ఇంద్రుడే వచ్చి పసివాడిని దీవించి హనుమపై ఆ వజ్రాయుధమే కాదు ఏ ఆయుధమూ పనిచేయదని వరమిచ్చిన సంగతి కూడ పాటలో ఉంది.
‘గంభీరప్రతాపమునఁ గడగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి… ‘అంటూ అన్నమయ్య ఈ సంఘటననూ పరవశంతో గుర్తుచేసుకున్నాడు తన
సంకీర్తనంలో!
హనుమ మహేంద్రగిరినెక్కి సాగరలంఘనానికి ఉద్యుక్తుడైనాడు।
అంబోధి దాటిన ఈ ఘట్టం వింటుంటే శతకంఠ రామాయణంలోని మూలా రామ్మూర్తి గారి పద్యమొకటి ప్రస్తావించాలనిపించింది.
సీ॥
తనదు వాలంబు మార్తాండ ప్రచండమై
తతరథంబునకు కేతనము గాగ
తనమోము సత్యలోక నివాస జలజాత
భవ చతురాస్య చుంబనము సేయ
తనయొంటి దీర్ఘదోర్దండ ప్రభావంబు
దిగ్గజంబులనెల్ల మొగ్గసేయ
తనబర్బల స్థూల తనుమహిమంబు
నీరజాండంబుల నిండుకొనగ
తే.గీ॥
తనదు భావంబునకు మహీతలము వణక
భూరి నక్షత్రములు మొలపూసలుగను
బెరిగి లోకంబులకు నెల్ల భీతిగదుర
విలయ భైరవ మూర్తియై మలయుచుండె॥
తోక సూర్యరథ కేతనమైందిట. ముఖం బ్రహ్మ ముఖాలను ముద్దాడిందట.
బాహువుల ముందు దిగ్గజాలు మొగ్గలైనాయట.
ఆ స్థూల దేహం బ్రహ్మాండమంతా వ్యాపించిందిట.
దూకుదామనే హనుమ ఆలోచనకే భూతలం వణికి పోయింది. తారకలు ఆయన మొలపూసలైనాయి. విలయకారకుడైన కాలభైరవుడిలా ఉన్నాడు హనుమ!
ఆయన పాద ఘట్టనతో…
సలలిత పుష్పితాగ్ర తరుశాఖల నుండి పూలగుత్తులు జలజలా రాలాయి. కొండ శిఖరాలు కూలిపోయాయి. పెను శిలలు దొర్లిపడ్జాయి.కులగిరులు కదిలాయి. జంతువులు పక్షులు భయంతో చెల్లాచెదరయినాయి. అంటారు మధునాపంతులవారు తమరచనలో.
ఇంతటి సంఘటనను అన్నమయ్య పాలబువ్వంత తియ్యగా —
అంబోధి లంఘించితివి హనుమంతుడ
కుంభినీజదూతవైతి గురుహనుమంతుడ
అంటూ
రెండు పాదాలలో సరళంగా చెప్పి ఇవన్నీ గుర్తుచేస్తాడు.
సీతామాత వద్దకు రాముని దూతగా వెళ్ళిన హనుమంతుడు సహసా విదధీత నక్రియా అన్నట్లు సమయోచితంగా ఆలోచించి మాట్లాడటం, ఆమెకు నమ్మకం కలిగేలా రామలక్ష్మణుల రూపాలను వర్ణించడం చేసాడు. గతంలో జరిగినవన్నీ వరసగా చెప్పాడు.
సీతాదేవికి శోకనివారణ కలిగించి, రాముడు వస్తాడనే ధైర్యం కలిగించాడు. తనశక్తిని నిరూపించుకోడానికి తనశరీరాన్ని ..
కం॥
జలనిధులు జానుదఘ్నం
బులుగా కులగిరులు గజ్జపొడవులుగాఁదా
రలుదలపువ్వులుగా , ది
క్కులు కడవన్ పెరిగె గగనకుధరము భంగిన్।అని వర్ణించాడొక కవి.
పుత్ర వాత్సల్యంతో జానకీ మాత హనుమంతునకు తన చూడామణిని శ్రీరామునికి అభిజ్ఞానంగా చూపమని ఇచ్చింది.
అది తెచ్చి చేతిలో పెట్టగానే రాముడు
సీత చూడామణి రూపం లో వచ్చినట్లుగా భావించి దానిని గుండెలకు హత్తుకున్నాడు
హృదయం స్వయమాతం
వైదేహ్య ఇవ మూర్తి మత్!
అని కాళిదాసు రఘువంశం లో ఈ దృశ్యాన్ని!
అడుగడుగునా తనప్రభువును సేవిస్తూ , అనుసరిస్తూ, అనుజ్ఞలు పాటిస్తూ ఆపదవేళల ఆదుకుంటూ
రావణునితో యుద్ధంలో అంతా తానే అయి మసలినవాడు రామభక్త హనుమ!
లక్ష్మణుడు మూర్ఛిల్లినపుడు సంజీవని కోసం వెళ్ళి పర్వతాన్నే తీసుకువచ్చిన శక్తిమంతుడు వాయుపుత్రుడేగద! వానర కుల రక్షకుడైన హనుమంతుడు లేని రామాయణం ఊహించలేం. ఆ అంజనీకుమారుని అసాధారణ పరాక్రమం వర్ణనాతీతం. అందుకే అన్నమయ్య అఖిలలోకైక వంద్య హనుమంత అన్నాడు !
తన ప్రభువు వేంకటపతి వెలసిన సప్తగిరులలో ఒకటి అంజనాద్రి !ప్రభువెక్కడో భక్తుడూ అక్కడే . ఆ స్వామి ఎదుటే ఉన్నాడు బేడీ ఆంజనేయస్వామి!
అన్నమయ్య హనుమంతునిపై చాలా పాటలు వ్రాసాడు. మారుతి మనసులో మెదిలితే పాటలూ మాటలూ కోకొల్లలు!
ఈ సందర్భంగా మల్లెమాల రామాయణం లోని ఒక పద్యంతో హనుమకు నమస్కరిద్దాం.
~
మ॥
ఘనుడా రాముని పంపునన్ వెడలి
లంకాపట్టణమ్మందు, సీ
తనుకన్నారగగాంచి మ్రొక్కులిడి , మాతా నేను శ్రీరామ దూ,
తను నీకింక శుభమ్ము గల్గునని యే
ధన్యుండు ఓదార్చె నా
హనుమంతున్ కడు భక్తితో గొలిచి నే నర్పింతు కైమోడ్పులన్ !

కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...