29, ఆగస్టు 2021, ఆదివారం

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి - అన్నమయ్య కీర్తన / చిత్రం : పొన్నాడ మూర్తి

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

వారం వారం అన్నమయ్య కీర్తన


సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు

భావం సౌజన్యం డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

వారం వారం అన్నమయ్య కీర్తన

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు


భావం సౌజన్యం డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం । దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ! అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. దేవకీ యశోదల ముద్దుల పట్టి లేలేత చరణ పద్మాలకు ఒక తెలుగు పద్యం కూడ సమర్పించుకుందాం। శా|| అందెల్ చిన్ని పసిండి గజ్జెలును మ్రోయన్ మేఖలా ఘంటికల్ క్రందై తోఁపఁగ రావిరేకు నుదుటన్ గన్పింప గోపాంగనా నందంబొందఁగ వెన్నముద్దలకునై వర్తించు నీ బాల్యపున్ చందంబాది విజుల్ నుతింపఁదగుఁగృష్ణా, దేవకీనందనా! ఈ వారం అన్నమయ్య కీర్తన —~~~~~~~~
విశ్లేషణ

వెంకటేశ్వరస్వామికి మహాభక్తుడైన అన్నమయ్య ఆ స్వామి అవతారమే అయిన శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ అనేక కీర్తనలు వ్రాసాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి గనక కృష్ణుడి జన్మవృత్తాంతం తోకూడిన “సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడూ “ అనే కీర్తన విశేషాలు మీతో పంచుకుంటాను । ఈ కీర్తనలో అన్నమయ్య తానూ ఓ గోపెమ్మ అయిపోయి పక్కనున్న సతులతో “పుట్టేటప్పుడే శంఖుచక్రాలతో , కిరీటంతో ఎలాపుట్టాడే”? అని ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు.

మరి అట్లా ఎలా పుట్టాడో ఆ కథేమిటో చూద్దాం ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకు ఎనిమదో సంతానంగా పుట్టిన వాడే మన కృష్ణుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే! ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మసంస్థాపనార్థం శ్రీమన్నారాయణుడు ఎన్నో సార్లు అవతారించాడు. వాటిలో దేవకీ వసుదేవులకు పుత్రునిగా పుట్టిన కృష్ణావతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి లీలామానుష రూపుడు. ఈ జన్మలోనే కాదు దేవకీ వసుదేవులు మూడు జన్మల నుంచి ఆ శ్రీహరిని పుత్రుడిగా పొందుతున్న పుణ్య దంపతులు.

అదెలా గంటే పృశ్ని, సుతపుడు అనే దంపతులు శ్రీహరిని ధ్యానిస్తూ తపస్సు చేసారు. విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. “నీవంటి కొడుకు కావాల”ని వరం అడిగారట। తనవంటి వాడు మరొకడు లేడు గనక తానే మూడు జన్మలలో వాళ్ళకు కొడుకుగా పుట్టాడు. పృశ్ని గర్భుడు అనేపేరుతో వారికి జన్మించాడు।

ఈ అవతారంలో ధృవలోకాన్ని నిర్మించి ధృవుడికి ఉన్నత స్థానం ఇచ్చాడు. ఈ దంపతులు తరవాత జన్మలో అదతి, కశ్యపులు. అప్పుడు వారికి వామనుడిగా పుట్టి బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కాడు. దేవకీ వసుదేవులకు బిడ్డగా జన్మించబోతున్నాడు. “నీకు పుట్టబోయే శిశువు శ్రీ మహావిష్ణువు”అని సాక్షాత్తు బ్రహ్మ రుద్రులే వచ్చి దేవకికి చెప్పి ఆశీర్వదించారు. చతుర్భుజాలతో, శంఖుచక్రాలతో పుట్టిన ఆ బిడ్డ తల్లిదండ్రులకు నమస్కరించి వారి పూర్వజన్మ వృత్తాంత మంతా చెప్పి పరమానందం కలిగించాడు. ఈ జన్మతో వారికి ముక్తి లభిస్తుందని చెప్పాడు.తనను వ్రేపల్లెలో నందుని భార్య యశోద దగ్గరకు చేర్చమన్నాడు. అదుగో ఆ విధంగా దేవకీ నందనుడు యశోదానందనుడైనాడు

శ్రీకృష్ణ పరమాత్మ పరిమార్చవలసిన దుష్టులలో ప్రముఖుడు కంసుడు. గతజన్మలో మారీచుని కొడుకైన కాలనేమనే రాక్షసుడు. రాక్షసాంశతో జన్మించి రాక్షసకృత్యాలు చేయడంలో శృతిమించి పోయాడు. దేవకీ దేవి కంసునికి పినతండ్రి కూతురు. అంటే కృష్ణయ్యకు కంసుడు వరసకు మేనమామన్నమాట.

మూడుజన్మలలో తమకు కొడుకుగా విష్ణువు జన్మించినా పెంచుకునే భాగ్యం ఈ దంపతులకు కలగలేదు. కానీ ఆ భాగ్యం గోకులంలోని యశోదానందులకు లభించింది. అదెలా దక్కిందో చూడండి. ద్రోణుడు అనేవసువును, అతని భార్య ధరను భూలోకంలో పుట్టమని బ్రహ్మ ఆదేశించాడట. మాకు శ్రీహరిని కొడుకుగా పొందే వరమిస్తే వెళతామన్నారుట. బ్రహ్మ వారిని ఎందుకు భూలోకానికి వెళ్ళమన్నాడో వాళ్ళూ అదే కోరడం వలన వారికోరికను అనుమతించాడు బ్రహ్మ. ఇదంతా దైవలీల !

సతులతో ముచ్చటలాడుతున్నట్లు వ్రాసిన ఈ అన్నమయ్య కీర్తన ఇన్ని విశేషాలను మనకు గుర్తు చేసుకునేలా చేసింది. కృష్ణుని పుట్టుక విశేషాలు చెప్పి “సతులారా! ఆ ఇద్దరుతల్లుల ముద్దుల పట్టి కృష్ణుడే ఇప్పుడు శ్రీవేంకటపతిగా సతి అలమేలుమంగతో కలిసి మనఎదుట ఉన్నాడు.” అని ఆనందపడతాడు. అన్నమయ్య కీర్తన వినగానే మనకు పోతన గారి భాగవతం లోని ఈ పద్యం గుర్తు వస్తుంది.

సీ॥ జలధరదేహు నాజానుచతుర్బాహు- సరసీరుహాక్షు విశాలవక్షుఁ జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ- గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు- శ్రీవత్సలాంఛనాంచిత విహారు నురుకుండలప్రభాయుత కుంతలలలాటు- వైడూర్యమణిగణ వరకిరీటు తే.గీ బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ జూచి తిలకించి పులకించి చోద్య మంది యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె! (కృష్ణుని పేరు గురించి - ~~~~

పసివాడి రూపంలోని ఈ పరమాత్మకు కృష్ణుడు అనే పేరెవరు పెట్టారో తెలుసుకోవడం అప్రస్తుతం కాదు. కృష్ణ వర్ణం లో ఉండటం ఒకకారణం. గర్గ మహర్షి ఉయ్యాలలోని పసివాడి రూపంలో పరబ్రహ్మ కనపడగా కృష్ణ అన్నాడు. క అంటే బ్రహ్మ. రు అంటే అనంతుడు. ష అంటే శివుడు. ణ అంటే ధర్మము. అ అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. ) ఆనాటి వ్యావహారిక భాషకు అద్దం పడుతుంది ఈ కీర్తన! సతులాల= సతులార. కతలాయ -=( గడసరి) కొదతీర=కొరత తీరగ ఇలాగే మరికొన్ని. తేట తెనుగు పదాలను ఎంతో ఇష్టంగా వాడుతూ మనోహరమైన వేలకీర్తనలను వ్రాసి మనసులనూయలలూపిన అన్నమాచార్యులవారికి తెలుగుజాతి ఋణ పడి ఉంటుంది. చిన్నకృష్ణునికి జన్మదిన శుభవేళ జేజేలు పలుకుదాం.
జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః| జయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః||

స్వస్తి .

1 కామెంట్‌:

GKK చెప్పారు...

డా. జంధ్యాల ఉమాదేవి ప్రసాదరావు గారి పద్యాలు వివరణ మీ చిత్రాలు చాలా బాగున్నాయి.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...