1, ఆగస్టు 2021, ఆదివారం

పాలు తాగె వెన్న దినె బానల పెరుగు జుర్రె - అన్నమయ్య కీర్తన




పాలు తాగె వెన్న దినె బానల పెరుగు జుర్రె

సోలి కాంగుల నేతులు చూరలాడె నమ్మా ॥
చిన్నవాని ఆరడి సేసినట్లు వుండుగాని
ఎన్నెన్ని పోకిళ్ళబొయ్యి ఈ కృష్ణుడు
కన్నెలు ముద్దాడబోతే గంటి సేసె మోవు లెల్ల
తన్నుగానట్టున్నాడు దయ్యపువాడమ్మా ॥
తగినపసిబిడ్డని దతిగొన్నట్టుండు గాని
ఎగసెక్కే లెన్ని నేర్చె ఈ గోవిందుడు
మగువలెత్తుకుంటేను మరి గోళ్ళు వెట్టి తానె
తగవులు చెప్పెఁగతలకోడోయమ్మా ॥
పలుదూరులు బాలునిపై చెప్పినట్టుండుగాని
కలికివాడమ్మ శ్రీ వెంకటనాథుడు
చెలులు కాగిలించెతే సిగ్గు వీడగూడి కూడి
వలపించినాడు ఎటువంటివాడోయమ్మా ॥

ఓ చక్కని అన్నమయ్య కీర్తనకి నేను వేసిన చిత్రం.

ఈ కీర్తనకి చాలా లోతుగా వెళ్ళి అద్బుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు సొదరి డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు. చదవండి :

ఓం నమో వేంకటేశాయ ప్రార్థన కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం కలయన్ కంఠే ముక్తావళిం గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః


పాలు తాగాడు వెన్న తిన్నాడు బానల్లోని పెరుగు జుర్రేసాడు. మైమరిచి పోతూ కాగుల కొద్దీ నెయ్యి దొంగిలించాడు. గోపెమ్మలు యశోదకు చిన్న కన్నయ్య మీద చాడీలు చెబుతున్నారని మీకీపాటికి అర్థమై పోయిందిగా. కీర్తనలో అన్నమయ్య తానూ ఒక గోపికగా మారిపోయాడు. అందరూ కట్టగట్టుకొని యశోదమ్మ దగ్గరకు వెళ్ళి గోపాల కృష్ణుని అల్లరి, తమ అగచాట్లూ చెబుతున్నారు. ఇదేం పిల్లవాడమ్మా అని నిందిస్తున్నారు ఉత్త దొంగ భడవ అంటున్నారు. కీర్తన వినబోయే ముందు వీళ్ళంతా నిందిస్తున్న , నేరాలు చెబుతున్న నవనీతచోరుడు ఎవరో , ఎంతటి వాడో , ఆయన సౌందర్య మెటువంటిదో చెబుతూ బ్రహ్మ చేసిన స్తుతి పోతనగారి పద్యంతో ఒకసారి మననం చేసుకుందాం. “శంపాలతికతోడి జలదంబు కైవడి; మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ కమనీయ మృదులాన్నకబళ వేత్ర విషాణ; వేణుచిహ్నంబుల వెలయువాని గుంజా వినిర్మిత కుండలంబులవాని; శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ వనపుష్పమాలికావ్రాత కంఠమువాని; నళినకోమల చరణములవానిఁ గరుణ గడలుకొనిన కడగంటివాని గో పాలబాలుభంగిఁ బరగువాని నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష! జగద్రక్షకుడు ఆహరి దేవకీ సుతునిగా పుట్టి యశోద కుమారునిగా పెరుగుతున్నాడే అనుకోండి. ఇంత అల్లరి చేయడం ఎందుకూ? వాళ్ళందరిచేతా మాటలు పడటమెందుకూ? ఏవిటీ నాటకం? అని ఎవరికైనా అనిపిస్తుంది. . కీర్తన అచ్చం మనం మాట్లాడు కుంటున్నట్లే ఉంటుంది. అందులో అర్థం కాని దేమీ లేదు. ఎటొచ్చీ అర్థం కానిది అందులోని పరమార్థమే! ముందు వెన్నదొంగిలించాడు. తరవాత మనసు దొంగిలించాడు. తన అల్లరితో గోపికల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. గోపికలంతా ఆయనకు ఒకప్పటి భక్తులే . పెరుగు చిలికితే వెన్న. మనసు చిలికితే జ్ఞానం. జ్ఞానానికి ప్రతీక వెన్న .ఆజ్ఞానాన్ని తనవెంట తిరిగే గోపాల బాలకులకందరికీ పంచిపెట్టాడు. గోపికలను తన మోహంలో ముంచి వేసాడు. మాయామోహితులను తనపై మోహం పెంచుకునే స్థితికి తీసుకు వచ్చాడు. చిన్నశిశువు చిన్నశిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు అని నాడు గోపికలూ నేడు అన్నమయ్య ఆశ్చర్య పోయినట్లే మనమూ ఆశ్చర్య పోతుంటాం. ఆయనది కానిది ఉందా. పాలు పెరుగు తమదనుకోవడం కృష్ణుడు దొంగిలించాడనుకోవడమే అజ్ఞానం. దూడల కోసం ఆవులకు ఇచ్చిన పాలు దొంగతనం చేస్తున్నది మనం. పుట్టకముందే తల్లి రక్తమాంసాల సారం దొంగిలించి ప్రాణం పోసుకున్న జీవులం. మనమధ్య తిరిగే భగవంతుని చూడలేని వాళ్ళం. దేవుడిచ్చిన వనరులన్నీ వాడుకుంటూ ఇదంతా నీ ప్రసాదమే అని చెప్పక మా ప్రతాపమని అనే దొంగలం మనం కదా! అన్ని మహిమలు చూపినా గోపికలు వీడి అల్లరి భరించలేం దయ్యపు పిల్లవాడని తిట్టారు. ఇదేగదా అజ్ఞానం! తాను వ్రేపల్లె వదిలినా తమ జీవితమంతా నెమరు వేసుకునేటన్ని అనుభూతులను పంచినవాడు చిన్నకృష్ణుడు. జగన్నాథుని పట్టుకోవాలనే ఆరాటమే గోపిక తత్వం. వాడు చిక్కడం లేదనే బాధే నేరారోపణ. తరచే కొద్దీ వచ్చే వెన్నలా ఇంకా ఎంతో లోతైన భావం ఉంది. భగవంతుడాడే బొమ్మలాట లో బొమ్మలం మనం . పాలకుండ పగిలినట్లు కొందరి జీవితాలు చిన్నవయసులోనే ముగిసిపోవడం చూస్తున్నాం. తోడు పెట్టిన పెరుగు నేలపాలైనట్లు తోడు పోగొట్టుకునే వారు కొందరు. ఇక ఆవును పోషించి పాలు తీసి , పెరుగు చేసి, చిలికి వెన్నతీసి నెయ్యి చేయడం వలే కష్టమంతా చేసి ఫలితం కోసం ఎదురు చూసే వేళ చేజారడం కొందరి ప్రారబ్థం . ఇదంతా మనకు కృష్ణుని చేతలలో కనబడదా! దశలో ఏదైనా జరిగేది కర్మఫలమే. కానీ నెరవేర్చేవాడు దైవం . మరి చిన్నవాడు నిగమాంత వర్ణితుడైన నారాయణుడే కదా! కీర్తన తాత్పర్యం మాటలలో బదులు ఆటవెలదులలో కూర్చి చివర ఒక ఉత్పలమాల సమర్పించాను. వినరూ! .వె పాలు పెరుగు వెన్న పట్టించు పొట్టకు పట్ట చిక్కనట్టి పాపడమ్మ కాగు లోని నేయి కాజేయు చోరుడు కట్టు బడడు గోప కాంత కెపుడు .వె ముద్దు పెట్టు కొనగ మోవిన గంటిడి జారు కొనును దాను చల్లగాను గోళ్ళతోడ గిచ్చు కోమలులెత్తగ వాని గూర్చి చెప్ప వాయిరాదు! .వె చిన్న వాడనుకొని చేరికౌగిలినీయ సిగ్గు బోవు నట్లు చేతలుండు ! బుడత పోవు నట్టి పోకిళ్ళవెన్నియో పిల్ల దయ్య మనగ పిల్వ వచ్చు! ఆరడిపెట్టినామనుచు నంగన దల్పకు వాడుబిడ్డడే! నేరము లెంచినామనుచు నిష్ఠుర మాడకు నిక్కమింతయున్ ఓరగ జూచిదోచుకొను నుల్లము వింతగ నేమిమాయయో తీరునె మాదుబాధలివి తీర్పక నీవుయశోద జెప్పుమా! పెరుగు చిందులన్నీ పైన బడి, నల్లనయ్య చుక్కలు పొదిగిన నీలాకాశంలా ఎంత ముద్దొస్తున్నాడో!


శ్రీకృష్ణ శరణం మమ

శ్రీమతి పొన్నాడా లక్ష్మి గారు ఈ కీర్తనని అద్భుతంగా గానం చేశారు. ఈ క్రింది లింక్స్ క్లిక్ చేసి వినండి.


https://www.facebook.com/100002637341011/videos/pcb.4032687193495819/1949053621938925


డా, ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి audio రూపంలో ఉన్న విశ్లేషణ కూడా ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.



ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...