19, అక్టోబర్ 2021, మంగళవారం

"సుందరదాసు' ఎమ్. ఎస్. రామారావు - MS Ramarao (Pencil sketch)


 
ఎమ్. ఎస్. రామారావు (Pencil sketch)
వీరు పేరు చెప్పుకోగానే గుర్తుకొచ్చేవి వీరు అద్భుతంగా గానం చేసిన, తెలుగునాట విశేషంగా ప్రాచుర్యం చెందిన 'హనుమాన్ చాలీసా', 'సుందరకాండ".
ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు.
అడవి బాపిరాజు గారి ప్రోత్సాహంతో చలన చిత్ర రంగంలో ప్రవేశించి 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సి.హెచ్. నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం గా చెప్పుకుంటుంటారు. తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహత్యం, నా యిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు.
ప్రఖ్యాత హిందీ చిత్ర సంగీత దర్శకులు ఓ.పీ.నయ్యర్ సంగీత సారధ్యంలో 'నీరాజనం' చిత్రంలో "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా" పాట అద్భుతంగా పాడారు.
1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన ఇండియన్ ఏర్ ఫోర్స్(IAF)లో పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ.

వీరు ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రఖ్యాత పాత్రికేయుడు శ్రీ గుడుపూడి శ్రీహరి వీరిని అనేకరకాలుగా ఆదుకోవడమే కాకుండా వీరి 'హనుమాన్ చాలీసా' 'సుందరకాండ' ప్రాచుర్యానికి చాలా సహకారం అందించారట. ఈ విషయం శ్రీహరి గారు ఓ టీవీ interview లో చెప్పారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఆ విషయాలు తెలుసుకోగలరు.


1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు, తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ సుందరకాండ గేయరచన చేశాడు. 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాదులో సహజ కారణాల వల్ల మరణించారు.

September-October 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో 'మూర్తిమంతమాయె' శీర్షికలో నేను చిత్రీకరించిన ఈ ఎమ్.ఎస్. రామారావు గారి చిత్రాన్ని ప్రచురించిన పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు.



కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...