1, అక్టోబర్ 2021, శుక్రవారం

ఎవ్బ్వరిలో మెచ్చదగవు ఇద్దరిలో రామరామ - అన్నమయ్య కీర్తన




 వారం వారం అన్నమయ్య

(ఈ వారం అన్నమయ్య కీర్తన, భావం : డా. Umadevi Prasadarao Jandhyala, చిత్రం : Pvr Murty)
ఎవ్వరి మెచ్చదగవు యిద్దరిలో రామరామ
రవ్వగా సురలు విచారము సేసేరిందుకే
దశరథు యజ్ఞములో తగ నీవు జనియింప
దశకంఠు మేన బుట్టె దావాగ్ని
వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు
దశకంఠు డంటి(ది?) నట్టిధర్మ మందె సమసె
నెఱిదొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను
చెఱకు విల్లెత్తె నీపె జేరి మరుడు
విఱిగె నీవెత్తినట్టి విల్లయితే నెంతైన
విఱుగ కాతనివిల్లు వెసఁ బెండ్లి సేసేను
శ్రీవేంకటాద్రిమీదఁ జేరి యెక్కితివి నీవు
ఆవెలది నీవుర మట్టె యెక్కెను
దేవుడవై ఇందరిలోన తిరుగాడుదువు గాని
నోవల నాకైతే (ఆకె + ఐతే) నీపై వున్నచోనే వున్నది

ఈ వారం అన్నమయ్య కీర్తన విశ్లేషణ :
నమో వేంకటేశాయ
ఉ॥ రామ! విశాలవిక్రమ పరాజిత భార్గవరామ! సద్గుణ
స్తోమ ! పరాంగనా విముఖ సువ్రత కామ! వినీలనీరద శ్యామ !
కకుత్థ్స వంశ కలశాంబుధిసోమ ! సురారిదోర్బలో
ద్దామ విరామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !
(కంచెర్ల గోపన్న గారి దాశరథీ శతకం లోని పద్యం )
ఇప్పుడు అన్నమాచార్యులవారి ‘ఎవ్వరి మెచ్చదగవు యిద్దరిలో రామరామ రవ్వగా సురలు విచారము సేసేరిందుకే’ అనే కీర్తన గురించి మాట్లాడు కుందాం.
దేవతలంతా ఈ ఇద్దరిలో ఎవరిని మెచ్చుకోవడం న్యాయం … అని నాయక , ప్రతినాయకుల గురించి రవ్వగా అంటే గొడవగా మాట్లాడుకుంటున్నారు. దానికి ఈ పాటలో మొదటి చరణంలో తన తీర్పును చెబుతున్నాడు అన్నమయ్య !
“రామా! నీవు దశరథుని పుత్రకామేష్టి యజ్ఞంలో జన్మించిన అవతారమూర్తివి! కారణ జన్ముడవు. నీవిక్కడ జన్మించగానే అక్కడ దశకంఠుడి శరీరంలో దావాగ్ని పుట్టింది. దేనికీ చలించని శాంతమూర్తివి. అందుకు నీవు అనుసరించిన ధర్మమే కారణం. నీశాంతమే నిన్ను యుగయుగాలకు ఆరాధ్యుని చేసింది. రావణుడు అందిపుచ్చుకున్న అసుర లక్షణం వాని వినాశనానికే కారణమైంది. నిస్సందేహంగా నీవే శ్రేష్ఠుడవు”
అన్నాడు అన్నమయ్య రామరావణుల గుణశీలాలను పరిశీలిస్తూ! (రావణుడు పులస్త్యబ్రహ్మ కుమారుడైనా, శివభక్తి కలవాడైనా అధర్మాన్ని ఆశ్రయించాడు. అందువల్లే బ్రతుకంతా అశాంతితో గడిపాడు.దానివలననే నాశనమైనాడు. ‘చిత్తవికారం కలిగిన భక్తీ, తనపూర్వీకుల ధర్మాన్ని అనుసరించని జీవితమూ వ్యర్థమే’ నని రావణుడి జీవితం లోకానికి చాటింది. మరి రామ రావణులలో నిస్సందేహంగా రాముడే శ్రేష్ఠుడు. కాబట్టి శ్రీరాముని మెచ్చడమే తగినది. అని అన్నమయ్య ఉద్దేశం) రాముడు, మారుడు ఇద్దరూ ధనుర్థారులే !ఎవరినెక్కువ మెచ్చుకోవాలి అనుకుంటూ కీర్తన రెండవ చరణం లో అన్నమయ్య …. “రామా! నీవు సీతకోసమై శివునివిల్లెత్తగానే మన్మథుడు ఆ సీతమ్మ పక్షాన చేరి నీమీదకు తన చెరకువిల్లు నెత్తాడు. నీవు ఎక్కుపెట్టిన విల్లు విరిగి పోయింది. ఆ మన్మథుడెక్కు పెట్టిన విల్లు మీ పెళ్ళి చేసింది. మరి ఇక్కడ ఎవరిని మెచ్చుకోవాలి ?”అంటూ చమత్కరించాడు! మరి లక్ష్మీ నారాయణులలో నయితే ఎవరెక్కువనుకోడం బాగుంటుందీ అనుకుంటూ మూడవ చరణంలో … “స్వామీ ! ఇక్కడ నీవు వేంకటాచలమెక్కి కూర్చుంటే నీ వక్షస్థలం మీదకెక్కింది ఆతల్లి లక్ష్మీదేవి! మీ ఇద్దరిలో ఎవరు గొప్పనడం న్యాయం చెప్పు. ఆపై ఆలోచిస్తే నీవు దేవుడివై ఇన్ని రూపాలు ధరిస్తూ అటూ ఇటూ తిరిగుతున్నావు గానీ ఆమె అయితే హాయిగా నీలోనే ఉన్నది. మరి మీ ఇద్దరిలో ఎవరెక్కువ ?”అంటాడు! ఇదొక చమత్కారం! స్వామి వారితోనే మేల మాడగల చనవు ఇంకెవరికుంటుంది?! భక్తుడికి గాక!!
అద్భుతమైన ఈ కీర్తనను గురించి నాకు తోచినది మీతో పంచుకోవడం ఆ ఏడుకొండలస్వామి ఇచ్చిన అదృష్టం. కొన్ని పదాలకు అర్థాలు తగవు- న్యాయము రవ్వ- గోల ఓవల- ఆవల లేదా ఆతరవాత ఈపె- ఈమె( సీత) ఆకె- ఆమె నెఱి- పరాక్రమము
మ॥ రాముడైజనియించె విష్ణువు రావణాసురుఁద్రుంపగన్
భూమి నాథుల మార్గదర్శిగ పోహణింపగ లోకముల్
స్వామి బొందెను బాధ లెన్నియొ సత్ప్రవర్తన నేర్పగన్ రామరాజ్యపదంబునేటికి రమ్యమైవిలసిల్లదే!
పోహణించు= ప్రశంసించు
—————— డా. ఉమాదేవి జంధ్యాల

Like
Comment
Share


కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...