"పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు"- అన్నమయ్య కీర్తన
కీర్తన విశ్లేషణ సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రాలు : Pvr Murty (పొన్నాడ మూర్తి)
సహకారం : Ponnada Lakshmi
ప|| పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు | ధరమము విచారించ తగునీకు అమ్మ ||
చ|| కమలజుగన్న తల్లివి కామునిగన్న తల్లి |
అమరులగన్న తల్లి ఆదిమ లక్ష్మి |
విమలపు నీపతికి విన్నపము జేసి మమ్ము |
నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ ||
చ|| కామధేను తోబుట్టుగ కల్పకము తోబుట్టుగ |
దోమటి చల్లిన చంద్రు తోబుట్టుగ |
నీమగని పంపునను నిజసిరులిచ్చితివి |
నేమపు వితరణము నీకే తగునమ్మ ||
చ|| పాలజలధి కన్యవు పద్మాసినివి నీవు |
పాలపండే శ్రీవేంకటపతి దేవివి |
ఏలిన యితని బంట్లకు యిహపరాలిచ్చి మా |
పాల గలిగితివి సంబంధము మేలమ్మ ||
ప్రార్థన :
ఉ॥రాముని చేయిబట్టియిల రక్షణ సేసెడి తల్లిజానకీ
నీమము తోడగొల్చెదము నీపదయుగ్మము భక్తిమీరగన్
తామసు డైనరావణు మదంబును గూల్చిన మీరునేడిలన్
క్షేమము గూర్చి సజ్జనుల చింతలు బాపగ గొల్తుమమ్మరో!
విజయదశమిని శ్రీరామచంద్రుడు రావణాసురునిపై సాధించిన విజయం గా జరుపుకుంటారు. లక్ష్మీ దేవే భూమిజ అయిన జానకిగా జన్మించి రావణ సంహారంలో తన పతికి తోడుగా నిలిచింది. అందు వలన లక్ష్మీ దేవిని వేంకటపతిగా కలియుగమున వెలసిన హరికి తన మొరవినిపించమని వేడుకునే అన్నమయ్య కీర్తన ఈ రోజు గుర్తు చేసుకుందాం.
*కీర్తన సారాంశం
అయ్యవారు ఆలకించకపోతే అమ్మవారితో “ననుబ్రోవమనీ చెప్పవే సీతమ్మతల్లీ”అని రామదాసు మొరలిడినట్లే ఇక్కడ అన్నమయ్య కూడా “అమ్మా నీపతితో కాస్త మాగురించి చెప్పవమ్మా” అంటున్నాడు ఈకీర్తనలో.
మనకు ఇళ్ళలో కూడా పిల్లలు తమకు కావల్సినవి అమ్మకు చెప్పి “నాన్నకు నువ్వు చెప్పమ్మా”అనడం మామూలే.
“అమ్మా ఆ పరమాత్మకు ప్రియసతివి. పైగా పట్టపురాణివి. ( మిగిలిన సతులకన్నా పట్టపురాణికి భర్త కు చెప్పే చనువు , ధైర్యం ఎక్కువ). మేం అడిగేది న్యాయమైనదేననీ, ధర్మవిరుద్ధం కాదనీ నీకూ తెలుసు.”అంటూ ఆమె ధర్మనిరతిని ప్రస్తావించి కొంచెం దగ్గరగా జరిగాడు పిల్లాడిలా అన్నమయ్య!
అమ్మైతే మాత్రం పొగడ్తలకు పొంగిపోదా ఏమిటి? చూడండి ఎలా తల్లిని తన మాటలతో మెప్పిస్తున్నాడో…
“ సృష్టికర్త బ్రహ్మకు, సృష్టికార్యానికి నడుంబిగించే మన్మధుడికీ కన్నతల్లివి! ఆదిలక్ష్మివి. ఆ దేవతలే నిన్ను తల్లివని మ్రొక్కుతుంటారు. నా విన్నపం నీ పతికి చేరవేయవమ్మా! ఆయన నిర్మలమైన మనస్సు కలవాడు। కోపిష్టి కాడు. నీ మాటలు వింటాడు. మా విన్నపాలు చెప్పి మమ్మల్ని ఏలగల దయ నీకే ఉన్నది. నీవన్నీ పరిశీలించగల ప్రజ్ఞామతివి!”
ఏ స్త్రీ అయినా ఆమె తోడబుట్టిన వాళ్ళను పొగిడితే , పుట్టింటిని మెచ్చుకుంటే సులభంగా ప్రసన్నమై పోతుంది. ఈ కిటుకు తెలిసిన అన్నమయ్య ఇలా అంటున్నాడు-“కోరిన కోరికలు తీర్చే కామధేనువూ, కల్పవృక్షమూ తోబుట్టువులుగాగల నీలో కూడా కోరికలు తీర్చే గుణం ఉంటుంది. మీరంతా సహజన్ములుకదా తల్లీ ।
తల్లీ నీవు పాలకడలిలో పుట్టావు. పద్మంలో ఆసీను రాలవైనావు…”
(ఇలా అనడంలో చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం మనగుణగణాల మీద ఉంటుంది గనక నీ మనసూ పాలవలె స్వచ్ఛమైనది,పూవువలె సుకుమారమైనది గా ఉంటుందని సూచన.)
నీ పతిదేవుడు పవళించేదీ పాలపైననే కదా. ఆ పాలకడలిలోనే ఉండే మీదంపతులు మా పాలిట వరప్రదాతలు! ఇహ పరాలను మీ సేవచేసుకునే భక్తులకు ప్రసాదించే మీతో మా సంబంధం విడదీయలేనిది”.
మరో పద్య కుసుమం ఆ జగన్మాతకు అర్పించి స్వస్తి పలుకుదాం.
ఉ॥
కౌస్తుభ హారియైన హరికౌగిలి జేరి ముదంబునొందుచున్
నిస్తుల పాలనన్ జరుపు నేర్పును గల్గిన నిత్యపూజితా
స్వస్తుల మౌదుమమ్మతవ సంస్తుతి సేయగ భక్తియుక్తులన్
కస్తిని బెట్టగా వలదు కామిత దాయిని నిన్ను వేడెదన్
~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి