15, ఏప్రిల్ 2023, శనివారం

పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము - - అనమయ్య కీర్తన


 

పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము -

ఈవారం అన్నమయ్య కీర్తన.

ప|| పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము ||
చ|| కినిసి వోడమింగెడి భూతము | పునుకవీపు పెద్దభూతము |
కనలి కవియు చీకటిభూతము | పొనుగు సోమపుమోము భూతము ||
చ|| చేటకాళ్ళ మించినభూతము | పోటుదారల పెద్దభూతము |
గాటపుజడల బింకపుభూతము | జూటరినల్లముసుగు భూతము ||
చ|| కెలసి బిత్తలేతిరిగేటి భూతము | పొలుపుదాంట్ల పెద్దభూతము |
బలుపు వేంకటగిరిపై భూతము | పులుగుమీది మహాభూతము ||

భావం: ఇది ఒక పెద్ద భూతము. భువిలో వారు, వీరు అన్న భేదభావం లేకుండా అందరినీ ఆవహించింది. కోపముతో పైబడి పెద్ద ఓడనే అమాంతముగా మింగువేయు భూతమిది. వీపున ఈ పెనుభూతమునకు ఒక ఎముక చిప్ప కలదు. చీకటివలె నల్లనైన ఈ భూతము కోపముతో మీదపడే స్వభావము కలిగి యున్నది. విజృంభించు విక్రమముతో నిండిన ముఖము కలభూతమిది.
ఈ భూతము వెడల్పయిన పెద్ద కాళ్ళతో అతిశయించి యున్నది. ఇది పెద్ద బీరముగల పోటుదారు. దట్టమైన జడలు కలిగి బింకముగల భూతం. ఈ మాయదారి భూతము నల్లని ముసుగు వేసుకున్నది.
ఈ భూతము దిస మొలతో అడ్డమాక తిరుగుచుండును. అవలీలగా ఇటునటు లంఘించు వడిగల భూతమిది. ఇది సమున్నతమైన వెంకటాచలముపై నుండును. ఈ భూతము పక్షిపై నుండును.
ఈకీర్తనలో అన్నమయ్య స్వామిని పెద్ద భూతముతో పోల్చి చెప్పాడు. ఎందుకంటే పరమాత్ముడు దుష్ట శిక్షణార్ధము పెద్ద భూతము చేసే వికృత చేష్టలు చేసాడు. పొడవుగా నల్లగా ఉండటం, ఓడలవంటి పెద్ద పెద్ద వస్తువులు మ్రింగుట, ఎముకచిప్పని వీపుమీద మోసుకోవడం, కోపముతో పై కొనుట, భయంకరమైన ముఖము, చేటలవంటి కాళ్ళు, బిరుసైన జడలు, నల్లనిముసుగు కలిగి యుండుట, దిస మొలతో సంచరించుట, వడివడిగా దాటిపోవుట, కొండలపై నుండుట, పక్షిపై సంచరించుట మున్నగునవన్నీ పెద్ద భూతముల స్వభావాలే అనుట లోక ప్రసిద్ధము. స్వామిని అన్నమయ్య ఏ విధంగానైనా పోల్చుకోగలడు. విమర్శించ గలడు.
(కీ. శే. సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మయ్య గారి వ్యాఖ్యానం ఆధారంగా.)

కామెంట్‌లు లేవు:

ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు - అన్నమయ్య కీర్తన

 ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు  - అన్నమయ్య కీర్తన ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదిలో హోమమై పోయఁ గాలము ॥ఏడ॥ ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడినని క...