ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు - అన్నమయ్య కీర్తన
ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు
బూడిదిలో హోమమై పోయఁ గాలము ॥ఏడ॥
ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడినని
కదిసిన యాసచేఁ గడవలేక
యెదురు చూచి చూచి యెలయించి యెలయించి
పొదచాటుమృగమై పోయఁ గాలము ॥ఏడ॥
ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని
వింతవింత వగలచే వేఁగి వేఁగి
చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని
పొంతనున్న వెన్నయై పోయఁ గాలము ॥ఏడ॥
యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని
యెక్కడికైనా నూర కేఁగియేఁగి
గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక
పుక్కిటి పురాణమయి పోయఁ గాలము ॥ఏడ॥
జీవితంలో ఎండవుమాలు, భ్రమల వెంట పరుగెత్తుతూ కాలాన్ని వృధా చేశానని వాపోతాడు అన్నమయ్య ఈ కీర్తనలో . అప్పటి రోజుల్లోనే అన్నమయ్య కాలం విలువ గుర్తించి చక్కగా కీర్తన రూపంలో మన కందించాడు.
ఇది మేలు జరుగుతుందని అది మేలు జరుగుతుందని ఆశతో గడుపుతాము. ఎదురు చూసి చూసి ఇటూ అటూ పోయి పొదచాటు మృగంలా మాయమైపోతుంది కాలము.
ఇదిగొ తీరుతుంది అదిగో తీరుతుంది అని వింత వింత కారణాలతో చూసి చూసి వేదనతో చిక్కుపడుచూ అగ్నిచెంత వెన్నలా కరిగిపోతుంది కాలము.
ఇక్కడ సుఖం దొరుకుతుందని, అక్కడ సుఖం దొరుకుతుందని ఎక్కడెక్కడో వెతుకుతాము. కాని శ్రీ తిరువేంకటపతిని కానక పుక్కుటి పురాణమైపోతుంది కాలము.
సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
చిత్రం : Pvr Murty
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి