30, జూన్ 2023, శుక్రవారం

తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద |వెలుగు లోపలికి వెలుగేలా - అన్నమయ్య కీర్తన



|| తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద | వెలుగు లోపలికి వెలుగేలా ||

|| అరయ నాపన్నుని కభయ మీవలెగాక | ఇరవైన సుఖి గావనేలా |
వరుత బోయెడువానివడి దీయవలె గాక | దరివాని తివియ( దానేలా ||

|| ఘనకర్మారంభుని కట్లు విడవలె గాక | యెనసి ముక్తుని గావనేలా |
అనయము దుర్బలుని కన్న మిడవలెగాక | తనిసిన వానికి దానేలా ||

|| మితిలేని పాపకర్మికి దావలె గాక | హిత మెరుగు పుణ్యునికి నేలా |
ధౄతిహీను గౄపజూచి తిరువేంకటేశ్వరుడు | తతి గావకుండిన తానేలా ||


- అన్నమయ్య కీర్తన


భావం : సౌజన్యం కీ.శే. సముద్రాల లక్ష్మణయ్య,  చిత్రం : పొన్నాడ మూర్తి

చీకటి నలుదెసల క్రమ్ముకొన్నప్పుడు వస్తుపరిజ్ఞానమునకై దీపము చేబూనవలెను. అంతే కాని గొప్ప ప్రకాశములోనికి దీపము జూపవలసిన పనిలేదు కదా!

ఆపదపాలై దుఖించువానికి అభయమిచ్చి రక్షింపవలెను. గాని ఎట్టు చీకు చింతలు లేక హాయిగా సుఖించువానిని కాపాడవలసిన పనిలేదు. వెల్లువలో కొట్టుకుని పోవువానిని వడిగా గట్టుకు దీయవలెను గాని గట్టుననే ఉన్నవానిని తీయవలసిన పని తనకు లేదుగదా!

పెద్ద పెద్ద కర్మలలో పూనిక వహించి అందు తగులుకొన్నవాని బంధనములు ఊడదీయవలెను గాని ఏ బంధము లేక ముక్తుడైయున్నవానిని రక్షింప అవసరము లేదు. స్వయముగా అన్నము సంపాదించుకొన జాలని దుర్బలునికి ఎల్లవేళల అన్నమ్ము పెట్టి పోషింపవలెను గాని తృప్తిగా తిని త్రేపినవానికి తాను పెట్టవలసినిది ఏమియు లేదు కదా !

అంతులేని పాపములాచరించి హీనుడైనవానిని ఉద్ధరించుటకు తాను కావలెని గాని హితము తెలిసి పుణ్య కర్మములు ఒనర్చు  సుకృతాత్మునికి తనతో (భగవంతునితో) పనిలేదు. ధైర్యము కోల్పోయిన దీనునిపై కృపబూని సమయమునకు రక్షింపకుండినచో శ్ఈవేంకటేశ్వరుడు ఉండి ప్రయోజనమేమి?

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...