కీ. శే. పొన్నాడ కుమార్ గారు నాకు స్వయానా పినతండ్రి.
కుమార్ గారు గొప్ప రచయిత, నటులు, గాయకులు కూడా. వీరితో నా అనుబంధం మరువరానిది.
నా చిన్నతనంలో మేము ఉండే రైల్వే క్వార్టర్ కి ఓ అర కిలో మీటర్ దూరంలో కుమార్ గారి క్వార్టర్ ఉండేది వారు కూడా రైల్వే ఉద్యోగులే. కుమార్ గారు తమ విరామ సమయంలో సాహితీ సేవ, నాటకరంగ సేవ చేస్తూ ఉండేవారు. వారు రచించిన కథలు, కవితలు వ్యాసాలు ఆనాటి ప్రముఖ తెలుగు పత్రికలు చిత్రగుప్త, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక తదితర పత్రికల్లో ప్రచురితమయ్యేవి. అవి మాకు చూపిస్తూ ఉండేవారు. కారా మాస్టారు గా ప్రసిద్ధి చెందిన కీ. శే. కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం లో స్థాపించిన "కథానిలయం" గ్రంధాలయం లో పొన్నాడ కుమార్ గారి కథలు కొన్ని లభ్యం. నేను ఇప్పుడు ఓ ప్రముఖ చిత్రకారునిగా, కార్టూనిస్ట్ గా పేరు సంపాదించుకోవడం వెనుక ఆయన ప్రోత్సాహం చాలా ఉందని చెప్పక తప్పదు.
ఇంక నాటక రంగానికి వస్తే వారు చాలా పౌరాణిక సాంఘిక నాటకాల్లో నటించారు. నేను చిన్నప్పుడు కటక్ నుండి భద్రక్ వెళ్లి వారు నటించిన పౌరాణిక నాటకం చూడడం నాకు బాగా గుర్తు. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా కూడా వారు ఆనాటి ప్రముఖ పౌరాణిక నాటక రంగ నటులైన ఈలపాట రఘురామయ్య, సూరిబాబు, పీసపాటి వంటి నటులతో కూడా నటిస్తూ ప్రదర్శనలు ఇచ్చేవారు. అటువంటి ఓ నాటకం ఒడిస్సాలో భద్రక్ పట్టణంలో ప్రదర్శించగా నా చిన్నతనంలో తిలకించే భాగ్యం కలిగింది. బరంపురంలో వారు మా నాన్నగారు శ్యాంసుందర్ రావు గారు తదితర బరంపురంల ప్రఖ్యాత స్థానిక నటులతో కలిసి ప్రదర్శించిన " పల్లెపడుచు " అనే సాంఘిక నాటకం తిలకించే భాగ్యం కూడా కలిగింది.
కుమార్ గారు మంచి గాయకులు. నాటకాల్లో ఆయన పద్యాలు ఆయనే పాడుకునేవారు. ఆయన పద్యం చదివితే ప్రేక్షకుల నుండి 'వన్స్ మోర్' అనే అభ్యర్థనలు వచ్చేవి.
నేను వేసిన కార్టూన్లు కొన్ని ప్రముఖ పత్రికలు ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక లో ప్రచురితమయ్యేవి. నా కార్టూన్ చూసి నన్ను అభినందించేవారు. కొన్ని సూచనలు కూడా ఇచ్చేవారు.
పదవి విరమణ అనంతరం కుమార్ గారు కొన్నాళ్ళు తమ స్వస్థలమైన ఎలమంచిలి లో ఉండేవారు. అక్కడ కూడా స్థానిక సాహితీ ప్రముఖులతో తన సాహితీ సేవ కొనసాగించారు. ఆ తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డారు. విశాఖ నగరం ఎందరో సాహితీప్రియులను ఆదరించింది, పోషించింది. వారిలో కుమార్ గారు ఒకరు. ఓ విశాఖ ప్రముఖ సాహితీ సంస్థ కుమార్ గారిని 'విశాఖ రత్న' బిరుదుతో సత్కరించింది.
కుమార్ గారు సంఘ సేవకులు కూడా. పదవీ విరమణ అనంతరం వారు కొన్ని బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల్లో పాల్గొనేవారు. పెళ్లి సంబంధాలు కుదిర్చారు.. మా పెద్దమ్మాయి సంబంధం కూడా ఆయనే కుదిర్చేరు. ఆయన ఆధ్వర్యంలోనే మా పెద్దమ్మాయి వివాహం కూడా జరగడం నా జీవితంలో ఓ మరపురాని మధురానుభూతి.
ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి పొన్నాడ కుమార్ గారిని సంస్మరిస్తూ వారి సేవలను అందరికీ తెలియజేసే విధంగా వారి కుమారుడు శ్రీ పొన్నాడ రఘునాథ్ గారు ఓ పుస్తకం ప్రచురించడం బహుదా ప్రశంసనీయం. వారికి నా ఆశీస్సులు. కుమార్ గారికి నా నివాళి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి