శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఓ అన్నమయ్య కీర్తన.
మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా
సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా
ఆవులు పేయలకుఁగా నఱచీఁబిదుకవలె
గోవిందుఁడ యింక మేలుకొనవయ్యా
ఆవలీవలి పడుఛు లాటలు మరిగివచ్చి
త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా
వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁ
గూడియున్నా రిదే మేలుకొనయ్యా
తోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకము
యీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా
పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁ
గొలుకులు నిచ్చి మేలుకొనవయ్యా
అలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణ
యిల మామాటలు వింటి విఁక మేలుకోవయ్య
అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.
నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.
నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా !
(సేకరణ )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి