8, మే 2024, బుధవారం

పోతుకూచి సాంబశివరావు - రచయిత - pencil sketch




పోతుకూచి సాంబశివరావు -  pencil sketch 


పోతుకూచి సాంబశివరావు బహుముఖ ప్రజనాశాలి. కవిత్వం, పద్యాలు, కధలు, నవలలు, నాటికలు, నాటకాలు, జీవిత చరిత్రలు రాశారు. సాహితీ స్వస్థలను స్థాపించారు. తెలుగులో, ఆంగ్లంలో సాహిత్య పత్రికలను స్థాపించి సంపాదకత్వం వహించారు. సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంలో అందె వేసిన చెయ్యి .

 
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో 1926 జనవరి 27న పోతుకూచి నరసింహ మూర్తి, సూరమ్మలకు రెండవ సంతానంగా సాంబశివరావు జన్మించారు. మేనమామ గండికోట రామమూర్తి ఆయనకు సాహిత్యంతో పరిచయం ఏర్పర్చారు. దాంతో కాకినాడలోని గ్రంథాలయాలు ఆయనకు ఆవాసాలయ్యాయి. తల్లి సూరమ్మ చెప్పే జానపద కథలు ఎంతో ఆసక్తితో వినడం అలవాటైంది. కాలేజీలో చదివే రోజుల్లోనే పద్యాలు రాశారు సాంబశివరావు. ‘ఇదీ తంతు’ అనే కథ రచించారు. దాన్ని నాటకీకరించి తానూ నటించారు. సచివాలయంలో స్టెనోగా ఉద్యోగం లభించింది. ఆ తర్వాత కార్మిక శాఖకు మారారు. అక్కడ ఉన్నప్పుడే ప్రైవేటుగా ఎల్‌.ఎల్‌.బి. చేశారు. ప్రముఖ కవి బోయి భీమన్న ఆయనను దామోదరం సంజీవయ్యకు పరిచయం చేశారు. నవ్యసాహితీ సమితిని. ఆ తర్వాత విశ్వసాహితిని ఆయన స్థాపించారు. ‘విశ్వ సాహితి’ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టారు.
 
‘బిరాజ్‌ బహు’ అనే హిందీ సినిమా స్ఫూర్తితో 1955లో ‘ఉదయ కిరణాలు’ అనే నవల రాశారు పోతుకూచి. ఈ నవలను 1967లో రష్యన్‌ భాషలోకి కూడా అనువదించారు. ‘అన్వేషణ’, ‘ఏడు రోజుల మజిలీ’, ‘చలమయ్య షష్టిపూర్తి’, ‘నీరజ’ అనే నవలలను రచించారు. అనేక పద్యాలు, గేయాలు, వచన కవితలు రాశారు. ‘హంతకులు’ అనే నాటక రచయితగా ఎంతో ప్రఖ్యాతి పొందారు సాంబశివరావు. ఈ నాటకం ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. దాదాపు 350 కథలను రాశారు.
 
అనువాదంలోనూ అందె వేసిన చెయ్యి. ఆలిండియా రేడియో జాతీయ కవిసమ్మేళనం కోసం వివిధ భాషల కవితలను తెలుగులోకి అనువదించారు. నేషనల్‌ బుక్‌ ట్రస్టు వారి బాల సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకువచ్చారు. ‘సంజీవయ్య దర్శనం’ అనే పేరుతో దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర రచించారు. సాయిబాబా జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు.
 
ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలను 1965లో హైదరాబాదులో నిర్వహించారు పోతుకూచి. 1961లో యునెస్కో సదస్సులో దక్షిణ భారత ప్రతినిధిగా పాల్గన్నారు. హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి కార్యదర్శిగా పనిచేశారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్‌ లలిత కళా అకాడమీ సభ్యుడిగా, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం సలహా మండలి సభ్యుడిగా, ఆంధ్ర మహిళాసభ సాహిత్య కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యుడిగా, సెన్సార్‌ బోర్డు సభ్యునిగా సేవలందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సాంబశివరావుకు 1993లో ‘కళా ప్రపూర్ణ’ గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు పురస్కారాలను ప్రదానం చేశాయి. ‘సాహితీ భీష్మ’, ‘కళారత్న’ తదితర బిరుదులను పొందారు. 2017 ఆగస్టు 6 న హైదరాబాదు లో మరణించారు.  

ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాన్ని సాహిత్య సేవకే అంకితం చేసిన ఆయన మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు.

కామెంట్‌లు లేవు:

దూరాలను ఓపలేను ఒదగనివ్వు గుండెల్లో..!! - గజల్

నా చిత్రానికి శ్రీమతి వాణి గారి రచన. దూరాలను ఓపలేను ఒదగనివ్వు గుండెల్లో..!! మౌనాలను మోయలేను ఒలకనివ్వు గుండెల్లో..! ఎడబాటును కన్నీళ్ళకు కానుక...