6, డిసెంబర్ 2016, మంగళవారం

నవ్వాలి గలగలా జలజలా

My Pen sketch.
'నవ్వడం ఒక యోగం నవ్వకపోవడం ఓ రోగం' అనే వారు జంధ్యాల గారు. నిజమే మరి !! facebook లో  బాబాయి అంటూ అభిమానించే Bhavani Ssa గారి కవిత చదివాక గుర్తుకొచ్చిన ఎప్పుడో అలాఅలా వేసుకున్న నా pen చిత్రం. మరి ఆమె రాసిన కవిత కూడా చదవండి.
చుక్కలన్నీ ఏదో ఎడారిలో రాల్చేసుకున్న ఆకాశంలా
ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు
అలా చిర్రుబుర్రులొద్దు - ఆ చిటపటలొద్దు
నవ్వాలి - గలగలా - జలజలా
అలా బడుల్లోకి పోయి
చిన్న పిల్లల ముందు నిలబడు
నాలుగు నవ్వులు నీ చేతుల్లో పడేస్తారు
తోటల్లో పక్షుల గూళ్ళల్లో తోంగి చూడు
నీ కళ్ళు నవ్వుల దీపాలవుతాయి.
మట్టి మొక్కలా నవ్వుతుంది
చెట్టు నీడలా నవ్వుతుంది
మనం నవ్వితే
ఇల్లంతా మాటలు నేర్చిన మల్లెపందిరవుతుంది
మనం నవ్వితే
వీధులూ ఆఫీసులూ రోడ్లూ
తంబురాలూ-వీణలు-గిటార్లయిపోతాయి
మనకు నవ్వడం కూడా తెలుసని
మన పిల్లలు అబ్బురాల అలలై
ఆనందంతో మన కాళ్ళను చుట్టేసుకుంటారు.
నవ్వాలి - హాయిగా - తీయగా
పువ్వులు జలజలా రాల్చుకుంటూ
ఒక చెట్టు మన మధ్యనుండి
అలా నడిచిపోవడం నవ్వు.
ఆఫీసునుండొచ్చిన అమ్మను చూసి
ఉయ్యాల ఆనందంగా ఊగడం నవ్వు.
మాఘమాసం చలిలో
ఓ అనాథ శరీరం మీద
ఉన్నట్టుండి ఒక ఉన్నిశాలువా వాలడం నవ్వు
ఒక పలకరింపు నవ్వు - ఒక స్పర్శ నవ్వు
నవ్వు ఔషధం - నవ్వు అవసరం
చేప పిల్లల్నీ తామరపువ్వుల్నీ
ఒక్క సారే పోగొట్టుకున్న చెరువులా
ఎప్పుడూ అదోలా ఉండొద్దు
నవ్వాలి - ముచ్చటగా - మురిపెంగా.
అజ్ఞాత వీరుల్ని జోకొడుతున్న
అడవి పాట నవ్వు
నలుగురు కూర్చున్న చోట
మానవహక్కుల గీతం గొంతు విప్పినట్టు నవ్వాలి
ప్రేమగా చేయి చాపడం నవ్వు
అణకువగా భుజాలు పంచడం నవ్వు
నవ్వితే ఎగురుతున్న పక్షి
ఓ సారి వెనక్కి చూడాలి
పైకెగసిన కెరటం ఓ సారి ఆగిపోవాలి
నది దేహం మీద పడవరాసిన పాట నవ్వు
ఆకాశానికి పక్షి ఇచ్చే షేక్హ్యాండ్ నవ్వు
చెట్టు బుగ్గ మీద గాలి ముద్దు నవ్వు
ప్రకృతి విశ్వవిద్యాలయం
మనుషులకు ప్రసాదించే పట్టా నవ్వు
నవ్వడం చేతకాక పోతే
బతకడం చేతకానట్టే.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత వీరుల్ని జోకొడుతున్న
అడవి పాట నవ్వు-- మధ్యలో ఈ బుచికి వదిలేస్తే తక్కిన మాటలు బాగున్నాయి.

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...