13, మార్చి 2018, మంగళవారం

అన్నమయ్య

అన్నమయ్య వర్ధంతి సందర్భంగా .....
ఏ జన్మమున ఏమి తపముచేసి ఈ జన్మమున మన అన్నమయ్యగా ఆవిర్భవించాడో ఈ మహాత్ముడు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బ్రాహ్మణులు , భరధ్వాజస గోత్రులు అయిన లక్కమాంబ, నారాయణసూరి పుణ్యదంపతులకు 1408 వ సంవత్సరము విశాఖ నక్షత్రం, వైశాఖపూర్ణిమనాడు కడపజిల్లా తాళ్ళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. ఈయనతో మొదలుపెట్టి మూడు తరాలవరకూ అందరూ కవులే. గాయకులే. తెలుగులో మొదటి కవయిత్రి అయిన తాళ్ళపాక తిమ్మక్క అన్నమయ్య మొదటి భార్య'సుభద్రా కల్యాణం' కావ్యాన్ని మంజరీ ద్విపదలో రచించారు.
పదకవిత్వం కవిత్వం కాదని నిరసించే కాలంలో అన్నమయ్య వాటిని రచించి, పద కవితకు ఒక నిర్దిష్టతనీ, గౌరవాన్ని కల్పించారు. పైగా పండితులకంటే, ముఖ్యంగా పామరులను రంజింపజేసేందుకు జానపదుల భాషలో మేలుకొలుపు, ఉగ్గు, కూగూగు, ఏల, జోల, జాలి, ఉయ్యాల, కోలాట, సువ్వి, జాజర పదాలను, సామెతలనీ, జాతీయాలనీ పొందుపరుస్తూ, తేలిక భాషలో జనరంజకంగా రచించారు. పండితానురంజకంగా గ్రాంథిక, సంస్కృత భాషల్లో కూడా సంకీర్తనలను రచించారు. అందువల్లనే ఆరు శతాబ్ధాలు గడిచినా ఇప్పటికీ అన్నమయ్య కీర్తనలు పండిత పామరుల నందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేకాక వైరాగ్య మనస్తత్వాలకు ఆధ్యాత్మిక సంకీర్తనలనీ, శృంగార ప్రియులకు శృంగార కీర్తనలనీ, పిల్లలకనువయిన ఆటపాట కీర్తనలనీ, శ్రమజీవులకోసం జానపద గేయాలనీ రచించారు. అందుకే సమాజంలోని అన్నివర్గాల వారికీ అన్నమయ్య సంకీర్తనలు నేటికీ ఆనందదాయకాలే. మానవ జీవన ధర్మాలన్నీ తన రచనల్లో పొందుపరిచారు. అన్నమయ్య మొత్తం 32,000 వేల కీర్తనలను రచించారు. అందులో 14 వేల కీర్తనలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి.అన్నమయ్య కీర్తనల్లో అమృతత్వాన్ని ఆస్వాదించడానికి ఎందరో ప్రజలు ఆయన అనుగ్రహం కోసం అర్రులు చాచేవారు. అన్నమయ్య మనుమడు చిన్నన్న గ్రంథస్థం చేసిన 'అన్నమాచార్య చరిత్ర'లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మన అన్నమయ్యకు ప్రపంచవాసన, సంసార లంపటము, దాంపత్య సౌఖ్యము, భార్యాపుత్రులయందు మమకారము, దొరలతో చెలిమి వగైరాదులు ఏమీ తక్కువగా లేవు. అసలే జోడు చేడెల మగడు. కడుపునిండిన సంతానము. దేనికీ లోటులేని సంపూర్ణ జీవితము మన అన్నమయ్యది.

'శ్రీహరి కీర్తన నానిన జిహ్వ, పరుల నుతించగ నోపదు జిహ్వ' అంటూ రాజాస్థానాన్ని తిరస్కరించిన ఆత్మాభిమాని అన్నమయ్య. తిరుమలలో నిత్యకల్యాణ సంప్రదాయాన్ని ప్రారంభించింది అన్నమయ్యే అంటారు. ఆ చనువుకొద్దీ శ్రీనివాసుడు స్వప్న సంభాషణల్లో అన్నమయ్యని 'మామా' అని సంబోధించేవాడని చెబుతారు. వేంకటపతి ప్రతీ సేవలోనూ అన్నమయ్య సంకీర్తన ఉండవలసిందే. అన్నమయ్య కీర్తనలను వింటూనే ఊరేగుతాడు వేంకటేశ్వరుడు.
నా నాలికపై నుండి నానా సంకీర్తనలు - పూని నాచే నిన్ను పొగిడించితివి
వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడ - కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతే అయ్యా! అంటూ తన సంకీర్తనా ప్రతిభ స్వామి వరమే నని ప్రకటించాడు ఆచార్యుడు. 1503 దుందుభి నామ సంవత్సరం, ఫ్హాల్గుణ బహుళ ద్వాదశినాడు అన్నమయ్య అనంతకోటి బ్రహ్మాండ నాయకునిలో ఐక్యమయ్యాడు.
"హరి అవతారమీతడు అన్నమయ్య - అరయ మా గురుడీతడు అన్నమయ్యా.."
- పొన్నాడ లక్ష్మి

(వ్యాసం courtesy శ్రీమతి పొన్నాడ లక్ష్మి)

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...