తెలుగు ప్రేక్షకుడి హృదయంలో ఆమె ‘పగటిపూట చంద్రబింబం’.. ఆమె నవ్వితే నవరత్నాలే! చిత్రాల్లో వన్నెతగ్గని రాకుమారి, తెలుగు సినిమా స్వర్ణయుగ రారాణిగా రాణించి ఓ వెలుగు వెలిగింది కృష్ణకుమారి. ఓ శిల్పి చెక్కిన అందాలు ఆమెవి. ఆమె నటనా సామర్ధ్యం కంటే ఆమె ముఖారవిందం, అవయవ సౌష్టవం ఆమెను అగ్రస్థానంలో నిలిపి అగ్ర తారామణులయిన సావిత్రి, జమున చెంత నిలబెట్టాయి అంటే అతిశయోక్తి కాదేమో!
పశ్చిమ బెంగాల్ లోని నైహతిలో జన్మించిన కృష్ణకుమారి.. మరో ప్రముఖ నటి షావుకారుజానకికి చెల్లులు. చిన్నతనం నుంచి తన పెద్దక్క జానకిని విపరీతంగా అభిమానించే వారు. ఆమె ప్రభావంతోనే సినిమాల్లోకి వచ్చినట్లుగా చెబుతారు. కృష్ణకుమారి తండ్రి ఉద్యోగరీత్యా తరచూ బదిలీలు జరుగుతుండేవి.
దీంతో ఆమె చదువంతా రాజమండ్రి.. చెన్నై.. అసోం (నాటి అస్సాం).. కోల్ కత్తా (నాటి కలకత్తా) ప్రాంతాల్లో సాగింది. మెట్రిక్ అస్సాంలో చదివిన తర్వాత మద్రాసుకు వీరి కుటుంబం చేరింది. అక్కడే కృష్ణకుమారికి సినిమా అవకాశాలు వచ్చాయి.
ఆమెకు తొలిసారి సినిమా అవకాశం సినిమాటిక్ గా వచ్చింది. తల్లితో స్వప్న సుందరి సినిమా చూడటానికి వెళ్లిన కృష్ణకుమారిని.. నిర్మాత సౌందర రాజన్ గారి అమ్మాయి భూమాదేవి చూశారు. సినిమాహాల్లో కృష్ణకుమారిని చూసినంతనే.. తాము తీసే నవ్వితే నవరత్నాలు సినిమా కోసం ఎంపిక చేయాలనుకున్నారట. ఆ సినిమాలో అమాయకంగా కనిపించే కథానాయికి పాత్రకు కృష్ణకుమారి అచ్చుగుద్దినట్లుగా సరిపోతారని భావించారు. ఇంట్లో వారి అనుమతి తీసుకొని ఆ సినిమాలో నటించిన ఆమె.. తక్కువ కాలంలోనే ప్రముఖ హీరోయిన్ల జాబితాలో చేరారు.
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలెన్నింటిలోనో నటించి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న కృష్ణకుమారి తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించారు. 1951లో మొదలైన ఆమె సినీ జీవితం మకుటాయమానంగా సాగింది. ఎన్‌టి రామారావు, అక్కినేని, కాంతారావు, జగ్గయ్య వంటి నాటి అగ్ర నటుల సరసన విభిన్నమైన భూమికలు పోషించి ప్రేక్షకలోకాన్ని మెప్పించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కాంతారావులతో కృష్ణకుమారి నటించి జానపద చిత్రాలు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్నే చేశాయి. అగ్గిపిడుగు, బందిపోటు, తిరుపతమ్మ కథ, భార్యభర్తలు, కులగోత్రాలు, డాక్టర్ చక్రవర్తి, గుడిగంటలు, జమీందార్, కానిస్టేబుల్ కూతురు, పెళ్లికానుక వంటి ఎన్నో చిత్రాల్లో కృష్ణకుమారి తనదైన ముద్రవేశారు. కన్నడంలో రాజ్‌కుమార్, తమిళంలో శివాజీగణేశన్ వంటి నటులతో కృష్ణకుమారి నటించిన చిత్రాలు ఘన విజయం సాధించాయి.
ఆమె ముఖంలో కనిపించే తెలుగుదనం, తీరువుగా ఉన్న శరీరాకృతి, వాలుజడ, సోయగాలు ఆమెపై చిత్రీకరించిన కొన్ని పాటలు తెలుగుతెరకు వన్నెతెచ్చాయి. ఉదాహరణకు 'తొలికోడి కూసింది' పాట చిత్రీకరణ లో ఆమె అందాలు ఈ వీడియో క్లిక్ చేసి చూడండి. ఓ ప్రభాతవేళ లో సన్నివేశానికి ఈ పాటలో ఆమె ఆంగికం ఎంత చక్కగా అమిరిందో చూడండి.
సినిమాల్లో కథానాయికిగా రాణించిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను ప్రేమించి పెళ్లాడారు. వీరికి దీపిక అనే కుమార్తె ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి