16, మార్చి 2018, శుక్రవారం

వాలుజడ

నా పెన్సిల్ చిత్రం. కవిత courtesy శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి.
జడతో నా బంధం.
నాకు ఊహ తెలిసినప్పటినుండీ
నా వాలుజడ
నాకో ప్రత్యేక గుర్తింపు
నల్లగా నిగనిగ లాడుతూ
నాగుపాములా నాట్యం చేస్తూ
నా అడుగులకు అందాన్నిస్తూ
బారెడు పొడవున్న నా జడను
మెచ్చుకోలుగా చూసే కళ్ళు
ఆశ్చర్యం తో చూసే కళ్ళు
అసూయతో చూసే కళ్ళు
ఆరాధనగా చూసే కళ్ళు
నా వీపుకి గుచ్చుకోవడం
నాకు‌తెలుస్తూనే ఉండేది
గర్వం చిరునవ్వుగా మారి
నా పెదవులపై చిందులాడేది
పూలజడకు నాకు
సవరం‌ అక్కరలేదని
ఇరుగూ పొరుగూ పొగుడుతుంటే
పిల్లకెంత దిష్టంటూ
కల్లు ఉప్పుతో దిగదుడిచే
బామ్మను చూసి నవ్వుకోవడం
బాగా గుర్తుంది నాకు
నన్ను నేను సత్యభామలా
భావించుకునేలా చేసిన నా జడ
పెళ్ళి చూపుల్లోనే మా వారిని
నన్ను కట్టుకునేలా
కట్టి పడేసింది.
పెళ్ళయిన కొత్తల్లో
నా ప్రేమ బంధంలో
చిక్కుకునేలా చేసింది.
ఏళ్ళు గడిచాయి
ఎన్నో మార్పులొచ్చాయి
సంసారం,సంతానం
బరువులు,బాధ్యతలు
అశ్రద్ధ,ఆందోళన
తమ ప్రభావాన్ని ముందుగా
నా జడపైనే చూపించాయి.
తలస్నానం‌ చేసినప్పుడల్లా
తలలో‌ దువ్వెన పెట్టినప్పుడల్లా
కుచ్చులు కుచ్చులుగా
ఊడిపోతున్న
కురులను చూస్తున్న కొద్దీ
కలవరం కంటి నిద్ర కాజేసింది
పలచబడుతున్న జుట్టుకి తోడుగా
తొంగిచూస్తున్న తెల్లవెంట్రుకలు
గోరుచుట్టుపై రోకటి పోటులా
నా దిగులును ద్విగుణం చేశాయి.
రంగువేసి వయసును దాచటానికి
రకరకాల నూనెలు,షాంపూలతో
ఊడే జుట్టును కాపాడడానికి
నేను విన్న‌ చిట్కా వైద్యాలన్నీ
పాటించి చేసిన ప్రయత్నాలన్నీ
బూడిదలో‌పోసిన పన్నీరయ్యాయి
పీలగా,పిలకలా మారిపోయిన
నా జడను చూసి
ఇప్పుడెవ్వరి కళ్ళల్లోనూ
ఆరాధనాభావం లేదు.
మా ఆయన కళ్ళల్లోనూ
తగ్గిందేమోనని
మనసులో చిన్న‌అనుమానం
ఇప్పుడు నా గర్వం కూడా మాయమయ్యింది
అయినా, నా మనసు
ఓటమిని ఒప్పుకోదు.
అందుకే,ఇప్పుడెక్కడనా
అందమైన వాలుజడ
కనపడగానే
అసూయతో నా కళ్ళు మండకుండా
నాకునేనే చెప్పుకుంటుంటాను
బుద్ధిమంతురాలి జుట్టు
భుజాలు దాటదని.....
సింహాద్రి
9.3.2017.

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...