29, మార్చి 2018, గురువారం

ఎన్టీఆర్


కృష్ణుడిగా ఎన్టీఆర్‌ పనికిరాడన్నారు!

ఎన్టీఆర్ - ఆ మూడక్షరాల పేరే సినీ జగత్తులోనూ, రాజకీయాలలో కూడా ఓ సంచలనం. ఈ పేరు తెలియని తెలుగు గడప లేదంటే అతిశయోక్తి కాదు. పౌరాణిక పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఒకప్పుడు కృష్ణుడిగా ఎన్టీఆర్‌ పనికిరాడన్నారు! ఇప్పుడు వారి తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించారు. చదవండి ఈనాటి ఈనాడు దినపత్రికలో ఆ మహనీయుని గురించి ఏమి రాసారో .. !


"తెలుగువారికి రాముడు, కృష్ణుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. తెలుగుతెరపై ఎందరో ఆ పాత్రల్లో నటించినా, ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మాత్రం ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కృష్ణుడిగా దాదాపు 33సార్లు తెరపై కనిపించి రికార్డు సృష్టించారు. అసలు కృష్ణుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా ఆయన పలికించే హావభావాలు ఎవరూ మర్చిపోలేరు. మరి అంతటి పేరు తెచ్చిన ఆ పాత్రను ఎన్టీఆర్‌ వేస్తే తీవ్ర విమర్శలు పాలయ్యారు. అవి ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ను ప్రారంభించిన తొలినాళ్లు. అప్పుడప్పుడే వరుస అవకాశాలను దక్కించుకుంటున్న రోజులవి. ఆ సమయంలో ‘సొంత ఊరు’ అనే సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్‌ కృష్ణుడి పాత్రను వేశారు. అయితే ఆ పాత్రకు ఆయన సరిగా నప్పలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. చూడడానికి ఆ వేషం బాగోలేదు. దీంతో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా పనికారాడన్నారు. దాన్ని ప్రేక్షకులు వ్యతిరేకించి తెరను చించెయ్యడానికి కూడా సిద్ధపడ్డారు. చిత్రం ఘోర పరాజయం పొందింది. ఆ అనుభవంతో ఎన్టీఆర్ కూడా శ్రీకృష్ణుడి పాత్రకు దూరంగా ఉంటూ వచ్చారు. బాల కృష్ణుడికి వాడే ఆహార్యం తనకి వాడటం వల్లే, ప్రేక్షకులకి అలాంటి భావన కలిగిందంటూ ఎన్టీఆర్ ఈ విషయంపై తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే ‘మాయాబజార్’ చిత్రంలో కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్‌ను కె.వి.రెడ్డి ఎంచుకున్నారు. దాంతో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమ నుంచి ప్రతిఘటన ఎదురైంది. కెవి రెడ్డి, చక్రపాణి తనను ఆ పాత్రకు ఎన్నుకున్నపుడు కూడా ఎన్టీఆర్‌ సందేహం వ్యక్తం చేసారు. ‘సొంత ఊరు’లో చిన్న పాత్రకే అంత అల్లరి చేసిన ప్రేక్షకులు, ఇందులో పూర్తి నిడివిగల కృష్ణుడి పాత్రను వ్యతిరేకిస్తారని చెప్పి చూశారు. అయినా దర్శక, నిర్మాతలు ససేమిరా ఒప్పుకోక అలంకరణ, ఆహార్యం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్టీఆర్‌తో ఆ పాత్రని వేయించారు. అద్భుతంగా వచ్చింది. శ్రీకృష్ణుడి పాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. అప్పటి నుంచి కృష్ణ పాత్ర వేయాలంటే ఎన్టీఆరే వెయ్యాలనడం మొదలైంది.


ఆహార్యం నుంచి అభినయం వరకూ కృష్ణుడికి ఒక శైలిని సృష్టించారు ఎన్టీఆర్‌. కృష్ణుడు వయ్యారంగా నడవడం, సమ్మోహనంగా నవ్వడం, కనులతోనే భావాలు పలికించడం, శాంత స్వభావంతో వ్యవహరించడం, గోపికల వద్ద శృంగారం ఒలకపోయడం వంటి హావాభావాలను అద్భుతంగా పండించడంతో విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. కృష్ణుడంటే ఎన్టీవోడు ,ఎన్టీవోడు అంటే కృష్ణుడే అనే భావన ప్రేక్షకులకు ఏర్పడింది. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘శ్రీకృష్ణావతారం’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘దానవీర శూరకర్ణ’, ‘శ్రీకృష్ణ సత్య’ తదితర చిత్రాల్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ అలరించిన తీరు అపూర్వం."

నా మిత్రురాలు సింహాద్రి జ్యోతెర్మయి ఈ మహా నటుడు పోషించిన కొన్ని పౌరాణిక పాత్రలు, వాటిని పోషించిన తీరుని ప్రశంసిస్తూ ఓ సీస పద్యం కూడా రాసింది. చదవండి.

నేనూ ఆయన పౌరాణికాలకు పిచ్చ ఫాన్ ని.
అందుకే ఈ సీసం

రామయ్యలోనున్న కోమలత్వము జూప
రామరావుకు సరి రామరావె
శ్రీ కృష్ణు రూపులో చిద్విలాసము జూప
రామరావుకు సరి రామరావె
అభిమానధనునిలో ఆభిజాత్యము జూప
రామరావుకు సరి రామరావె
చేడియ కుల్కులన్ పేడియందున జూప
రామరావుకు సరి రామరావె

ఆ.వె.
దానకర్ణుడైన ,దశకంఠుడైననూ
భీమసేనుడైన, భీష్ముడైన
భక్తుడైన గాని, భగవంతుడే గాని
రామరావుకు సరి రామరావె.

సింహాద్రి జ్యోతిర్మయి
28.3.2017.

కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...