25, ఫిబ్రవరి 2021, గురువారం

శ్రీవారికి ప్రేమలేఖ


 పోస్ట్ అంటూ  గావు కేక వినపడగానే పరుగులు తీసే వయసు దాటీ యెన్ని వత్సరాలు అయ్యాయో ...అనుకుంటూ ఉత్తరం అందుకున్నాను ....


ప్రియమైన మీకూ  ... ప్రేమతో నేను వ్రాస్తున్న మొదటి ఉత్తరం .....

క్లుప్తంగా ఆనాడు మీరు వ్రాసిన   క్షేమసమాచారాలు రేపటి జాబు కోసం నన్ను యెదురు తెన్నులు చూసేలా చేసేవి.  

మీరు వ్రాసిన ఉత్తరాలు  యెన్నో సార్లు చదివించుకుంటూ మురిసిపోయేదానిని.

మన పెళ్ళి కోసం ఎన్నెన్ని  కలలు కన్నాను.  నువ్వు నాకో  ఉత్తరాం వ్రాయవూ అని మీరు  బ్రతిమాలుతున్నప్పుడు నా  చేతులకి సంకెళ్లు వేసినట్లు అయ్యేవి.  


       ఆడపిల్లకి చదువులు  ఎందుకూ ... ఊళ్ళు ఏలీ ఉద్యోగాలు చేయాలా అని మా మూలనున్న ముసిల్ది నాకు అక్షరం ముక్క కూడా రాకుండా చేసిందనీ యెలా చెప్పేదీ. రాయడానికి సిగ్గు పడుతున్నాను అనుకున్న మీ నమ్మకాన్ని వమ్ము చేశాను ఆనాడు.


మన పెళ్ళి ముచ్చట్లు తీరకుండానే చంటోడు నా కడుపున పడ్డాడు .

తీరికలేని సంసార సాగరం లో నాకు ఉత్తరం ముక్క వ్రాయడం  రాదన్న సంగతి  మీకు యేనాడూ  చెప్పలేకపోయాను.


నేను వూరు వెళ్ళితే ఉత్తరం వ్రాస్తావు కదూ అంటున్న ప్రతీ సారి నన్ను తీసుకుని వెళ్లకుండా మీరు  యెక్కడికి వెళ్ళగలరూ  అంటూ తప్పించుకుని తిరిగాను.


చంటి వాడికి ఆరోనెల వచ్చిందో లేదో మళ్ళీ వేవిళ్ళు మొదలయ్యాయి .

నా పెళ్లయ్యాక నన్ను చూసే వాళ్ళు ఎవ్వరూ లేరని తెలిసీ పురుడూ పోసీ మీరే  నన్ను కంటికి రెప్పలా కాపాడు కున్నారు . యీ సారి మీ పోలికలతో పుట్టిన అమ్మాయిని చూసీ కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు . కానీ యెక్కడా  ఉత్తర , ప్రత్యుత్తరాలు   మాటే మన మధ్యలో  రాలేదు.

కాల గర్భం లో రోజులూ  , నెలలూ , సంవత్సరాలు గడచిపోయాయి . నా మగపిల్లాడితో పాటు ఆడపిల్లని కూడా  సమానం గా చదివించుకున్నాను . పిల్లలకి పెళ్లిళ్లు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేసారు . యింత వరకూ నేను మీకు  ఒక్క ఉత్తరం రాసే అవసరమూ  రాలేదూ . మన పెళ్ళి అయిన యిన్నేళ్ళకి  అవసరార్ధం మీరు నన్ను  నా కొడుకు దగ్గర వదిలీ  కూతురుని వెంటపెట్టుకునీ  ఉద్యోగం లో చేర్పించే నిమిత్తం  కొన్ని రోజులు  తనకి తోడుగా వుండాలనీ వెళ్ళారు .   

మీలా  కొందరు  తల్లిదండ్రలు అయినా    ఆడపిల్లలకి   కూడా   చదువూ , సంస్కారం   వుండాలనీ  ఆనాడు   అలోచించి  వుంటే ఈ యెక్కువ తక్కువలూ ,  ఈ అహంకారాలూ ఈనాడు వుండేవి కావు.

కాలం మారింది చట్టాలూ  , న్యాయాలూ యిద్దరికీ సమానత్వాన్ని కలిపిస్తున్నాయి. 

 నా కూతురు  ఒకనాడు నాకు నేర్పిన ఈ  అక్షరాల వలనే  ఈనాడు నేను  అన్ని విషయాలూ  తెలుసుకో గలుగుతున్నాను .    దూరాలు దగ్గర చేర్చే  సాధనాలు యెన్ని వచ్చినా , మన   తియ్యని జ్ఞాపకాలు అన్నీ అక్షరాలుగా పేర్చి   మీకు ఉత్తరాల మాల వెయ్యాలనీ   యెన్నో సంవత్సరాలుగా  యెదురు చూస్తున్నాను. అవకాశం రానే వచ్చింది .

మీ ఆరోగ్యం జాగ్రత్త  . 

మీ రాకకోసం వెయ్యి కళ్ళతో యెదురు చూస్తూ ఉంటాను.  


ప్రేమతో ...


♥️మీ ... చిట్టి♥️

Pvr Murty అంకుల్  చిత్రానికి  "చిట్టి"  ఉత్తరం ....

✍️లక్ష్మీ అయ్యగారి

19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

కనులు కనులు ఊసులాడే




🌹 కనులు కనులే ఊసులాడే కాముడేదో చేసెనే 
     మనసుపొరలో అలజడేదో  తీపిగాయం చేసెనే  

🌹 పలుకు వినకే క్షణము యుగమై వేచిచూసే మౌనమే 
     దరికిచేరగ  కనులుమెరిసీ కోరికేదో మెదిలెనే   

🌹మనసులోనా బొమ్మనీదే గీసి కనులే నవ్వేనే 
     నిముసమైనా కానరాకా కంటినీరే కురిసెనే    

🌹వలపుచూపి మాయమైతే ఓపలేనుర  ప్రియతమ
    నీవువచ్చే దారిగాచీ వెతికి కనులే అలసెనే   

🌹 ప్రణయగాథ అతిశయమ్మని నమ్మలేదుగ ఎప్పుడూ 
     కోరుకుంటే  వలపు ఊబే మునుగుతుంటే తెలిసేనే 

🌹 ప్రేమలోనే  శక్తివుందా క్షమాగుణమే నేర్పగ 
      దక్కలేదనీ చింతవలదని ఆశతోనే నిలచెనే    
  
🌹వలపు చివురే మరలవేసి నీరాకతో పూసెనే 
     మిన్నునంటే సంతసాలే నిన్నేవరమై పొందెనే
 

కళాతపస్వి శ్రీ కే. విశ్వనాథ్


 (My pencil sketch)



*తెలుగుజాతి కళాతపస్వి*

భారతీయ సంస్కృతి,

హిందూ సాంప్రదాయంలో దేవాలయాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కుగ్రామంలో కూడా దేవాలయం మానవజీవన ధర్మానికి వేదమంత్రమైంది.ప్రాణవాయువులా సేదతీర్చే ఉత్కృష్టమైన మహిమ దేవాలయానికి వుంది.అటువంటి దేవాలయంలేని ఊరు పాడుబడిన ఊరుతో సమానం..

  అలాగే తెలుగు సినీ చరిత్రలో మన ముందుతరంవారు సమాజవికాసానికి తీసిన చిత్రాలు మహోజ్వలంగా ప్రేక్షకుల హృదయాలను  ప్రకాశవంతంచేశాయి అనటంలో ఏమాత్రం సందేహంలేదు...కానీ రాను రాను తెలుగు సినిమా రూపురేఖలు మారిపోతూ ప్రేక్షకుడికి భారతీయత,తెలుగుదనం అంటే ఇదేనా అని ప్రశ్నార్ధకంగా  నిల్చి కలవరపెట్టాయి..తెలుగు సినిమాకు తిరోగమనం మొదలయ్యింది,దేవాలయంలేని ఊరులా ఒక ఉనికిని పవిత్రతను కోల్పోతోంది అని కలవరపెడుతున్న తరుణంలో...

అదిగో అప్పుడే విశ్వనాధుడి నవశకం"సిరిసిరిమువ్వలతో"సవ్వడి చేస్తూ కళలకు ఆరాధ్యదైవమైన శంకరుడికి ఆభరణాల వంటి   సినిమాల పరంపరతో మొదలయింది..

    ఒక జాతి చరిత్రను తెలిపే కళల సమాహారమయినాయి ఆయన చిత్రాలు..

  అసలు ఇటువంటి కళాత్మక చిత్రాలకు ఆయన తొలిచిత్రం *ఆత్మగౌరవం*లోనే సూచనప్రాయంగా అంకురార్పణ చేశారు..

 భారతీయ ఆత్మ రూపురేఖలకు మూలస్థంభాలు మనో వికాసానికి దోహదపడే కళలు, ఆధ్యాత్మికత, సంస్కృతి సంప్రదాయాలు,నాగరికత మొ...

     ఇక కళలనేవి వెండితెర మీద రూపుదిద్దుకోవటంతో నవశకం ప్రారంభమైంది అని భావిస్తే విశ్వనాథుని ప్రవేశంతో 

స్వాతి కిరణాలతో ప్రకాశించింది.

     ఈ శకానికి కళాతపస్వి..

     విశ్వనాధ్ తెలుగుజాతికి పరిచయం చేసిన కవులు ఇద్దరు.సాహిత్య సరస్వతి ఉఛ్చ్వాస నిశ్వాసాలల ఒక వేటూరి,ఒక సీతారామ శాస్త్రీ.వారికలాల వెలుగుతో  సినీ సాహిత్య వనాన్ని తమరచనా సౌరభాలతో  నింపారు.ఆయన చిత్రాల్లోని గీతాలు ప్రణవనాదంలా ధ్వనించాయి.

      ఎన్నో ప్రయోగాలకు,ఎన్నో అభ్యుదయభావాలకు ఆయన సినిమాలు తార్కాణంగా నిలిచాయి.ఎన్నో అవార్డులు,మరెన్నో పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో సగౌరవంగా సగర్వంగా నర్తించాయి...

    తెలుగుజాతి అదృష్టం విశ్వనాథుడు,

తెలుగుజాతి గౌరవం విశ్వనాథుడు,

తెలుగుజాతి గర్వము విశ్వనాథుడు 

అంతెందుకు తెలుగుజాతి కీర్తిపతాక మన కాశీనాధుని విశ్వనాథుడు...

       ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ భారతజాతికి  కాశీలోని విశ్వనాధుడు ఒక్కడే,అలాగే తెలుగు సినిమారంగానికి మంచి సినిమాలతో కీర్తిప్రతిష్టలను సాధించిన"కాశీనాధుని విశ్వనాధుడూ"ఒక్కడే...

     ఈరోజు ఆయన పుట్టినరోజు...ఆయన ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా హాయిగా ఉండాలని ఆకాంక్షిస్తూ...

విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...( చక్కని విశ్లేషణ ఇచ్చిన ప్రముఖ విశ్లేషకరాలు శ్రీమతి విజయదుర్గ గారికి ధన్యవాదాలు)

మిత్రులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు నా చిత్రానికి ఇచ్చిన పద్య స్పందన. వారికి ధన్యవాదాలు. 


ఆ.వె
శంకరాభరణము చక్కగా చిత్రించి
భారతీయ కళల వన్నె దెల్పి
వెలిగె దర్శకునిగ విశ్వనాధుడు, తెల్గు
చిత్రసీమ మణిగ చిరము నిలిచె
సకల కళల యందు సంగీత, నృత్యము
విలువ చాటిచెప్పి తెలుగు సీమ
విశ్వనాధు శైలి విశ్వమంతయు వెలుగ
చిత్ర దర్శకునిగ చిరము గాను


18, ఫిబ్రవరి 2021, గురువారం

మధుబాల - The Venus of India


మధుబాల, హిందీ చిత్రజగత్తును ఏలిన ఓ సౌందర్యరాశి.  నా pencil చిత్రాలు.






వెలుగు చీకటులు....కలబోసిన ఈ కాలము చేతిలో...
కీలు బొమ్మలం!
భావన లోనే జీవనమున్నది. మమతే జగతిని....
నడుపునది....
మమతే జగతిని నడుపునది!
అవునా?! నిజమేనా!?
అసలు ప్రపంచం లో ప్రేమెక్కడుంది? ముఖ్యంగా...అది మనుషుల మనస్సుల్లో...అసలుందా అనిపిస్తుంది!
ప్రేమికుల రోజున పుట్టిన మధుబాల కు ఈ అనుమానం కలగడమే వింతగా అనిపిస్తుంది!
స్వార్థం....ఈ మానవ హృదయాలెప్పుడో...దీనితో నిండిపోయాయి!
మమత....ప్రేమ...ఈ జగత్తును నడుపుతున్నాయంటారు! అంతా బూటకమే!
మానవ సంబంధాలన్నీ....ఆర్థిక సంబంధాలే!
అసలు కించిత్తు కూడా అనుమానం లేదు.
బొంబాయి బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న మధుబాలకు...అర్థరాత్రి అవుతున్నా....నిద్ర రాలేదు.
ఎన్నో సంఘటనలు కళ్ళ ముందు ఇంకా....ఈ మధ్యనే జరిగినట్లున్నాయి!....
ఎందుకని...జీవితం...ఇంత వేగంగా మలుపులు తిరుగుతోంది....నా విషయంలో!
************
మొన్న మొన్నే 1942 లో బాలనటిగా....బసంత్ లో యాక్ట్ చేసినట్లు...రాజ్ కపూర్ తో హీరోయిన్ గా 1947 లో నీల్ కమల్ డెబ్యూ...
ఇక యూసఫ్ ఖాన్(దిలీప్ కుమార్) తో ప్రేమలో పడడం
తండ్రి...ససేమిరా అనడం!....
1954 లో గుండె జబ్బు విషయం...తెలియడం. అయినా సరే...మూవీస్ నిరంతరంగా చేస్తూనే తండ్రి తో సహా కుటుంబాన్ని మొత్తం పోషిస్తూ ఉన్నా.....
బ్రతుకెప్పుడు..అంతమౌతుందో!...తెలియని నిస్సహాయత...అనిశ్చితి...అబ్బా....ఎలా పడ్తుంది నిద్ర!?
దిలీప్ జీ ప్రేమ వ్యవహారం తెలిసేది కాదు తండ్రికి.... ఆ ఇన్సానియత్(1955)...ప్రీమియర్ షో కు దిలీప్ తో కలిసి వెళ్ళకపోయుంటే!
అసలు నువ్వా మూవీలో యాక్ట్ చేయలేదుగా...ఎందుకెళ్ళావో నాకు తెలీదనుకున్నావా?...ఆ దిలీప్ కుమార్ తో నిఖా జరగని పని.....అంటూ తండ్రి వార్నింగ్!
ఓ స్వేఛ్ఛ లేదు....నాకు నచ్చిన వాడిని పెళ్ళాడ కూడదు! నేనో డబ్బు సంపాదించే యంత్రాన్ని మాత్రమే! సంపాదించి...సిస్టర్స్ ను....తండ్రిని పోషించడమొక్కటే....తన పని!
అందంలో అప్పట్లో వీనస్ ఆఫ్ ఇండియా గా పేరొందిన మధుబాల అంతరంగ మథనం ఇది!
**********
ప్రేమికుల రోజున పుట్టి..... వీనస్ ఆఫ్ ఇండియాగా పేరొంది...వెండితెర మీద ఒక జ్వాలగా వెలిగిన అరుదైన అందం .....మధుబాల.
ఆమె అందానికి...స్త్రీలు ఈర్ష్యపడరు! వారు కూడా పురుషులతో సమంగా ఆరాధిస్తారు!
1942 లో 9 ఏళ్ళకే.... బసంత్ తో బాలనటిగా ప్రవేశించింది ముంతాజ్. అదే తన అసలు పేరు. వరుసగా 4 చిత్రాల్లో బాలనటిగా యాక్ట్ చేసేసరికి...నాన్న అతౌల్లా ఖాన్ కు ఆశ పుట్టి....
డిల్లీ నుండి బొంబాయికి మకాం మార్చి... ఘీ మండి లో ఓ చిన్న ఇంట్లో 6 గురు పిల్లలతో ఉండేవాడు. ఆయనేం సంపాదించడు. అందరికీ...మధుబాలే ఆధారం!
ఏప్రిల్ 14, 1944 లో డాక్ ఎక్స్ప్లోషన్ లో ఉంటున్న ఇల్లు పూర్తిగా కాలిపోతే.....ముంతాజ్ స్నేహితురాలింట్లో 6 నెలలు తల దాచుకుంది కుటుంబం మొత్తం.
క్రమేణా...మూవీస్ పెరిగాయి. దేవికారాణి...ముంతాజ్ పేరును మధుబాల గా మార్చింది!
1947లో కిదార్ శర్మ అనే నిర్మాత మధుబాల(14 ఏళ్ళు)ను హీరోయిన్ గా...రాజ్ కపూర్ ను హీరోగా(ఇద్దరికి డెబ్యూ) తీద్దామనుకుంటే...ఫైనాన్షియర్ తప్పుకున్నాడు. కిదార్ శర్మ తనే సొంతంగా తీశాడు. అదే నీల్ కమల్(1947) మూవీ.
***********
ఇక ఫామిలీకి బంగారు బాతు అయ్యింది మధుబాల! అన్నీ రెస్ట్రిక్షన్స్. తండ్రి డేగలా కాపలా! తనకంటూ ఇష్టాఇష్టాలు ఉండకూడదు!
మనీ ఎర్నింగ్ మెషిన్ అయ్యింది.బొంబాయి సినీరంగంలో ఎన్నో మగ పుంగవులు...ఎన్నో వెకిలి చూపులు...ఎన్నో ప్రపోజల్స్....ఇవన్నీ...తన చిరునవ్వుతో ఎదుర్కుంటూ...సాగిపోయింది.
ఏఏ మూవీస్ చేయాలో...తండ్రే నిర్ణయిస్తాడు!
బాల నటీమణులుగానే మిత్రులయ్యారు మధుబాల & మీనాకుమారి. ఇద్దరి జీవితాలు ఒకేలా అంతమయ్యాయి!
దిలీప్ కుమార్ తో ప్రేమాయణం తండ్రి పసిగట్టి.....ఖచ్చితం గా గీత గీశాడు. దిలీప్ తో అసలు సినిమాలు ఒప్పుకునేవాడు కాదు!
1954 లో బహుత్ దిన్ హుయే...షూటింగ్ మద్రాస్ లో....కళ్ళు తిరిగి పడిపోవడం...నోటి వెంట రక్తం రావడం....అప్పుడు తెలిసింది. మధుబాలకు వి.ఎస్.డి...అనే గుండె జబ్బు పుట్టుకతోనే ఉందని. ఇప్పుడైతే...ఈజీగా ఆపరేట్ చేస్తారు. కానీ...అప్పటి పరిస్థితి వేరు !
దిలీప్ తో ప్రేమ బెడిసి కొట్టాక....తన జబ్బు తండ్రికి తెలిసాక మాత్రం...తనకు ఫ్రీడం దొరికింది.
అయినా బి.ఆర్ చోప్రా ..నయాదౌర్ మూవీ కోసం దిలీప్ ప్రక్కన మధుబాలను బుక్ చేస్తే....తండ్రి ఒప్పుకోలేదు.
దాంతో...దిలీప్...మధుబాల ల మధ్య మాటలు కూడా కరువైపోయాయి!
************
హాల్ కైసా హై జనాబ్ కా.....1958 లో చల్తీ కా నాం గాడీ మూవీ షూటింగ్ లో కిషోర్ కుమార్ తో ప్రేమలో పడ్డది మధుబాల.
ఒక విధంగా చెప్పాలంటే...దిలీప్ మీద కోపంతో....కిషోర్ మీద ఇష్టం పెంచుకుంది. అప్పటికే పెళ్ళైన కిషోర్ కుమార్...మతం మారి ....మధుబాలను పెళ్ళాడాడు.
1960 లో ముఘల్-ఇ- అజాం....రిలీజ్ అయి రికార్డ్ సృష్టించింది. షోలే వరకు ఆ రికార్డ్ అలాగే ఉంది.
ఇద్దరికీ పెద్దగా మాటలు లేకపోయినా...తెరమీద ప్రేమ బాగా పండించారు!
ఆరోగ్యం క్షీణిస్తుండటంతో లండన్ కు తీసుకెళ్ళారు. సర్జెరీ వద్దని....రెస్ట్ తీసుకోమని....2 సంవత్సరాలే టైం ఇచ్చారు ....బ్రతకడానికి!...
అయినా...అలాగే నటిస్తూనే ఉంది. 1960 తరువాత కూడా ఓ 4 మూవీస్ చేసారు. షూటింగుల్లో...దగ్గు, ఆయాసం...రక్తం పడటం....సాధారణమైపోయాయి. కానీ....ఇవేవీ కూడా...తెర మీద మధుబాల లో కనిపించేవి కావు!
కిషోర్ రాకపోకలు తగ్గాయి. నెలకో..2 నెలలకో ఓ సారి వచ్చేవాడు. మెడికల్ బిల్స్ అవీ పే చేసి...రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయేవాడు!
దీనికి కిషోర్ ను నిందించడం కూడా తప్పే. ఇప్పుడు కిషోర్ కు నా పైన ప్రేమ కంటే జాలే ఎక్కువుంది.
అయినా ప్రేమంటే...ఓ బండరాయా!? ఎప్పుడూ అలాగే...అక్కడే ఉండడానికి. దానికీ ప్రాణం ఉంటుంది.
***********
1965లో బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు...చూసిన వారికి...ఆమె సన్నగా...పేల్ గా...ఆక్సిజెన్ పెట్టుకున్న దేవత లాగే కనిపించింది. తన అందం అలాంటిది మరి....ఏంజలిక్ బ్యూటీ.
67 సినిమాలు చేసినా...అందులో గొప్పగా ఆడినవి 17 మాత్రమే! సినిమాలు ఎన్నుకునే స్వతంత్రం తనకు లేదు మరి. ఎవరు డబ్బులెక్కువ ఇస్తే...వారికి తండ్రే ఓకె చేస్తాడు!
ఒక చక్కటి బాలనటి ...ముంతాజ్....
మనోహరమైన అందగత్తె ....మధుబాల.....
శత్రువుల గుండెలను సైతం కరిగించే దరహాసిని....
తెరపై...మత్తుమందు చల్లి..మైమరిపించిన ముగ్ధ.....
ప్రేమికులరోజున పుట్టి...ప్రేమకు నోచుకోని ప్రేమ పూజారిణి....
మధుబాల!
ఫిబ్రవరి 14- 1933 న జన్మించిన ధ్రువతార ఫిబ్రవరి 23- 1969 న తుది శ్వాస విడిచి....వినీలాకాశంలోకెళ్ళింది.
36 ఏళ్ళకే ....ఎంతో సాధించింది. ధృవతారగా నిలిచింది.

(మంచి వివరాలు అందించిన డా. ప్రసాద్ కె.వి.యస్ గారికి ధన్యవాదాలు)

 

11, ఫిబ్రవరి 2021, గురువారం

డా. సి. ఆనందారామం.. నివాళి


 ఆనందరామం  ఇకలేరు!

ప్రముఖ రచయిత్రి సి.ఆనందరామం ఇవాళ ఉదయం హైదరాబాద్ లో  గుండెపోటుతో కనుమూశారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త రామం పేరు తన పేరు చివర జోడించి రచయిత్రి సి.ఆనందారామంగా తెలుగు సాహిత్య లోకం లో రాణించారు. ఆగస్టు 20వ తేదీ 1935వ సంవత్సరం  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలు  రాశారు. ఆమె రాసిన నవల ఆత్మబలి ...సంసార బంధం సినిమాగా, అదే నవల జీవన తరంగాలు టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతల కోవెల నవలను జ్యోతి సినిమా గా తీశారు. ఏలూరులోని ఈదర వెంకట రామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించి, ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పూర్తి చేశారు.  సి.ఆర్.ఆర్.కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. 1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాంమార్చారు .1958-'60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చేశారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గైడ్ గా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీ విరమణ పొందారు.

గృహలక్ష్మి స్వర్ణకంకణము - 1972

మాలతీ చందూర్ స్మారక అవార్డు -2013, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు - 1979 (తుఫాన్ నవలకు), మాదిరెడ్డి సులోచన బంగారు పతకం - 1997, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు - రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, 

గోపీచంద్ పురస్కారం,

అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి!  ఆమె మృతితో  ఒక శకం ముగిసింది!  శాశ్వతంగా గుర్తుండిపోయే రచనలు చేసిన ఆనందరామం గారికి అశ్రు నివాళి🙏

- డాక్టర్ మహ్మద్ రఫీ

రావి కొండలరావు.. నివాళి




 ప్రముఖ నటుడు , దర్శకుడు, రచయిత, నాటకం.. సినీమా.. టీవీ.. పత్రికలు..  ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం కలిగిన రావి కొండలరావు జయంతి సందర్బంగా నా చిత్ర నివాళి. (Pencil sketch).                              వీరి గురించి నేను సోషల్ మీడియాలో సేకరించిన మరిన్ని వివరాలు. : 

ప్రముఖ నటుడు రచయిత పాత్రికేయుడు నిర్మాత దర్శకుడు శ్రీ రావి కొండలరావు గారిని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం ....

రావి కొండలరావు గారు(ఫిబ్రవరి 11, 1932 - జూలై 28, 2020) నటుడు దర్శకుడు రచయిత పాత్రికేయుడు నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి. దాదాపు 600 చిత్రాలలో నటించారు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటి.

రావి కొండరావు 
జననం ఫిభ్రవరి 11, 1932 సామర్లకోట 
మరణం జులై 28, 2020 (వయస్సుగల 88)
బేగంపేట
మరణ కారణం గుండెపోటు 
జాతీయత భారతీయుడు 
వృత్తి పాత్రికేయుడు నటుడు దర్శకుడు రచయిత 
ఆర్గనైజష సుకుమార్ ఆర్కెస్ట్రా 
నోటబుల్ వర్క నాగవల్లి నుండి మంజీరా వరకు 
జీవిత భాగస్వాములు రాధాకుమారి ​(ఎం. 1960⁠–⁠2012)​ పిల్లలు .రావి వెంకట శశికుమార్ 
తల్లిదండ్రులు 
రావి చిదంబరం (తండ్రి) 

1932 ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు. 

ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 1958లో ?శోభ? చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా పొందారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి పొందారు. ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన ?దాగుడుమూతలు? సినిమాలో డాక్టరు వేషం లభించింది. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా పొందారు. రాధాకుమారి జన్మించినది విజయనగరంలో. ముందు ?ముగ్గురు వీరులు? సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు రాధాకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం తేనె మనసులు. 

చిత్ర సమాహారం 

నటుడిగా రావి కొండలరావు నటించిన సినిమాల జాబితా 

కింగ్ (2008)- అతిథి పాత్ర 
మీ శ్రేయోభిలాషి (2007) 
నిన్నే ఇష్టపడ్డాను (2003) 
శ్రీ కృష్ణార్జున విజయం (1996) 
మేడమ్ (1993) 
బృందావనం (1992 సినిమా) 
పెళ్ళి పుస్తకం (1991) 
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం (1991) 
చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989) 
సాహసం చేయరా డింభకా (1988) 
చంటబ్బాయ్ (1986) 
రుద్రకాళి (1983) 
మంత్రి గారి వియ్యంకుడు (1983) 
ఊరికిచ్చిన మాట (1981) 
రాధా కళ్యాణం (1981) 
సొమ్మొకడిది సోకొకడిది (1978) 
ఇదెక్కడి న్యాయం (1977) 
ఇల్లు - వాకిలి (1975) 
అందాల రాముడు (1973) 
దసరా బుల్లోడు (1971) 
శ్రీమంతుడు (1971) 
శ్రీకృష్ణ విజయం (1970) 
ప్రేమకానుక (1969) 
వరకట్నం (సినిమా) (1968) 
వింత కాపురం (1968) 
ప్రేమించి చూడు (1965 సినిమా) (1965) 
శోభ (1958 సినిమా) (1958) 

రచయితగా

భైరవ ద్వీపం (1994) (సంభాషణలు) 
బృందావనం (1992 సినిమా) (సంభాషణలు) 
పెళ్ళి పుస్తకం (1991) (కథ) 
చల్లని నీడ (1968) (రచయిత) 

నిర్మాతగా

శ్రీకృష్ణార్జున విజయం (1996) (పర్యవేక్షక నిర్మాత) 
భైరవ ద్వీపం (1994) (పర్యవేక్షక నిర్మాత ) 
బృందావనం (1992) ( పర్యవేక్షక నిర్మాత ) 

సాహిత్యరంగం 

ఇతడు సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి జ్యోతి రచన యువ ఉదయం పుస్తకం విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు పొందారు. హాస్యరచయితగా గుర్తింపు పొందారు. సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశారు. ఇతడు వ్రాసిన కొన్ని కథలు 
అనురాగం 
అభిప్రాయం 
అభిమాన పుస్తకం 
అసంభవామి యుగేయుగే 
ఆడదిక్కు 
ఆత్మహత్య 
ఆవు పులి 
ఇదీ ఓ కథే 
ఎదురుచూడని వరుడు 
ఏడో చేప 
కంగారూ కనకంగారూ 
కంపార్టుమెంటాలజి 
కనబడుట లేదు 
కబుర్లూ... 
కలం స్నేహం 
కలలో వినాయకుడు 
కోతితోక 
గయ్యాళి 
చంద్రశేఖరుని కథ 
చావుల కొండ 
చిక్కుడుకాయలూ... 
చిత్రఖేదం 
చిత్రమోదం 
చిత్రలాభం 
తప్పిపోయినాడు 
తెలుగుమాస్టారి స్వగతం 
తొందరపాటు 
తోడేలు-గొర్రెపిల్ల 
దాహంగల కాకి 
దిదృక్ష 
దొంగ 
నాణెం 
నిరుద్యోగ పర్వం 
నీతి 
నేరపరిశోధన 
పండితుడు-రాజు 
పాము-సన్యాసి 
పాలు-నీళ్లూ 
పిరికిపందలు 
భయంలేని వాడు 
భూత 'గోస్ట్' కథ నేను సుబ్బారావుని 
మర్కటాలూ మిణుగురులూ 
మళ్లీ చెప్పిన కథ 
మాయమైన మనీపర్సు 
ముకుంద... 
ముక్తిమార్గం 
ముమూర్ష 
మూడు చేపలు 
రట్టూ గుట్టూ 
రామూర్తి పెళ్లయింది 
రెండు శవాలు 
రైలు పట్టాలు 
లంచగొండి-యమలోకం 
వాళ్లూ నేనూ 
వ్యర్థపుటాశలు 
సంతుష్టి 
సన్మాన సభ 
సింహం-కుందేలు 
సుబ్బారావు సూర్యకాంతి 
స్థిరపడిన సంబంధం 

పుస్తకాలు

నీతిచంద్రికహ్యూమరథం (రెండు భాగాలు) 
మల్లీశ్వరి (సినిమా నవల) 
బ్లాక్ అండ్ వైట్ . 
రావి కొండలరావు నాటికలు 
రావి కొండలరావు కథలు 
నాగావళి నుంచి మంజీర వరకు 

పురస్కారాలు

బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం - 2004 సంవత్సరానికి 
అ.జో-వి.భొ. కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం 

హైదరాబాదు బేగంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020, జూలై 28వ తేదీన సాయంత్రం గం. 4.35 ని.లకు గుండెపోటుతో మరణించారు.

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

విజయనగరం సంగీత కళాశాల.. ఘంటసాల



 విజయనగరం సంగీత కళాశాల ప్రాంగణంలో నాడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు విద్యార్థి దశలో పచ్చడి రుబ్బుకోవటం కోసం ఉపయోగించిన రుబ్బుడు రాయి (గుంట).  ఎంతో  జాగ్రత్తగా, పవిత్రంగా పదిలపరిచి కళాశాల శతాబ్ది(2019) సంవత్సర వేడుకలలో   వారి అభిమానులకు, సందర్శకులకు దర్శన బాగ్యం   కల్పించేరు ఉత్సవ రధసారధులు. The Golden Heritage of Vizianagaram సౌజన్యం తో..

4, ఫిబ్రవరి 2021, గురువారం

మదిగదిలో వలపు రేపి మౌనిలాగ మరలిపోకు


 🌹ముషాయిరా గజల్🌹

               @@**@@


మదిగదిలో వలపు రేపి మౌనిలాగ మరలిపోకు! 

గుబులు బుగులు తోడునిచ్చి వింతగ నను వీడిపోకు!


కనులెందుకు భారమాయె, కలత నలక రాలిపోదె

ఓ మానిస పదేపదే తపనల దరి కుమిలిపోకు!


చిత్తడిమడి మనసంతా, చిన్నబోయి చివికి పోయె

కమ్ముకున్న కారుమబ్బు కసిదీరా కురిసిపోకు!


తిరిగి రాని కాలమింక నిలదీసే వగపేలని

నన్ను నాకు మిగల్చనీ స్నేహితమా మరచిపోకు!  


గుండెగోస తీరనిదే, ఎవరికెవరు చివరివరకు

రంగుహంగు జీవితమా క్రుంగిపోయి ఆగిపోకు !


గుప్పెడంత గుండెలోన అల్లుకున్న ఆత్మీయత 

తడిమిబోవు తరంగాల ఉప్పెనవై ముంచిపోకు!


జ్ఞాపకాల సమాధిపై నిదురించకు చెంగలువా

చిలకరించు తలపులతో చిరునగవా వీగిపోకు!


✍️...#పద్మజ_చెంగల్వల


PC : Pvr Murty garu

1, ఫిబ్రవరి 2021, సోమవారం

శంకరాభరణం





41 సంవత్సరాలు పూర్తి చేసుకన్న అద్భుత చిత్రం శంకరాభరణం. ఈ చిత్రం నిత్యనూతనంగా ఇప్పటికీ భాసిల్లుతోంది. ఈటీవి భారత్ వారు అందించిన వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.   https://www.etvbharat.com/telugu/andhra-pradesh/sitara/cinema/sankarabaranam-movie-completed-four-decades/na20210202053052806




ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...