25, ఫిబ్రవరి 2021, గురువారం

శ్రీవారికి ప్రేమలేఖ


 పోస్ట్ అంటూ  గావు కేక వినపడగానే పరుగులు తీసే వయసు దాటీ యెన్ని వత్సరాలు అయ్యాయో ...అనుకుంటూ ఉత్తరం అందుకున్నాను ....


ప్రియమైన మీకూ  ... ప్రేమతో నేను వ్రాస్తున్న మొదటి ఉత్తరం .....

క్లుప్తంగా ఆనాడు మీరు వ్రాసిన   క్షేమసమాచారాలు రేపటి జాబు కోసం నన్ను యెదురు తెన్నులు చూసేలా చేసేవి.  

మీరు వ్రాసిన ఉత్తరాలు  యెన్నో సార్లు చదివించుకుంటూ మురిసిపోయేదానిని.

మన పెళ్ళి కోసం ఎన్నెన్ని  కలలు కన్నాను.  నువ్వు నాకో  ఉత్తరాం వ్రాయవూ అని మీరు  బ్రతిమాలుతున్నప్పుడు నా  చేతులకి సంకెళ్లు వేసినట్లు అయ్యేవి.  


       ఆడపిల్లకి చదువులు  ఎందుకూ ... ఊళ్ళు ఏలీ ఉద్యోగాలు చేయాలా అని మా మూలనున్న ముసిల్ది నాకు అక్షరం ముక్క కూడా రాకుండా చేసిందనీ యెలా చెప్పేదీ. రాయడానికి సిగ్గు పడుతున్నాను అనుకున్న మీ నమ్మకాన్ని వమ్ము చేశాను ఆనాడు.


మన పెళ్ళి ముచ్చట్లు తీరకుండానే చంటోడు నా కడుపున పడ్డాడు .

తీరికలేని సంసార సాగరం లో నాకు ఉత్తరం ముక్క వ్రాయడం  రాదన్న సంగతి  మీకు యేనాడూ  చెప్పలేకపోయాను.


నేను వూరు వెళ్ళితే ఉత్తరం వ్రాస్తావు కదూ అంటున్న ప్రతీ సారి నన్ను తీసుకుని వెళ్లకుండా మీరు  యెక్కడికి వెళ్ళగలరూ  అంటూ తప్పించుకుని తిరిగాను.


చంటి వాడికి ఆరోనెల వచ్చిందో లేదో మళ్ళీ వేవిళ్ళు మొదలయ్యాయి .

నా పెళ్లయ్యాక నన్ను చూసే వాళ్ళు ఎవ్వరూ లేరని తెలిసీ పురుడూ పోసీ మీరే  నన్ను కంటికి రెప్పలా కాపాడు కున్నారు . యీ సారి మీ పోలికలతో పుట్టిన అమ్మాయిని చూసీ కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు . కానీ యెక్కడా  ఉత్తర , ప్రత్యుత్తరాలు   మాటే మన మధ్యలో  రాలేదు.

కాల గర్భం లో రోజులూ  , నెలలూ , సంవత్సరాలు గడచిపోయాయి . నా మగపిల్లాడితో పాటు ఆడపిల్లని కూడా  సమానం గా చదివించుకున్నాను . పిల్లలకి పెళ్లిళ్లు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేసారు . యింత వరకూ నేను మీకు  ఒక్క ఉత్తరం రాసే అవసరమూ  రాలేదూ . మన పెళ్ళి అయిన యిన్నేళ్ళకి  అవసరార్ధం మీరు నన్ను  నా కొడుకు దగ్గర వదిలీ  కూతురుని వెంటపెట్టుకునీ  ఉద్యోగం లో చేర్పించే నిమిత్తం  కొన్ని రోజులు  తనకి తోడుగా వుండాలనీ వెళ్ళారు .   

మీలా  కొందరు  తల్లిదండ్రలు అయినా    ఆడపిల్లలకి   కూడా   చదువూ , సంస్కారం   వుండాలనీ  ఆనాడు   అలోచించి  వుంటే ఈ యెక్కువ తక్కువలూ ,  ఈ అహంకారాలూ ఈనాడు వుండేవి కావు.

కాలం మారింది చట్టాలూ  , న్యాయాలూ యిద్దరికీ సమానత్వాన్ని కలిపిస్తున్నాయి. 

 నా కూతురు  ఒకనాడు నాకు నేర్పిన ఈ  అక్షరాల వలనే  ఈనాడు నేను  అన్ని విషయాలూ  తెలుసుకో గలుగుతున్నాను .    దూరాలు దగ్గర చేర్చే  సాధనాలు యెన్ని వచ్చినా , మన   తియ్యని జ్ఞాపకాలు అన్నీ అక్షరాలుగా పేర్చి   మీకు ఉత్తరాల మాల వెయ్యాలనీ   యెన్నో సంవత్సరాలుగా  యెదురు చూస్తున్నాను. అవకాశం రానే వచ్చింది .

మీ ఆరోగ్యం జాగ్రత్త  . 

మీ రాకకోసం వెయ్యి కళ్ళతో యెదురు చూస్తూ ఉంటాను.  


ప్రేమతో ...


♥️మీ ... చిట్టి♥️

Pvr Murty అంకుల్  చిత్రానికి  "చిట్టి"  ఉత్తరం ....

✍️లక్ష్మీ అయ్యగారి

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...