19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

కళాతపస్వి శ్రీ కే. విశ్వనాథ్


 (My pencil sketch)



*తెలుగుజాతి కళాతపస్వి*

భారతీయ సంస్కృతి,

హిందూ సాంప్రదాయంలో దేవాలయాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.కుగ్రామంలో కూడా దేవాలయం మానవజీవన ధర్మానికి వేదమంత్రమైంది.ప్రాణవాయువులా సేదతీర్చే ఉత్కృష్టమైన మహిమ దేవాలయానికి వుంది.అటువంటి దేవాలయంలేని ఊరు పాడుబడిన ఊరుతో సమానం..

  అలాగే తెలుగు సినీ చరిత్రలో మన ముందుతరంవారు సమాజవికాసానికి తీసిన చిత్రాలు మహోజ్వలంగా ప్రేక్షకుల హృదయాలను  ప్రకాశవంతంచేశాయి అనటంలో ఏమాత్రం సందేహంలేదు...కానీ రాను రాను తెలుగు సినిమా రూపురేఖలు మారిపోతూ ప్రేక్షకుడికి భారతీయత,తెలుగుదనం అంటే ఇదేనా అని ప్రశ్నార్ధకంగా  నిల్చి కలవరపెట్టాయి..తెలుగు సినిమాకు తిరోగమనం మొదలయ్యింది,దేవాలయంలేని ఊరులా ఒక ఉనికిని పవిత్రతను కోల్పోతోంది అని కలవరపెడుతున్న తరుణంలో...

అదిగో అప్పుడే విశ్వనాధుడి నవశకం"సిరిసిరిమువ్వలతో"సవ్వడి చేస్తూ కళలకు ఆరాధ్యదైవమైన శంకరుడికి ఆభరణాల వంటి   సినిమాల పరంపరతో మొదలయింది..

    ఒక జాతి చరిత్రను తెలిపే కళల సమాహారమయినాయి ఆయన చిత్రాలు..

  అసలు ఇటువంటి కళాత్మక చిత్రాలకు ఆయన తొలిచిత్రం *ఆత్మగౌరవం*లోనే సూచనప్రాయంగా అంకురార్పణ చేశారు..

 భారతీయ ఆత్మ రూపురేఖలకు మూలస్థంభాలు మనో వికాసానికి దోహదపడే కళలు, ఆధ్యాత్మికత, సంస్కృతి సంప్రదాయాలు,నాగరికత మొ...

     ఇక కళలనేవి వెండితెర మీద రూపుదిద్దుకోవటంతో నవశకం ప్రారంభమైంది అని భావిస్తే విశ్వనాథుని ప్రవేశంతో 

స్వాతి కిరణాలతో ప్రకాశించింది.

     ఈ శకానికి కళాతపస్వి..

     విశ్వనాధ్ తెలుగుజాతికి పరిచయం చేసిన కవులు ఇద్దరు.సాహిత్య సరస్వతి ఉఛ్చ్వాస నిశ్వాసాలల ఒక వేటూరి,ఒక సీతారామ శాస్త్రీ.వారికలాల వెలుగుతో  సినీ సాహిత్య వనాన్ని తమరచనా సౌరభాలతో  నింపారు.ఆయన చిత్రాల్లోని గీతాలు ప్రణవనాదంలా ధ్వనించాయి.

      ఎన్నో ప్రయోగాలకు,ఎన్నో అభ్యుదయభావాలకు ఆయన సినిమాలు తార్కాణంగా నిలిచాయి.ఎన్నో అవార్డులు,మరెన్నో పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో సగౌరవంగా సగర్వంగా నర్తించాయి...

    తెలుగుజాతి అదృష్టం విశ్వనాథుడు,

తెలుగుజాతి గౌరవం విశ్వనాథుడు,

తెలుగుజాతి గర్వము విశ్వనాథుడు 

అంతెందుకు తెలుగుజాతి కీర్తిపతాక మన కాశీనాధుని విశ్వనాథుడు...

       ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ భారతజాతికి  కాశీలోని విశ్వనాధుడు ఒక్కడే,అలాగే తెలుగు సినిమారంగానికి మంచి సినిమాలతో కీర్తిప్రతిష్టలను సాధించిన"కాశీనాధుని విశ్వనాధుడూ"ఒక్కడే...

     ఈరోజు ఆయన పుట్టినరోజు...ఆయన ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా హాయిగా ఉండాలని ఆకాంక్షిస్తూ...

విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...( చక్కని విశ్లేషణ ఇచ్చిన ప్రముఖ విశ్లేషకరాలు శ్రీమతి విజయదుర్గ గారికి ధన్యవాదాలు)

మిత్రులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారు నా చిత్రానికి ఇచ్చిన పద్య స్పందన. వారికి ధన్యవాదాలు. 


ఆ.వె
శంకరాభరణము చక్కగా చిత్రించి
భారతీయ కళల వన్నె దెల్పి
వెలిగె దర్శకునిగ విశ్వనాధుడు, తెల్గు
చిత్రసీమ మణిగ చిరము నిలిచె
సకల కళల యందు సంగీత, నృత్యము
విలువ చాటిచెప్పి తెలుగు సీమ
విశ్వనాధు శైలి విశ్వమంతయు వెలుగ
చిత్ర దర్శకునిగ చిరము గాను


కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...