18, ఫిబ్రవరి 2021, గురువారం

మధుబాల - The Venus of India


మధుబాల, హిందీ చిత్రజగత్తును ఏలిన ఓ సౌందర్యరాశి.  నా pencil చిత్రాలు.


వెలుగు చీకటులు....కలబోసిన ఈ కాలము చేతిలో...
కీలు బొమ్మలం!
భావన లోనే జీవనమున్నది. మమతే జగతిని....
నడుపునది....
మమతే జగతిని నడుపునది!
అవునా?! నిజమేనా!?
అసలు ప్రపంచం లో ప్రేమెక్కడుంది? ముఖ్యంగా...అది మనుషుల మనస్సుల్లో...అసలుందా అనిపిస్తుంది!
ప్రేమికుల రోజున పుట్టిన మధుబాల కు ఈ అనుమానం కలగడమే వింతగా అనిపిస్తుంది!
స్వార్థం....ఈ మానవ హృదయాలెప్పుడో...దీనితో నిండిపోయాయి!
మమత....ప్రేమ...ఈ జగత్తును నడుపుతున్నాయంటారు! అంతా బూటకమే!
మానవ సంబంధాలన్నీ....ఆర్థిక సంబంధాలే!
అసలు కించిత్తు కూడా అనుమానం లేదు.
బొంబాయి బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న మధుబాలకు...అర్థరాత్రి అవుతున్నా....నిద్ర రాలేదు.
ఎన్నో సంఘటనలు కళ్ళ ముందు ఇంకా....ఈ మధ్యనే జరిగినట్లున్నాయి!....
ఎందుకని...జీవితం...ఇంత వేగంగా మలుపులు తిరుగుతోంది....నా విషయంలో!
************
మొన్న మొన్నే 1942 లో బాలనటిగా....బసంత్ లో యాక్ట్ చేసినట్లు...రాజ్ కపూర్ తో హీరోయిన్ గా 1947 లో నీల్ కమల్ డెబ్యూ...
ఇక యూసఫ్ ఖాన్(దిలీప్ కుమార్) తో ప్రేమలో పడడం
తండ్రి...ససేమిరా అనడం!....
1954 లో గుండె జబ్బు విషయం...తెలియడం. అయినా సరే...మూవీస్ నిరంతరంగా చేస్తూనే తండ్రి తో సహా కుటుంబాన్ని మొత్తం పోషిస్తూ ఉన్నా.....
బ్రతుకెప్పుడు..అంతమౌతుందో!...తెలియని నిస్సహాయత...అనిశ్చితి...అబ్బా....ఎలా పడ్తుంది నిద్ర!?
దిలీప్ జీ ప్రేమ వ్యవహారం తెలిసేది కాదు తండ్రికి.... ఆ ఇన్సానియత్(1955)...ప్రీమియర్ షో కు దిలీప్ తో కలిసి వెళ్ళకపోయుంటే!
అసలు నువ్వా మూవీలో యాక్ట్ చేయలేదుగా...ఎందుకెళ్ళావో నాకు తెలీదనుకున్నావా?...ఆ దిలీప్ కుమార్ తో నిఖా జరగని పని.....అంటూ తండ్రి వార్నింగ్!
ఓ స్వేఛ్ఛ లేదు....నాకు నచ్చిన వాడిని పెళ్ళాడ కూడదు! నేనో డబ్బు సంపాదించే యంత్రాన్ని మాత్రమే! సంపాదించి...సిస్టర్స్ ను....తండ్రిని పోషించడమొక్కటే....తన పని!
అందంలో అప్పట్లో వీనస్ ఆఫ్ ఇండియా గా పేరొందిన మధుబాల అంతరంగ మథనం ఇది!
**********
ప్రేమికుల రోజున పుట్టి..... వీనస్ ఆఫ్ ఇండియాగా పేరొంది...వెండితెర మీద ఒక జ్వాలగా వెలిగిన అరుదైన అందం .....మధుబాల.
ఆమె అందానికి...స్త్రీలు ఈర్ష్యపడరు! వారు కూడా పురుషులతో సమంగా ఆరాధిస్తారు!
1942 లో 9 ఏళ్ళకే.... బసంత్ తో బాలనటిగా ప్రవేశించింది ముంతాజ్. అదే తన అసలు పేరు. వరుసగా 4 చిత్రాల్లో బాలనటిగా యాక్ట్ చేసేసరికి...నాన్న అతౌల్లా ఖాన్ కు ఆశ పుట్టి....
డిల్లీ నుండి బొంబాయికి మకాం మార్చి... ఘీ మండి లో ఓ చిన్న ఇంట్లో 6 గురు పిల్లలతో ఉండేవాడు. ఆయనేం సంపాదించడు. అందరికీ...మధుబాలే ఆధారం!
ఏప్రిల్ 14, 1944 లో డాక్ ఎక్స్ప్లోషన్ లో ఉంటున్న ఇల్లు పూర్తిగా కాలిపోతే.....ముంతాజ్ స్నేహితురాలింట్లో 6 నెలలు తల దాచుకుంది కుటుంబం మొత్తం.
క్రమేణా...మూవీస్ పెరిగాయి. దేవికారాణి...ముంతాజ్ పేరును మధుబాల గా మార్చింది!
1947లో కిదార్ శర్మ అనే నిర్మాత మధుబాల(14 ఏళ్ళు)ను హీరోయిన్ గా...రాజ్ కపూర్ ను హీరోగా(ఇద్దరికి డెబ్యూ) తీద్దామనుకుంటే...ఫైనాన్షియర్ తప్పుకున్నాడు. కిదార్ శర్మ తనే సొంతంగా తీశాడు. అదే నీల్ కమల్(1947) మూవీ.
***********
ఇక ఫామిలీకి బంగారు బాతు అయ్యింది మధుబాల! అన్నీ రెస్ట్రిక్షన్స్. తండ్రి డేగలా కాపలా! తనకంటూ ఇష్టాఇష్టాలు ఉండకూడదు!
మనీ ఎర్నింగ్ మెషిన్ అయ్యింది.బొంబాయి సినీరంగంలో ఎన్నో మగ పుంగవులు...ఎన్నో వెకిలి చూపులు...ఎన్నో ప్రపోజల్స్....ఇవన్నీ...తన చిరునవ్వుతో ఎదుర్కుంటూ...సాగిపోయింది.
ఏఏ మూవీస్ చేయాలో...తండ్రే నిర్ణయిస్తాడు!
బాల నటీమణులుగానే మిత్రులయ్యారు మధుబాల & మీనాకుమారి. ఇద్దరి జీవితాలు ఒకేలా అంతమయ్యాయి!
దిలీప్ కుమార్ తో ప్రేమాయణం తండ్రి పసిగట్టి.....ఖచ్చితం గా గీత గీశాడు. దిలీప్ తో అసలు సినిమాలు ఒప్పుకునేవాడు కాదు!
1954 లో బహుత్ దిన్ హుయే...షూటింగ్ మద్రాస్ లో....కళ్ళు తిరిగి పడిపోవడం...నోటి వెంట రక్తం రావడం....అప్పుడు తెలిసింది. మధుబాలకు వి.ఎస్.డి...అనే గుండె జబ్బు పుట్టుకతోనే ఉందని. ఇప్పుడైతే...ఈజీగా ఆపరేట్ చేస్తారు. కానీ...అప్పటి పరిస్థితి వేరు !
దిలీప్ తో ప్రేమ బెడిసి కొట్టాక....తన జబ్బు తండ్రికి తెలిసాక మాత్రం...తనకు ఫ్రీడం దొరికింది.
అయినా బి.ఆర్ చోప్రా ..నయాదౌర్ మూవీ కోసం దిలీప్ ప్రక్కన మధుబాలను బుక్ చేస్తే....తండ్రి ఒప్పుకోలేదు.
దాంతో...దిలీప్...మధుబాల ల మధ్య మాటలు కూడా కరువైపోయాయి!
************
హాల్ కైసా హై జనాబ్ కా.....1958 లో చల్తీ కా నాం గాడీ మూవీ షూటింగ్ లో కిషోర్ కుమార్ తో ప్రేమలో పడ్డది మధుబాల.
ఒక విధంగా చెప్పాలంటే...దిలీప్ మీద కోపంతో....కిషోర్ మీద ఇష్టం పెంచుకుంది. అప్పటికే పెళ్ళైన కిషోర్ కుమార్...మతం మారి ....మధుబాలను పెళ్ళాడాడు.
1960 లో ముఘల్-ఇ- అజాం....రిలీజ్ అయి రికార్డ్ సృష్టించింది. షోలే వరకు ఆ రికార్డ్ అలాగే ఉంది.
ఇద్దరికీ పెద్దగా మాటలు లేకపోయినా...తెరమీద ప్రేమ బాగా పండించారు!
ఆరోగ్యం క్షీణిస్తుండటంతో లండన్ కు తీసుకెళ్ళారు. సర్జెరీ వద్దని....రెస్ట్ తీసుకోమని....2 సంవత్సరాలే టైం ఇచ్చారు ....బ్రతకడానికి!...
అయినా...అలాగే నటిస్తూనే ఉంది. 1960 తరువాత కూడా ఓ 4 మూవీస్ చేసారు. షూటింగుల్లో...దగ్గు, ఆయాసం...రక్తం పడటం....సాధారణమైపోయాయి. కానీ....ఇవేవీ కూడా...తెర మీద మధుబాల లో కనిపించేవి కావు!
కిషోర్ రాకపోకలు తగ్గాయి. నెలకో..2 నెలలకో ఓ సారి వచ్చేవాడు. మెడికల్ బిల్స్ అవీ పే చేసి...రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయేవాడు!
దీనికి కిషోర్ ను నిందించడం కూడా తప్పే. ఇప్పుడు కిషోర్ కు నా పైన ప్రేమ కంటే జాలే ఎక్కువుంది.
అయినా ప్రేమంటే...ఓ బండరాయా!? ఎప్పుడూ అలాగే...అక్కడే ఉండడానికి. దానికీ ప్రాణం ఉంటుంది.
***********
1965లో బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు...చూసిన వారికి...ఆమె సన్నగా...పేల్ గా...ఆక్సిజెన్ పెట్టుకున్న దేవత లాగే కనిపించింది. తన అందం అలాంటిది మరి....ఏంజలిక్ బ్యూటీ.
67 సినిమాలు చేసినా...అందులో గొప్పగా ఆడినవి 17 మాత్రమే! సినిమాలు ఎన్నుకునే స్వతంత్రం తనకు లేదు మరి. ఎవరు డబ్బులెక్కువ ఇస్తే...వారికి తండ్రే ఓకె చేస్తాడు!
ఒక చక్కటి బాలనటి ...ముంతాజ్....
మనోహరమైన అందగత్తె ....మధుబాల.....
శత్రువుల గుండెలను సైతం కరిగించే దరహాసిని....
తెరపై...మత్తుమందు చల్లి..మైమరిపించిన ముగ్ధ.....
ప్రేమికులరోజున పుట్టి...ప్రేమకు నోచుకోని ప్రేమ పూజారిణి....
మధుబాల!
ఫిబ్రవరి 14- 1933 న జన్మించిన ధ్రువతార ఫిబ్రవరి 23- 1969 న తుది శ్వాస విడిచి....వినీలాకాశంలోకెళ్ళింది.
36 ఏళ్ళకే ....ఎంతో సాధించింది. ధృవతారగా నిలిచింది.

(మంచి వివరాలు అందించిన డా. ప్రసాద్ కె.వి.యస్ గారికి ధన్యవాదాలు)

 

కనులు కనులు ఊసులాడే

🌹 కనులు కనులే ఊసులాడే కాముడేదో చేసెనే       మనసుపొరలో అలజడేదో  తీపిగాయం చేసెనే   🌹 పలుకు వినకే క్షణము యుగమై వేచిచూసే మౌనమే       దరికిచేరగ...