28, జూన్ 2021, సోమవారం

"నిదురించే తోటలోకి..' పాట - రచన గుంటూరి శేషేంద్ర శర్మ

గుంటూరు శేషేంద్ర శర్మ

pencil drawing



గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక్క పాట తెలుగు సినీ సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది. ఈ పాట విశ్లేషణ నాకు whatsapp లో తారసపడింది. ఈ పాటను ఎవరు విశ్లేషించారో నాకు తెలియదు. ఆ విశ్లేషణ చదివిన వారికి,  శేషేంద్ర శర్మ గారి భావుకత కి జోహార్లు అర్పించకుండా ఉండలేము.  ఇంత చక్కగా విశ్లేషించిన ఆ వ్యక్తికి నా ధన్యవాదాలు. నేనొక చిత్రకారుణ్ణి.  విశ్లేషణ చదివిన వెంటనే శేషేంద్ర శర్మ గారి చిత్రాన్ని నా pencil తో చిత్రీకరించుకున్నాను. విశ్లేషణ ఎటువంటి మార్పులూ లేకుండా అందరికీ వీరి పాట గురించి తెలియాలన్న సదుద్దేశంతో ఇక్కడ పొందుపరుస్తున్నాను.


విశ్లేషణ చదివేముందు ఈ పాట ఒకసారి వింటే బాగుంటుందని ఈ పాట లింకు ఇక్కడ ఇస్తున్నాను.

https://www.youtube.com/watch?v=fgmx0Q887RI

 

నిదురించే తోటలోకి............

 

పాటలు రాయడం సులభం కావచ్చు. కానీ సినిమాలకు సన్నివేశపరంగా పాటలు రాయడం అంత సులభం కాదు. సన్నివేశానికీ,పాత్ర మనో భావాలకీ తగ్గట్టుగా, అతికినట్టుగా పాట రాయాలంటే కవి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే చక్కని భావాల గీతాలు పుడతాయి. అటువంటి చక్కని రచనకు అద్భుతమైన సంగీతమూ, గాన మాధుర్యమూ, చిత్రీకరణా కూడితే ఆ పాట ఎన్ని తరాలయినా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. పెదవులపై పారాడుతుంది. తెలుగు సినీ గీతాలలో ఇటువంటి మణిపూసలు ఎన్నో. సుకవులు ఎందరో. 

కేవలం ఒకే ఒక్క పాట రాసి చలన చిత్ర రంగంలో గీత రచయితగా గొప్ప స్థానాన్ని పొందిన కీర్తి గుంటూరు శేషేంద్ర శర్మ గారిది. ముత్యాల ముగ్గు చిత్రం కోసం వారు రాసిన 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది....'అనే గీతం గొప్ప ఆర్త గీతం. అద్భుతమైన సన్నివేశానికి, అద్భుతమైన రచన, అత్యంత అద్బుతమైన చిత్రీకరణ, మహాద్భుతమైన సంగీతం.......కోటి కోకిలలకు ఏక రూపమైన గాత్రధారి సుశీలమ్మ గానం. వెరసి ఇది ఒక విషాద రసరమ్యగీతం. 

తేట తెలుగు తోటలో స్వేచ్ఛగా విహరించి ఏర్చి కూర్చి తెచ్చిన పదసుమాలతో కవి అల్లిన గీత మాలికకు అద్భుతమైన భావాన్ని అద్ది ప్రతి పదాన్ని సుశీలమ్మ పలికిన తీరు ...కరకు గుండెనైనా కరిగించి తీరు!. 

సన్ని వేశ పరంగా చూస్తే కథానాయిక రాముడిచే పరిత్యజించబడిన సీత. లవకుశల్లాంటి ఇద్దరు పిల్లలతో వాల్మీకి లాంటి ఆశ్రమవాసి రక్షణలో జీవనం సాగిస్తూ ఉంటుంది. 'ఏ నాటికైనా తన రాముడు కనికరిస్తాడా ? అపార్థాలు తొలగి భర్తను కలవగలుగుతుందా ?తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతున్న పిల్లలను అతని సన్నిధికి చేర్చగలుగుతుందా? ఎప్పటికైనా తామంతా ఒకే కుటుంబంగా జీవించగలుగుతారా? 'ఇవన్నీ కథానాయికను నిరంతరం వేధించే ప్రశ్నలు. వేదనని గుండెల్లోనే దాచుకుంటూ మూగగానే భగవంతుడిని వేడుకుంటూ జీవితాన్ని భారంగా గడుపుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. కన్ను మూసేలోగా కలలోనైనా క్షణకాలమైనా దర్శనమిస్తాడో లేదోనని ఆరాటపడుతున్న మూర్తి కనిపించాడు.ప్రత్యక్షంగా కాకపోయినా కన్నకూతురితో నవ్వుతూ మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇది ఆమెకు దివ్యదర్శనం. రమ్యమైన అనుభూతి. ఒకసారి ఎదురు వెళ్ళి పలకరిద్దామనిపించినా అడుగు ముందుకు పడదు. తనమీద ద్వేషంతో రగిలిపోతున్న మనిషి పన్నెత్తి పలకరిస్తాడా ?  ఎవరో అనుకొని మాట్లాడుతున్నాడు కానీ తన కూతురే అని తెలిస్తే ఏమౌతాడో ? అతని భావాలు ఎలా ఉంటాయో ? అసహ్యించుకుంటాడో ? ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడో!!

 ఇలాంటి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ  మానసికంగా సిద్ధమయే లోపలే పడవ ముందుకి సాగిపోతూ నాయకుడిని తనతో పాటు తీసుకు పోతూ రేవుని బావురుమనిపిస్తుంది. 

ఈ చిన్న సంఘటన కథానాయిక మనసుని అతలా కుతలం చేసింది. నిరాశనుంచి పుట్టిన చిరు ఆశ దీపంలా వెలిగి తన జీవితాన్ని వెలిగిస్తుందా లేక నిరాశలోనే తన జీవితం లయిస్తుందా ? జవాబు తెలియని ప్రశ్నలు ఆమెను వేధించసాగాయి. ఏది ఏమైనా ....చిక్కటి చీకటి నిండిన ఆకాశంలో అతని రాక నిండు జాబిల్లి కాకపోయినా మిణుక్కు మిణుక్కుమనే నక్షత్రం లాంటిది. ఏమో! ఎవరు చెప్పగలరు?!  ఆ తార పక్కనే మబ్బుల్లో నిండు చంద్రుడు దాగున్నాడేమో ?ఆ మబ్బు తొలగిపోతే తన జీవితంలోనూ పండువెన్నెల కురుస్తుందేమో! ఏమో!  పీడకలలు తప్ప మామూలు కలలు కూడా కనలేని స్థితిలో ఉన్న ఆమెకు అతని రాక ఒక కమ్మని కల. ఆ కల కన్నీటిని తుడిచి తెలియని ఆశని, ఓదార్పుని ఇచ్చింది. ఆ వెంటనే నది దోచుకు పోతున్న నావ తీరని నిరాశని, నిట్టూర్పునీ కూడా ఇచ్చింది.

 

ఆశ నిరాశల మధ్య ఉయ్యాల లూగుతూ, వింత అనుభవం ఇచ్చిన ఉద్విగ్న స్థితిలో ఉన్న కథానాయిక నోట కవి పలికించిన భావగీతమే ఈ పాట. అతి కమ్మని పాట లోని ప్రతి మాటా ఓ చక్కని భావ చిత్రంగా ప్రతీకాత్మకంగా పలికించిన ఘనత శేషేంద్రవారిది. 

బాపూ రమణల భావవాహినిలో రూపొందించబడ్డ రమ్యమైన సన్నివేశం. చక్కని గోదారి ఒడ్డున, చిన్న పొదరిల్లు. దాని చుట్టూ చక్కని తోట. అటువంటి చోట నిలబడి నది దోచుకుపోతున్న నావను, నావ దోచుకుపోతున్న నాథుడ్నీ చూస్తూ విలపిస్తూ కథానాయిక ఆలపించే గీతం ఇది.

 

*నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది 

కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

 

 

నిజానికి తోట అనగానే అందమైన చెట్లు,రంగు రంగులుగా విరబూసి గాలికి తలలూపే పూలు, వాలుగా సెలయేరు కళ్ళముందు మెదులుతాయి. కానీ ఈ తోట అన్ని తోటల్లోగా అందమైనదీ సందడితో నిండినదీ కాదు. తోటే కానీ నిదురించే తోట. నిరాశతో నిండిన  నాయిక జీవితాన్ని నిదురించే తోటతో పోల్చడమే ఒక చక్కని బావ చిత్రం. అలాంటి నిదురించే తోటలోకి పాటరావడం (కథానాయకుడి రాక) నిశ్శబ్దాన్ని చీల్చే సవ్వడి చేయడం నిదురించిన ఆశలను మేల్కొలపడమే కదూ. ఆ మధురమైన పాట కన్నీటిని తుడవడమే కాదు ఒక కమ్మని కలనే కానుకగా ఇచ్చింది. 

*రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ 

దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ 

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ 

ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ 

ఆ కల నిజంగా ఎంత కమ్మనిదో ! ఆ పాట ఎన్ని అద్భుతాలు చేసిందో. కుటీరాల ముంగిట్లో శుభాల ముగ్గులేసింది. చీకటి నిండిన గూటిలో దీపమై వెలిగింది. ఏ స్వరమూ పలుకలేక మూగబోయిన వేణువులో ఒక కొత్త స్వరం కలిపింది. ఆశలనే ఆకులను దిగులుగా రాల్చేసుకున్న అడవిలో ఒక కొత్త ఆశ వసంతంగా దయచేసింది. కుటీరం, దీనురాలి గూడు, శూన్యమైన వేణువు, ఆకురాలు అడవి ఇవన్నీ  విగతాశ అయిన కథానాయిక నిస్సారమైన జీవితానికి ప్రతీకలైతే రంగవల్లి, దీపము, స్వరం, ఆమని కథానాయకుని ఆగమానికీ, కొత్త ఉత్తేజానికి ప్రతీకలు.

 

*విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో

ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి

కొమ్మల్లో పక్షుల్లారా!

గగనంలో మబ్బుల్లారా!

నది దోచుకుపోతున్న నావను ఆపండీ! 

రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ! 

కథానాయిక నిలచిన గుమ్మం ఇంటికి శుభసూచకంగా కట్టే మామిడాకులు వేలాడే గుమ్మంకాదు. విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మం అది. అలాంటి నిరాశ నిండిన గుమ్మంలో ఆశల అడుగుల సవ్వడి వినిపించింది.  ఆసవ్వడి విని ఆనందించే లోపలే ఆ ఆడుగులు దూరమై పోయాయి. ఆమె పిలుపు వినబడనంత దూరంలో నావలో ఉన్నాడతను. ఆ నావను నది అతి వేగంగా దోచుకుపోతోంది. ఆ అడుగుల సవ్వడిని శాశ్వతంగా గుమ్మంలోనే నిలబెట్టగలిగే శక్తి ఎవరికుంది.  ఆ వేగాన్ని అందుకునే శక్తి మానవ మాత్రులకు లేదు. అందుకే ఆమె ప్రకృతిని ఆశ్రయించింది. వాయువేగంతో ఎగిరే పక్షులూ, గగనాన గమించే మబ్బులనూ పిలిచి నది దోచుకుపోతున్న నావను ఆపమంటూ నావలేని రేవు బావురుమంటోందంటూ తన ఆవేదనను సందేశంగా వినిపించమంటూ దీనంగా ప్రార్థించింది. 

మరి పక్షులూ మబ్బులూ నావను ఆపగలిగాయా? 

నాయిక సందేశాన్ని వినిపించ గలిగాయా? 

పాట విన్న ప్రతి ఒక్కరిలో నూ రేగే ఆత్మీయ ఉత్కంఠ ఇది.

 

అవి తప్పక వినిపించే ఉంటాయిలే. నాయిక వేదనను తీరుస్తాయిలే. ప్రకృతి కష్టాలను మానవుడు అర్థం చేసుకోలేడేమోగాని, మానవుడి కష్టాలను ప్రకృతి తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు అనే చిరు ఆశతో నిండిన విషాదభరితమైన గుండె నుంచి వెలువడిన వేడి నిట్టూర్పుకు వెచ్చటి కన్నీటి పొర జతగూడి ఓదార్పునిస్తుంది. 

ఆశనిరాశల మధ్య ఊగులాడే కథానాయిక కల్లోల మానస కాసారంలో ఈదులాడి ఆమెలో కదలాడే ప్రతి భావాన్ని తన భావంగా అనుభూతించి చక్కని భావచిత్రాలతో కరుణరస స్ఫోరకంగా శేషేంద్ర రాసిన గీతమిది. 

అత్యంత విషాద మాధుర్యంతో నిండిన గీతాన్ని రాసి ఒక్క పాటతోనే సినీ గీతాభిమానుల హృదయంలో చిరంజీవిగా నిలిచి పోయిన ఘనుడు శేషేంద్ర శర్మ



 



 

27, జూన్ 2021, ఆదివారం

ప్రేమకోసమై వలలో పడినే పాట - గాయకుడు వి.జె.వర్మ

 





facebook పుణ్యమా అని ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.  తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాట "ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు' వివరాలు అందించారు కొందరు మిత్రులు. పింగళి వారు రాసిన. ఈ పాట అత్యంత ప్రజాదరణ పొందింది.

"పల్లవి:వి.జె.వర్మ:ప్రేమ కోసమై వలలో పడెనో పాపం పసివాడు...అయ్యో  పాపం పసివాడు| ప్రేమ కోసమై |


చరణం:వి.జె.వర్మ:వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని
ఘంటసాల:ఓ..ఓ.ఓ.ఓ.. ఓ.ఓ.ఓ.. ఓ..ఓ..ఓ..

వి.జె.వర్మ:వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని
ఏమైనాడో, ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ | ప్రేమ కోసమై |
చరణం:వి.జె.వర్మ:ప్రేమకన్ననూ పెన్నిధియేమని యేమి ధనాలిక తెత్తుననీ| ప్రేమ కన్ననూ |
భ్రమసి చూచు ఆ రాజకుమారిని నిముసమె యుగముగ గడుపుమనీ| ప్రేమ కోసమై |


చరణం:వి.జె.వర్మ:ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకుని| ప్రేమలు దక్కని |
ఏమివ్రాసెనో... అటు కానిమ్మని బ్రహ్మదేవునిదే భారమనీ  | ప్రేమ కోసమై |
ప్రేమ కోసమై వలలో పడెనో పాపం పసివాడు...
అయ్యో  పాపం పసివాడు| అయ్యో |"

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఈ పాట వినవచ్చు.


తెలుగు చిత్ర సీమలో అజరామంగా వెలుగొందిన చిత్రం 'పాతాళ భైరవి' లో చిరకాలం, నిలిచిపోయే పాట, గత 70 ఏళ్లుగా సామాన్య ప్రజల గొంతు లో నిలిచిపోయిన పాట.
'ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు....'

 
ఇంత ప్రాచుర్యం పొందిన ఈ పాట పాడినది వి.జె.వర్మ అని   చాలామందికి తెలియదు. పాతాళ భైరవి టైటిల్స్ లో ప్లే బ్యాక్ అని ఘంటసాల, జిక్కి, లీల పేర్లు మాత్రమే ఉంటాయి. మరి అందులో 'ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు....' పాట పాడిన వి జె వర్మ పేరు గాని, 'ఇతిహసం విన్నారా ' అని పాడిన టి జి కమల పేరు గాని, 'వినవే బాల నా ప్రేమ గోల...' అని గోల చేసిన రేలంగి పేరు గాని, ఏ పి కోమల పేరు గాని ఉండవు. ధన సంపాదనకోసం మాయావియని మాంత్రికుని (ఎస్.వి. రంగారావు) ని నమ్ముకుని, తనను నమ్ముకున్న రాజకుమారిని (మాలతి) ఎడబాసి సాగే తోట రాముడిని (ఎన్.టి. ఆర్) రక్షించమని వేయిమార్లు (వేమరు) ప్రార్ధించే తల్లి (సురభి కమలాబాయి) నేపథ్యంలో ఈ నలుగురి పై చిత్రీకరించిన పాట ఇది. పింగళి వారి రచన ఇది.


వి.జె.వర్మ పదిరోజుల పసిగుడ్డుగా ఉన్నప్పుడే కాలం కర్కశంగా కాటేసింది. చీకటి అంటేనే తెలీని వయసులోనే అతని రెండు కళ్లనీ మశూచి వ్యాధి కబళించేసింది. అలాంటి పరిస్థితుల్లో వి.జె.వర్మకి సంగీతమే మనోనేత్రమయ్యింది. కళ్లులేకపోతేనేం... స్వరాల్నే నయనాలుగా మలుచుకున్నాడు. మదనపల్లిలో పుట్టిన వర్మకు మద్రాసు మహానగరం కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

చిన్నతనం నుంచి నేర్చుకున్న వేణుగానం వర్మకు కీర్తి సాక్షాత్కారం కావించింది. ఎన్నో కచ్చేరీలు... రేడియో ప్రోగ్రామ్స్... క్షణం తీరిక లేదు. అలాంటి సమయంలో విజయా సంస్థ నుంచి పిలుపు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో పాట పాడే ఛాన్సు. పాట అదిరింది. విన్నవాళ్లంతా ఆహా ఓహో అన్నారు. ఆంధ్రదేశమంతా మార్మోగిపోయిన ఆ పాట ఏంటో తెలుసా? ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు...’. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి ఈ పాట. వి.జె.వర్మ జన్మ ధన్యం. ఈ ఒక్క పాటతోనే ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. నిజానికి వర్మ ఎవరో ఆ తరంలో చాలామందికి తెలీదు. ఈ తరానికి అంతకన్నా తెలీదు. టోటల్‌గా సినిమా పరిశ్రమే మరిచిపోయింది పాపం. ఎంత అన్యాయం!

వర్మది ఎంత చక్కని గొంతు. నాగయ్య లాంటివాడే మెచ్చుకున్న గొంతు. ‘అచ్చం నాలాగే పాడతావు నాయనా’ అంటూ నాగయ్య ఓసారి మెచ్చేసుకున్నారు కూడా. ఇంత చేస్తే... వర్మ పాడిన పాటలు పదికి మించి ఉండవు. అక్కడో పాట.. ఇక్కడో పాట... అంతే. ‘పాతాళ భైరవి’లోనే ‘కనుగొనగలనో లేనో’ అంటూ ఘంటసాలతో కలిసి ఓ పాట. ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో ‘పోవమ్మా! బలి కావమ్మా’ అంటూ ఇంకో పాట. ‘నా యిల్లు’ (1953)లో ‘ఔరా కాలమహిమ’ అటూ మరో పాట. ‘పెద్ద మనుషులు’ (1954)లో ఓ పాట. ‘ఓరి ఇరక’ అనే తమిళ సినిమాలో పాట. ‘జగన్నాటక సూత్రధారి’లో ఇంకో పాట. తక్కువ పాడినా... తియ్యగా పాడాడు. విధియే కాదు, సంగీత దర్శకులు కూడా వర్మను చిన్న చూపు చూసినట్టున్నారు. కారణాలేంటో తెలీదు కానీ, వర్మకు ప్రోత్సాహమే కరవు. ఒక్క అద్దేపల్లి రామారావు మాత్రం వర్మ ప్రతిభను గుర్తించాడు. ఆయన ఏ సినిమా చేసినా వర్మతో పాట పాడించాల్సిందే. అద్దేపల్లి ఆర్కెస్ట్రాలో వర్మ ఫ్లూట్ వాయించాల్సిందే. అశ్వత్థామ కూడా కొన్నాళ్లు ఎంకరేజ్ చేశారు.

ఆ తర్వాత వర్మ ఒంటరి అయిపోయారు. అవకాశాలిచ్చేవారు లేరు. పట్టించుకున్నవారు లేరు. అప్పటివరకూ కళ్లు లేకపోయినా చీకటి అనిపించలేదు. ఫస్ట్ టైమ్ చీకటి అంటే ఏంటో తెలిసొచ్చింది. నాలుగ్గోడల మధ్యనే జీవితం. అయినా పాటను మరవలేదు. స్వరం చేయి విడువలేదు. కాసేపు త్యాగరాజ కీర్తన ఆలపించడం... ఇంకాసేపు ఫ్లూట్ వాయించడం... ఇవే కాలక్షేపాలు ఆయనకు. అప్పట్లో మద్రాసులో వేడి జ్వరాలు వెల్లువెత్తాయి. వర్మకు తగులుకుందీ పాడు రోగం. అప్పుడు కూడా సంగీతమే రిలీఫ్ ఆయనకు. అర్ధరాత్రి రెండు గంటలకు లేచి గ్లాసుడు మంచినీళ్లు తాగి ఓ త్యాగరాజ కీర్తన పాడారు. అలాగే నిద్రలోకి జారుకున్నారు. తెల్లారింది. కానీ ఆయన నిద్ర లేవలేదు. గూట్లోని వేణువు కన్నీరు పెట్టుకుంది. చీకటి నుంచి చీకటికి వర్మ స్వర ప్రయాణం ముగిసింది. కానీ, పాట ఉన్నంతకాలం వర్మ పండు వెన్నెలే!

ఉన్నంతలోనే సాయపడాలనేది అయన సిద్ధాంతం. ఆయన అసలు పేరు విజయ వర్మ. ఇంటి పేరు పీవీ. అంటే పండ్రూత్తి వల్లం. అదో ఊరి పేరట. మరి వీజే వర్మగా ఎలా పాపులర్ అయ్యారో తెలీదు. ఆయనకు నాగరత్నమ్మతో 1945లో పెళ్లయ్యింది. అప్పటికే ఫ్లూట్ కచ్చేరీలతో బాగా పాపులర్. ట్రంక్ పెట్టె నిండా బోల్డన్ని గోల్డ్, సిల్వర్ మెడల్స్. ఒక అబ్బాయి ఓ అమ్మాయి అతని సంతానం. ఆలిండియా రేడియోలో రెండు నెలలకోసారి ప్రోగ్రామ్స్ చేసేవారు. ఏ జన్మలోనో ఏదో పాపం చేయడం వల్లనే ఇలా అంధుణ్ణయ్యానని బాధపడుతుండేవారు. అందుకే ఈ జన్మలోనైనా ఉన్నంతలో అందరికీ సాయపడాలని తపించేవారు.


B.Ramu

Courtesy : Sri Krishna Vytla, మధుర సంగీతం group, facebook., & vulimirighantasala blog.

24, జూన్ 2021, గురువారం

నీవలపుల నావపైన ప్రేమాంబుధి దాటేస్తా ! -- తెలుగు గజల్



నా చిత్రానికి డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి గజల్


నీవలపుల నావపైన ప్రేమాంబుధి దాటేస్తా !
నాతలపుల తేరుపైన గగనసీమ తాకేస్తా!
నీరాకను తెలిపెనులే గాలిలోని పరిమళమే
ఈలవేసి నీసరసకు తూనీగై వచ్చేస్తా!
చిరుజల్లును ఎడారిపై కురిపించావిన్నాళ్ళకు !
హరితానికి ప్రతీకనై భువిని తొలిచి మొలిచేస్తా!
కన్నులలో సంధ్యారుణ కాంతులేల ఓచెలీ
నీకోసం వెన్నెలనే మేలిముసుగు చేసేస్తా!
హృదయానికి ఉదయాలను చూపించిన ప్రేమమయీ
ముదమారగ దరికొస్తే బ్రతుకుపోరు గెలిచేస్తా!
చల్లనివెన్నెల లైనా సలసలమరిగింతువులే
విషమైనా నువ్విస్తే మధువనుకొని తాగేస్తా !
ఓదేవీ నీవులేని స్వర్గం నాకెందుకులే
నీప్రేమకు దాసుడినై దివినైనా వదిలేస్తా!
~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం-శ్రీ Pvr Murty గారు


 

23, జూన్ 2021, బుధవారం

కరణం మల్లీశ్వరి


 తెలుగు మహిళ పద్మశ్రీ కరణం మల్లీశ్వరి గారికి  విశిష్ట గౌరవం.


ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46) ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(వీసీ)గా నియమితులయ్యారు. ఈమేరకు ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీ కరణం మల్లీశ్వరే కావడం విశేషం. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.


ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో భారత్ కు కాంస్య పతకం సాధించారు. భారత్ తరుపున ఓలింపిక్స్ లో మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళ కరణం మల్లీశ్వరే. 1994,1995లలో 54 కేజీల విభాగంలో రెండుసార్లు వరల్డ్ టైటిల్ సాధించి ఛాంపియన్గా నిలిచారు. 1994లో ఇస్తాంబుల్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించారు. 1995లో కొరియాలో ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సాధించారు.

(pencil sketch)


నా చిత్రానికి శ్రీమతి పద్మజ మంత్రాల తన పద్యం ద్వారా ఇలా స్పందించారు :



కరణం మల్లీశ్వరి యను
తరుణి బరువు లెత్తగ మును దక్కెను బిరుదుల్...
మురియగ నాంధ్రజనావళి
వరియించెను నేడు గొప్ప పదవియు నామెన్!

22, జూన్ 2021, మంగళవారం

గణేష్ పాత్రో - ప్రముఖ నాటక, సినీ రచయిత


My pencil sketch



తన మాటలతో 'మరోచరిత్ర' సృష్టించాడు, 'ఆకలిరాజ్యం' ఎలాగుంటుందో చూపించాడు. 'రుద్రవీణ' మోగించాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నాటాడు. 'మయూరి' వంటి చాలా హిట్ సినిమాలకు మాటలు రాసిన ఘనత దక్కించుకున్నాడు. 'నంది' పురస్కారం దక్కించుకున్నాడు.
ప్రముఖ నాటక, సినీ రచయిత 'గణేష్ పాత్రో' జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి.

వీరి గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది వికీపీడియా లింక్ లో :

 

21, జూన్ 2021, సోమవారం

అద్భుత సంగీత దర్శకుడు 'చిత్రగుప్త'


 అద్భుత సంగీత దర్శకుడు 'చిత్రగుప్త' (1917-1991. (Pencil sketch).

సంగీత ప్రపంచంలో పరిచయమున్నవారికి చిత్రగుప్త అనగానే వారు "భాభీ" చిత్రానికి సమకూర్చిన సూపర్ హిట్ పాటలు "చల్ ఉడ్ జారే పంచీ" (తెలుగులో పయనించే ఓ చిలుకా), చల్ చల్ రే పతంగ్ మేరీ చల్ రే (పద పదవే వయ్యారి గాలి పటమా) పాటలు గుర్తుకొస్తాయి. ఈ రెండు పాటలు ప్రఖ్యాత వాఖ్యాత నిర్వహించిన 'బినాకా గీత్ మాలా" టాప్ లో నిలిచాయి. ఈ చిత్రం తెలుగులో 'కులదైవం' పేరుతో నిర్మించడమే కాకుండా ఈ రెండు బాణీలు అలాగే ఉపయోగించుకున్నారు. తెలుగులో ఈ పాటలు బాగా హిట్ అయ్యాయి. వీరు 'Main chup rahungi' (తెలుగులో అదే చిత్రం మూగనోము పేరుతో వచ్చింది). ఈ చిత్రం కోసం సమకూర్చిన బాణీ "main kaun hoon main kahan hoon" పాటని అదే బాణీతో "కలనైనా నిజమైనా" పాటగా హిట్ అయ్యింది.

చిత్రగుప్త 1946 నుండి 1998 వరకు 150 చిత్రాలకు సంగీతం సమకూర్చారు. వాటిలో జనాదరణ పొందినవి జబక్, భాభి, ఊంచేలోగ్, ఆకాష్ దీప్, వాస్నా, ఔలాద్, ఇన్సాఫ్ కి మన్జిల్ మరియు కాళి టోపి లాల్ రుమాల్. మీనా కుమారి మరియు సునీల్ దత్ నటించిన "మైం చుప్ రహూంగీ" 1962 లో విడుదలైన తరువాత సినీ సంగీత ప్రపంచంలో వీరి ఖ్యాతి మరింత పెరిగింది. . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద "సూపర్ హిట్" గా నిలిచింది మరియు "చాంద్ జానే కహాన్ ఖో గయా" మరియు "కోయి బతా దే దిల్ హై కహాన్" వంటి పాటలు ప్రాచుర్యం పొందాయి. అతను ఎక్కువగా గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురి పాటలకి సంగీతం సమకూర్చారు.

అలాగే "గంగా కి లాహ్రెయిన్" లోని కిషోర్ కుమార్ మరియు లతా మంగేష్కర్ పాడిన "మచ్లతి హుయ్ హవా మేం" పాట విజయవంతమైంది.
వీరు పలు భోజ్పురి చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

భాభీ చిత్రానికి వీరు స్వరపరచిన "Chal ud jaa re" పాట ఈ క్రింది లింక్ లో క్లిక్ చేసి వినవచ్చు..



13, జూన్ 2021, ఆదివారం

బుచ్చి బాబు (రచయిత)


ప్రముఖ రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి. వీరు రచించిన 'చివరకు మిగిలేది" నవలా సాహిత్యం లో ఓ సంచలనం. తెలుగులో వచ్చిన 'చివరకు మిగిలేది' సినిమా వీరి నవల ఆధారంగా తీసిన సినిమా అని కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాశారు.. ఈ సినిమా బెంగాలీలో నిర్మించిన 'దీప్ జలే జాయ్' చిత్రంగా ఆధారంగా తీసారు. (pencil sketch)


"నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే. నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు - వీటిని గురించినవే. నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి. అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం. మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా అభిరుచి కలగజేసే యత్నం చేస్తాను. ప్రతి రచయితా తన రచనపట్ల అభిరుచి తనే ప్రయత్నపూర్వకంగా కలగచెయ్యాలి. నిత్యజీవితంలో రచయిత సంఘర్షణకి గురవుతాడు. తాను కోరిన ఉద్యోగం దొరకదు, ప్రేయసి దొరకదు, స్నేహితులుండరు. తాను ఆరాధించిన ఆదర్శశిఖరాలు కూలిపోతూ వుంటే చూస్తూ ముక్కు మీద వేలేసుగుని కూర్చంటారు. బాల్యంలో తన కేవో పేచీలు, బాధలు ఏర్పడతాయి. ఒక సంఘర్షణ ప్రబలి, ద్వంద వ్యక్తిత్వం ఏర్పడి యీ బాధని ఇతరులతో చెప్పుగుని విముక్తుడవుతాడు. సంఘర్షణ నిలిచి, ద్వంద వ్యక్తిత్వానికి సమన్వయం కుదిరి, ఏకత్వం సాధించినవాడు అతను యోగి - ఇంక వ్రాయడు. గొడవ విని, యీ బాధని పంచుకోడానికి సిద్ధపడే పాఠకులు వొకరిద్దరో వుంటారేమో. ఒక్కడు వున్నా కథకుడు ప్రయోజనం సాధించి చరితార్ధుడైనట్లే భావిస్తాను."


 

7, జూన్ 2021, సోమవారం

ఖ్య్వాజా అహ్మద్ అబ్బాస్ - చరిత్ర సృష్టించిన రచయిత

ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ - my pencil sketch


ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ అనగా గుర్తుకొచ్చేవి రెండు, రాజ్ కపూర్ వీరు రచించిన కధ ఆధారంగా నిర్మించిన "ఆవారా" చిత్రం. ఇది అప్పటికీ ఇప్పటికీ భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ sensation! రెండవది : sensational వార పత్రిక Blitz లో వీరి కాలమ్ : "Last Page". అబ్బాస్ గారి జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి. మరిన్ని వివరాలు వికీపీడియా ఆధారంగా :
Tribute to K.A.Abbas (Khwaja Ahmad Abbas) on his birth anniversary. (My pencil sketch)
Abbas was an Indian film director, screenwriter, novelist, and a journalist in the Urdu, Hindi and English languages. He won four National Film Awards in India, and internationally his films won the Palme d'Or (Grand Prize) at the Cannes Film Festival (out of three Palme d'Or nominations) and the Crystal Globe at the Karlovy Vary International Film Festival. As a director and screenwriter, Khwaja Ahmad Abbas is considered one of the pioneers of Indian parallel or neo-realistic cinema, and as a screenwriter he is also known for writing Raj Kapoor's best films.

His column ‘Last Page’ holds the distinction of being one of the longest-running columns in the history of Indian journalism. The column began in 1935, in The Bombay Chronicle, and moved to the Blitz after the Chronicle's closure, where it continued until his death in 1987. He was awarded the Padma Shri by the Government of India in 1969. 

 

6, జూన్ 2021, ఆదివారం

రాముడిదె లోకాభిరాముడు - అన్నమయ్య కీర్తన






 

అన్నమయ్య కీర్తనకి నా చిత్రాలు (బాపు బొమ్మలు ఆధారంగా వేసుకున్న చిత్రాలివి)


రాముడిదె లోకాభిరాముడితడు

గోమున పరశురాముకోప మార్చెనటరే
యీతడా తాటకిఁ జించె యీపిన్నవాడా
ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె
చేతనే యీకొమారుడా శివునివిల్లు విఱిచె
సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త కదవె
మనకౌసల్యకొడుకా మాయామృగము నేసె
దనుజుల విరాధుని తానే చెఱిచె
తునుమాడె నేడుదాళ్ళు తోడనే వాలి నడచె
యినకులుఁ డితడా యెంతకొత్త చూడరే
యీవయసునుతానే యాయెక్కువజలధి గట్టి
రావణు జంపి సీత మరలఁ దెచ్చెను
శ్రీవేంకటేశుడితడా సిరుల నయోధ్య యేలె
కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే


5, జూన్ 2021, శనివారం

కధానిలయం కధానాయకుడు - కాళీపట్నం రామారావు




 

కాళీపట్నం రామారావు - నా pencil drawing

చెల్లాచెదురుగా ఉన్న కథా సాహిత్యాన్ని ఒకే చోట చేర్చే యజ్ఞంలో ఓ కథాతపప్వి సాహితీ సేవకు ప్రతిరూపంగా శ్రీకాకుళం లో ఓ కథానిలయం ఏర్పడింది. కథల కాణాచి కారా మాష్టారు మానసపుత్రికగా.... ఎక్కడెక్కడో విచ్చుకున్న కథా పుష్పాలన్నింటినీ సేకరిస్తూ 'కథా నిలయం' అన్న పేరుకే సార్థకత చేకూరుస్తూ ముందుకు సాగుతోంది.

'కారా మాష్టరు' గా తెలుగు సాహ్యిత్య ప్రపంచంలో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని ఏర్పర్చుకున్న కాళీపట్నం రామారావు గారు నిన్న స్వర్గస్తులయ్యారు. వారికి నా చిత్ర నివాళి.

మరిన్ని వివరాలు వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది లింక్ లో ...



దానవ సంహా రమునకు మానుష రూపంబునెత్త మాధవు డిలపై వానికి తోడుగ రుద్రుడు వానర రూపం బునొందె వాయుసుతుండై !

 


నా చిత్రానికి చక్కని పద్యాలు రచించిన మా కుటుంబ మిత్రురాలు, శ్రేయోభిలషి డా. ఉమాదేవి జంధ్యాల గారికి కృతజ్ఞతలు


1)కం॥
దానవ సంహా రమునకు
మానుష రూపంబునెత్త మాధవు డిలపై
వానికి తోడుగ రుద్రుడు
వానర రూపం బునొందె వాయుసుతుండై !

2)ఉ॥
పట్టగ సూర్యునే దలచి పండుగ మారుతి పోవుచుండగన్
కొట్టెను నేమిచే హయుడు కూనని యెంచక హన్వుదాకగన్
తిట్టుచు వాయుదేవుడును తెమ్మెర నిల్పగ నెల్లలోకముల్
తుట్టున కోర్వలేక పరితోషణ నొందగ దీర్చిరర్థముల్ !
(నేమి - వజ్రాయుధం
తుట్టు- బాధ
పరితోషణ - సంతోషము)

3)సీ||
లంఘించి సంద్రమున్ లాఘవంబున,లంక
జేరి గన్గొనెకదా సీతజాడ !
మెప్పించు మాటలన్ మైధిలి శోకంబు
నుడిపియొసగెరాము నుంగరంబు ‘!
కుప్పించి యెగురుచు గూల్చెను వనమంత
రావణునకెరిగింప రాక తనది !
దండింప నుంకింప దగ్ధంబు గావించె
కపివీరుడననేమొ గనుల బడగ !

ఆ.వె॥
చేరి రాఘ వునకు చింతామణినియిచ్చె
సీత జాడ దెలిపి చింతదీర్చె
బంటు రీతి గొల్చి పవరము జరిపించె
స్వామి హత్తు కొనగ సంతసించె !

4)తే.గీ ।।

అసమ బలశాలి యంజన యాత్మ భవుడ!
సకల సద్గుణ వంతుడ! శౌర్యధనుడ!
స్వర్ణ దేహుడ! సుగ్రీవ సచివ హనుమ !
రామభక్తాగ్ర గణ్యుడా రక్ష నీవె !

5)ఉ॥మాలిక

వాలము ద్రిప్పి పైకెగిరి వార్థిని దాటిన వాయుపుత్ర నీ
వాలము జుట్టిగుండ్రముగ ప్రస్తరణంబున నిల్చిరావణున్
‘ఆలము జేయగా దగదు యారఘు రామునితో’ననంగ, పో
గాలము దాపురింప దశకంఠుడు మెచ్చడు నీదు మాటలన్
చేలము జుట్టివాలమున చిచ్చును బెట్టగ నూరుకుందువే
ఫాలుడ వైననీవపుడు పావకు డొందగ బ్రీతిఁజేయవే !
కూలగ జేసినావుగద గుండెన ధైర్యము దైత్యనాథుకున్ !

6)తే.గీ
జ్ఞాన పరిపూర్ణ హనుమంత జయము నీకు !
వాయుపుత్రుడ!భయహారి! భక్త సులభ !
గదను బట్టిన నీధాటి కెదురుగలదె !
దనుజ సంహారి! బ్రోవుమా దయతొ మమ్ము !

7)కం॥
గ్రహపీడదొల్గ జేసెడి
మహిమాన్వితుడైనవాడు మారుతి యనగన్
రహియింప జేయ భక్తుల
వహియించునువానిభరము భక్తసు లభుడై

8)కం॥
భయవిహ్వలులైనప్పుడు
భయమును పోగొట్టియాత్మ బలమునొసంగున్
జయమునకు తగిన శక్తిని
రయమున చేకూర్చుహనుమ ప్రస్తుతి సేయన్ !

9)సింధువు దాటిన వానికి
సింధూరమునిష్టపడెడి చిద్రూపునకున్
డెందముననిలిపి రాముని
యందరికాదర్శమైన యనిలజు దలతున్ !

10)
నేడు పీడించు రాక్షసిన్ నేలగూల్చ
ననిల తనయుని గొల్చెద నార్తితోడ
బ్రోవరావయ్య జగతిని మ్రుచ్చునుండి
నేటి వేడుక గుర్తుగ నింపు శుభము !

—————-
చిత్రం
శ్రీ Pvr Murty గారిది. వారికి కృతజ్ఞతలు

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...