28, జూన్ 2021, సోమవారం

"నిదురించే తోటలోకి..' పాట - రచన గుంటూరి శేషేంద్ర శర్మ

గుంటూరు శేషేంద్ర శర్మ

pencil drawing



గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక్క పాట తెలుగు సినీ సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది. ఈ పాట విశ్లేషణ నాకు whatsapp లో తారసపడింది. ఈ పాటను ఎవరు విశ్లేషించారో నాకు తెలియదు. ఆ విశ్లేషణ చదివిన వారికి,  శేషేంద్ర శర్మ గారి భావుకత కి జోహార్లు అర్పించకుండా ఉండలేము.  ఇంత చక్కగా విశ్లేషించిన ఆ వ్యక్తికి నా ధన్యవాదాలు. నేనొక చిత్రకారుణ్ణి.  విశ్లేషణ చదివిన వెంటనే శేషేంద్ర శర్మ గారి చిత్రాన్ని నా pencil తో చిత్రీకరించుకున్నాను. విశ్లేషణ ఎటువంటి మార్పులూ లేకుండా అందరికీ వీరి పాట గురించి తెలియాలన్న సదుద్దేశంతో ఇక్కడ పొందుపరుస్తున్నాను.


విశ్లేషణ చదివేముందు ఈ పాట ఒకసారి వింటే బాగుంటుందని ఈ పాట లింకు ఇక్కడ ఇస్తున్నాను.

https://www.youtube.com/watch?v=fgmx0Q887RI

 

నిదురించే తోటలోకి............

 

పాటలు రాయడం సులభం కావచ్చు. కానీ సినిమాలకు సన్నివేశపరంగా పాటలు రాయడం అంత సులభం కాదు. సన్నివేశానికీ,పాత్ర మనో భావాలకీ తగ్గట్టుగా, అతికినట్టుగా పాట రాయాలంటే కవి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. అప్పుడే చక్కని భావాల గీతాలు పుడతాయి. అటువంటి చక్కని రచనకు అద్భుతమైన సంగీతమూ, గాన మాధుర్యమూ, చిత్రీకరణా కూడితే ఆ పాట ఎన్ని తరాలయినా ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. పెదవులపై పారాడుతుంది. తెలుగు సినీ గీతాలలో ఇటువంటి మణిపూసలు ఎన్నో. సుకవులు ఎందరో. 

కేవలం ఒకే ఒక్క పాట రాసి చలన చిత్ర రంగంలో గీత రచయితగా గొప్ప స్థానాన్ని పొందిన కీర్తి గుంటూరు శేషేంద్ర శర్మ గారిది. ముత్యాల ముగ్గు చిత్రం కోసం వారు రాసిన 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది....'అనే గీతం గొప్ప ఆర్త గీతం. అద్భుతమైన సన్నివేశానికి, అద్భుతమైన రచన, అత్యంత అద్బుతమైన చిత్రీకరణ, మహాద్భుతమైన సంగీతం.......కోటి కోకిలలకు ఏక రూపమైన గాత్రధారి సుశీలమ్మ గానం. వెరసి ఇది ఒక విషాద రసరమ్యగీతం. 

తేట తెలుగు తోటలో స్వేచ్ఛగా విహరించి ఏర్చి కూర్చి తెచ్చిన పదసుమాలతో కవి అల్లిన గీత మాలికకు అద్భుతమైన భావాన్ని అద్ది ప్రతి పదాన్ని సుశీలమ్మ పలికిన తీరు ...కరకు గుండెనైనా కరిగించి తీరు!. 

సన్ని వేశ పరంగా చూస్తే కథానాయిక రాముడిచే పరిత్యజించబడిన సీత. లవకుశల్లాంటి ఇద్దరు పిల్లలతో వాల్మీకి లాంటి ఆశ్రమవాసి రక్షణలో జీవనం సాగిస్తూ ఉంటుంది. 'ఏ నాటికైనా తన రాముడు కనికరిస్తాడా ? అపార్థాలు తొలగి భర్తను కలవగలుగుతుందా ?తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతున్న పిల్లలను అతని సన్నిధికి చేర్చగలుగుతుందా? ఎప్పటికైనా తామంతా ఒకే కుటుంబంగా జీవించగలుగుతారా? 'ఇవన్నీ కథానాయికను నిరంతరం వేధించే ప్రశ్నలు. వేదనని గుండెల్లోనే దాచుకుంటూ మూగగానే భగవంతుడిని వేడుకుంటూ జీవితాన్ని భారంగా గడుపుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. కన్ను మూసేలోగా కలలోనైనా క్షణకాలమైనా దర్శనమిస్తాడో లేదోనని ఆరాటపడుతున్న మూర్తి కనిపించాడు.ప్రత్యక్షంగా కాకపోయినా కన్నకూతురితో నవ్వుతూ మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇది ఆమెకు దివ్యదర్శనం. రమ్యమైన అనుభూతి. ఒకసారి ఎదురు వెళ్ళి పలకరిద్దామనిపించినా అడుగు ముందుకు పడదు. తనమీద ద్వేషంతో రగిలిపోతున్న మనిషి పన్నెత్తి పలకరిస్తాడా ?  ఎవరో అనుకొని మాట్లాడుతున్నాడు కానీ తన కూతురే అని తెలిస్తే ఏమౌతాడో ? అతని భావాలు ఎలా ఉంటాయో ? అసహ్యించుకుంటాడో ? ప్రేమతో ఆలింగనం చేసుకుంటాడో!!

 ఇలాంటి ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ  మానసికంగా సిద్ధమయే లోపలే పడవ ముందుకి సాగిపోతూ నాయకుడిని తనతో పాటు తీసుకు పోతూ రేవుని బావురుమనిపిస్తుంది. 

ఈ చిన్న సంఘటన కథానాయిక మనసుని అతలా కుతలం చేసింది. నిరాశనుంచి పుట్టిన చిరు ఆశ దీపంలా వెలిగి తన జీవితాన్ని వెలిగిస్తుందా లేక నిరాశలోనే తన జీవితం లయిస్తుందా ? జవాబు తెలియని ప్రశ్నలు ఆమెను వేధించసాగాయి. ఏది ఏమైనా ....చిక్కటి చీకటి నిండిన ఆకాశంలో అతని రాక నిండు జాబిల్లి కాకపోయినా మిణుక్కు మిణుక్కుమనే నక్షత్రం లాంటిది. ఏమో! ఎవరు చెప్పగలరు?!  ఆ తార పక్కనే మబ్బుల్లో నిండు చంద్రుడు దాగున్నాడేమో ?ఆ మబ్బు తొలగిపోతే తన జీవితంలోనూ పండువెన్నెల కురుస్తుందేమో! ఏమో!  పీడకలలు తప్ప మామూలు కలలు కూడా కనలేని స్థితిలో ఉన్న ఆమెకు అతని రాక ఒక కమ్మని కల. ఆ కల కన్నీటిని తుడిచి తెలియని ఆశని, ఓదార్పుని ఇచ్చింది. ఆ వెంటనే నది దోచుకు పోతున్న నావ తీరని నిరాశని, నిట్టూర్పునీ కూడా ఇచ్చింది.

 

ఆశ నిరాశల మధ్య ఉయ్యాల లూగుతూ, వింత అనుభవం ఇచ్చిన ఉద్విగ్న స్థితిలో ఉన్న కథానాయిక నోట కవి పలికించిన భావగీతమే ఈ పాట. అతి కమ్మని పాట లోని ప్రతి మాటా ఓ చక్కని భావ చిత్రంగా ప్రతీకాత్మకంగా పలికించిన ఘనత శేషేంద్రవారిది. 

బాపూ రమణల భావవాహినిలో రూపొందించబడ్డ రమ్యమైన సన్నివేశం. చక్కని గోదారి ఒడ్డున, చిన్న పొదరిల్లు. దాని చుట్టూ చక్కని తోట. అటువంటి చోట నిలబడి నది దోచుకుపోతున్న నావను, నావ దోచుకుపోతున్న నాథుడ్నీ చూస్తూ విలపిస్తూ కథానాయిక ఆలపించే గీతం ఇది.

 

*నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది 

కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

 

 

నిజానికి తోట అనగానే అందమైన చెట్లు,రంగు రంగులుగా విరబూసి గాలికి తలలూపే పూలు, వాలుగా సెలయేరు కళ్ళముందు మెదులుతాయి. కానీ ఈ తోట అన్ని తోటల్లోగా అందమైనదీ సందడితో నిండినదీ కాదు. తోటే కానీ నిదురించే తోట. నిరాశతో నిండిన  నాయిక జీవితాన్ని నిదురించే తోటతో పోల్చడమే ఒక చక్కని బావ చిత్రం. అలాంటి నిదురించే తోటలోకి పాటరావడం (కథానాయకుడి రాక) నిశ్శబ్దాన్ని చీల్చే సవ్వడి చేయడం నిదురించిన ఆశలను మేల్కొలపడమే కదూ. ఆ మధురమైన పాట కన్నీటిని తుడవడమే కాదు ఒక కమ్మని కలనే కానుకగా ఇచ్చింది. 

*రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ 

దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ 

శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ 

ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసిందీ 

ఆ కల నిజంగా ఎంత కమ్మనిదో ! ఆ పాట ఎన్ని అద్భుతాలు చేసిందో. కుటీరాల ముంగిట్లో శుభాల ముగ్గులేసింది. చీకటి నిండిన గూటిలో దీపమై వెలిగింది. ఏ స్వరమూ పలుకలేక మూగబోయిన వేణువులో ఒక కొత్త స్వరం కలిపింది. ఆశలనే ఆకులను దిగులుగా రాల్చేసుకున్న అడవిలో ఒక కొత్త ఆశ వసంతంగా దయచేసింది. కుటీరం, దీనురాలి గూడు, శూన్యమైన వేణువు, ఆకురాలు అడవి ఇవన్నీ  విగతాశ అయిన కథానాయిక నిస్సారమైన జీవితానికి ప్రతీకలైతే రంగవల్లి, దీపము, స్వరం, ఆమని కథానాయకుని ఆగమానికీ, కొత్త ఉత్తేజానికి ప్రతీకలు.

 

*విఫలమైన నా కోర్కెల వేలాడే గుమ్మంలో

ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి

కొమ్మల్లో పక్షుల్లారా!

గగనంలో మబ్బుల్లారా!

నది దోచుకుపోతున్న నావను ఆపండీ! 

రేవు బావురు మంటోందని నావకు చెప్పండీ! 

కథానాయిక నిలచిన గుమ్మం ఇంటికి శుభసూచకంగా కట్టే మామిడాకులు వేలాడే గుమ్మంకాదు. విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మం అది. అలాంటి నిరాశ నిండిన గుమ్మంలో ఆశల అడుగుల సవ్వడి వినిపించింది.  ఆసవ్వడి విని ఆనందించే లోపలే ఆ ఆడుగులు దూరమై పోయాయి. ఆమె పిలుపు వినబడనంత దూరంలో నావలో ఉన్నాడతను. ఆ నావను నది అతి వేగంగా దోచుకుపోతోంది. ఆ అడుగుల సవ్వడిని శాశ్వతంగా గుమ్మంలోనే నిలబెట్టగలిగే శక్తి ఎవరికుంది.  ఆ వేగాన్ని అందుకునే శక్తి మానవ మాత్రులకు లేదు. అందుకే ఆమె ప్రకృతిని ఆశ్రయించింది. వాయువేగంతో ఎగిరే పక్షులూ, గగనాన గమించే మబ్బులనూ పిలిచి నది దోచుకుపోతున్న నావను ఆపమంటూ నావలేని రేవు బావురుమంటోందంటూ తన ఆవేదనను సందేశంగా వినిపించమంటూ దీనంగా ప్రార్థించింది. 

మరి పక్షులూ మబ్బులూ నావను ఆపగలిగాయా? 

నాయిక సందేశాన్ని వినిపించ గలిగాయా? 

పాట విన్న ప్రతి ఒక్కరిలో నూ రేగే ఆత్మీయ ఉత్కంఠ ఇది.

 

అవి తప్పక వినిపించే ఉంటాయిలే. నాయిక వేదనను తీరుస్తాయిలే. ప్రకృతి కష్టాలను మానవుడు అర్థం చేసుకోలేడేమోగాని, మానవుడి కష్టాలను ప్రకృతి తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు అనే చిరు ఆశతో నిండిన విషాదభరితమైన గుండె నుంచి వెలువడిన వేడి నిట్టూర్పుకు వెచ్చటి కన్నీటి పొర జతగూడి ఓదార్పునిస్తుంది. 

ఆశనిరాశల మధ్య ఊగులాడే కథానాయిక కల్లోల మానస కాసారంలో ఈదులాడి ఆమెలో కదలాడే ప్రతి భావాన్ని తన భావంగా అనుభూతించి చక్కని భావచిత్రాలతో కరుణరస స్ఫోరకంగా శేషేంద్ర రాసిన గీతమిది. 

అత్యంత విషాద మాధుర్యంతో నిండిన గీతాన్ని రాసి ఒక్క పాటతోనే సినీ గీతాభిమానుల హృదయంలో చిరంజీవిగా నిలిచి పోయిన ఘనుడు శేషేంద్ర శర్మ



 



 

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఈ పాట సినిమా కోసం రాసింది కాదు,వారు రాసుకున్న అనేక బావగీతల నుండి బాపు రమణలు, ఈ గీతాన్ని ఇస్తే, మా సినిమాకు వాడుకుంటాము అంటే, వారు ఇచ్చారట...గ్రేట్ poeitic value..

Rao S Lakkaraju చెప్పారు...

థాంక్స్ ఫర్ పోస్టింగ్.

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...