5, జూన్ 2021, శనివారం

దానవ సంహా రమునకు మానుష రూపంబునెత్త మాధవు డిలపై వానికి తోడుగ రుద్రుడు వానర రూపం బునొందె వాయుసుతుండై !

 


నా చిత్రానికి చక్కని పద్యాలు రచించిన మా కుటుంబ మిత్రురాలు, శ్రేయోభిలషి డా. ఉమాదేవి జంధ్యాల గారికి కృతజ్ఞతలు


1)కం॥
దానవ సంహా రమునకు
మానుష రూపంబునెత్త మాధవు డిలపై
వానికి తోడుగ రుద్రుడు
వానర రూపం బునొందె వాయుసుతుండై !

2)ఉ॥
పట్టగ సూర్యునే దలచి పండుగ మారుతి పోవుచుండగన్
కొట్టెను నేమిచే హయుడు కూనని యెంచక హన్వుదాకగన్
తిట్టుచు వాయుదేవుడును తెమ్మెర నిల్పగ నెల్లలోకముల్
తుట్టున కోర్వలేక పరితోషణ నొందగ దీర్చిరర్థముల్ !
(నేమి - వజ్రాయుధం
తుట్టు- బాధ
పరితోషణ - సంతోషము)

3)సీ||
లంఘించి సంద్రమున్ లాఘవంబున,లంక
జేరి గన్గొనెకదా సీతజాడ !
మెప్పించు మాటలన్ మైధిలి శోకంబు
నుడిపియొసగెరాము నుంగరంబు ‘!
కుప్పించి యెగురుచు గూల్చెను వనమంత
రావణునకెరిగింప రాక తనది !
దండింప నుంకింప దగ్ధంబు గావించె
కపివీరుడననేమొ గనుల బడగ !

ఆ.వె॥
చేరి రాఘ వునకు చింతామణినియిచ్చె
సీత జాడ దెలిపి చింతదీర్చె
బంటు రీతి గొల్చి పవరము జరిపించె
స్వామి హత్తు కొనగ సంతసించె !

4)తే.గీ ।।

అసమ బలశాలి యంజన యాత్మ భవుడ!
సకల సద్గుణ వంతుడ! శౌర్యధనుడ!
స్వర్ణ దేహుడ! సుగ్రీవ సచివ హనుమ !
రామభక్తాగ్ర గణ్యుడా రక్ష నీవె !

5)ఉ॥మాలిక

వాలము ద్రిప్పి పైకెగిరి వార్థిని దాటిన వాయుపుత్ర నీ
వాలము జుట్టిగుండ్రముగ ప్రస్తరణంబున నిల్చిరావణున్
‘ఆలము జేయగా దగదు యారఘు రామునితో’ననంగ, పో
గాలము దాపురింప దశకంఠుడు మెచ్చడు నీదు మాటలన్
చేలము జుట్టివాలమున చిచ్చును బెట్టగ నూరుకుందువే
ఫాలుడ వైననీవపుడు పావకు డొందగ బ్రీతిఁజేయవే !
కూలగ జేసినావుగద గుండెన ధైర్యము దైత్యనాథుకున్ !

6)తే.గీ
జ్ఞాన పరిపూర్ణ హనుమంత జయము నీకు !
వాయుపుత్రుడ!భయహారి! భక్త సులభ !
గదను బట్టిన నీధాటి కెదురుగలదె !
దనుజ సంహారి! బ్రోవుమా దయతొ మమ్ము !

7)కం॥
గ్రహపీడదొల్గ జేసెడి
మహిమాన్వితుడైనవాడు మారుతి యనగన్
రహియింప జేయ భక్తుల
వహియించునువానిభరము భక్తసు లభుడై

8)కం॥
భయవిహ్వలులైనప్పుడు
భయమును పోగొట్టియాత్మ బలమునొసంగున్
జయమునకు తగిన శక్తిని
రయమున చేకూర్చుహనుమ ప్రస్తుతి సేయన్ !

9)సింధువు దాటిన వానికి
సింధూరమునిష్టపడెడి చిద్రూపునకున్
డెందముననిలిపి రాముని
యందరికాదర్శమైన యనిలజు దలతున్ !

10)
నేడు పీడించు రాక్షసిన్ నేలగూల్చ
ననిల తనయుని గొల్చెద నార్తితోడ
బ్రోవరావయ్య జగతిని మ్రుచ్చునుండి
నేటి వేడుక గుర్తుగ నింపు శుభము !

—————-
చిత్రం
శ్రీ Pvr Murty గారిది. వారికి కృతజ్ఞతలు

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...