3, జూన్ 2021, గురువారం

శ్రీరంగం గోపాలరత్నం

గతంలో ప్రముఖ గాయని కీ.శే. శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి టూకీగా ఈ బ్లాగులో రాసుకున్నాం.  ఇప్పుడు మరికొన్ని వివరాలతో ఈ క్రింది లింక్ లో ... కీ.శే. ప్రముఖ గాయకులు కీ.శే. KBK మోహన్ రాజు గారు, గోపాలరత్నం గారు కలిసిన పాట కూడా ఈ క్రింది లింక్ క్లిక్ చేసి  వినవచ్చు.


https://www.facebook.com/kbk.mohanraju/posts/3759423140808545?notif_id=1622734488380897&notif_t=comment_mention&ref=notif


#శ్రీరంగం_గోపాలరత్నం (1939 ~ 16-3-1993) ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు మొదలైనవి ఈమె ఆలపించిన పాటల్లో ప్రాచుర్యం పొందినవి. 1992 లో ఈమెకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం లభించింది.
*ఆబాలగోపాలాన్ని అలరించిన రత్నం*_
ఆంధ్రభూమి పత్రిక కోసం *శ్రీ సుధామ* గారు శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారు వ్రాసిన *శ్రీరంగం గోపాలరత్నం (జీవితం- సంగీతం)* అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ రాసిన వ్యాసం : *Published Friday, 25 December 2015
ఆకాశవాణిలో లలిత సంగీత కళాకారిణిగా, కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా పేరెన్నికగన్న శ్రీరంగం గోపాలరత్నం అశేష శ్రోతలకు చిరపరిచితమైన పేరు. విదుషీమణి సంగీత చూడామణి కుమారి శ్రీరంగం గోపాలరత్నంగారి జీవితం-సంగీతం గురించి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాలగారు ఓ గ్రంథాన్ని సంతరించటం ఎంతైనా అభినందనీయమైన సంగతి. వారితో జానకీబాలగారికి సన్నిహిత పరిచయం వుండటం కూడా ఈ గ్రంథ రచనకు లాభించింది. శ్రీమతి శారదా శ్రీనివాసన్‌గారు ఈ గ్రంథానికి చక్కని పీఠిక సమకూర్చారు.
సంగీత ప్రపంచంలో శ్రీరంగం గోపాలరత్నంగారి పేరు ఆ రోజుల్లో విస్తారంగా వినిపించేది. రేడియోలో ఆమె పాటలంటే శ్రోతలు పరవశించిపోయేవారు. లలిత గీతాలు పాడినా, శాస్ర్తియ సంగీతం పాడినా, శ్లోకాలు, పద్యాలు వినిపించినా ఆమె గొంతు ఎంతో శ్రావ్యంగానూ పలుకు ఎంతో స్పష్టంగానూ వుండి పాట భావానికి రసానుభూతి తెచ్చిపెట్టేది.
మంచాల జగన్నాథరావుగారు బాలమురళిని గోపాలరత్నంని హైదరాబాద్ పిలిపించి నండూరివారి ఎంకి పాటలు ఎన్నింటినో పాడించారు గానీ ఎందుకో ఎంకి పాటలు ప్రసారం చేయకూడదని రేడియోలో నిషేధం విధించబడింది. గోపాలరత్నంగారు మొదట్లో ఓలేటి వెంకటేశ్వర్లుగారు గురువుగా ఆకాశవాణి సంగీత శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆ తరువాత ఆవిడే స్వయంగా సంగీత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కూడాను. భక్తిరంజనిలో తిరుప్పావై, సప్తపదులు విశేష ప్రాచుర్యం పొందడానికి ఆవిడ గళం కూడా కారణమే. ధనుర్మాస ప్రారంభానికి రేడియో భక్తిరంజనిలో ఆమె గళం ఆనాడు ఒక ‘ఐకాన్’గా నిలిచింది.
జానకీబాలగారు ఎంతో శ్రమకూర్చి అజ్ఞాతంగా వుండిపోయిన గోపాలరత్నంగారి జీవితానికి, సంగీతానికి సంబంధించిన అనేక విషయాలను ప్రోగుచేసి ఆ విదుషీమణిని ఈ తరానికి కూడా పరిచయం చేస్తూ అపురూపమైన ఈ గ్రంథరచన కావించారు.
శ్రీరంగం వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు 1939వ సంవత్సరంలో విజయనగరం జిల్లా పుష్పగిరిలో జన్మించిన గోపాలరత్నం ఇంట సహజంగానే వున్న సంగీత ప్రతిభను వంట పట్టించుకున్నారు. చిన్నవయసులోనే తన మేనమామ,
అయిన అప్పకొండమాచార్యులు వారి తల్లి గారు కలిసి వ్రాసిన హరికథలకు బాణీలుకట్టి పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానంచేసిన ఘనత ఆమెది. వైష్ణవ భక్తి సంప్రదాయపు కుటుంబం గనుక సంగీతానురక్తీ, భక్తీ బంగారానికి తావిలా అబ్బాయి. కళానిలయమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జి.పి.ఎస్.నాయర్ డైరెక్టర్‌గా వుండగా 1957లో శ్రీరంగం గోపాలరత్నం ‘టీన్ ఏజ్’లోనే నిలయ విద్వాంసురాలిగా చేరారు. 1957నుండి 1977 వరకు రెండు దశాబ్దాలపాటు రేడియోని ఏలిన గళం ఆమెది. నటిగా, యక్షగాన గాయనిగా, లలిత సంగీత గాయనిగా, అన్నమాచార్య పద ప్రచారకురాలిగా, సంస్కృత నాటకాల పాత్రధారిణిగా, పద్య గాన ప్రతిభామతిగా, స్వరకారిణిగా గోపాలరత్నం గొప్ప ప్రయోగశీలిగా భాసించారు. రేడియోలో పనిచేస్తూనే కర్ణాటక శాస్ర్తియ సంగీత కచేరీలను దేశమంతటా తిరిగి చేశారావిడ. ఎందరో కవులు రాసిన లలిత గీతాలకు తన గళంతో విశేషఖ్యాతి తెచ్చిపెట్టిందావిడ. వేటూరి సుందరరామమూర్తిగారి "సిరికాకొలను చిన్నది" సంగీత రూపకంలో ప్రధానపాత్ర పోషించింది గోపాలరత్నంగారే. అన్నమాచార్య కీర్తనలు గానంచేసి ప్రచులితం చేసిన వారిలో ప్రథమగణ్యురాలు అని చెప్పదగిన గాయని గోపాలరత్నం.
ఆమె సినిమాల్లో రెండే పాటలు పాడారు. ఆ మార్గంలో తనకంత కుదరలేదని ఆమే స్వయంగా చెప్పారట! దేశంలో విస్తృతంగా తిరిగి కర్ణాటక శాస్ర్తియ సంగీత కచ్చేరీలు చేశారావిడ. 1977లో హైదరాబాద్ త్యాగరాజ సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్‌గా 1979లో సికింద్రాబాద్ రామదాసు సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అలాగే 1988లో తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళాపీఠానికి తొలి ప్రొఫెసర్ డీన్ ఆవిడే. 1990లో తెలుగు విశ్వవిద్యాలయం విడిచిపెట్టారు. 1991లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో ఆమెను గౌరవించింది. సంగీత విద్యలో గాయనిగా అలా పురస్కారం అందుకున్న తొలి కళాకారిణి ఆమెయే కావడం, అనేక బిరుదులు ఆమెను వరించడం జరిగింది. ఆమెలో ఎంతో సంగీత ప్రతిభవున్నా చిత్రంగా క్యాసెట్లుగానీ, డిస్క్ రికార్డులు కానీ ఆమెవి తగినన్ని లేకపోవడం జరిగింది. 1993 మార్చి 13న ఆమె హఠాత్తుగా కనుమూశారు.
జానకీబాలగారు గోపాలరత్నంగారి మరణం గురించి రాస్తూ-
‘‘కీర్తి, డబ్బు ఒక్కొక్కసారి ప్రాణాంతకాలు కావచ్చునని అనిపిస్తూ వుంటుంది- అలాంటి సంఘర్షణలో ప్రాణాలు కోల్పోయే సందర్భాలు కూడా వుంటాయేమో. ఊహకి కూడా అందని విషయాలు అనేకం వుంటాయి మానవ జీవితాల్లో’’ అంటూ రాశారు. ఆమె మరణించి రెండు దశాబ్దాలకు పైగా గడిచినా శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీరంగం గోపాలరత్నంగారి గురించి జానకీబాలగారు ఈ గ్రంథ రచన చేసి అందించడం ఆ ప్రతిభామతికి నిజంగా అక్షర నివాళి.
*వ్యాస రచయిత: #సుధామ గారి సౌజన్యంతో
శ్రీరంగం గోపాలరత్నం గారు మోహన్‌రాజు గారు 16 మార్చ్ న మరణించడం యాదృచ్ఛికం. వారివురు కలిసి పాడిన రాజరాజేశ్వరి స్తుతి తో వారికి ఘన నివాళులు🙏💐 అర్పిస్తున్నాము.
*ఈ వ్యాసం "లలిత గీతాల నిధులు" వాట్సప్ గ్రూప్ లో గోపాలరత్నం గారి 29వ వర్థంతి సందర్భంగా #సుధామ గారు నిన్న పోస్ట్ చేసారు.
*లలిత గీతాల నిధుల సమూహ సౌజన్యంతో
-విజయ్ మోహన్‌రాజు


ధన్యవాదాలు. 

1 వ్యాఖ్య:

విజయ్ మోహన్‌రాజు చెప్పారు...

మూర్తి గారు, శ్రీరంగంగోపాలరత్నం గారి గురించి మీరు వ్రాసిన ఈ వ్యాసం చాలా చాలా బాగుంది. జీవం ఉట్టిపడేలా చిత్రించిన ఆవిడ పెన్సిల్ స్కెచ్ మీ వ్యాస సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసిందంటే అతిశయోక్తి కాదు.ఈ సందర్భంగా మా తండ్రిగారు గోపాలరత్నం గారితో కలిసి పాడిన స్తోత్రములు షేర్ చేసినందుకు మీకు అనేక ధన్యవాదాలు🙏
విజయ్ మోహన్‌రాజు

బుచ్చి బాబు (రచయిత)

ప్రముఖ రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి. వీరు రచించిన 'చివరకు మిగిలేది" నవలా సాహిత్యం లో...