24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

విరహపు రాజదె విడిదికి రాగా | సిరుల జేసెనిదె సింగారములు - అన్నమయ్య కీర్తన


వారం వారం అన్నమయ్య -

"విరహపు రాజదే విడిదికి రాగా సిరులు చేసెనదే సింగారములు"
భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty

ప|| విరహపు రాజదె విడిదికి రాగా | సిరుల జేసెనిదె సింగారములు || చ|| నెలత నుదుటిపై నీలపు కురులనె | తొలుతనె గట్టెను తోరణము | మొలక చెమటలనె ముత్యపు (మ్రుగ్గులు) | అలరిచె మదనుండిదె చెలిమేన || చ|| దట్టముగ చింతా లతనే వడి | బెట్టె చప్పరము పెనుగొనగా | పట్టిన మై తావులు పరిమళములు | కట్టించెను చెంగట వలరాజు || చ|| విందగు వేంకట విభుని ప్రేమచే | పొందగ బెట్టెను బోనాలు ఇందు వదనికి ఇందిరా విభుని | కందుదేర నలుకలు చవిజేసె ||

ఓం నమో వేంకటేశాయ

ఉ॥
పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టిప్రపంచమంతకున్
తల్లి! సమస్తజీవుల నిధానమ శ్రీయలమేలు మంగ! నీ
చల్లని చూపు చిల్కి వెదజల్లగ బుణ్యులమైతి మండ్రు భూ
మెల్లను నీవధూమణి, ననేక విధంబుల వెంకటేశ్వరా!

అన్నమాచార్యుల వారు తన శతకంలో అలమేలుమంగమ్మను స్తుతిస్తూ వ్రాసినది పైపద్యం.
ఇప్పుడు ఈ వారం అన్నమయ్య కీర్తన ‘విరహపు రాజిదె విడిదికి రాగా
సిరుల గూర్చెనిదె సింగారములు!’గురించి ముచ్చటించుకుందాం!
అమ్మవారి దగ్గరకు ఆ వేంకటపతి వెళ్ళినప్పుడు ఏంజరిగి ఉంటుందో ఊహించుకుంటూ వ్రాసిన కీర్తన ఇది!
అమ్మవారి విడిది అంటే మంగాపురం ! అమ్మవారు మంగాపుర లో విడిది చేయడానికి వెనక కథేమిటి?
వక్షస్థలం మీద కాలితో తన్నిన భృగు మహర్షిని శ్రీహరి దండించలేదన్న కోపంతో లక్ష్మీ దేవి వైకుంఠం విడిచి కొల్హాపురం వెళ్ళిందికదా! లక్ష్మీ దేవి కోసం శ్రీనివాసుడు వేంకటాచలం ప్రాంతంలోని పద్మసరోవరం ముందు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు.
కార్తీక శుద్ధ పంచమినాడు ఆ సరోవరంలో అమ్మవారు పద్మంనుంచి ఉద్భవించింది. వ్యూహలక్ష్మిగా ఆమెను హృదయంలో నిలుపుకున్నా
అమ్మవారిని చూడటానికి శ్రీపతి తిరుచానూరు రావసిందే. తిరు అంటే శ్రీ. చాన అంటే స్త్రీ. పద్మంలో జన్మించడం వలన పద్మావతి అయింది. అలమేల్ మంగ అనే తమిళ పదం అర్థంకూడ పద్మనివాసిని అనే!
ఆ విధంగా తిరుచానూరులోని పద్మసరోవరంలో ఉన్న అలమేలుమంగమ్మ అంతః పురానికి శ్రీవారు విరహం నిండిన మనసుతో విచ్చేస్తుంటారు. అమ్మవారు శ్రీ వారు ఎప్పుడు వస్తారా అని విరహంతో వేగిపోతోంది!
తన హృదయాధినాధుడు తనసదనానికి విచ్చేస్తున్నాడని తెలిసి స్వయంగా యింటి అలంకరణను పర్యవేక్షించింది. స్వహస్తాలతో ద్వారాల తోరణాలను సరిదిద్దిఉంటుంది. ఆమె మేని సిరులే ఆయనకు వైభవం ! ఈ భావమే చిత్రకారుని చేతిలో అద్భుత చిత్రమైంది. ఆహా! స్వామి వస్తున్నారని తెలిసి అమ్మవారు అలంకరించుకునే పనిలేకుండా సహజసిద్ధంగానే ఆమె శరీరం ఎంతశోభాయమానంగా తయారయిందో వర్ణించాడు అన్నమయ్య!
సిరుల తల్లికి అలంకారానికి కొరవేముంది? పద్మావతీ దేవి అణువణువూ సింగారాలకునెలవు!
సతి సింగారమే కదా పతికి నిజమైన వైభవోపేతమైన దృశ్యం .ఆ సహజసౌందర్యం ఏవిధంగా ఉందంటే……
ఆమె నీలి కురులే తోరణంగా స్వాగతం పలికాయి !
మదనుడు వేసిన ముగ్గులా ఉన్నాయి ఆమె తనువుపై ముత్యాల వంటి స్వేదబిందువులు!
ఆలోచనల లతలు దట్టంగా అల్లుకొని ప్రేమపందిరి వేసాయి।తనుగంధ పరిమళం పతికి శ్రీగంధ సేవకు సిద్ధమైంది!
ఇవన్నీ ఆ వలరాజు పనులే!
ఆ పద్మావతి ప్రేమే స్వామికి విందు భోజనం!
అలమేలు మంగ అలగడం, స్వామివారు తీర్చడం లేకపోతే ఆకలయికలో మాధుర్యం తగ్గదూ!అందుకే ప్రణయకలహపు రుచినీ చవిచూసారా జంట!
కలహం తీరి కలయిక మరింత మధురమై సుఖాంతమైంది!
ఈ జగత్తుకే మాతాపితలైన వారి అచ్చట ముచ్చటలను అక్షర చిత్రంగా చూపి మనల్ని ముగ్థులను చేసాడు అన్నమయ్య!
కీర్తన సారాంశం ఉత్పల మాలగా వ్రాసాను.
ఉ॥
అంగన మంగమాంబ విర హంబును దీర్పగ వచ్చుస్వామికిన్
ముంగురు లాయెతోరణము ముగ్థకు నాథుని స్వాగతింపగన్
పొంగిన స్వేదబిందువుల ముగ్గుగ మార్చెను మారుడంతలో!
చెంగట చేరగంధమగు చేడియ దేహపరీమళంబులున్
సంగడమాయెనల్కలును చక్కగ దీరగ వారికప్పుడున్!
~~~~~~~
స్వస్తి !
ఉమాదేవి జంధ్యాల

 

కామెంట్‌లు లేవు:

  భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala చిత్రాలు : Pvr Murty సహకారం : శ్రీమతి Ponnada Lakshmi ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె...