24, ఏప్రిల్ 2024, బుధవారం

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు




బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు 

(my charcoal pencil sketch) 


Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వారికి నా ధన్యవాదాలు. 

గాయకుడు బి (బొడ్డు) గోపాలం గూర్చి కొందరికి అయినా తెలుసనుకుంటా!


"అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ" అని కె వి రెడ్డి గారి శ్రీకృష్ణార్జున యుద్ధములో అల్లు, సురభి బాల సరస్వతి మీద  తీసిన హాస్య గీతం గుర్తుందా?. ఆ గీతాన్ని పాడింది గోపాలం, స్వర్ణలతలు.


శ్రీరామాంజనేయ యుద్ధము 1974 లో అర్జా జనార్దన్ రావు గారికి పాటలు అయితే గాయక నటుడు రఘురామయ్య పాడారు గానీ పద్యాలు వచ్చేసరికి మరో గాయకుణ్ణి వెదుక్కోక తప్పలేదు. అవి అద్భుతంగా నాటక ఫక్కీలో బాలుతో పాడింది బి గోపాలమే. 


శాస్త్రీయ సంగీతము క్షుణ్ణంగా అభ్యసించి వాయులీనం కూడా నేర్చుకున్న  గోపాలం చిత్ర రంగానికి వచ్చి ఘంటసాల మాష్టారు వద్ద సహాయకునిగా ఉన్నారు తొలినాళ్లలో. 


తరువాత  కన్నడ నటుడు , దర్శక నిర్మాత  కెంపరాజ్  మన భానుమతి గారితో నటించాలన్న కోరికతో తీసిన నలదమయంతి 1957 చిత్రం ద్వారా పూర్తి సంగీతం చేసి, అందులో నారద పాత్ర వేసి మెప్పించినా ఆ చిత్ర పరాజయం తో మళ్లీ సంగీత సహాయకునిగా ఉండి పోయారు. 


1961లో రచయిత పాలగుమ్మి పద్మరాజు దర్శకుడు గా వచ్చిన బికారి రాముడు లో మళ్లీ తన అద్భుత ప్రతిభ చూపారు. అందులో శ్రీరంగం గోపాల రత్నం గారు పాడిన "నిదురమ్మా నిదురమ్మా కదలీ రావే మాయమ్మా" పెద్ద హిట్. ఆ చిత్రం సంగీతం వినగానే అప్పగింతలు 1962 అనే మరో చిత్రం వచ్చింది. రెండింటి సంగీతం బాగున్నా ఆ చిత్రాల పరాజయం తో మళ్లీ అవకాశాలు దొరక్క గాయకుడు గా కూడా అవతార మెత్తారు. అలా పెండ్యాల గారు ఆయన్ని పాడించారు. తర్వాత రాజేశ్వరరావు వద్ద సహాయకునిగా ఉన్నారు.


రేడియో గాయని రేణుక  బి గోపాలం భార్యయే.


ఎందుకో వాళ్ళ ప్రతిభ బాగున్నా పెద్దగా అవకాశాలు రాకపోవడం తో తిరిగి నాటకాలకు వెళ్లి పోదాం అని అనేకమార్లు వెళ్ళిపోయి తిరిగి అవకాశాలు రావడం తో చివరగా పెద్దలు మారాలి, కరుణామయుడు చిత్రాలకు సంగీతం చేశారు. 


అవి హిట్ అయినా ఆయనకు పేరు రాలేదు. చూడండి వింత . మంచి సంగీతం చేసినా చిత్రాలు విజయవంతం కాకపోవడం తో అవకాశాలు రాలేదు, చిత్రాలు హిట్ అయినా ఆ తర్వాత అవకాశం రాలేదు. పూర్తిగా ఇది దురదృష్టమే కదూ.  


శ్రీరంగం గోపాల రత్నం గారు శాస్త్రీయ సంగీతకారిణిగా బాగా పేరు వచ్చాక ఆయనతో అన్నమయ్య గీతాలు ఆల్బమ్ ఒకటి " అన్నమయ్య పద సౌందర్యము" చేయించి HMV కోసం పాడారు. ఆ రికార్డ్ కూడా పెద్దగా హిట్ అయింది. 


తర్వాత గోపాలం గారు స్వంత ఊరు గుంటూరు వెళ్ళిపోయి అక్కడే నివసిస్తూ 2004 లో  తనువు చాలించారు.

కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...