14, డిసెంబర్ 2022, బుధవారం

సఖియను వలచిన వలపులు మురిసెను చెలియను తలచిన సమయము మురిసెను - గజల్


 నా చిత్రానికి మిత్రుడు శ్రీ RVSS Srinivas రచించిన గజల్

సర్వలఘువుల గజల్

సఖియను వలచిన వలపులు మురిసెను
చెలియను తలచిన సమయము మురిసెను
రజతపు గొలుసుల రవళులు మధురము
పదములు కదలిన పథములు మురిసెను
పెదవులు విసిరిన నగవులు తగిలెను
పరిమళసుమముల హృదయము మురిసెను
కనుకలి వదిలెను వెలుగుల ములుకులు
తగిలిన తిమిరపు నయనము మురిసెను
చెలియకు తెలియును వలపులదొరనని
తనువులు కలిసిన క్షణములు మురిసెను
అడుగుల సడివిని వెడలెను విరహము
ప్రియసఖి చొరవకు ప్రణయము మురిసెను
పికముల స్వరములు చెలియకు వరములు
ప్రియసతి పలికిన శ్రవణము మురిసెను.
ప్రణయని అలుకల విడుపులు తరుగవు.
కలహము తొలగిన సరసము మురిసెను
తెలిసెను మదనుని శరముల బలములు
తనువులు అలసిన తడిపము మురిసెను
...
గజల్ శిరోమణి ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్
9425012468.

మనసు తంత్రులను శృతిచేస్తూ బ్రతుకు గీతం పాడాలి - కవిత


నా చిత్రానికి వర్ధమాన కవయిత్రి సునీతా జోషి రచించిన కవిత.

మనసు తంత్రులను శృతిచేస్తూ
బ్రతుకు గీతం పాడాలి
వేదనెంతో మోదమెంతో
గుండెతోనే పలకాలి
జీవితపు సారాన్ని రంగరించి
ఎత్తు పల్లాలనే పదనిసలుగా
స్వర జతులను పలికించి
సప్తస్వర సంగీత మాధుర్యాన్ని
భావితరాలకు అందించాలి
ఆస్వాదించే హృదయానికి
నిత్యం ఆమని చేరువౌతుంది
ఆకు రాల్చుకునే శిశిరం కూడా
ఆమడదూరం జరగుతుంది
మమతల మాధుర్యాన్ని
అణువణువున నింపుకున్న
ఆ కళాత్మక హృదయానికి
ఈ జగతి కళావేదిక కావాలి
రసానుభూతి చెందే మనసు
తన సొంతమైతే....
ఆపగలదా వయసు అలసట
హద్దులెరుగని అనంతమైన
భావాల విహంగానికి స్వేచ్ఛనిస్తే
తన స్వర మాధుర్యంతో....
విజేతై నిలవదా...ఈ జగతి నేలదా ......
...సునీతా జోషి.



nd 15 ot

10, డిసెంబర్ 2022, శనివారం

కవిసార్వభౌమ, స్వరాజ్యకవి - వడ్డాది సీతారామాంజనేయ కవి -




వడ్డాది సీతారామాంజనేయులు కవి రచించిన దండాలు దండాలు భారత మాత గేయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ పాట ఆంగ్లేయుల పాలనను విశదపరుస్తుంది.

''దండాలు దండాలు భారతమాత
నీవందుకోని దీవించు భారతమాత
నీవందుకోని దీవించు భారతమాత
దండాలు దండాలు భారత మాత
మా కొంపల్ని కూల్చినారే భారతమాత''

కవిసార్వభౌమ, స్వరాజ్యకవి కీ. శే. వడ్డాది సీతారామాంజనేయులు. నేను 3rd Form (అంటే ఇప్పుడు 8th class అన్నమాట) చదువుకుంటున్నప్పుడు మా తెలుగు మాస్టారు. (pencil sketch)
వడ్డాది సీతారామాంజనేయులు కవి గారు రచించిన దండాలు దండాలు భారత మాత గేయం ఎంతో బహుళ ప్రాచుర్యం పొందింది. ఆ పాట ఆంగ్లేయుల పాలనను విశదపరుస్తుంది.
''దండాలు దండాలు భారతమాత
నీవందుకోని దీవించు భారతమాత
నీవందుకోని దీవించు భారతమాత
దండాలు దండాలు భారత మాత
మా కొంపల్ని కూల్చినారే భారతమాత''
వీరు మహాత్మా గాంధి గారి పిలుపుమేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కారాగార శిక్షననుభవించారు. కొన్నాళ్ళు తెలుగు మాస్టారుగా పనిచేసారు. వారు పద్యం చదివి పాఠం చెబుతూ ఉంటే లేవబుధ్ధికాదు. అయితే వారు ఇంత ప్రముఖ వ్యక్తులని అప్పుడు తెలియదు. నేను చూసిన సీతారామంజనేయ కవి గారు గుండు, పిలకతో ఉండేవారు. వారి reference picture దొరకక ఇన్నాళ్ళూ వారి చిత్రాన్ని గీయలేకపోయాను. ఈరోజు వారు రచించిన పుస్తకం మీద ముఖచిత్రం net లో కనిపించింది. నేను చిత్రీకరిస్తున్న విశాఖ మహనీయుల చిత్రాలలో భాగంగా వీరి చిత్రాన్ని చిత్రీకరించుకునే భాగ్యం కలిగింది. ఓ మిత్రుడు ప్రచురించబోతున్న 'విశాఖ మాన్యులు' పుస్తకంలో కూడా ఈ చిత్రం చోటుచేసుకోబోతోంది అని తెలిసి ఆనందించాను.
ధన్యవాదాలు


9, డిసెంబర్ 2022, శుక్రవారం

ఆనందనిలయ ప్రహ్లాదవరదా భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా - అన్నమయ్య కీర్తన


చిత్ర లేఖనం : పొన్నాడ మూర్తి

(॥పల్లవి॥)
ఆనందనిలయ ప్రహ్లాదవరదా
భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా

(॥ఆనం॥)
పరమపురుష నిత్య ప్రహ్లాదవరదా
హరి యచ్యుతానంత ప్రహ్లాదవరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా

(॥ఆనం॥)
భవరోగసంహరణ ప్రహ్లాదవరదా
అవిరళ కేశవ ప్రహ్లాదవరదా
పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా
భవపితామహవంద్య ప్రహ్లాదవరదా

(॥ఆనం॥)
బలయుక్త నరసింహ ప్రహ్లాదవరదా
లలిత శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదా
ఫలితకరుణారస ప్రహ్లాదవరదా
బలివంశకారణ ప్రహ్లాదవరదా


భావం ః 

 

ఆనందనిలయుడైన ఓ ప్రహ్లాదవరదా నీకు జయమగుగాక ! సూర్యచంద్రులు కన్నులుగాగల ఓ నరసింహస్వామీ నీకు జయము పలికెదను ప్రభూ ! 

స్వామీ ! నీవు పరమపురుషుడవు.  శ్రీహరివి. నాశనములేని అచ్యుతడవు. నీకు పరిపూర్ణత తప్ప కొద్దిగా ఉండటం అనేది లేదు. గోవులవంటి  సమస్త జీవులను పాలించే గోవిందుడవు. నీవే ప్రహ్లాదవరదుడవు. అట్టి నీకు జయమగుగాక!

పురాకృతకర్మలవల్ల సంప్రాప్తమయ్యే భవరోగమును అణచగల శక్తి నీకు మాత్రమే ఉన్నది. నీవు అవిరళమైనవాడివి. కేశవుడవు. పవమననుత కీర్తివి. పితామహవంద్యుడవు. భవుడవు. అట్టి ప్రహ్లాదవరదుడా ! నీకు జయమగుగాక ! 

ప్రభూ నీవు అమిత బలశాలివి. వేంకటాద్రి మీదనున్న లలిత శృంగార రాయుడైన శ్రీవేంకటేశ్వరిడివి నీవే. కరుణారసమును ప్రతిఫలించే ప్రహ్లాదవరదుడైన కారుణ్యమూర్తివి నీవే! బలివంశమును రక్షించి పోషించిన త్రివిక్రముడవు నీవే ! అట్టి నీకు జయమగుగాక!


 సౌజన్యం ః గీతాదీక్ష - geetadeeksha.com

 


8, డిసెంబర్ 2022, గురువారం

పదవుల నొక ముద్దిడగా - కవి సామ్రాట్ కీ. శే. నోరి నరసింహ శాస్త్రి పద్యములు


 My Pencil sketch 


పెదవుల నొక ముద్దిడగా

సదయత నొప్పితివి మేలు సకియా, ఇదె నా

పెదవుల గదించి పెదవులు

వదలను పలవశత ప్రాణి వదలెడు దాకన్


వదలర పెదవులు వదలర,

సద మద మయితిని గదయ్యొ సామీ యపుడే

వదలితి నీ ముద్దుల కీ

పెదవుల, నిక వదలి బ్రదికి బ్రదికింపు ననున్ !


(కవి సామ్రాట్ కీ. శే. నోరి నరసింహ శాస్త్రి పద్యములు)

4, డిసెంబర్ 2022, ఆదివారం

దేవానంద్ - చరిత్ర సృష్టీంచిన భారతీయ నటుడు

 




Devanand - black and white pencil sketch drawn by me.

ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత ఆర్కె నారాయణ్ రచించిన 'గైడ్' నవల సినిమాగా తీస్తే బాగుంటుందని దేవానంద్ కి ఓ మిత్రుని సలహా.. ఆ నవల రాత్రంతా ఏకధాటిని చదవడం, రచయితని ఒప్పించడం అన్నీ చకాచకా సాగిపోయాయి. అయితే నవల లో కధానాయిక పాత్రని low light లో చూపించడం భారతీయు ప్రేక్షకులు స్వీకరిస్తారా లేదా అన్నది ఓ పెద్ద సమస్య. అటువంటి నవలని చిత్రంగా నిర్మించాలంటే అదొక పెద్ద సాహసమే..! 'వద్దు.. నష్టపోతావు' అని మిత్రులు చెప్పినా సాహసించాడు దేవానంద్.


దర్శకునిగా ఎవర్ని పెట్టుకోవాలి అన్నగారు చేతన్ ఆనంద్ నా, లేక రాజ్ ఖోస్లా నా? అనే అంశంపై తర్జన భర్జన లు జరిగిన పిమ్మట చేతన్ ఆనంద్ నే దర్శకునిగా పెట్టుకున్నాడు. అయితే S D Burman పాడిన 'వహా కౌన హై తెరా' పాట దృశ్యీకరించడం కూడా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఎంపిక విషయంలో అన్నగారితో విభేదాలు తలెత్తటంటో చేతన్ అనంద్ ఈ project నుండి తొలగిపోయాడు. అప్పుడు తమ్ముడు విజయ్ ఆనంద్ ని దర్శకుడిగా నియమించుకున్నాడు.

సంగీత దర్శకుణ్ణి ఎస్.డి. బర్మన్ ని పెట్టుకుంటే ఆయనకి heart attack రావడంతో తాను కొనసాగించలేనని మరో దర్శకుడికి ఆ బాధ్యతలు అప్పగించమన్నాడు బర్మన్ దా. అందుకు దేవానంద్ ససేమిరా అంగీకరించలేదుట. మీరు కోలుకునేవరకూ వేచి ఉంటానని చెప్పి, అంతవరకూ నిరీక్షించి పాటలన్నీ ఆయనచేతనే కంపోజ్ చేయించాడు.

ఇంక పాటల రచయిత విషయంలోనూ సమస్య ఎదురైంది. హస్రత్ జైపూరి ని పాటల రచయితగా నియమించుకున్నారు. కాని ఓ పాట lyrics లో మార్పులు చేయమని బర్మన్ దా అడిగితే వారు దానికి అంగీకరించలేదుట . ఒప్పందమైన పారితోషకాన్ని వారికి ఇచ్చేసి, పాటల రచన బాధ్యతని శైలేంద్ర కి అప్పగించారు.

ఇంకా ఎన్నో సమస్యలతో ఎంతో ధైర్యంతో ప్రారంభించిన ఈ చిత్రం అనూహ్యంగా అఖండ విజయం సాధించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక classic గా పేరొందింది. పలు పురస్కారాలు దక్కించుకుంది. 'దేవానంద్ అంటే గైడ్, గైడ్ అంటే దేవానంద్' అనిపించుకుంది.

దేవానంద్ నటించిన మేటి చిత్రాలు గైడ్, హమ్ దోనోం, కాలాపాని ఇత్యాది చిత్రాలు పలువురి ప్రశంసలు పొందాయి. పురస్కారాలు దక్కించుకున్నాయి.

ఈ రోజు దేవానంద్ వర్ధంతి సందర్భంగా నా చిత్ర నివాళి.

(సేకరణ : ఇక్కడా, అక్కడా)

దాచుకో నీపాదాలకు దగ నే జేసినపూజ లివి - అన్నమయ్య కీర్తన


 ఈ వారం అన్నమయ్య కీర్తన : దాచుకో నీ పాదాలకు దగ నే జేసిన పూజ లివి.

దాచుకో నీపాదాలకు - దగ నే జేసినపూజ లివి
పూచి నీకీరీతిరూప - పుష్పము లివి యయ్యా
..
వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన - దాచి వుండనీ
వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా
..
నానాలికపైనుండి - నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను -బొగడించితివి
వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా
..
యీమాట గర్వము గాదు - నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము - చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను - నేరము లెంచకుమీ
శ్రీమాధవ నే నీదాసుడ - శ్రీవేంకటేశుడవయ్యా
అర్ధములు : పూచి : పూని, కీరితిరూపపుష్పములు = కీర్తి రూపముననున్న పూలు, వేనామాల వెన్నుడా = సహస్రరూపములగల విష్ణుడా, చేముంచి = పనిబూని, నేమానన్ = నియమముతో
--------------------------------------------------------------------------
భావం సౌజన్యం : "సాహిత్యశిరోమణి' సుముద్రాల లక్ష్మణయ్య
దేవా! నేను రచించిన ఈ సంకీర్తనలు నీ చరణములకు తగురీతిగా పూని నేనొర్చిన పూజలే. ఇవి నీ యశోరూపములైన కుసుమములు. కాన భద్రముగా దాచుకొనుము.
వేలకొలదిగా నున్న ఈ పాటలలో అన్ని విధముల అనుకూలమై మమ్ము కాపాడుటకు ఒక్కపాటయే చాలు. మిగిలినవెల్లా భాండాగారములో దాచి ఉండనిమ్ము. నీ నామము దుర్లభము. దాని వెల తక్కువ. కాని దాని ఫలము మిక్కిలి దొడ్డది. ఆ నామ సంకీర్తన ప్రభావముచేతనే నాకు దిక్కై నన్ను నీవు రక్షించితివి. ఇక నీ నామ సంకీర్తనలే నాకు తరిగిపోని సంపదలయ్యా..!
అందుకని పూని నా నాలుకపై నిలిచి పెక్కు సంకీర్తనలతో నాచే నిన్ను స్తుతింపజేసితివి. వేయి నామములుగల విష్ణుదేవా నిన్ను స్తుతింప నేనెంతవాడను? నీవే నాపై దయతలచి కానిమ్మని నాకీ పుణ్యము అంటగట్టితివి. ఇంతే.
నేనీమాట గర్వముతో పలుకుటలేదు. నీ మహిమనే నేనిట్లు నుతించితిని కాని పనిబూని నా స్వాతంత్ర్యమును నేను చెప్పుకొనలేదు. నియమము తప్పక నిన్ను నిత్యము గానము చేయుచున్నాను. నాలోని తప్పులెంచకు. శ్రీమాధవా! నీవు శ్రీవేంకటేశ్వరుడవు. నేను నీ దాసుడనయ్యా..!

వల్లూరి జగన్నాధరావు

  వల్లూరి జగన్నాథరావు గారు తెలుగు లలిత సంగీత, నాటక రంగాల్లో ప్రసిద్ధి చెందిన రచయిత మరియు కళాకారుడు. ఆకాశవాణి (All India Radio) వేదికగా ఎన్న...