9, డిసెంబర్ 2022, శుక్రవారం

ఆనందనిలయ ప్రహ్లాదవరదా భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా - అన్నమయ్య కీర్తన


చిత్ర లేఖనం : పొన్నాడ మూర్తి

(॥పల్లవి॥)
ఆనందనిలయ ప్రహ్లాదవరదా
భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా

(॥ఆనం॥)
పరమపురుష నిత్య ప్రహ్లాదవరదా
హరి యచ్యుతానంత ప్రహ్లాదవరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా

(॥ఆనం॥)
భవరోగసంహరణ ప్రహ్లాదవరదా
అవిరళ కేశవ ప్రహ్లాదవరదా
పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా
భవపితామహవంద్య ప్రహ్లాదవరదా

(॥ఆనం॥)
బలయుక్త నరసింహ ప్రహ్లాదవరదా
లలిత శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదా
ఫలితకరుణారస ప్రహ్లాదవరదా
బలివంశకారణ ప్రహ్లాదవరదా


భావం ః 

 

ఆనందనిలయుడైన ఓ ప్రహ్లాదవరదా నీకు జయమగుగాక ! సూర్యచంద్రులు కన్నులుగాగల ఓ నరసింహస్వామీ నీకు జయము పలికెదను ప్రభూ ! 

స్వామీ ! నీవు పరమపురుషుడవు.  శ్రీహరివి. నాశనములేని అచ్యుతడవు. నీకు పరిపూర్ణత తప్ప కొద్దిగా ఉండటం అనేది లేదు. గోవులవంటి  సమస్త జీవులను పాలించే గోవిందుడవు. నీవే ప్రహ్లాదవరదుడవు. అట్టి నీకు జయమగుగాక!

పురాకృతకర్మలవల్ల సంప్రాప్తమయ్యే భవరోగమును అణచగల శక్తి నీకు మాత్రమే ఉన్నది. నీవు అవిరళమైనవాడివి. కేశవుడవు. పవమననుత కీర్తివి. పితామహవంద్యుడవు. భవుడవు. అట్టి ప్రహ్లాదవరదుడా ! నీకు జయమగుగాక ! 

ప్రభూ నీవు అమిత బలశాలివి. వేంకటాద్రి మీదనున్న లలిత శృంగార రాయుడైన శ్రీవేంకటేశ్వరిడివి నీవే. కరుణారసమును ప్రతిఫలించే ప్రహ్లాదవరదుడైన కారుణ్యమూర్తివి నీవే! బలివంశమును రక్షించి పోషించిన త్రివిక్రముడవు నీవే ! అట్టి నీకు జయమగుగాక!


 సౌజన్యం ః గీతాదీక్ష - geetadeeksha.com

 


కామెంట్‌లు లేవు:

ఆతడే ఇన్నియు నిచ్చు నడిగిన వల్లాను చేతిలోనే ఉండగాను చింతించడు హరిని - అన్నమయ్య కీర్తన

  ప. ఆతడే ఇన్నియు నిచ్చు నడిగిన వల్లాను చేతిలోనే ఉండగాను చింతించడు హరిని !! వలనంటే సంపదలు వట్టి ఎలమట బెట్టు అలసి నోప నంటేను అండనే ఉండు ...