- ఈ రోజు ప్రముఖ నటులు శ్రీ lb Sriram గారు నేను చిత్రీకరించిన వారి చిత్రాన్ని Facebook లో పోస్ట్ చేశారు. అది fb లో విశేష ప్రశంసలు అందుకుంటోంది. ఈ సంధర్భంగా 64 కళలు. కామ్ లో వారి గురించిన వ్యాసం.
"జస్ట్ నిన్ననే ‘చాలా బాగుంది ‘ సినిమా రిలీజైనట్టుంది.. మొన్ననే రిలీజైనట్టుంది ‘ఏప్రిల్ ఫస్ట్ విడుదల ‘ చిత్రం. ఒకటి నాణ్యమైన రచయితని సినీ పరిశ్రమలపైకి విసిరితే.. ఒకటి మన్నికైన నటుడిని రంగుల తెరమీదకి రువ్వింది. ఆ రచయిత. ఆ నటుడు ఇద్దరూ ఒక్కరే.. ఆ ఒక్కరే ఎల్.బి. శ్రీరాం. సినిమా పిచ్చితో ఎల్బీ శ్రీరాం పరిశ్రమలోకి దూరిపోలేదు. ఆయన రచనల మీద పిచ్చితో పరిశ్రమ ఆయనకి రా రమ్మని ఎర్రతివాచీ పరిచింది. రచించడంలో నైపుణ్యమున్నా నాణ్యమైన అమాయకత్వం ఎల్బీ చేత ఆ ఎర్ర తివాచీ మీద కూడా ఎర్రగులాబీ మీద కాదు.. గుర్రుమంటున్న ముళ్ళ మీద నడిపించేసింది. ఫుల్ గా బుడ్డీలు. బుడ్డీలు సిరా తాగేసి వచ్చేసిన.. విచ్చేసిన శ్రీరాంకి ముళ్ళు గుచ్చుకుంటున్నా ఆనందంగా వాటి మీద నొప్పి తెలియకుండానే నడిచేశారు.
నాటకరంగంలో హుష్ కాకి వంటి ఎన్నో నాటికలు, నాటకాలు రాసి, వేసి అక్కడ కింగ్ సైజ్ సిగరెట్టు స్టయిల్ గా తయారయ్యాకనే ఎల్బీ సినీరంగప్రవేశం జరిగింది. కానీ సినిమా రంగం.. నాటకరంగం కాదు. ఇక్కడ బాగా రాస్తే సరిపోదు. రాసింది, బాగుందని రాయడం చేతకాని వాళ్ళచేత ఒప్పించగలగాలి. అసలే లౌక్యం పాళ్ళు తక్కువేమో.. పైగా దిక్కుమాలిన మొహమాటం.. రెండూ కల్సి బక్కపలచన ఎల్బీని మరింత బక్కగా తయారు చేసింది. కానీ కితకితలు పెట్టించే మాటలే కాదు. కొరడాల్లాంటి మాటలు కూడా రాసిన ఆయన సమర్ధత కవచంలా కాపాడింది. సుదీర్ఘకాలం రచయితగా ఆయుష్సుపోసింది. అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆశీర్వచనాక్షతలలో ఎల్బీ ప్రయాణం ఎన్నో సన్మానాలను పోగు చేసుకుంది. ఒక్కసారి వెళ్ళి వెనక్కి తిరిగి అవును అక్షరాలే నాకు శ్రీరామరక్ష. లేకపోతే నా ఫ్యాక్టరీ.. నా గుమాస్తాగిని.. నా టీవియస్ మరికొన్ని నాటకాలు మహా అయితే ఇలా.. అన్నారు.
నటుడైన రచయిత.. రచించగల నటుడు రెండు వైపుల పదునెక్కిన కత్తి లాంటివాడు. ఓవైపు కత్తి తావుల తావుల కాగితాలను డైలాగులతో అలంకరిస్తే… రెండో వైపు కత్తి రీముల రీముల రీళ్ళ మీద వినూత్న విలక్షణ.. విభిన్న పాత్రలను రంగుల తెర మీద తీర్చిదిద్దింది. రచయితగా ఓ సంగ్రామం.. నటుడిగా ఓ సంచలనం ఎల్బీ జీవితం. ఎవ్వరూ ఊహించని ఓ గొప్ప మలుపు ఎల్బీని తొలి అడుగులోనే శతదినోత్సవ నటుడిగా కేక పుట్టించింది. దర్శక, నిర్మాతలలో కాక పుట్టించింది. అవేడి నటుడిగా ఆయన వాహనాన్ని ఏళ్ళ తరబడి సులభంగా పరిగెత్తించింది. ఎల్బీలా రచయత వామనుడయ్యాడు. నటుడు ఆజానుబాహుడయ్యాడు. ఆ పుణ్యం దర్శకుడు ఇవివి. సత్యనారాయణ గారిదే. అందరికీ ఎంతో వడ్డించిన ఆయన నాకు మాత్రం కాస్త పెద్ద చేత్తోనే వడ్డించారు. చాలా బాగుంది. చిత్రం.. వెంకట్రామా అండ్ కో ఎక్కాల బుక్కు ఎంత ఫేమస్ నన్ను అంత పాప్యులర్ చేసింది. గత జీవితం కనుమరుగవచ్చు. ఆ జీవితాన్ని పెంచిన వ్యక్తులు ఎప్పటికో కనుమరుగుకారు. ఇవివిగారు అంతే అన్నారు నటుడిగా తన పరివర్తనను తలచుకుని. రచయిత, నటుడు ఇద్దరిలో ఎల్బీకి ఎక్కువ ఎవరు ఇష్టం..ఎవరు వెన్ను దన్ను.. ఎవరు కన్ను.. ఎవరు చూపు. రచయిత కదా అని ఎల్బీని కొంచెం కన్ఫ్యూజ్ చెయ్యబోతే జారిపోకుండా ఆసరాగా పెన్ను పట్టుకుని మరీ నిలదొక్కుకుని ఎల్బీ సమాధానం చెప్పారు. రచయితకి ముగింపులేదు. రచయిత జీవితానికి చివరి అంకమే లేదు. ఓపిక ఉన్నంతకాలం.. ఉత్సాహం ఉరకలు వేసినంత సేపు రచయిత ఓ గెలుపుగుర్రమే.,నటుడు మరొకరి చేతిలో కీలుబొమ్మ, ఇతరులు కీ ఇస్తే ..ఆ కీ తిరిగినంత టైమూ నటుడి పరుగు ఆగదు, ఎప్పుడు.. ఎక్కడ అది ఆగిపోతే నటుడి పరుగూ ఆగిపోతుంది. రచయిత నటుడ్ని నడిపించగలడు.
నటుడు రచయితని పరిగెత్తించలేడు. ఎంత గొప్ప నటుడైనా సరే రచయిత కల్పనని ఆసరాగా చేసుకోవాల్సిందే అన్నారు. ఎల్బీ మరి ఈ రెండువైపులా పదునెక్కిన కత్తి.. కొత్త దర్శకులు.. కొత్త కథల మధ్య ఏమయ్యాడు. ఎల్బీ శ్రీరాం నవ్వుతూ. ఏమైపోతాడు. కొత్త పుంతలు తొక్కుతాడు. సరికొత్తగా తయారవుతాడు. ఎల్బీ కూడా అలాగే అయ్యాడు. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆఫర్స్ వస్తూండేవి. అదీ నెలకు మూడు డిఫరెంట్.. డిఫరెంట్ పిక్చరు. తమాషా ఏంటంటే క్యారెక్టర్ మాత్రం ఒక్కటే. అదే మధ్య తరగతి తండ్రి.. బడుగు, బలహీన,సగం క్యారెక్టర్ వాళ్ళు చెబితే మిగిలిన సగం నేను చెప్పేవాడిని. ఎప్పుడో వచ్చే జీవితానికి అంతిమ ఘడియలు.. నాకు మాత్రం ప్రతీ సినిమాలో వచ్చేస్తాయి. . వద్దు బాబోయ్ అని దణ్ణం పెట్టేశాను. కష్టపడి ఆరుగాలం శ్రమించే రైతు తన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే క్రాప్ పాలీడే ప్రకటించుకున్నట్టుగా నేను కూడా స్క్రీన్ హాలీడే ప్రకటించుకున్నాను. అప్పుడు నాలోని నటుడు.. రచయిత ఇద్దరూ నాకు త్రోవ చూపించారు. ఈ రోజు తలలో నాలుకలా అందరికీ అండగా వచ్చిన సోషల్ మీడియాలో నేను అదికి ముందే ప్రవేశించాను. రక రకాల ఎపిసోడ్స్ తో అన్ని క్రాఫ్టులూ నేనే హేండిల్ చేస్తూ లైవ్ లోకి వచ్చాను. కె.విశ్వనాథ్ గారిలాంటి మహాదర్శకులు ప్రశంసలు పొందాను. ఇప్పుడు రెండు మెయిన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. సినిమాని చాలెంజ్ చెయ్యగల మరో పద్ధతి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ చాలెంజే వెబ్ సిరీస్. లేటెస్ట్ రివల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా వెబ్ సిరీస్ లే రాజ్యమేలుతున్నాయి. వాటిలో మీరన్న ఆ కత్తి ఇప్పుడు నవతరం చేతిలో తళ తళమంటోందని చెప్పనా.. ఎన్నో సినిమాలు రాశాను. నటించాను. 14వ రీలు బాగులేకపోతే ఏ సినిమా అయినా ప్లాపే. నా జీవితంలో 14వరీలు చాలా బాగుంది.. బాగా వస్తోంది. 14వ రీలు బాగుంటే ఆ సినిమా హిట్. నా జీవితమనే సినిమాలో ఈ ఆఖరి 14వ రీలు ఎంత బాగుందో.. కొత్త దర్శకులు.. కొత్త కథల మధ్యన చాలా ఆహ్లాదకరంగా ఆసక్తికరంగా సాగుతోంది. కాబట్టి నా జీవితం హిట్.. ఆనందం.. ఉల్లాసం.. ఆరోగ్యం ఇంకేం కావాలి ఈ కత్తికి అన్నారు. ఏకధాటిన ఎల్బీ సున్నితమైన ప్రాణి, సునిసితమైన రచయిత.. సులభమైన నటుడు.. ఈత రాకపోయినా మూడు దశాబ్దాలు పైబడి సినీ సముద్రంలో ఈదేశాడు.. వందల సినిమాలు ఉదేశాడు. మే నెల30నే పుట్టాడు. ఒకనాడు. ఎవ్వరికీ తెలియని ఎల్బీ.. ఎన్నో మెట్లెక్కి అందరికీ కనిపించేంత ఎత్తుగా ఎదిగాడు.. ఇంకా ఎత్తుగా ఎదిగే వైపుకే ప్రయాణిస్తున్నాడు.
– నాగేంద్రకుమార్"