31, అక్టోబర్ 2020, శనివారం

అందగాడా నా చందురూడా ! చందురూడా వెన్నెలరేడా ! - P. Leela


(నా pencil చిత్రం)



వింజమూరి శివరామారావు గారి రచన, గానం : పి. లీల.  క్రింది లింక్ క్లిక్ చేసి వినండి


 


అందగాడా నా చందురూడా !

చందురూడా వెన్నెలరేడా !                   ॥ అంద !!

మల్లెపూవుల కారు మళ్ళీ రాదంటారు

త్రోవత్రోవా ఏదో తానేనింపు రేవు          ॥ అంద ॥

గండుకోయిలగొంతు ఎండూనింకంటారు

తోటాతోటయేదో పాటా నింపిరావో          ॥ అంద ॥

వినువీధిలో ప్రొద్దూ కనుదాటేనంటారు

నాల్గు దిక్కుల ఏదో వెల్గూనింపీరావో    ॥ అంద ॥

తెలి మల్లీ తావీ, కోయిల తీయని పాటా

వెన్నెల చక్కని వెల్గూ, నా వలపు నింపీరావో  ॥ అంద ॥

28, అక్టోబర్ 2020, బుధవారం

"చక్కని చుక్క ఏదిరా".. కవిత

(Pencil sketch by : Ponnada Murty)

 చక్కనిచుక్క ఏదిరా ఎక్కడ కనరాదురా ! చక్కని

టక్కరి పడుచేదిరా పక్కున నవ్వేదిరా

నవ్వులోన బొండుమల్లె పువ్వులు రువ్వేదిరా ! చక్కని

టక్కరి పడుచేదిరా ? మక్కువ చూసేదిరా

అరచూపుల దరిరాపుల మెరపులు దూసేదిరా !! చక్కని

టక్కరి పడుచేదిరా ? తక్కుచు వచ్చేదిరా

కులుకు నడకతోనె కొత్త వలపులు విచ్చేదిరా !! చక్కని

టక్కరి పడుచేదిరా ? సొక్కుచు పలికేదిరా !

మాటలందు తీయనైన పాటలు చిల్కేదిరా !! చక్కని


(రచన : వింజమూరి శివరామారావు, గానం : మాధవపెద్ది సత్యం)


https://www.youtube.com/watch?v=ycNhoxTR_Kg

27, అక్టోబర్ 2020, మంగళవారం

నేనో .. ఆరని నెగడు - కవిత


 


My pen sketch
 
శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి కవిత
------------------------------------------------------

నేనో.....  ఆరని నెగడు


ఏ కోయిల కూస్తుందో

ఏ పూవు పూస్తుందో

ఏ చేయి దీవిస్తుందో...

ఏ ప్రేమ తరగ నన్నలుముతుందో....

కాల్చే ఎదురు  థూపున

రాహిత్యమై నిలిచా

స్వచ్ఛమై..స్వేచ్ఛనై పెరిగా

అందమైన అద్దమై..

అర్థమై..ఎదిగా

చీకటి గూటిని తిరిగే

చెద పురుగుల్లా మనుషులు ..మనసులు..

రంగుల గాజుల చేయిలా అందమవరు

పూచిన పూల వల్లరిలా హాయినివ్వరు

తడిపే వాన చినుకులా ఫలమీయరు

సీతాకోకచిలుకల్లా కనిపించే గొంగళి పురుగులే..

లోకమంతా రాహిత్యమే...

హృదయం లేని కరాళ నృత్యమే..

మనసు నచ్చింది..

మెచ్చింది సాహిత్యమే

కాలం ..చిలిపిగా ...

నేను ముందంటే ...

నేను ముందంటూ... ఒయారాన తీరం తాక

పరుగెతే అలనైతే...

వెన్నెల జాలులో పొన్నల జల్లులో విని పించే మురళీ రవళైతే...

అందంమై విచ్చుకునే

ముద్దు మందారమైతే

అమ్మ చీర కొంగులా

కొలువుదీరితే..

అనుకుంటూ...అనుకుంటు దూరమెంతో వచ్చా...

ఐనా...

అంతా రాహిత్యమే

వివరించ లేవి డొల్లతనమే

కంటి చూపుతో జోల పాడి లాలించే ప్రేమ

ఆలింగనమై మనసు మరపించే ప్రేమ

అనుభూతి నందించి

అద నానందాన ముంచే ప్రేమ

నీవుంటే చాలు మరేమి వద్దనిపించే ప్రేమ 

అంతరంగ రంగాల

ఆలయాల.....

ఆదర్శవచనాల...ప్రవచనాల

ఎక్కడా నే వెదికే ప్రేమ కనపడదే....

పూషు రుచెరుగని

పుడమినయ్యా

మంచు ముసిరిన పూ

దరినయ్యా

పూత రాలిన తరువునయ్యా

రాహిత్యాన మిగిలా

పరవళ్ళై పారుతూ హఠాత్తుగా నీరింకిన సెలలా

నీటిని  మోస్తున్నా...

వర్షించ లేని మేఘంలా

పూలు రాల్చుకున్న చెట్టు దైన్యంలా

అందం అద్బుతం ఆశ్చర్యం అనిపిస్తున్నా...

ఆశించే ప్రేమందక

రాహిత్యాన సింగార మెరుగని  విషాదాన్నయ్యా

అనుకున్నా ప్రేమ పాట

చిరునామా కావాలని...

ఆశ చావని ఆయువు

పట్టుగా నిలవాలని

నిత్యమల్లినై పూస్తూనే

ఉన్నా...

ఐనా....

ప్రేమందక...ప్రేమంటక....

నే. ఆరని నెగడు నే

(కవిత courtesy శ్రీమతి వాసిరెడ్డి మల్లీశ్వరి గారు)

24, అక్టోబర్ 2020, శనివారం

ఎవరదీ ఎవరదీ - ఇంతగ నను వెంటాడేదెవరదీ - కవిత - బోయి భీమన్న

 

Pencil sketch by me

గానం : పొన్నాడ లక్ష్మి
క్రింది youtube లింక్ క్లిక్ చేసి వినండి.



ఎవరదీ ఎవరదీ

వింతగనను వెంటాడేదెవరదీ

 

ఎలమావుల కొమ్మలలో

వలపు చిలికి పిలిచేది

ఆరుమొయిలు నడుమ కూడ

కన్నుకొట్టి నిలిచినది

 

వైశాఖపు ఎండలలో

పైరుగాలి విసిరేది

చీకు నరక యాతనలో

చేదోడుగ నిలిచేది

 

దిక్కులేని పేద ఇంట

దీపం వెలిగించేది

మోడుకు గిలిగింతపెట్టి

మొగ్గలు తొడిగించేది

 

(బోయి భీమన్న)

20, అక్టోబర్ 2020, మంగళవారం

రాజ బాబు, ప్రఖ్యాత హాస్యనటుడు - Raja Babu, Actor, Comedian


 Tribute to Raja Babu, ace comedian actor of Telugu cinema, on his birth anniversary (pencil sketch.

నివాళి - తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు హాస్యనటునిగా వెలిగిన రాజబాబు, శతాబ్దపు హాస్యనటునిగా ప్రశంసలు పొందిన వ్యక్తి. వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు. ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు, , ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందాడు. "చెన్నై ఆంధ్రా క్లబ్బు" వారు వరుసగా ఐదు సంవత్సరాలు "రోలింగ్ షీల్డు"ని ప్రధానం చేసారు. రాజబాబు జయంత్రి సందర్భంగా నా చిత్ర నివాళి.

మిత్రులు ప్రసాద్ కె.వి.యస్ గారు facebook లో అందించిన మరిన్ని వివరాలు. వారికి నా ధన్యవాదాలు.

"నువ్వు గొప్ప నటుడివిరా....నువ్వుండాల్సిన చోటిది కాదు. మద్రాసెళ్ళు....పెద్ద స్టార్ వు అవుతావు!....అంటూ....తను వేసిన నాటకాలు చూచిన వారంతా చెప్తుంటే....
సరే...అని మద్రాసొచ్చి....చూస్తే....ఎవ్వరూ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చిన పాపాన పోలేదు మొదట్లో....పుణ్యమూర్తుల అప్పలరాజుకు!
నిజమే....స్టార్వవుతున్నాను.....తిండిలేక!....అనుకున్నాడు అప్పలరాజు.
మునిసిపాలిటీ కొళాయి నీళ్ళు త్రాగి.....కడుపు నింపుకున్న రోజులు!....
పస్తులతో....బ్రతుకు దుర్భరమనిపించిన రోజుల నుండి....అప్పలరాజు.....నసీబ్ మారి....రాజబాబు గా అవతరించడానికి...ఎన్నో కష్టాలు...అవమానాలు పడ్డాడు!
నటులు....దర్శకుడు చెప్పినదాన్ని...చెప్పినట్లే...ఉన్నది ఉన్నట్లే కాకుండా....తమ దైన సొంత ధోరణిలో కొంత ఇంప్రువైజ్ చెయ్యాలి. అప్పుడే గుర్తింపు బాగా వస్తుంది.
ఇలా చెయ్యడంలో అందె వేసిన చెయ్యి....రాజబాబుది. దర్శక నిర్మాతల అనుమతితో....సీన్....మరింత బాగుండేలా ..తన డైలాగ్ డెలివరీ తో....తనకే సొంతమైన నటనతో...పండించే వాడు....రాజబాబు.
అందుకే ...20 వ శతాబ్ధపు హాస్య నటుడు....అనే బిరుదు సంపాదించగలిగాడు!
***********
రాజబాబూ.....ఏం పలకడం లేదే?.....సీను పండడం లేదు. నవ్వు రావడం లేదు......అని నిర్మాత ప్రక్కకు పిలిచి షూటింగ్ మధ్యలో అడుగుతుంటే....
కొపం వచ్చినా....తమాయించుకుని....
అసలు సీనులోనో....మీరు వ్రాయించిన డైలాగుల్లోనో....కొంచెం అయినా సత్తా ఉండాలి కదా. అదుంటే.....నేనైనా...ఎవరైనా పండించ గలరు....నవ్వించ గలరు. ముందు సీన్ డైలాగ్ లు...మళ్ళీ వ్రాయించండి.
ఆతరువాత షూటింగ్ చేసుకుందాం....అని షూటింగ్ కూడా ఆపించగల స్టేజి లో ఉండేవాడు రాజబాబు.
మీ సినిమాలో రాజబాబు ఉన్నాడా?....అయితే సరే....అని డిస్ట్రిబ్యూటర్లు తలలూపేవారు.
శతాబ్ధి హాస్య నటుడు....అనిపించుకున్న రాజబాబు కున్న బలహీనత....మందు.
అవును....నేను త్రాగుతాను.
నా సొంత డబ్బుతో...నా ఆనందం కోసం...నేను త్రాగుతాను. త్రాగి ఎప్పుడూ నేను షూటింగులకు రాలేదే! ఏ నిర్మాతకూ...నష్టం కలిగించలేదే!.....
అని తనకు తను మభ్య పెట్టుకున్నా....రాజబాబు కు త్రాగుడు వ్యసనం ఉందన్నది జగమెరిగిన సత్యం.
***********
అక్టోబరు 20, 1935 తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో పుట్టిన... పుణ్యమూర్తుల అప్పలరాజు....
నిడదవోలు లోని పాఠశాల చదువు చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు.
ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశాడు.
ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలుపంచుకొనే వాడు.
ఒక సారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు.
దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నాడు.
పూట గడవడానికి పిల్లలకు ప్రైవేటు చెప్పేవాడు. కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావు రాజబాబుకి సమాజం(1960 )సినిమాలో అవకాశం కల్పించాడు.
మొదటి సినిమా తరువాత.... తండ్రులు-కొడుకులు,కులగోత్రాలు,స్వర్ణగౌరి,మంచి మనిషి.... చిత్రాలలో అవకాశాలు వచ్చాయి.
స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించాడు.
తరువాత వచ్చిన చిన్న చిన్న పాత్రలలో నటిస్తూనే...
కుక్కపిల్ల దొరికింది, నాలుగిళ్ళ చావిడి, అల్లూరి సీతారామరాజు....ఇలాంటి నాటకాలలో నటించేవాడు.
**********
జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ చిత్రం...అంతస్తులు చ్రిత్రంలో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా పెద్దమొత్తం 1300 రూపాయల్ని పారితోషికంగా పొందాడు.
తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా...
ఎన్నో చిత్రాలలో నటించాడు.
రాజబాబుకు జంటగా లీలా రాణి, మీనా కుమారి, ప్రసన్న రాణి, గీతాంజలి లాంటి వారు నటించినా,
ప్రేక్షకాదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ అని చెప్పాలి.
ఇద్దరు అమ్మాయిలు, ప్రేమనగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రెటరి, జీవన జ్యోతి, కార్తీక దీపం, అడవి రాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు-రమాప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి.
రాజబాబు...
తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగా నటించాడు.
ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా బాబ్ & బాబ్ ప్రొడక్షన్స్ అన్న నిర్మాణ సంస్థ పేరుతో...నిర్మాత కూడా రాజబాబే.
***********
వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు.
ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు,
మూడు నంది బహుమతులు, , ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందాడు.
చెన్నై ఆంధ్రా క్లబ్బు వారు వరుసగా ఐదు సంవత్సరాలు...రోలింగ్ షీల్డు..ని ప్రధానం చేసారు.
అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు.
రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు.
ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించే వాడు.
ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన బాలకృష్ణను సత్కరించాడు.
హాస్యనటుడు....బాలకృష్ణ నటన కోసం.....పాతాళ భైరవి....ఎన్నోసార్లు చూశానని చెప్పేవాడు రాజబాబు.
రాజబాబుచే సత్కారం పొందిన వారిలో... డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు.
ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు.
రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇచ్చాడు.
అంతే కాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు.
దాని పేరుకూడా ఆయన పేరు మీదే....రాజబాబు జూనియర్ కళాశాలగా ఉంది.
***********
రాజబాబుకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టం.
మహా శివరాత్రి రోజు, ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు.
అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు.
గొంతు కాన్సర్ తో 6 నెలలు బాధ పడారు.
ఆ ఆసుపత్రి లోనే ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయాడు.
అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది.
ఆయన సోదరులు....చిట్టిబాబు & అనంత్ లు...మనకు పరిచయమున్న హాస్య నటులే.
రాజబాబు బాణీనే అనుసరించినా సక్సెస్ కాలేక పోయారు. అనుకరణ ఎప్పుడూ విజయవంతం కాదు మరి.
రాజబాబు డిసెంబరు 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు ను వివాహమాడాడు.
శ్రీ.శ్రీ. గారికి రాజబాబు గారు......తోడల్లుడు.
వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.
తెరపై....కనిపిస్తే చాలు.....నవ్వులు అసంకల్పితంగా సినిమా హాల్లో....విరబూయించిన... కీ.శే.రాజబాబు ఉరఫ్ పుణ్యమూర్తుల అప్పలరాజు గారి జయంతి నేడు.
స్మృత్యంజలి )

Courtesy Dr. Prasad Kvs)

నేను వేసిన చిత్రానికి మిత్రులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్య స్పంధన.

ఆ.వె
మాట,నటన మనల మరిమరి నవ్వించు
దాన కర్ణుడతడు ధర్మ మొసగ
మేటి సాటిలేరు నేటికైననుగాని
రాజు హాస్యమునకు రాజబాబు

19, అక్టోబర్ 2020, సోమవారం

బాలవే నీ వెపుడు - గోలవే బేలవే - అడవి బాపిరాజు కవిత


 

కీ. శే. అడవి బాపిరాజు గారి అద్భుత కవిత కి నా pencil చిత్రం.


బాలవే నీ వెపుడు – గోలవే బేలవే!

పరమ సౌందర్యాలు – పడతి నీ కన్నులే

కన్నులలో దాగెనే – కమ్మని సిగ్గోటి

బాలవే నీవెపుడు – గోలవే బేలవే!

 

ఉదయ సంధ్యల ఎరుపు

పెదిమెలలో తేనెలే

తేనెలో ఒదిగింది – తీయ తీయని సిగ్గు!

బాలవే నీవెపుడు – గోలవే బేలవే!

 

తంత్రి స్పందించుతూ

తలవాల్చి పాడుతూ

నను ముంచు నీ పాట నవ్యమయ్యే సిగ్గు!

బాలవే నీవెపుడు గోలవే బేలవే!

 

నీలి కనురెప్పలో మేలమాడే సిగ్గు

అందాల నీ పెదవి అలమిపోయే సిగ్గు

దివ్య గాందర్వాన నవ్యమయ్యే సిగ్గు

సిగ్గులను మాలగా చేర్తువే నా గళము

బాలవే నీవెపుడు – గోలవే బేలవే






18, అక్టోబర్ 2020, ఆదివారం

అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


charcoal/graphite pencil sketch - ఈ చిత్రం ఈ నెల 'తెలుగుతల్లి కెనడా; పత్రికలో 'మూర్తిమంతమాయె' శీర్షికలో ప్రచురితమైనది. ప్రతినెలా నేను చిత్రీకరించిన చిత్రాన్ని ప్రచురిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు. 

ఈ సందర్భంగా మిత్రురాలు, కవయిత్రి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి వివరణాత్మక వ్యాసం ఆమెకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పొందుపరుస్తున్నాను. 


"కాలం మోసుకెళ్లిన పాటల పూల రుతువు

అతడో పాటల పూల రుతువు. స్వరాల మేలి క్రతువు. అతడో రాగ విలాసమెరిగిన స్వర విలాసి. స్వర విరోధమెరుగని విలక్షణ విలసన కలాపి. అతడు విరసమెరుగని విరామం లేని విసుగు చెందని స్వర సామ్రాట్టు. స్వర జ్ఞాన నిధానమైన జన హృదయ విజేత. అతడు సంగీత వన స్వర సౌందర్య సీమల మన మనముల నిలుపు గంధర్వ గాన వనమాలి. అతడో తీయని తన్మయ స్వరం. అతడే బాల సుబ్రహ్మణ్యం.

‘‘శ్రుతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు
శరణాగతి నీవు భారతి’’ - అనే స్తుత్యాలాపనతో భారతిని స్మరించి, ఆ నలువ చెలిని మెప్పించి, ఆమె కరుణా కటాక్షసిద్ధినొందారు కనుకనే ఉత్తేజం, ఊర్జితం, ఉద్రేకం, ఉద్వేగం, ఓదార్పు, జాలి, లలి, లాలి, విషాదం, శృంగారం, ఆధ్యాత్మికత, ఆరాధన, చిలిపితనం, వేడుకోలు ఇలా ఎన్నెన్నో అనుభూతి గళ తంత్రుల గాన సరాలను సురానందమందించి తన్మయత్వపు మత్తును ముంచారు మనను.
‘‘ఏమి ఈ వింత మోహం’’ అనే పాటలో ప్రారంభమైన తన స్వర్వార్చన ప్రస్తానంలో దండకాలు, పద్యాలు, యుగళ గీతాలు, సోలో పాటలు, స్తోత్రాలు గానం చేసి జనస్తోత్ర మందుకున్నారు బాలు. వేణువులా బాలు స్వరం శ్రుతిలయలకు సుందరాతి సుందరంగా ప్రాణ ప్రతిష్ట గావించింది.

‘‘సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము’’ - అని గుర్తెరిగిన బాలు కవుల కలం చిలికిన అక్షర భావం ముభావం అభావం కానీక సంభావనా ప్రభావం పరివ్యాప్తి నందేలా అమరత్వమందేలా, శ్రుతి శుభగంగా రాగాలాపన చేశారు. అంతే కాదు కేవలం అక్షరాలను రాగాలతో జతపరిచి ఆలపించటం కాక అక్షరాల వెనుక ఉన్న ఆద ఆరాటం ఏమో అవగతం చేసుకొని అద్భుతావిష్కరణ చేసే విద్య బాలుకు తెలిసినట్లు వేరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అంటే వారి గళ నాధ గమకాల గమనాల గుణ గణముల గల ఘనత నెంచగలమా!’

‘సంగీతమపి సాహిత్యం
సరస్వతీప్తగన ద్వయం
ఏకమాపాత మధురం
అన్యదాలోచనామృతం’ - అన్న ఈ సత్యం తెలిసి సంగీత సాహిత్యాలనే స్వాధ్యాయముగా భావించి, స్వరాలాపనలో స్వరారోహణావరోహణల స్వారస్యమెరిగిన రసజ్ఞతతో నవకపు నాజూకు రాగాల నవ నవోన్మేషంగా, నలువుగా నయగారంగా నవరస ప్రదర్శనానందాన తెలుగు వాడినని చెప్పుకుని తెలుగు భాష మీద వన్నె తగ్గని ప్రేమతో వర్ణ, పద, శబ్దోచ్ఛారణా సౌందర్యాన్ని, తెలుగు భాష తీయదనాన్ని అపరిమిత రీతిని తన గాన మాధుర్యంతో నేల నాలుగు చెరగులా చాటి మన హృదయ కేదారాలను గాన రసప్లావితం చేశారు.

ఆయన శ్వాసాలాపనా ధ్వని రాయి వంటి మనసునైనా రామ మందిరంగా ఆరామ సుందరంగా మార్చగల శక్తి రూపం. భక్తిరస రాగిణిగా భావోద్వేగసిక్తమైన బాలు స్వరం-
‘‘గిరినందిని శివరంజని భవభంజని జననీ’’ -అంటూ పాడిన పాట మానసాలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. అక్షరోచ్చారణా కేళిలో ఆరితేరిన బాలు ఏ వర్ణాన్నెలా పలికితే - ఏ అక్షరాన్నెంత నొక్కి పలికితే కవి ఆశించిన భావం ద్యోతకమౌతుందో తెలిసిన అక్షర మాంత్రికుడు బాలు. భక్తి భావంలో ఆర్ద్రతను కలగలిపి పాడిన పాటలనేకం మనకు తెలుగు గుడిలోని గంటలా మన ఎదల మోగుతూనే ఉంటాయి.

మనశ్శరీరాలనత్యంత ప్రభావితం చేసేది శృంగారం. శృంగార తపనల తమకపు హాయిని తన గాత్ర గారాబాన మరువలేని తీరున మన మనసులను మైమరపించే విధాన వినిపించిన విధానానికి నిదర్శనం
‘‘మల్లెలు పూచే వెన్నల కాసే
ఈ రేయి హాయిగా
మమతలు తీయిగ పెనవేయి
నన్ను తీయగా
ముసిముసి నవ్వులలో గుసగుస లాడినవే
మిస మిస వెన్నెలలో మిలమిలలాడినవే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే’’
- అన్న పాట. ఆభేరి రాగంలో పాడిన ఈ పాటలో బాలు గాత్రం వింత శృంగార రాగపు గారామునెంత గారాబంగా ఒలికించిందో... ‘‘మమతలు రేయిగ పెనవేయి నన్ను తీయగా’’ - అనటంలోనే కాదు పాటంతా కవి రాసిన పద-భావ సౌందర్యాన్ని మచ్చు చల్లినట్లు - ఓ మైమరపు అల అలమినట్టు తన్మయత్వపు మునకలో మునిగినట్టు బాలు గళం చిత్ర విచిత్ర భావ గమకాల సోయగపు సోనలలో ముంచుతుంది.

అలాగే అంత అందంగా -
‘‘ చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా
బొట్టు కాటుక పెట్టి నేను కట్టే పాటలు
చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ’’ - అంటూ కవి భావుకతకే అందం అద్దేలా మోహనంగా ఆలపించారు.

‘‘మనసే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా’’ - అని పాడిన పాట వెన్నెలంత అందమైన పాట.
‘‘మానస వీణ మధుగీతం
మన సంసారం సంగీతం’’ - ఈ పాటలో
‘‘జాబిలి కన్న నా చెలిమిన్న
పులకింతలకే పూచిన పొన్న
కానుక లేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను’’ -
ప్రేమ లాలిత్యాన్నంతా వినే మనసునంటేలా అద్భుతంగా పలికించారు.

" కోవెల్లో వెలిగే దీపం దేవి నా తల్లి
కోవెల్లో తిరిగే పాటల గువ్వ నా చెల్లి
గువ్వంటే గువ్వ కాదు గోరవంక కాని
వంకంటె వంక కాదు నెల వంక కాని’’
అన్న పాటలో చెల్లి పట్ల అన్నకుండే వాత్యల్సాన్ని తన స్వరంలో అద్భుతంగా పలికించారు.
‘‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం
బ్రతుకు తెరవుకై పెనుగులాడుటి ఆరాటం
కృష్టి చేశావంటె - ఎదురీదావంటే
సాధించేవు గెలిచేవు నీదే జయం’’ - అంటూ
నీరస హృదయాలకు ఉత్తేజ ఉత్సాహాలను ప్రబోధించే పాటలతో పాటు, ‘పుణ్యభూమి నా దేశం’’ వంటి దేశభక్తి గీతాలు, ‘‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు’’ వంటి విప్లవాత్మక గీతాలు, ‘‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్‌’’ వంటి వ్యంగ్యాత్మకమైన పాటలు, ‘పాట ఆగిందా ఒక సీటు గోవిందా’ వంటి సరదా పాటలను ఆయా భావాలను తన స్వరంలో ఆకర్షణీయంగా అద్వితీయంగా వినిపించారు.

రాజశ్రీ, సిరివెన్నెల, వేటూరి, దేవులపల్లి, దాశరధి, శ్రీశ్రీ, నారాయణరెడ్డి మొదలైన ఎందరెందరో రచించిన పాటలను స్వరాల వరాల మూటలుగా, సాటిలేని మేటి సుస్వర పేటలుగా చేసి మన హృదయ శ్రవణాలను నలంకరించారు బాలు.

‘సంగీత ప్రేమికులను, రసజ్ఞులను ఉర్రూతలూగించే విధాన సంప్రదాయ సంగీత రీతిని స్వరం సారించి గానం చేసిన గీతాలన్ని కల్యాణి, మోహన, శివరంజని, శంకరాభరణం, హంసనాదం, అరుదైన చారుకేశి ఇత్యాది రాగాలనెన్నింటినో అవలీలగా పాడి వాణినే మెప్పించిన వారు బాలు’ నాద రాగ భావమయమైన గాన ప్రవాహాన మనసానందడోలల నూపిన బాలు భక్తి భావోద్వేగాన మోహన రాగంలో - ‘శివాని భవాని శర్వాణీ గిరినందిని శివరంజని భవభంజని జననీ శతవిధాల శృతి విధాన స్తుతులు గలుపలేని నీ సుతుడనే శివానీ’ - అని ఆ వీణాపాణిని వేడుకొని సిరివెన్నెల పద సరళిననుసరించి పాట పాడిన తీరు అబ్బురమనిపిస్తుంది.

‘‘శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా’’- అనే పాటలో
"మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల
సిరిసిరి వ్వులు కాబోలు
పరవశాన శిరసూగంగా
ధరకు జారెగా శివగంగా
నా గానలహరి నువు మునుగంగా
ఆనంద వృష్టినే తడవంగా ".. అంటూ,
" పదములు తామే పెదవులు కాగా
గుండెయలే అందియులై మ్రోగా
వేదం అనణుణువున నాదం’ - అంటూ
ఎంత పారవశ్యాన్ననుభవించారో .మనకు పంథాలో..
ఎంతగా తమ గమకిత కంఠనాదాన జన ప్రాణ
పాదులకు హ్లాదమిచ్చారో..బాలు.
‘‘ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరా భరణము
శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము
రాగ రత్న మాలికా తరళము శంకరాభరణము
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
రసికులకనురాగమై రస గంగలో తానమై
పల్లవించు సామ వేద మంత్రము శంకరాభరణము’’ - అంటూ
కవి శంకరాభరణ రాగం గొప్పతనాన్న్నెంత గొప్పగా నిర్వచించారో అంతే ఘనంగా బాలు స్వరం భావప్రకటనా ప్రదర్శితమైంది.
సర్వులను రంజింపచేసే శివరంజని రాగంలో శోకరసాన్ని ఉత్సాహాన్ని ఒలికిస్తూ బాలు ఆలపించడం ఓ విశేషం. నందానికే ఆనందమిచ్చారు బాలు.
‘‘ అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
మేలుకొనపోవు నీవు వద్దనక’’ - అంటూ
తన గళ కలశంలో శోక రసాన్నెంతగ నింపారో... ఈ లోకంలో సుఖదుఃఖాలతో అలసిన జీవి ఆత్మజ్ఞానంతో కోరికలన్నీ బంధించే కట్లు వంటివని వాటిని నీవే తెంచాలి అని భగవంతుడి ముందు మోకరిల్లితే - ఇలాగే వేడుకుంటాడేమో..
క్రౌంచ పక్షి విషాదాన్ని తన స్వరాన నింపుకుని విషాదమే వితాకు నందేలా స్వాంతననెరుగని విషాదాన్ని స్వర తంత్రుల సవ్వళ్ళ సుడులు తిరిగి ఎదలను రాపిడి పెట్టేలా
‘‘ ఎవరికి తెలుసు చితికిన మనసు
చితిగా రగులునని’’ -
‘‘ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూ దారులన్ని గోదారి కాగా
పాడింది కన్నీటి పాట
..................................
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలు పూత’’ -
‘‘నిన్ను మరచి పోవాలని
అన్ని విడచి వెళ్ళాలని
ఎన్నిసార్లో అనుకున్నా
మనసు రాక మానుకున్నా’’-
‘‘తలుపు మూసిన తల వాకిట నే
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక
అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది
నీ హృదయం కరగనిది’’- అంటూ
ఓ భగ్న హృదయపు ఆవేదనను, ఆర్తిని విషణ్ణ హృదయ విలాప రాగాలాప సల్లాప కలాపంగా తన స్వర స్పర్శతో అద్భుతంగా వినిపించారు.
‘‘ప్రాణము నీదని గానము నీవని
ప్రాణమే గానమనీ
మౌన విచక్షణ గాన విలక్షణ
రాగమె యోగమని
నాదోపాసన చేసిన వాడను
నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సిత
ఖందరా నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర
గానమది అవధరించరా
విని తరించరా’’ - అని పరమాత్మతో మొరవిడుతూ ఆహ్వానిస్తూ,

‘‘అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా’ ’ -
అని వేడుకొంటూ సంగీత రససిద్ధుడైన బాలు, గాన పారిజాత సౌరభమై ప్రాతఃకాల సౌజన్యమై జనాంతరంగ అంతస్సీమల నిలచిన బాలు పాట ఒడిని గుండె తడిని మిగిల్చి అదృశ్యమైనాడు.
బాలు శ్వాస స్వరాలాపన నిలచిన వేళ, అభిమానుల ఆక్రోశమే సంతకమై నిలచిన వేళనైనా వెన్నెల్లో ఆలోజు వంటి సరస రాగ విలసితమైన నీ మధుర గానం వినుగలగటం ఏ పూర్వ యోగమో నీ గానంతో ప్రతి హృదయం పులకితమైంది చెంగలువల చందు ఐంది.

క్షితి మృతి లేని తన మధుర గానంతో రస రాగాలూది తెలుగు పలుకు చక్కదనం తెలిపి, అలసితి అంటూ ఈ లోకానికి వీడ్కోలు పలికి, తన గానామృతాన్ని అందించటానికే అంబరాంగణాన రమ్య రసరాగ గంగా తరంగ రంగాన కచేరి గావింప
‘‘పాడనా తీయగా కమ్మని ఒక పాట’’ అని ఊరిస్తూ,
‘‘పాటగా బతకనా మీ అందరి నోట’’ - అని అడుగుతూ,
‘‘ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమనుకున్నా నా గానమాగదులే’’ - అంటూనే దివికేగినాడు.
-రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

17, అక్టోబర్ 2020, శనివారం

'అమరత్వము' కవిత - అడవి బాపిరాజు




అమరత్వము - 

(కీ.శే. అడివి బాపిరాజు గారి కవితకి నా చిత్రం.)


ఓ చెలీ

ఓ చెలీ

నీవు నా నిదురలో మూర్తించి

నీవు నా ఎదలలో నర్తించి

పూవులో తేనెవై

తావిలో మత్తువై

పాటలో ఫణితివై

మాటలో తేటవై

అమ్రుత బిందువులోని

అమరత్వమైతివే

నువ్వూ నేనూ కలిసి - అడవి బాపిరాజు కవిత

My pencil sketch

నువ్వూ నేనూ కలిసి - అడివి బాపిరాజు గారి కవిత కి నా చిత్రం





నువ్వూ నేనూ కలసి

పువ్వులో తావిలా - తావిలో మధువులా!
నువ్వూ నేనూ కలసి
కోకిలా గొంతులా - గొంతులో పాటలా!
నువ్వూ నేనూ కలసి
వెన్నెలా వెలుగులా - వెలుగులో వాంఛలా!
నువ్వూ నేనూ కలసి
గగన నీలానిలా - నీలాన కాంతిలా!


16, అక్టోబర్ 2020, శుక్రవారం

Pendyala Nageswara Rao - పెండ్యాల నాగేశ్వరరావు

సంగీత స్వర కళానిధి 'పెండ్యాల నాగేశ్వరరావు' - నా pencil చిత్రం.

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. వారి గురించి మరిన్ని వివరాలు ('సితార' సౌజన్యంతో) ఈ క్రింది లింక్ క్లిక్ చేసి తెలుసుకుందాం. 




 

14, అక్టోబర్ 2020, బుధవారం

నువ్వటే నువ్వటే - ఆడవి బాపిరాజు - కవిత



 అడవి బాపిరాజు గారి కవితకి నా చిత్రం ః 


నువ్వటే నువ్వటే - పువ్వు విరిసిన వయసు - నవ్వులలమిన సొగసు

రువ్వి నా ఎదపైన - చివ్వునంతర్హివే - నువ్వటే నువ్వటే !

నువ్వటే నువ్వటే - కవ్వించి నా కాంక్ష - త్రవ్వించి నా కళలు

ఉవిళ్ళుగొన మనసు - దవ్వైతివే దెసల్ - నువ్వటే నువ్వటే

నువ్వటే నువ్వటే - జవ్వనీ ప్రణయినీ - మువ్వంపు వగలాడి

అవ్వరు ముద్ది మా - నవ్వుతూ నను వదలి

రివ్వురివ్వున మిన్ను - పవ్వళిపయితివే - నువ్వటే



మనసు మనసులో లేనప్పుడు - కవిత


Pencil sketch

నా చిత్రానికి ఆనూశ్రీ కవిత Courtesy facebook dated 14th October, 2019. 


మనసు మనసులో లేనప్పుడు


మనసు మనసులో లేనప్పుడు
మాటలన్నీ అపార్ధాల మూటలవుతాయ్
భావాల దొంతరలన్నీ విషాదగేయాన్నే ఆలాపిస్తూంటాయ్....

హృదయం వేదన పదం జపిస్తుంటే
నిరాశలన్నీ నిశీధులై చుట్టేస్తుంటాయ్ ...
దుఃఖాన్ని పారద్రోలగా చేసే యత్నాలన్నీ
ఫలించని కలలై నిదురని దోచేస్తుంటాయి.

నదులై పారిన కన్నీళ్ళు సైతం
చిరునవ్వును పూయించలేక
నలిగిన హృదయపు పొరల్లో
ఇంకి పోతుంటాయి...

ఆలోచనల సరళిమారి
స్థిమిత పడిన మరునిముషం...
పంజరాన్ని వీడిన పక్షుల్లా
బాధలన్నీ నింగికెగసే తారలవుతాయి..

సహనం నీడలో మరింత దృఢమై సమస్యలపై సంధించే
అస్ర్రాల అమరికలో
నిమగ్నమవుతుంది మది

కూచిపూడి నృత్యకళాకారిణి డా. శోభానాయుడు

       

 Dr. Sobha Naidu, Kuchipudi Exponent - My pencil sketch

డా. శోభానాయుడు (1956-14th October 2020)

దేశం గర్వించదగ్గ నాట్యకారిణి పద్మశ్రీ డా.శోభానాయుడు. పురుషులు మాత్రమే కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తున్న కాలాన్ని దాటుకుని వచ్చి.. మహిళలు సైతం కూచిపూడి ఘన పతాకను రెపరెపలాడించగలరని నిరూపించిన కళాకారిణుల్లో అగ్రేసర విదుషీమణి ఆమె! అభినయానికి నిలువెత్తు సాక్షి సంతకం శోభానాయుడు. ఆమె నాట్య ప్రస్థానంలో.. సాత్వికాభినయానికి చిరునామాగా నిలిచే నృత్యరూపకాలెన్నో! 

జగమెరిగిన కూచిపూడి నాట్యాచార్యులు డా.వెంపటి చినసత్యం దగ్గర గురుకుల పద్ధతిలో పాఠాలు నేర్చుకున్నారు శోభానాయుడు. నాట్యకారిణిగా ఆమె చేయని ప్రయోగం లేదు. ఎక్కని వేదికా లేదు. కూచిపూడి అంటే శోభానాయుడే అన్నంత పేరు తెచ్చుకున్నారు. అనంతరం, తన నాట్య సంస్థ ‘శ్రీనివాస కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ’ ద్వారా అనేక మందిని తీర్చిదిద్దారు. శిష్య ప్రశిష్యులు పదివేల పైచిలుకే! వారంతా అమెరికా, యూరప్‌, రష్యా వంటి దేశాల్లో కూచిపూడి నాట్య వైభవాన్ని చాటుతున్నారు.   గురువు పేరు నిలబెడుతున్నారు.  

అభినయ సౌందర్యం

అభినయ ప్రదర్శనలో శోభానాయుడు దిట్ట. సంప్రదాయ పద్ధ్దతిలో అనేక నాట్యప్రదర్శనలిచ్చారు. భామాకలాపం, శ్రీకృష్ణ పారిజాతం వంటి రూపకాల్లో ఆమె అభినయం సత్యభామను ప్రత్యక్షం చేస్తుంది. సంభాషణలు లేకుండానే, హావభావాలతో  రసానుభూతిని కలిగిస్తాయి ఆమె పాత్రలు! శోభానాయుడు పదిహేను పైచిలుకు నాట్యరూపకాలకు దర్శకత్వం వహించి నిర్మించారు! కళ్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణ శరణం మమ, విప్రనారాయణ, ‘జగదానంద

కారక..’గా జగద్విఖ్యాతమైన త్యాగరాజ రామాయణం, నవరస నటభామిని, సర్వం సాయిమయం, భగవద్గీతాసారమైన సంభవామి యుగేయుగే, విజయోస్తుతే నారీ, స్వామి వివేకానంద.. ఆమె దర్శకత్వం వహించిన రూపకాల్లో కొన్ని. ఇవేకాకుండా, నూటికిపైగా ’సోలో’ ప్రదర్శనలను రూపొందించి ప్రచారం చేశారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపైన నృత్య ప్రదర్శనలిచ్చిన శోభానాయుడు వాగ్గేయకారుల కీర్తనలను విరివిగా ప్రచారం చేశారు. తిరుమల నాదనీరాజనం వేదికగా అనేక ప్రదర్శనలిచ్చారు. పలుకుతేనెల తల్లి, అలరులు కురియగ, తగునయ్య హరి..  వంటి కీర్తనలను ఆమె ప్రదర్శించినప్పుడు అలమేలు మంగమ్మను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేది ప్రేక్షకులకు.

సందేశాత్మకం..చండాలిక

సంప్రదాయరీతిలో సాగిన శోభానాయుడు నృత్యప్రదర్శనలన్నీ ఒక ఎత్తయితే, రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన ‘చండాలిక’ మరొక ఎత్తు. అస్పృశ్యతను నిరసించే ఆ బెంగాలీ రచనను.. యస్వీ భుజంగరాయ శర్మ నృత్యానికి అనుగుణంగా అనువదించారు. అందులో అంట రానియువతి పాత్రలో.. చండాలికగా శోభానాయుడు నర్తించిన తీరు ప్రేక్షకులతో  కంట తడి పెట్టిస్తుంది. అంటరానితనాన్ని మించిన అకృత్యం లేదనే గొప్ప సందేశాన్నిస్తుంది! ఈ రూపకాన్ని కొన్ని వందలసార్లు ప్రదర్శించి, సమసమాజ నిర్మాణానికి  నాట్యం ద్వారా కృషి చేశారు శోభానాయుడు. కూచిపూడికి అంకితం కావాలనే దృఢ సంకల్పంతో సినిమా అవకాశాలను కూడా త్రుణప్రాయంగా వదులుకున్నారు ఆమె. లేకపోతే, కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలోని ఓ చిత్రంలో కథానాయికగా కనిపించేవారు. భారత ప్రభుత్వం నుంచి ఆమె పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ శాస్త్రీయ నృత్య చూడామణి ప్రదర్శనను తిలకించడానికే సృష్టికర్త పైలోకాలకు రప్పించు కున్నాడేమో!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌,  తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సంగీత విద్వన్మణి, తమిళనాడు కృష్ణగానసభ నుంచి నృత్య చూడామణి..  వంటివి శోభానాయుడు అందుకున్న పురస్కారాల్లో కొన్నిమాత్రమే!

-- గంధం బసవశంకరరావు


Courtesy ; Namaste Telangana


- గంధం బసవ శంకరరావు

 

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...