18, అక్టోబర్ 2020, ఆదివారం

అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


charcoal/graphite pencil sketch - ఈ చిత్రం ఈ నెల 'తెలుగుతల్లి కెనడా; పత్రికలో 'మూర్తిమంతమాయె' శీర్షికలో ప్రచురితమైనది. ప్రతినెలా నేను చిత్రీకరించిన చిత్రాన్ని ప్రచురిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు. 

ఈ సందర్భంగా మిత్రురాలు, కవయిత్రి శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి వివరణాత్మక వ్యాసం ఆమెకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పొందుపరుస్తున్నాను. 


"కాలం మోసుకెళ్లిన పాటల పూల రుతువు

అతడో పాటల పూల రుతువు. స్వరాల మేలి క్రతువు. అతడో రాగ విలాసమెరిగిన స్వర విలాసి. స్వర విరోధమెరుగని విలక్షణ విలసన కలాపి. అతడు విరసమెరుగని విరామం లేని విసుగు చెందని స్వర సామ్రాట్టు. స్వర జ్ఞాన నిధానమైన జన హృదయ విజేత. అతడు సంగీత వన స్వర సౌందర్య సీమల మన మనముల నిలుపు గంధర్వ గాన వనమాలి. అతడో తీయని తన్మయ స్వరం. అతడే బాల సుబ్రహ్మణ్యం.

‘‘శ్రుతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు
శరణాగతి నీవు భారతి’’ - అనే స్తుత్యాలాపనతో భారతిని స్మరించి, ఆ నలువ చెలిని మెప్పించి, ఆమె కరుణా కటాక్షసిద్ధినొందారు కనుకనే ఉత్తేజం, ఊర్జితం, ఉద్రేకం, ఉద్వేగం, ఓదార్పు, జాలి, లలి, లాలి, విషాదం, శృంగారం, ఆధ్యాత్మికత, ఆరాధన, చిలిపితనం, వేడుకోలు ఇలా ఎన్నెన్నో అనుభూతి గళ తంత్రుల గాన సరాలను సురానందమందించి తన్మయత్వపు మత్తును ముంచారు మనను.
‘‘ఏమి ఈ వింత మోహం’’ అనే పాటలో ప్రారంభమైన తన స్వర్వార్చన ప్రస్తానంలో దండకాలు, పద్యాలు, యుగళ గీతాలు, సోలో పాటలు, స్తోత్రాలు గానం చేసి జనస్తోత్ర మందుకున్నారు బాలు. వేణువులా బాలు స్వరం శ్రుతిలయలకు సుందరాతి సుందరంగా ప్రాణ ప్రతిష్ట గావించింది.

‘‘సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము’’ - అని గుర్తెరిగిన బాలు కవుల కలం చిలికిన అక్షర భావం ముభావం అభావం కానీక సంభావనా ప్రభావం పరివ్యాప్తి నందేలా అమరత్వమందేలా, శ్రుతి శుభగంగా రాగాలాపన చేశారు. అంతే కాదు కేవలం అక్షరాలను రాగాలతో జతపరిచి ఆలపించటం కాక అక్షరాల వెనుక ఉన్న ఆద ఆరాటం ఏమో అవగతం చేసుకొని అద్భుతావిష్కరణ చేసే విద్య బాలుకు తెలిసినట్లు వేరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అంటే వారి గళ నాధ గమకాల గమనాల గుణ గణముల గల ఘనత నెంచగలమా!’

‘సంగీతమపి సాహిత్యం
సరస్వతీప్తగన ద్వయం
ఏకమాపాత మధురం
అన్యదాలోచనామృతం’ - అన్న ఈ సత్యం తెలిసి సంగీత సాహిత్యాలనే స్వాధ్యాయముగా భావించి, స్వరాలాపనలో స్వరారోహణావరోహణల స్వారస్యమెరిగిన రసజ్ఞతతో నవకపు నాజూకు రాగాల నవ నవోన్మేషంగా, నలువుగా నయగారంగా నవరస ప్రదర్శనానందాన తెలుగు వాడినని చెప్పుకుని తెలుగు భాష మీద వన్నె తగ్గని ప్రేమతో వర్ణ, పద, శబ్దోచ్ఛారణా సౌందర్యాన్ని, తెలుగు భాష తీయదనాన్ని అపరిమిత రీతిని తన గాన మాధుర్యంతో నేల నాలుగు చెరగులా చాటి మన హృదయ కేదారాలను గాన రసప్లావితం చేశారు.

ఆయన శ్వాసాలాపనా ధ్వని రాయి వంటి మనసునైనా రామ మందిరంగా ఆరామ సుందరంగా మార్చగల శక్తి రూపం. భక్తిరస రాగిణిగా భావోద్వేగసిక్తమైన బాలు స్వరం-
‘‘గిరినందిని శివరంజని భవభంజని జననీ’’ -అంటూ పాడిన పాట మానసాలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. అక్షరోచ్చారణా కేళిలో ఆరితేరిన బాలు ఏ వర్ణాన్నెలా పలికితే - ఏ అక్షరాన్నెంత నొక్కి పలికితే కవి ఆశించిన భావం ద్యోతకమౌతుందో తెలిసిన అక్షర మాంత్రికుడు బాలు. భక్తి భావంలో ఆర్ద్రతను కలగలిపి పాడిన పాటలనేకం మనకు తెలుగు గుడిలోని గంటలా మన ఎదల మోగుతూనే ఉంటాయి.

మనశ్శరీరాలనత్యంత ప్రభావితం చేసేది శృంగారం. శృంగార తపనల తమకపు హాయిని తన గాత్ర గారాబాన మరువలేని తీరున మన మనసులను మైమరపించే విధాన వినిపించిన విధానానికి నిదర్శనం
‘‘మల్లెలు పూచే వెన్నల కాసే
ఈ రేయి హాయిగా
మమతలు తీయిగ పెనవేయి
నన్ను తీయగా
ముసిముసి నవ్వులలో గుసగుస లాడినవే
మిస మిస వెన్నెలలో మిలమిలలాడినవే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే’’
- అన్న పాట. ఆభేరి రాగంలో పాడిన ఈ పాటలో బాలు గాత్రం వింత శృంగార రాగపు గారామునెంత గారాబంగా ఒలికించిందో... ‘‘మమతలు రేయిగ పెనవేయి నన్ను తీయగా’’ - అనటంలోనే కాదు పాటంతా కవి రాసిన పద-భావ సౌందర్యాన్ని మచ్చు చల్లినట్లు - ఓ మైమరపు అల అలమినట్టు తన్మయత్వపు మునకలో మునిగినట్టు బాలు గళం చిత్ర విచిత్ర భావ గమకాల సోయగపు సోనలలో ముంచుతుంది.

అలాగే అంత అందంగా -
‘‘ చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా
బొట్టు కాటుక పెట్టి నేను కట్టే పాటలు
చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ’’ - అంటూ కవి భావుకతకే అందం అద్దేలా మోహనంగా ఆలపించారు.

‘‘మనసే వెన్నెలగా బ్రతుకే పున్నమిగా’’ - అని పాడిన పాట వెన్నెలంత అందమైన పాట.
‘‘మానస వీణ మధుగీతం
మన సంసారం సంగీతం’’ - ఈ పాటలో
‘‘జాబిలి కన్న నా చెలిమిన్న
పులకింతలకే పూచిన పొన్న
కానుక లేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను’’ -
ప్రేమ లాలిత్యాన్నంతా వినే మనసునంటేలా అద్భుతంగా పలికించారు.

" కోవెల్లో వెలిగే దీపం దేవి నా తల్లి
కోవెల్లో తిరిగే పాటల గువ్వ నా చెల్లి
గువ్వంటే గువ్వ కాదు గోరవంక కాని
వంకంటె వంక కాదు నెల వంక కాని’’
అన్న పాటలో చెల్లి పట్ల అన్నకుండే వాత్యల్సాన్ని తన స్వరంలో అద్భుతంగా పలికించారు.
‘‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం
బ్రతుకు తెరవుకై పెనుగులాడుటి ఆరాటం
కృష్టి చేశావంటె - ఎదురీదావంటే
సాధించేవు గెలిచేవు నీదే జయం’’ - అంటూ
నీరస హృదయాలకు ఉత్తేజ ఉత్సాహాలను ప్రబోధించే పాటలతో పాటు, ‘పుణ్యభూమి నా దేశం’’ వంటి దేశభక్తి గీతాలు, ‘‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు’’ వంటి విప్లవాత్మక గీతాలు, ‘‘సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్‌’’ వంటి వ్యంగ్యాత్మకమైన పాటలు, ‘పాట ఆగిందా ఒక సీటు గోవిందా’ వంటి సరదా పాటలను ఆయా భావాలను తన స్వరంలో ఆకర్షణీయంగా అద్వితీయంగా వినిపించారు.

రాజశ్రీ, సిరివెన్నెల, వేటూరి, దేవులపల్లి, దాశరధి, శ్రీశ్రీ, నారాయణరెడ్డి మొదలైన ఎందరెందరో రచించిన పాటలను స్వరాల వరాల మూటలుగా, సాటిలేని మేటి సుస్వర పేటలుగా చేసి మన హృదయ శ్రవణాలను నలంకరించారు బాలు.

‘సంగీత ప్రేమికులను, రసజ్ఞులను ఉర్రూతలూగించే విధాన సంప్రదాయ సంగీత రీతిని స్వరం సారించి గానం చేసిన గీతాలన్ని కల్యాణి, మోహన, శివరంజని, శంకరాభరణం, హంసనాదం, అరుదైన చారుకేశి ఇత్యాది రాగాలనెన్నింటినో అవలీలగా పాడి వాణినే మెప్పించిన వారు బాలు’ నాద రాగ భావమయమైన గాన ప్రవాహాన మనసానందడోలల నూపిన బాలు భక్తి భావోద్వేగాన మోహన రాగంలో - ‘శివాని భవాని శర్వాణీ గిరినందిని శివరంజని భవభంజని జననీ శతవిధాల శృతి విధాన స్తుతులు గలుపలేని నీ సుతుడనే శివానీ’ - అని ఆ వీణాపాణిని వేడుకొని సిరివెన్నెల పద సరళిననుసరించి పాట పాడిన తీరు అబ్బురమనిపిస్తుంది.

‘‘శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా’’- అనే పాటలో
"మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల
సిరిసిరి వ్వులు కాబోలు
పరవశాన శిరసూగంగా
ధరకు జారెగా శివగంగా
నా గానలహరి నువు మునుగంగా
ఆనంద వృష్టినే తడవంగా ".. అంటూ,
" పదములు తామే పెదవులు కాగా
గుండెయలే అందియులై మ్రోగా
వేదం అనణుణువున నాదం’ - అంటూ
ఎంత పారవశ్యాన్ననుభవించారో .మనకు పంథాలో..
ఎంతగా తమ గమకిత కంఠనాదాన జన ప్రాణ
పాదులకు హ్లాదమిచ్చారో..బాలు.
‘‘ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరా భరణము
శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము
రాగ రత్న మాలికా తరళము శంకరాభరణము
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
రసికులకనురాగమై రస గంగలో తానమై
పల్లవించు సామ వేద మంత్రము శంకరాభరణము’’ - అంటూ
కవి శంకరాభరణ రాగం గొప్పతనాన్న్నెంత గొప్పగా నిర్వచించారో అంతే ఘనంగా బాలు స్వరం భావప్రకటనా ప్రదర్శితమైంది.
సర్వులను రంజింపచేసే శివరంజని రాగంలో శోకరసాన్ని ఉత్సాహాన్ని ఒలికిస్తూ బాలు ఆలపించడం ఓ విశేషం. నందానికే ఆనందమిచ్చారు బాలు.
‘‘ అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
మేలుకొనపోవు నీవు వద్దనక’’ - అంటూ
తన గళ కలశంలో శోక రసాన్నెంతగ నింపారో... ఈ లోకంలో సుఖదుఃఖాలతో అలసిన జీవి ఆత్మజ్ఞానంతో కోరికలన్నీ బంధించే కట్లు వంటివని వాటిని నీవే తెంచాలి అని భగవంతుడి ముందు మోకరిల్లితే - ఇలాగే వేడుకుంటాడేమో..
క్రౌంచ పక్షి విషాదాన్ని తన స్వరాన నింపుకుని విషాదమే వితాకు నందేలా స్వాంతననెరుగని విషాదాన్ని స్వర తంత్రుల సవ్వళ్ళ సుడులు తిరిగి ఎదలను రాపిడి పెట్టేలా
‘‘ ఎవరికి తెలుసు చితికిన మనసు
చితిగా రగులునని’’ -
‘‘ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూ దారులన్ని గోదారి కాగా
పాడింది కన్నీటి పాట
..................................
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలు పూత’’ -
‘‘నిన్ను మరచి పోవాలని
అన్ని విడచి వెళ్ళాలని
ఎన్నిసార్లో అనుకున్నా
మనసు రాక మానుకున్నా’’-
‘‘తలుపు మూసిన తల వాకిట నే
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక
అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది
నీ హృదయం కరగనిది’’- అంటూ
ఓ భగ్న హృదయపు ఆవేదనను, ఆర్తిని విషణ్ణ హృదయ విలాప రాగాలాప సల్లాప కలాపంగా తన స్వర స్పర్శతో అద్భుతంగా వినిపించారు.
‘‘ప్రాణము నీదని గానము నీవని
ప్రాణమే గానమనీ
మౌన విచక్షణ గాన విలక్షణ
రాగమె యోగమని
నాదోపాసన చేసిన వాడను
నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సిత
ఖందరా నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర
గానమది అవధరించరా
విని తరించరా’’ - అని పరమాత్మతో మొరవిడుతూ ఆహ్వానిస్తూ,

‘‘అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా’ ’ -
అని వేడుకొంటూ సంగీత రససిద్ధుడైన బాలు, గాన పారిజాత సౌరభమై ప్రాతఃకాల సౌజన్యమై జనాంతరంగ అంతస్సీమల నిలచిన బాలు పాట ఒడిని గుండె తడిని మిగిల్చి అదృశ్యమైనాడు.
బాలు శ్వాస స్వరాలాపన నిలచిన వేళ, అభిమానుల ఆక్రోశమే సంతకమై నిలచిన వేళనైనా వెన్నెల్లో ఆలోజు వంటి సరస రాగ విలసితమైన నీ మధుర గానం వినుగలగటం ఏ పూర్వ యోగమో నీ గానంతో ప్రతి హృదయం పులకితమైంది చెంగలువల చందు ఐంది.

క్షితి మృతి లేని తన మధుర గానంతో రస రాగాలూది తెలుగు పలుకు చక్కదనం తెలిపి, అలసితి అంటూ ఈ లోకానికి వీడ్కోలు పలికి, తన గానామృతాన్ని అందించటానికే అంబరాంగణాన రమ్య రసరాగ గంగా తరంగ రంగాన కచేరి గావింప
‘‘పాడనా తీయగా కమ్మని ఒక పాట’’ అని ఊరిస్తూ,
‘‘పాటగా బతకనా మీ అందరి నోట’’ - అని అడుగుతూ,
‘‘ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమనుకున్నా నా గానమాగదులే’’ - అంటూనే దివికేగినాడు.
-రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...