16, డిసెంబర్ 2020, బుధవారం

'ఎంకి' పాటల 'నండూరి సుబ్బారావు' (My charcoal pencil sketch)



 'ఎంకి' పాటల 'నండూరి సుబ్బారావు' (My charcoal pencil sketch)

నండూరి వెంకట సుబ్బారావు (1884 - 1957)  ప్రసిద్ధ గేయ రచయిత. వీరి ఎంకి
పాటలు ఆంధ్ర దేశమంతా సుప్రసిద్ధంగా ప్రబంధాలతో సమానంగా గౌరవించబడ్డాయి.

వీరు పశ్చిమ గోదావరి జిల్లాలోని వసంతవాడలో చిన్న బాపన్న దంపతులకు
జన్మించారు. వీరి ప్రాథమిక విద్య ఏలూరులోను, కళాశాల చదువు కాకినాడలోను
సాగాయి. కొన్ని పరీక్షలలో తప్పడం మూలంగా మద్రాసుకు మకాం మార్చి వీరి
బంధువైన బసవరాజు అప్పారావు గారి ప్రోత్సాహంతో ఎఫ్.ఏ. పరీక్షలో
ఉత్తీర్ణులై, బి.ఎ. కోసం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరారు. కొంతకాలం
ఉపాధ్యాయునిగా పనిచేసి న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించారు. 1926 నుండి
ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు. తాను నమ్మిన కవితా మార్గాన్ని, దాని
విశిష్టతను, కవిత్వంలోని మర్మాలను నిరంతరం బోధించే అప్పారావును తనకు
గురువుగా భావించారు. గురజాడ అప్పారావు గారి ముత్యాలసరాలు చదివి దానిలోని
కవన మాధుర్యానికి ముగ్ధులైనారు. లవణరాజు కల అనే కావ్యం వీరిని ప్రగాఢంగా
ఆకర్షించింది. తన ఎంకి నాయుడు బావలు లవణరాజు కలలో నుండి మొలుచుకుని
వచ్చినట్లుగా వీరి ఉనికిపట్టయిన ఏటిదరితోట లవణరాజు కలలోనిదిగా
వ్యాఖ్యానించారు.

యెంకి పాటలు ప్రధానంగా ప్రణయానికి సంబంధించిన పాటలు. తొలి వలపులు,
దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు, బాసలు, వేదనలు, విరహాలు ఈ పాటల్లో
చక్కని పదాలలో కూర్చబడ్డాయి.

యెంకి పల్లె పడుచు. కపటం ఎరుగనిది. జానపద సౌందర్యానికి ప్రతీక.
ధర్మబద్ధమైన హద్దులలోనే ప్రేమిస్తుంది.

కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది,
దగ్గరగ కూకుంటె అగ్గి దూస్తాది".
అందుకే "యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి", "వయ్యారమొలికించు నా యెంకి,
వనలచ్చిమనిపించు నా యెంకి".

ఎవరీ ఎంకి? నండూరి వెంకట సుబ్బారావు పేరులోనే ఒక ‘వెంకీ’ ఉన్నాడు.
‘వెంకీ’ అంటే ఆధునికం, ‘ఎంకి’ అంటే పల్లె పదం. 1917-18లో రాతలు మొదలై,
పాటలైన ఈ ఎంకి పదాలు, 1925 దాకా పుస్తకంగా రాలేదు. అంటే  నండూరి వారి
ఎంకి 2017 సంవత్సరంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నమాట! అందుకే
ఈమెను ‘శతవత్సర విజయోత్సవ నాయిక’ అని కొనియాడారు కొందరు కవులు, రచయితలు.

అనేకమంది చిత్రకారుల రేఖల్లో రూపం పోసుకున్న ‘ఎంకి-నాయుడు బావ’ పాత్రలు
ప్రపంచ సాహిత్యంలో అరుదైనవి. తెలుగు సినిమాలకు పాటల ప్రాగ్రూపాలుగా,
సంస్మృతిలో అభినయ రూపాలుగా నిలిచాయి.

‘ఎంకి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్’ అన్నారు కవి. ‘ఎంకి పాటకు
నూరేళ్లండోయ్!’ అంటున్నాయి తెలుగుపల్లెలు. ‘బొండు మల్లెలు, గోవు
మాలచ్మిలు, తలలూపే చేలు’ అంటున్నారు యువ హృదయాల నాయుడు బావలు- వారిని
అలరించే పెంకి ఎంకి పిల్లలు. భావ కవిత్వపు వాడుక మాటల తేనె వాగు ఎంకి.
తనను రవల వెలుగులతో అభిషేకించారు నండూరి సుబ్బారావు. పల్లెల, పల్లె
మనుషుల, పల్లెమనసుల జవ జీవాలను ఈ పాటల్లో సజీవంగా ఉంచిన ఎంకి రూపశిల్పి
‘నండూరి వెంకట సుబ్బారావు’.

(సేకరణ : ఇక్కడా అక్కడా)

1 కామెంట్‌:

sri చెప్పారు...

బసవరాజు అప్పారావు గారు వీరికి బంధువు అని,ప్రేరణ అని మీ ద్వారా తెలుసుకొన్నాము, ధన్యవాదాలు.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...