23, డిసెంబర్ 2020, బుధవారం

సరిదె లక్ష్మీ నరసమ్మ - కళావర్ రింగ్



కళావర్ రింగ్ అను అప్పలనరసమ్మ లేదా సరిదె లక్ష్మీ నరసమ్మ -

శాపవశాత్తూ కొందరు అప్సరసలు భూమి మీద జన్మించడం మనం చందమామ కథల్లో చదువుకున్నాం. అలా జన్మించిన విద్యాధర కాంతయో, గంధర్వ కాంతయో.. . కళావంతుల కుటుంబములో విజయనగరం లో జన్మించిన ఆమె నాట్యం, హరికథ , మధురంగా పాటలు పడటం వంటివన్నీ పుట్టుకతో అబ్బాయి. తండ్రి సూరెడ్డి సన్యాసయ్య తల్లి అప్పయ్యమ్మ .

అధిక సంతతి గలిగిన ఆమె తల్లిదండ్రులు ఆమెను విజయ నగర రాజ నర్తకిగా ఉన్న బంధువురాలు 


అయిన సరిదె అన్నపూర్ణమ్మ అనే ఆమెకు దత్తత ఇవ్వడం తో ఆమె ఇంటి పేరు సరిదె అప్పల నరసమ్మ లేదా సరిదె లక్ష్మీ నరసమ్మ అని పిలిచేవారు. విజయనగరంలో లక్ష్మీ నరసమ్మ ఆరోజుల్లో మేజువాణీ గట్టి క్షేత్రయ్య మువ్వగోపాల పదాలకు చేసే నాట్యం చూడ్డానికి కోకొల్లలుగా చేరేవారట .

అప్పలనరసమ్మ గారు వృత్తి రీత్యా పేరుకు కళావంతురాలే గానీ ఆమె హృదయం వెన్న . ధనిక రస పిపాసులు తన నాట్యం మెచ్చి ఇచ్చిన కానుకలతో ఆమె అమిత వైభవంగా జీవించి ఉండవచ్చు .. కానీ ఆమెకు పేదల పట్ల , సంగీత విద్యార్థుల పట్ల అపార ప్రేమ . ఓమారు లక్ష్మీనరసమ్మ గారు గజ్జె కట్టి నాట్యం చేస్తుంటే మైమరచిన రసికుడు తన చేతికున్న కళావర్ మార్కు ఉన్న ఉంగరాన్ని ఆమెకు బహూకరించాడు. అప్పటి నుండి ఆమె పేరు కళావర్ రింగ్ గా మారిపోయింది .

కళావర్ రింగ్ కి హరికథలు మధురంగా చెప్పడం కూడా వచ్చు ఆమె చేతిలో చిడతలు వాయిస్తూ నాట్యం చేస్తూ మధురంగా గానం చేస్తుంటే ప్రేక్షకులు మైమరచిపోయేవారు. ఆమె హరికథా భాగవతార్ చొప్పల్లి సూర్యనారాయణ వద్ద హరికథ, ఆనాడు పేరుగాంచిన కళావంతురాలు మద్దెల రాముడు వద్ద నాట్యం నేర్చుకున్నారు. మద్దెల రాముడు గూర్చి నటుడు శ్రీ మిక్కిలినేని గారు రచించిన ఆంధ్రుల కళారూపాలులో ఆమెను గూర్చిన ప్రస్తావన ఉంది . ఆమె నాటకాలు, హరికథలు, భారత నాట్య ప్రదర్శనలు అన్నీ ఇచ్చి అశేష ప్రజానీకం మెప్పులు అందుకున్నది. కళావర్ రింగ్ ప్రతిభ జూసి ఆనాటి సినిమా వారు కూడా రాణి ప్రమీల 1935 అనే చిత్రములో ఆమె చేత నటింపజేశారు.

చింతామణి నాటకములో ఆమె చింతామణిగా నటించేవారు. ఆమె చింతామణిగా నటిస్తూ పద్యం ఎత్తుకుంటే ఆనాటి ప్రేక్షకులు పరవశించిపోయేవారట . చింతామణి వలే ఆమెకు కూడా ధనవ్యామోహం అసలు లేదు తనకు వచ్చిన సంపద అంతా పేదలకు , పేద విద్యార్థులకు సహాయం అందించడానికి వెచ్చించేది.

ఒకనాడు మధూకరం ఎత్తడానికి వెళ్లిన మన గాయక చక్రవర్తి ఘంటసాల గారికి ఆమె అనేక సార్లు అన్నం పెట్టి సహాయం చేసింది. విజయనగర సంగీత కళాశాలలో బావి తవ్వించి అక్కడి సంగీత విద్యార్థుల దాహార్తి తీర్చింది.

ఆల్ ఇండియా రేడియో లో కూడా అనేక నాటకాలు, సంగీత ప్రదర్శనలు ఇచ్చిన ఆమె చివరి దశలో తనకు ఉన్నదంతా దాన ధర్మాలకు వియోగించడం వల్ల ఆర్థికంగా బాగా చితికి పోయింది. ఒకనాడు తనను ఆశించి వచ్చిన వారికల్లా దాన ధర్మాలు లేదనకుండా చేసిన ఆమె చివరి రోజుల్లో ఆంధ్ర నాటక అకాడెమీ వారు ఇచ్చిన 50 రూపాయల నెలసరి జీతముతో కొన్నాళ్ళు జీవితం గడిపి నటరాజులో ఐక్యం అయ్యారు.

సేకరణ : facebook లో 'The Golden Heritage of Vizianagaram' గ్రూప్ ఇంకా ఇక్కడా అక్కడా
Pen sketch of Lakshminarasamma garu drawn by me.


 


కామెంట్‌లు లేవు:

కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! - తెలుగు గజల్

 ॥తాజా గజల్॥  నా pencil చిత్రానికి Dr. ఉమాదేవి గారి గజల్ ~~~~🔹🔸🔹~~~~ కెరటాలు వేరనీ సాగరం వేరనీ ఆలోచనే తప్పు! పోరాట మేలేని జీవితం కోసమై అన...