19, డిసెంబర్ 2020, శనివారం

మాధవపెద్ది సత్యం - గాయకుడు, నటుడు


 మాధవపెద్ది సత్యం

( నా పెన్శిల్ చిత్రం)


మిత్రులు డా. ప్రసాద్ కెవియస్ గారు మాధవపెద్ది గురించి నాకు తెలియని విషయాలు తెలియజేసారు. కేవలం చిత్రం నాది. వివరాల్ వారివి. . వారికి నా ధన్యవాదాలు.

"ఈ నగరానికేమయ్యింది?!...ఓవైపు నుసి....మరో వైపు పొగ! ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి!?....అంటూ..ఆ రోజుల్లో నిలదీసేవారు ఎవ్వరూ లేరు!

బీడి....చుట్ట....సిగిరెట్...రెండేళ్ళు మార్చి మార్చి త్రాగాను...ఇప్పుడు ఆపరేషన్ అంటున్నారు! దీని తరువాత...నేనుంటానో...లేనో...అంటూ భయపెట్టే వాళ్ళు కూడా లేరప్పట్లో!
అంతెత్తు మనిషి...పొడవాటి కోలముఖం...కోటేరు ముక్కు....ఒంటిమీద పైజమా జుబ్బాతో... చేతిలో గొడుగుతో...
నోట్లో చుట్టతో గుప్పు గుప్పున పొగ వదుల్తూనే...పాటో....పద్యమో...హం చేసుకుంటూ...నిదానంగా నడచి వెళ్ళే వారాయన!
బాగా పాపులర్ అయ్యాక...సరదా సరదా సిగిరెట్టు...ఇది దొరల్ తాగు భల్ సిగిరెట్టు...అంటూ...రేలంగి నోట వెలువడిన...ఆ హిట్ డ్యూయెట్ కూడా ఆయన పాడినదే!
************
నీ హైట్....కోటేరేసిన ముక్కు....కాస్త చాయ తక్కువైనా...నీ పర్సనాలిటీకి...నీకు కబీరు వేషమే ఖాయం చేస్తున్నా. పైగా...నీ వాయిస్ చాలా బాగుంది.....
అని యరగుడిపాటి. వరద రావు(వై.వి.రావు- నటీమణి లక్ష్మి తండ్రి) చెప్తుంటే......ఆ మాటలు....సదరు ఆసామికి...అమృతతుల్యం గా అనిపించాయి.
1948 లో తమిళం- హిందీ లలో ఒకేసారి రామదాస్ మూవీ తీసి రిలీజ్ చేశారు...వై.వి.రావు. ఫ్లాప్ !
చూడు .....నిన్ను నువ్వు...ఆ వై.వి.రావు గారి తో పోల్చుకోకు. ఆయనకేం...బాగా ఉన్నవారు. ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయినా...తట్టుకుంటారు.
నీ భవిష్యత్తు ఆలోచించు. నీ కున్న అస్సెట్ నీ వాయిస్...కాబట్టి...నాతో మద్రాస్ వచ్చెయ్. లైలా- మజ్ఞు(1949) తీస్తున్నారు. దానికి సంగీతం నాదే. నీకు చాన్స్ ఇస్తాను. మెల్లగా..గాయకుడిగా...తప్పక పైకొస్తావు.నాకు నమ్మకముంది....అన్న సంగీత దర్శకుడు సుబ్బరామన్ మాట....తలదాల్చి...మద్రాస్ వచ్చి...తన తొలి పాట
మనుచుకాదా...ఖుదా తోడై....అనే పాట ను ఘంటసాల & పిఠాపురం గార్లతో కలిసి పాడారు....ఆయన!
***********
12 ఏళ్ళకే...నాటకాలు వేసి...గొంతు విప్పి పాడితే.....మైక్ లేకుండానే...చివరి వరస లో ఉండే వారికి కూడా...స్పష్టం గా వినిపించేంత కంచు కంఠం....ఆయన సొంతం!
మాధవపెద్ది గారి గాత్ర ప్రత్యేకత ఎలాంటిదంటే....ఓ ఇండోర్ ఆడిటోరియంలో ఆ తరం గాయనీ గాయకులు కచేరీ చేస్తున్నారనుకుందాం! సడన్ గా కరెంట్ పోయి...ఇక ఓ గంట వరకు రాదు...అయినా పాడాల్సిందే అంటూ ఆర్గనైజర్స్ ఒత్తిడి తెచ్చారనుకోండి!......
అప్పుడు గాయనీ మణులైన....పి.సుశీల & ఎస్.జానకి గార్ల వాయిస్ లు....మొదటి రెండు వరసలకు వినిపించవచ్చు మైక్ లేకుండా. ఘంటసాల వారి వాయిస్ ఓ 5 వరసల వరకు వినిపించవచ్చు. కానీ...ఏ మైక్ లేకుండానే....చివరి వరుస వరకు ...వినిపించగల వాయిస్ మాధవపెద్ది సత్యం గారిది!
ఆయన కంఠం లో 2 భిన్న పార్శ్వాలున్నాయి!
ఒకటి వీరావేశం తో...ధాటీ..గంభీరం తో....దురహంకార మదాంధులై ఖలులు..అంటూ పాడితే....
మరొకటి...మారిపోవురా కాలము...మారుట దానికి సహజమురా...అంటూ షావుకారు(1950) లో పిచ్చన్న తాత వేషం వేసి ...మెత్తగా....మార్ధవమైన...తత్వాలతో...వేదాంతం ఒలికించింది!
మిమిక్రీ కూడా చేయగలదా కంఠం..
వేమూరి గగ్గయ్య, సూరిబాబు ల కంఠాలను అనుకరించగల...ఆ స్వరమే......
ఎంత మదమెంత కావరమెంత పొగరు...అన్న పలుకులు ఆయనే ఏస్.వి.ఆర్ లా.... మాట్లాడి పద్యమందుకుంటే....మాయాబజార్ మూవీలో ప్రేక్షకులు సమ్మోహనమే!
ఎక్కువగా ఎస్.వి.ఆర్, రమణారెడ్డి, రేలంగి లాంటి వారికి పాడినా...ఎ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, జగ్గయ్య & పద్మనాభం లాంటి వారికి కూడా పాడారు!
***********
విజయా వారు షావుకారు ప్రారంబిస్తూ....నాటకాలలో రాటుతేలిన స్వరం...పైగా మంచి హైట్...ఏదో ఓ వేషం ఇచ్చేట్టనుకుని....
చివరికి గుడ్డి పిచ్చన్న తాత వేషమిస్తే....సత్యం గారు...ఆ పాత్రలో జీవించారు....స్వయంగా పాడుతూ.
ఆ గుడ్డి యాచకుని పాత్రకు వలసిన....మార్ధవాన్ని స్వరాన పలికిస్తూ పాడిన పాటలు...దర్శక నిర్మాతలనే కాదు....ప్రేక్షక లోకాన్ని కూడా అలరించింది.
దాంతో ...మంజరి,మాయాబజార్,మనోహర,దక్షయజ్ఞం & రాజ మకుటం....మూవీస్ లో నటించినా...క్రమేణా...గాయకుని గానే స్థిరపడి పోయారు.
ఎస్.వి.ఆర్ కు సరే....పాడటానికి పేటెంట్ రైట్స్ సత్యం గారివే. ఇక రమణారెడ్డి, రేలంగి, పద్మనాభం....వంటి హాస్య దిగ్గజాలకు...కూడా నిరంతరం పాడుతూ బిజీ అయిపోవడం తో....నటనకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఇదీ వారి సినీ నట జీవితం.
*************
ఇక కచేరీల విషయం. మాధవపెద్ది సత్యం గారుంటే....కచేరీ లో కరెంట్ పోయినా...ఢోకా లేదు! అంతటి భరోసా!
పిఠాపురం నాగేశ్వర రావు & స్వర్ణలత గార్లతో కలిసి ఎన్ని కచేరీలు చేశారో లెక్క పెట్టడం కష్టమేనట!
మా ఊర్లో ఒక పడుచుంది...దయ్యమంటే భయమన్నది....ఈ పాట పాడకుండా కచేరీ ముగిసేది కాదు!
నిజానికి అవేకళ్ళు మూవీలో ఈ పాట పాడింది ఘంటసాల & పిఠాపురం గార్లు. కచేరీలో మాధవపెద్ది & పిఠాపురం గార్లు కలిసి పాడినా....ప్రేక్షకులు...వన్స్ మోర్ అంటూ చప్పట్లు కొట్టే వారట!
ఇక మాధవపెద్ది గారు స్వర్ణలతల డ్యూయెట్లు...కచేరీకే పెద్ద ఆకర్షణగా ఉండేవి. అన్నీ చలాకీగా...హుషూరుగా ఉండే పాటలే కాబట్టి...ప్రేక్షకాదరణ...అద్భుతం గా ఉండేది.*
ఇన్ని ఘనతలున్నా...మన సత్యం గారికి....అసలు గర్వమే లేదు!
ఉన్నదల్లా...పేకాట! ఇంట్లోనే స్నేహితులతో...కాలక్షేపం. కేవలం స్నేహం కోసమే. ధనార్జన కోసం కాదు. అయినా పేకాడి మేడలు కట్టినదెవరు...ఈ భూప్రపంచం లో!
***********
భోళా మనిషి....ఎవర్నీ...పన్నె త్తి...ఒక్క మాట అనగా నేను వినలేదని ఎస్.పి.బాలు....ఆయనకు కితాబిచ్చారు!
రాజమండ్రి లో ఆయన పెళ్ళప్పటికి....గాయని ఎస్.జానకి...చిన్నపిల్లే అయినా...ఆ పెళ్ళి లో పాట పాడి...వారి మెప్పు పొందిందట!
ఎన్నో వేల పాటలు...తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం & హిందీలలో పాడిన ఘనత కీ.శే. మాధవపెద్ది సత్యం గారిది!
1952 లో సంగీత దర్శకత్వం కూడా వహించాలని ...నిజం చెపితే నమ్మరు.....అనే మూవీ ప్లాన్ చేసి....4 పాటలు కూడా రికార్డ్ చేసినా...ఆ సినిమా పట్టాలెక్కలేదు. చెట్టెక్కేసింది!
అందుకే...నేను సాధించలేనిది నువ్వు సాధించాలిరా....అని తన అన్నయ్య కుమారుడు....మాధవపెద్ది సురేష్ తో అనేవాడట. అది సురేష్ సాధించారు కూడా!
మాధవపెద్ది గారి....తనయుడు....మాధవపెద్ది మూర్తి గారు....ప్రఖ్యాత కూచిపూడి నాట్య కళాకారులు.
విదేశాలెన్నో చోట ప్రదర్శనలిచ్చి...చెన్నైలో శివ ఫౌండేషన్...అని ఓ నాట్య శిక్షణాలయం నడుపుతున్నారు.
కళైమామణి తో బాటుగా...నాట్య శిరోమణి, నాట్య కళా విపంచి, సత్య తాండవ సుందరం.....ఇన్ని బిరుదులు పొందారు.
18-12-2000.... ఆ ధీర గంభీర సుస్వరం.....మూగబోయిన రోజు. "



కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...