11, ఏప్రిల్ 2021, ఆదివారం

నాన్న - రచన శ్రీ RVSS శ్రీనివాస్)

 





(మిత్రుడు శ్రీనివాస్, వయసులో నాకంటే చిన్నవాడు, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాడు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాడు. భోపాల్ 'దూర్ దర్శన్' లో ఉద్యోగం చేస్తుండేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడొ తెలియదు. FB లో కనిపించడంలేదు. రెండు మూడు సందర్భాల్లో కలుసుకున్నాం. ఫోన్లో మాట్లాడుకున్నాం.  శ్రీనివాస్  ః నీ కవిత కి నా బొమ్మ జోడించి నీ అనుమతి లేకుండా నా బ్లాగులో పెట్టుకున్నాను.  నీకు అభ్యంతరం ఉండదని భావిస్తున్నాను. ఈ పోస్ట్ నీకు ఎప్పుడైనా తారసపడితే నాకు ఫోన్ చెయ్యవా ప్లీజ్ ... అంకుల్)


పిల్లల్ని నవమాసాలు మోసిన అమ్మ గొప్పతనం ఒకవైపునుంటే

ఆ సంతనాన్ని అమ్మతో సహా జీవితాంతం మోసే నాన్న గొప్పతనం వేరొకవైపుంటుంది.

మూడు పూటలా రుచికరమైన భోజనం పెట్టేది అమ్మైతే,

ఆ భోజనం ఇంట్లోకి రావడానికి కారణం నాన్నే కదా !

దెబ్బ తగిలితే ‘అమ్మా’ అంటూ అరుస్తాం

కాని మందు వేయించేది నాన్నే కదా..!

పాకెట్ మనీ కోసం రెకమండేషన్ చేసేది అమ్మే అయినా

మన ఖాళీ జేబులు నింపేది నాన్నే కదా…!

చిన్న చిన్న సమస్యలు అమ్మ తీరుస్తుంది

సమస్య జటిలమైతె  పరుగెత్తేది నాన్న దగ్గరకే కదా ..!

భూదేవంత ఓర్పు సహనం అమ్మదైతే

ఆకాశమంత ఔన్నత్యం నాన్నది !

చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం

పెద్దయ్యాక కనీసం ఆ రెక్కల భారం పంచుకునే ప్రయత్నం కూడా చేయం..

కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి

వెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.

ఆ కొబ్బరి నీళ్ళ తీపి

ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,

నాన్నను ఎప్పటికీ వదలం.

అమ్మ వర్తమానాన్ని చూస్తే,

మన భవిష్యత్తుని మనకంటే ముందుగా చూసేది,

మన లక్ష్యాలను చూపేది,

వాటిని సాధించుకోవడానికి బంగారు బాటలు వేసేది నాన్నే కదా … !

 

(సౌజన్యం : నా మిత్రుడు, ప్రఖ్యాత కవి శ్రీ RVSS శ్రీనివాస్ రచన. శ్రీనివాస్ కి నా శుభాశీస్సులు)

 

కామెంట్‌లు లేవు:

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...