5, ఏప్రిల్ 2021, సోమవారం

వృద్ధాప్యం - ఓ అనుభవాల పాఠం


అనుభవాల పాఠం వృద్ధాప్యం (ఆంధ్రభూమి నుండి సేకరణ) - 

వ్యాసానికి చిత్రం ః పొన్నాడ మూర్తి (charcoal pencil sketch)

మనిషి జన్మ చాలా చిత్రమైనది. శిశువు జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు. అదేవిధంగా చనిపోయినప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంతవాయువుల్లో కలిసిపోతాడు. శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో, భూగర్భంలో కలిసిపోవడమో జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మనందరికీ తెలిసిన నగ్నసత్యం. ఉపనిషత్తులో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు. బాల్యాన్ని ఉదయంతోను, మధ్యాహ్నం యవ్వనంతోను, సాయంకాలాన్ని వృద్ధాప్యంతోను, రాత్రిని మరణంతోను వర్ణించారు. బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో, అంతే బాధాకరంగా వృద్ధాప్యం నడుస్తుంది.
వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది.
ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు, మరికొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది. 60 సంవత్సరాల వయస్సువరకు మనిషి జన్మ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధాప్యం అంటారు. హాయి హాయిగా గడిచే జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటూ వచ్చి చివరికి మనిషిని మ్రగ్గిన పండులా మార్చి రాలిపోయేలా చేస్తుంది వృద్ధాప్యం.
అన్ని కష్టాలు 60 నుండే ఆరంభం అవుతాయి. ఆరోగ్య, మానసిక, సాంఘిక సమస్యలు ప్రతిమనిషిలోనూ తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా వున్నా సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి. ఎంతో అందంగా కాపాడుకొంటూ వచ్చిన మానవ దేహం రిపేరుకొచ్చేస్తుంది. శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్తువ అవుతూ వస్తుంది. కొందరికి ముందుగా పంటి సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కొందరిలో 60 సం.లనుండి ఆరంభం అయితే, మరికొందరికి 65 సం.లో ప్రారంభమవుతాయి. కొందరు వేగంగా వెళ్లిపోతారు. ఇంకొందరు కాస్త స్లోగా నడుస్తూ వెళ్లిపోతారు. అందరూ చేరే గమ్యం ఒక్కటే! కర్మ సిద్ధాంతాలతో మిగిలినవారు సరిపుచ్చుకుంటారు. ఇది జీవనతరంగం.
అనే్నళ్ళ ఆనందాలన్నీ ఆవిరైపోయి శేషజీవితం విషాదంతో ముగుస్తుంది. భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాల్ని ఆరంభిస్తాడు. ఎన్నో ఎనె్నన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. కానీ క్రమంగా ఆలోచించేశక్తి సన్నగిల్లుతుంది. ఎంత గింజుకున్నా కొన్ని గుర్తుకురావు. మనకు కావాల్సిన వ్యక్తుల్నే మనం గుర్తించలేము. ఒక్కోసారి ఆత్మీయుల పేర్లనుకూడా మరచిపోతాం. మందుబిళ్ళలు వేసుకొన్నా అవి మనకు పూర్వ శక్తిని తీసుకురాలేవు. కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది. నడుం నొప్పులు, కీళ్ళనొప్పులు ఇంకా ఇంకా ఎనె్నన్నో.. బాధలు అపరిమితం. ఒక్కోసారి అసహనం, కోపం కూడా వృద్ధాప్యాన్ని వెక్కిరిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్థుల బాధలైతే మరీ వర్ణనాతీతం. ఈదశలో కొందరికి సరైన ఆదరణ కన్పించదు. వాళ్ళ జీవితం మరీ దుర్భరం. ఒంటరి బ్రతుకు. సాంఘికంగా, ఆర్థికంగా మానసికంగా అన్నీ సమస్యలే. భార్యలు కోల్పోయిన భర్తలు, భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం.
కొందరు వృద్ధాప్యంలో బాగా డిప్రెషన్కు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. పిల్లల్ని తమ అదుపు ఆజ్ఞలో ఉంచాలనుకొంటారు. అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకొంటారు. కొంతమంది వృద్ధాప్యంలో మంచానబడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భర జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారిని చూసి రెండు కన్నీటిబొట్లు విడవడం తప్ప ఏం చేయలేం.
చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరిమితమై జీవిస్తుంటారు. వీళ్లలో ఆత్మన్యూనతభావన ఎక్కువగా ఉంటుంది. ఎవరితో కలవాలనుకోరు. ముఖ్యంగా తమకన్నా చిన్న వయసున్న వారితో. కొందరిలో మతిమరుపు ఎక్కువకావడం చాలా అనర్థాలకు కారణవౌతాయి. రాను రాను చెవుడు కూడా తోడుకావడం మరింత బాధాకరం అన్పిస్తుంది. వయస్సులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.
కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత సంతరించుకొన్న జన జీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు. ఇలాంటివారికి సమాజంలోని కొందరైనా చేయూతనివ్వాలి.
వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి. ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తనే ఎక్కువ చోటుచేసుకుంటుంది. తమని కూడా చిన్నపిల్లల్లా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి. క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి. వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్లు, వృద్ధాశ్రమాలు ప్రభుత్వమే నెలకొల్పాలి. ముఖ్యంగా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి. విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి. మానసికంగా కూడా వీళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దిశగా కొన్ని సదుపాయాలను కల్పించాయి. టాక్స్ బెనిఫిట్స్, డిపాజిట్లకు అదనపు వడ్డీతోపాటు విమాన, రైలు, బస్సు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలిస్తున్నాయి. బ్యాంకుల్లో కొత్తగా 65 సం.లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయం ఏర్పాట్లు చేశారు.
వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి. జననం తథ్యమని.. మరణం తప్పదని గుర్తెరగాలి. తొలి జీవితానే్న కడవరకూ కోరుకోవడం అత్యాశే. అందరికీ ఆదర్శంగా బ్రతకాలి.కనీసం ఇపుడైనా వయస్సు అహంకారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది. దైవచింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది. ఇంట్లోనే హాయిగా ఆత్మవిశ్వాసంతో, ఆనందంతో జీవించండి.. ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే!అనుభవాల పాఠం వృద్ధాప్యం (ఆంధ్రభూమి నుండి సేకరణ)



(ఆంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో)

 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...